పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -7 మంత్రం యోగం

పుట్ట పర్తి వారి   పుట్ట తేనె చినుకులు -7

మంత్రం  యోగం

యోగం అంటే సంబంధం .ఒక లక్ష్యం తో సంబంధాన్ని పొందటం .ఇందులో హఠ ,లయ మొదలైన యోగాలున్నాయి .సాధారణం గా అందరూ ద్వైతులే .అద్వైత భావం కలిగేది కొన్ని క్షణాల పాటు మాత్రమె .’’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు గీతా  చార్యుడు కృష్ణుడు . యోగాలలో మంత్రం యోగమూ ఒకటి .మంత్రాన్ని అనుష్టానం చేస్తూ లక్ష్యాన్ని సాధించి అందులో లయం అవటం అన్న మాట .దీని ప్రధాన లక్ష్యం వైరాగ్యమే .కాని వైరాగ్యం తో మొదలు అవ్వదు .మంత్రాలు  వైదికాలు అని  , తాంత్రి కాలని రెండు రకాలు .వీటిలో వైదికాలు శ్రేష్టమైనవి .శ్రీ సూక్తం  ,పురుష సూక్తం లలో  అనేక ప్రయోగ విశేషాలున్నాయి .జపం హోమం ,తర్పణ ,మార్జనం భోజనం సాధనకు అంగాలు .అన్నీ కుదరక పొతే జపమే చాలు .జపం లక్ష చేస్తే హోమం అందులో పదో వంతు చేయాలి .దీనిలో పదో వంతు తర్పణం .హోమం లేకుండా జపం చేయాలంటే హోమ అంశానికి  రెట్టింపు జపం కూడా చేయాలి .

రుద్ర నమక చమకాదులకూ ఇదే విధానం  దనం కావాలంటే శ్రీ సూక్తాన్ని బిల్వ వృక్షం కింద కూర్చుని జపించాలి .ప్రతి మంత్రానికి యంత్రం ఉంటుంది .వైదికం గా చేయలేనివారికి తంత్రం సాయ పడింది. శివుని అనుగ్రహం లేక పొతే తంత్రాలు సిద్ధిం చవు .అరవై నాలుగు తంత్రాలున్నాయి .ఇందులో కొన్ని భయంకరాలు కొన్ని జుగుప్స అసహ్యం కలిగించేవి ఉన్నాయి .ముఖ్యం గా శైవాలు వైష్ణవాలు శాక్తాలు అని మూడు భాగాలుగా చెప్ప వచ్చు .ఉపాసకుడు ఎవరైనా సరే ముందు శాక్తేయుడే అని తర్వాతే శివుడో వైష్ణవుడో అవుతాడని కొందరు అంటారు .లోపల ఉండే పంచ భూతాత్మక పదార్ధాలను జయించి,వాటి ద్వారా బాహ్యాన్ని బంధించే ప్రయత్నమే తంత్ర శాస్త్రం .ప్రతి మంత్రానికి రుషి ఛందస్సు ,బీజం శక్తి కీలకాలు .న్యాసం తో సాధకుడు అభేదాన్ని ముందు పొందుతాడు .ధ్యాన శ్లోకం లో ఉన్న మూర్తిని జపం లో అనుస్టిం చు కొంటాడు .మంత్రాలలో అనేక భేదాలున్నాయి .

కొన్ని మంత్రాలు శాపగ్రస్తాలు .కొన్నిటికి శాపం లేవు .గాయత్రీ మంత్రానికి విశ్వామిత్ర మహర్షి శాపం ఉందట .అన్ని మంత్రాలను పరశురాముడు శపించడట .అందుకే భార్గవ రామ మంత్రాన్ని సాధించిన వారికి గురువు ఉపదేశం అక్కర లేదని పుట్ట పర్తి వారు సెలవిచ్చారు .పుస్తకం లో చూసి జపిస్తే చాలని ‘’మేరు తంత్రం ‘’అనే గ్రంధం తెలియ జేస్తోందని సరస్వతీ పుత్రుల అభిభాషణ .అన్ని వర్ణాల వారు సాధించే మంత్రాలు కొన్ని ఉన్నాయి .ఒక్కో వర్ణం వారికి ఒక్కో మంత్రమూ చెప్ప బడింది .పునశ్చరణ చేసిన తర్వాతే కార్య సాధనానికి ఉపయోగ పడే మంత్రాలు కొన్ని .దాని అపేక్ష లేకుండానే కార్య సాధన ఇచ్చేవికొన్ని .ఇలాంటి వాటిలో ‘’నారసింహ మంత్రం ‘’ఒకటి .మంత్రోపదేశం లో ‘’సిద్దారి చక్రం ‘’ప్రాముఖ్యత ఉంది .ఏ మంత్రాన్ని అనుష్టిస్తే ఏమి లాభం అనేది ఇది తెలియ జేస్తుంది .కొన్నిటికి ఈ చక్రాన్ని చూసే పని లేదనీ శాస్త్రం చెబుతోందని ఆచార్య ఉవాచ .మంత్రాలలో శ్రీ ,పుంస మంత్రాలున్నాయి .ప్రతి మంత్రానికి కుండ భేదం ఉంటుంది .మానసికం గా జపించేటప్పుడు దీని ఆపేక్ష అక్కర్లేదు .గురువు శిష్యుడికి ఉపదేశించాల్సిన మంత్రాన్ని ముందుగా సాధించిన తర్వాతే శిష్యుడికి  ఉపదేశించాలి .అప్పుడు శిష్యుడికి ఏ సాధనా అక్కర్లేదు అని ‘’మేరు తంత్రం ‘’బోధిస్తోందని నారాయణాచార్యుల వారు తెలిపారు .అలాంటి గురువు దొరకటం  పరమ భాగ్యం అన్నారు .మంత్రానికి ఆరు ప్రయోజనాలున్నాయి .

వశ్యాకర్షక మంత్రాలు ,మారణం చేసే మంత్రాలూ,స్తంభన మంత్రాలు ,మోహన మంత్రాలు  ఉన్నాయి .పల్లవం అనేదాన్నికలిపినప్పుడు ఈ భేదాలేర్పడతాయి .విధి విధానం లో మాలా భేదం, ఆసన భేదం చెప్ప బడ్డాయి.ముద్రా ప్రదర్శన కూడా రక రకాలుగా ఉంటాయి .ఇలా షట్ ప్రయోజనాలతో ఒక్క మంత్రాన్ని సాదిస్తే చాలు ఐహిక ,ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి .ఇప్పుడు గురూజీ లు పెరిగిపోయి స్వార్ధం కోసం డబ్బుకో మంత్రం ,ఆకర్ణకో మంత్రం చెప్పి డబ్బు గుంజుతూ పీల్చి పిప్పి చేస్తున్నారు .దీనివలన సాధకుడి లక్ష్యం సిద్ధించటం లేదని పుట్ట పర్తి వారు బాధ పడ్డారు .అందుకే ఒక్కడు కూడా ఒక్క దానిలోనైనా నిష్ణాతుడు కాలేక పోతున్నాడని విచారించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.