ఆదర్శ గురువు.. పాటిబండ
- -ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్
- 13/09/2014

పాటిబండ మాధవ శర్మగారి
జీవిత సాహిత్యౌన్నత్యం
డా.నిడమర్తి నిర్మలాదేవి
ధర: రూ.200/-
ప్రతులకు: నవోదయ,
విశాలాంధ్ర బుక్‌హౌస్‌లు
ఎల్-10, డి.డి.కాలనీ,
బాగ్‌అంబర్‌పేట, హైదరాబాద్.
తెలుగు సాహితీ లోకానికి డా. నిడమర్తి నిర్మలాదేవి సుపరిచితురాలు. ‘దేవులపల్లి’ వారి సాహిత్యంపైన సాధికారిక పరిశోధనా గ్రంథాన్నీ అనేక సాహిత్యోపన్యాసాలనిచ్చీ ‘కృష్ణశాస్ర్తీ నిర్మల’గా వాసికెక్కారు. వివిధ అంశాలపైన పరిశోధనాత్మక పత్రాలతో కూడిన వ్యాస సంపుటులు అరడజనుకు పైగా వివేకానంద, దుర్గాబాయి, పొట్టిశ్రీరాములు వంటి మహనీయులపైన బుఱ్ఱకథలు, భారత భారతి, భామినీ భువన విజయము వంటి సాహిత్య రూపకాలు, ‘విష్ణు చిత్తీయము- కృష్ణాపుష్కరీయం’ వం టి పౌరాణిక పద్యనాటకాలు, ‘తృణసుమము’ వంటి నృత్య గేయ నాటికలు, ‘బ్యాలెన్స్‌షీట్’ వంటి హాస్య నాటికలు, ‘పాటల పేటిక’, ‘కవితా కదంబమాల’వంటి విభిన్న సాహిత్యప్రక్రియలను చేబట్టి రచించి సాహితీవేత్తల ప్రశంసలనందుకున్నట్టివారు నేడు కీ.శే. ఆచార్యవర్య పాటిబండ మాధవశర్మగారి ‘జీవిత-సాహిత్యౌన్నత్యమన్న పరిశోధనాత్మకమైనట్టి గ్రంథాన్ని రచించి వెలువరించి తెలుగు పాఠక లోకానికి అందజేయడమెంతైనా ముదావహం.
విద్వత్కవీశ్వరులు, విద్యాగురుకుల వ్యవస్థా నిర్వాహకులు, బహుశాస్తక్రళాకోవిదులు, సంస్కృతాంధ్రాంగ్ల భాషాభినివేశము గలిగినట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుసాహిత్యోపన్యాసకులు, రీడరు, విమర్శకాగ్రేసరులు, భాస, కాళిదాసాది కవిశేఖరుల కావ్యానువాద వ్యాఖ్యాన – పరిష్కరణలను గావించినట్టి కీ.శే. పాటిబండ మాధవశర్మగారు తెలుగు సాహితీ జగత్తులో విశిష్టస్థానాన విరాజిల్లుతున్నారు. తెలుగు భాషాసాహిత్యాలకు వారు చేసిన సేవ ఎనలేనట్టిది. ముందుతరాలకు మార్గదర్శకమైనట్టి వారి జీవిత- సాహిత్యౌన్నత్యాన్ని నిర్మలాదేవిగారు ఈ గ్రంథము ద్వారా తేటతెల్లమొనర్చుతూ సాహితీ ప్రియం భావుకులకందచేసారు. పాటిబండవారి అనంత సాహిత్య సాగరాన్నీ, డెబ్భైయైదు వసంతాల జీవిత ప్రస్థానాన్నీ వంద పుటలుగల ఈ గ్రంథ కలశములో నిమిడ్చిన రచయిత్రి ప్రజ్ఞాపాటవాలు మెచ్చదగినవి. ఈ పుస్తకం ఒక వ్యక్తియొక్క జీవిత సాహిత్య విశేషాలను తెలియపర్చేదిగానే కాక భావకవిత్వపు పూర్వార్థ సాహిత్య చరిత్రగా భావింపదగినట్టిది. తెలుగు సాహిత్య విద్యార్థులకు కరదీపిక వంటిది.
మొత్తం తొమ్మిది అధ్యాయాలుగా కూర్చబడిన ఈ గ్రంథంలో మొదటి రెండు అధ్యాయాలు శర్మగారి జనన- బాల్య- విద్య- ఉద్యోగాదికాలు తెలుపడం జరిగింది. మూడవ అధ్యాయంలో వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని సోదాహరణగా పేర్కొనడమైనది. నాల్గవ అధ్యాయంలో భావ కవితా లక్షణాలతో విరాజిల్లుతున్న శర్మగారి తొలి కావ్య ఖండికలైన ‘ప్రణయపథి’, ‘మధ్యమ’, ‘రక్షరేఖ’, ‘తర్పణము’, ‘చారుణి’అన్న లఘుకావ్య వైశిష్ట్యాలను వివరించడం జరిగింది. ఐదవ అధ్యాయంలో ‘నాగానందం’, ‘విక్రమోర్వశీయమ్, ‘మాళవికాగ్నిమిత్రమ్’, ‘ప్రతిమా’ నాటకానువాద నైపుణినీ, ‘కిరాతార్జునీయం’ రఘువంశ, కుమార సంభవమిత్యాది కావ్యవ్యాఖ్యాన విశిష్టతను సోపపత్తికంగా విశదీకరింపబడ్డాయి. ఆరవ అధ్యాయంలో దండి ‘దశకుమార చరితమ్’ పూర్వపీఠికాపరిష్కరణ, ‘తపతీ సంవరణ’, ‘నిర్వచనోత్తర రామాయణ’ పరిష్కరణలు, తిక్కన, నన్నయ-ఎఱ్ఱన రచనల వైవిధ్య వైశిష్ట్యాలపైన వివరణాత్మకంగా సాగిన శర్మగారి వ్యాఖ్యలు ఉటంకింపబడ్డాయి. తరువాతి అధ్యాయంలో శర్మగారి పరిశోధనా గ్రంథాలయిన ‘ఆధునిక భావ కవిత్వము’, ‘ఆంధ్ర మహాభారతము- ఛందఃశిల్పము’అన్న వాటిలోని వారి పరిశోధనా పాటవాన్నీ, విశే్లషణాచాతురినీ వివరించడం జరిగింది.
ఎనిమిదవ అధ్యాయంలో పాటిబండవారి కలంనుండి జాలువారినట్టి ‘ఇంద్రాణి’, ‘రాజశిల్పి’అన్న చారిత్రక నవలల, ‘గిరికపెళ్ళి’అన్న పౌరాణిక నవలయొక్క పరిచయ వివేచనలు, వాటితో ద్యోతకమవుతున్న శర్మగారి చారిత్రక, పౌరాణిక పరిజ్ఞానము, బహుశాస్త్ర కళాభినివేశము, సాంస్కృతిక వైభవ స్మరణ, కథాకల్పనాచాతురి, పాత్ర చిత్రణా నైపుణ్యాదులు ఉగ్గడింపబడ్డాయి.
‘కీర్తికౌముది’అన్న చివరి అధ్యాయములో శర్మగారి తెలుగుసాహిత్య సేవను, వారి ప్రతిభాపాటవాలను, విద్యా వైదుష్యాలను గుర్తించిన సాహితీవేత్తలు, ప్రజలు-ప్రభుత్వము చేసిన సన్మానాలు- సత్కారాలు, ఇచ్చినట్టి బిరుదావళులు, ప్రశంసా నీరాజనాలు పేర్కొడమైనది.
ఈ విధంగా పాటిబండ వారి జీవిత, సమగ్ర సాహిత్యంపైన నిర్మలాదేవి చేసిన పరిశోధనా వివేచనాత్మక కృషీ, రచనా నైపుణ్యానికీ ఈ గ్రంథం అద్దంపడుతూ విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. సరళ, సుందర, సులభశైలిలోనుండి సామాన్యులను ధీ మాన్యులను కూడ అలరిస్తుందనడంలో అతిశయోక్తిలేదు. దివంగతులైన సాహితీమూర్తులు కాలగర్భంలో కలిసిపోకుండా అజరామరమైన కీర్తికాములై ఉండాలంటే ఇటువంటి అమూల్య గ్రంథాలు వెలువడాలి. డా. నిడమర్తి నిర్మలాదేవి గారికి అభినందనలు.
ఉత్తమ గురుత్వం పాండితీ వైదగ్ధ్యం గౌరవింపబడే తరానికి చెందిన ఆదర్శ అధ్యాపకుని జీవితం నేటి విద్యార్థులకు పాధేయం- ఉపాదేయం’’ నిర్మలగారి పేరు దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తీకి పర్యాయపదంగా విన్పడుతూ ఉన్నప్పటికీ ఈ కృతి ఆమె సుకృతిగా భావింపవచ్చు.
