గీతాసారం -సమాజ అసమానతలు –

మనుషులకు రెండు రకాల స్యభావాలు ఉన్నాయని చెబుతారు బ్రాహ్మణిస్టులు. రాక్షసస్వభావం, దైవీ స్వభావం. భౌతిక వాదుల ప్రకారం ప్రకృతిలో ఆహారం కోసం ఘర్షణ జరుగుతుంది. రెండు వేరు వేరు జాతుల మధ్య జరిగే ఘర్షణను జాత్యంతర ఘర్షణ అని, ఒకే జాతిలో జరిగే ఘర్షణను జాత్యంతస్థ ఘర్షణ అంటారు. జాత్యంతస్థ ఘర్షణ ఉండకూడదనే ఆకాంక్షతోనే సమాజంలో న్యాయం, విలువలు అనే విషయాలు ముందుకు వచ్చాయి. న్యాయం, విలువలు పాటించేవారికి మంచి స్వభావం ఉన్నట్లుగా, పాటించని వారికి చెడు స్వభావం ఉన్నట్లుగా భౌతికవాదులు భావిస్తారు.

ఆంధ్రజ్యోతి నివేదనలో 12-9-2014న డా .కె. అరవిందరావు గీతసారమిదే అనే వ్యాసం రాశారు. పిల్లలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే మన మూల గ్రంథాలు చదవాలన్నారు. మూలగ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు అన్నారు. వీటిసారం గీతలో ఉందన్నారు. అంటే వేదాల బదులు గీత చదివినా సరిపోతుందని అర్థం. గీత అంటే భగవద్గీత మాత్రమే కాదని ‘ఉద్ధవగీత, అనుగీత, అష్టావక్రగీత’లు కూడా అన్నారు. ఎలాంటి దానిని గీత అంటారో కూడా చెప్పారు. విశ్వానికంతటికీ మూలమైన సత్యమేమిటి? దైవానికి మనిషికి సంబంధం ఏమిటి? సృష్టి అంటే ఏమిటి? మనిషి స్వభావం, గమ్యం ఏమిటి? లాంటి ప్రశ్నలకు విశ్లేషణా పూర్వక సమాధానాలు ఈ గీతలో ఉంటాయన్నారు.
సామాజిక కారణాల దృష్ట్యా మనుస్మృతి, రామయణాలను విస్మరిస్తున్నారని చెప్పారు. కాని మనుస్మృతి, రామాయణం మన సంస్కృతికి మూల గ్రంథాలు కావన్నారు. కాని వెంటనే వాటికి మూలం వేదాలు, ఉపనిషత్తులు అంటున్నారు. అంటే వేదాలు, ఉపనిషత్తులలోని సారమే మనుస్మృతి, రామాయణం అని అర్థం. అంటే ఒకవైపు కాదంటూనే మరొకవైపు అవునని అంటున్నారు. సామాజిక కారణాలు అంటే ఇక్కడ కుల అసమానత, సీ్త్ర పురుష అసమానత. అవి వేదాలలోను, మనుస్మృతిలోను, గీతలోను ఉన్నాయి. సామాజిక అసమానతలే ఫలితమైనపుడు అవి మూలగ్రంథాల వల్ల వచ్చాయనే చెప్పుతాము.
ఈ చుక్కలు కలపండి అందమైన అయ్యగారి బొమ్మ వస్తుందన్నారు. కాని చుక్కలు కలిపితే వికృతమైన కోతి బొమ్మ వచ్చింది. అంటే కోతి బొమ్మ రావడం కొరకే చుక్కలు పెట్టారని అర్థం. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, గీత చదివి వాటిని పాటిస్తే సమానత్వం, సౌభ్రాతృత్వం వస్తాయన్నారు. కాని అవి రాలేదు. అంటే వాటిని పాటిస్తే వచ్చేది సామాజిక అసమానతలని తేలిపోయింది.
ఈ విశ్వానికంతటికీ మూలమైన సత్యం గురించి ప్రస్తావించారు ఒక చోట. హరిశ్చంద్రుడు సత్యాన్ని ఇలా పాటించారు అన్నారు మరోచోట. ఇక్కడ సత్యము అనేది ఒకే పదానికి రెండు వేరు వేరు అర్థాలు వచ్చాయి. ఈ నానార్థ ప్రయోగాలు భాషా ప్రయోజనాన్ని, సమాజ ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. అవకాశవాదాన్ని ప్రోత్సహిస్తాయి. హరిశ్చంద్రుని విషయంలో ఉపయోగించిన సత్యం, అబద్ధం ఆడకపోవడం అనే అర్థాన్నిస్తుంది. ఈ విషయంలో అబద్ధం అనే పదాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. విశ్వానికి మూలమైన సత్యం అంటే త్రికాల అబాధితము. అంటే మూడు కాలాల్లో నశించనిది. అంటే ఏ కాలంలోనూ నశించనిది. ఈ సత్యం విషయంలో సమాజంలో రెండు భిన్నాభిప్రాయాలున్నాయి. బ్రాహ్మణిస్టులు దేవుడే సత్యము అంటారు. చార్వాకులు, లోకాయతులు, హేతువాదులు, భౌతికవాదులు పదార్థం సత్యం అంటారు. పదార్థం త్రికాలములలో నశించదు అంటారు. పదార్థ చలనాలను, ప్రదేశ కాలాలను పదార్థమే అంటారు. అంటే విశ్వమే సత్యం. ఇలాంటి పరిస్థితిలో సత్యం దేవుడా? పదార్థమా? అనే చర్చసాగాల్సి ఉంటుంది. కాని బ్రాహ్మణిస్టులు దేవుడు ఉన్నాడా? లేడా? అనే చర్చగా మార్చారు. అలా మార్చడంలో వారికి మాత్రమే అనుకూలించే ఎత్తుగడ ఉంది. దేవుడు లేడంటే మూలసత్యం లేదన్నట్లవుతుంది. విశ్వానికంతటికీ మూలమైన సత్యం ఏమిటి? అనడంలోనూ ఇలాంటి ఎత్తుగడే ఉందని అర్థం. చార్వాకాధి భాతికవాదులు విశ ్వమే సత్యం అంటుంటే విశ్వానికి మూలమైన సత్యం ఏమిటి? అని ప్రశ్నించడం అంటే చర్చను తమకు అనుకూలంగా మార్చుకోవడమని అర్థం. దేనికైతే పుట్టుక చావు ఉంటుందో దానినే సృష్టి అంటాము. జగత్తు అంటాము. వస్తువును సృష్టి అంటాము. జీవులను సృష్టి అంటాము. సృష్టికి మూలం సత్యం అవుతుంది. బ్రాహ్మణిస్టుల ప్రకారం దేవుడు సత్యం అయినందున వస్తువులు, జీవుల పుట్టుకకు మూలం దేవుడు. భౌతికవాదుల ప్రకారం పదార్థం సత్యం అయినందున వస్తువులు, జీవుల పుట్టుకకు మూలం పదార్థం. మనిషికి, దైవానికి సంబంధం ఉందనుకుంటారు బ్రాహ్మణిస్టులు. మనిషికి, పదార్థానికి సంబంధం ఉందనుకుంటారు భౌతికవాదులు.
మనుషులకు రెండు రకాల స్వభావాలు ఉన్నాయని చెబుతారు బ్రాహ్మణిస్టులు. రాక్షస స్వభావం, దైవీ స్వభావం. భౌతిక వాదుల ప్రకారం ప్రకృతిలో ఆహారం కోసం ఘర్షణ జరుగుతుంది. రెండు వేరు వేరు జాతుల మధ్య జరిగే ఘర్షణను జాత్యంతర ఘర్షణ అని, ఒకే జాతిలో జరిగే ఘర్షణను జాత్యంతస్థ ఘర్షణ అంటారు. జాత్యంతస్థ ఘర్షణ ఉండకూడదనే ఆకాంక్షతోనే సమాజంలో న్యాయం, విలువలు అనే విషయాలు ముందుకు వచ్చాయి. న్యాయం, విలువలు పాటించేవారికి మంచి స్వభావం ఉన్నట్లుగా, పాటించని వారికి చెడు స్వభావం ఉన్నట్లుగా భౌతికవాదులు భావిస్తారు. బలవంతులు న్యాయం, విలువలు గురించి చెబుతూనే మనుగడ కోసం పోరాటాన్ని ఆచరిస్తారు. దీనివల్ల న్యాయం, విలువలు సంక్షోభంలో పడిపోతాయి. బ్రాహ్మణిస్టులు చెప్పే రాక్షసస్వభావం, దైవీ స్వభావం అనే ప్రచారం మనుగడ కోసం పోరాటాన్ని ఆచరించడమే.
మనిషి గమ్యం బ్రాహ్మణిస్టుల ప్రకారం మోక్షం పొందడం. జన్మరాహిత్యం పొందడం. స్వర్గాన్ని చేరడం. అవి ఉన్నాయా? లేవా? అనేది మరొక చర్చ. లేవు అనేదే భౌతికవాదుల అభిప్రాయం. భౌతికవాదుల ప్రకారం మనిషి గమ్యం వీలైనంత ఎక్కువ కాలం జీవించడం, సహజ మరణం వచ్చే దాకా తాను జీవిస్తూ ఇతరులు కూడా జీవించడానికి సహకరించడమే.
యుద్ధం అంటే మానవుల మధ్య జరిగే అంతర్గత ఘర్షణ. అది ఉండకూడదని భౌతికవాదుల అభిప్రాయం. యుద్ధమే అధర్మం. అలాంటప్పుడు ధర్మయుద్ధం ఉండదు. యుద్ధానికి సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచడానికి ధర్మయుద్ధమనే ప్రచారాన్ని తెచ్చారు బ్రాహ్మణిస్టులు.
సమాజంలో ప్రతి ఒక్కడికీ వాడి వాడి ప్రవర్తనా నియమాలు ఉంటాయంటున్నారు అరవిందరావు. సాధారణంగా చెప్పేటప్పుడు ఎవరికి కేటాయించిన పనిని వారు చేయడమే ధర్మం అన్నారు. అంటే ఏ కులానికి కేటాయించిన పనిని ఆ కులం వాళ్లు చేయడమని అర్థం. దానినే వారు పరోక్షంగా చెప్పడం జరిగింది. బ్రాహ్మణిస్టుల ప్రకారం సత్యం, అహింస, తపస్సు బ్రాహ్మణుల ధర్మం. భౌతికవాదుల ప్రకారంగా అసత్య ప్రచారమే బ్రాహ్మణ వర్ణ ధర్మం. బ్రాహ్మణిస్టుల ప్రకారం క్షత్రియుని ధర్మం మంచిని స్థాపించడం, చెడును ఎదుర్కోవడం. వారి దృష్టిలో మంచి అంటే వారికి అనుకూలంగా ఉండడం, చెడు అంటే వారికి వ్యతిరేకంగా ఉండడం. ఇలాంటి మంచి చెడుల స్థాపన కోసం యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఫలితం హింసనా? అహింసనా? హింసే. కృష్ణుడు అర్జునుడికి తన ధర్మం పాటించమనే చెప్పాడు అనుకుందాము. కాని వచ్చిన ఫలితమేమిటి? యుద్ధం – హింస. అంటే క్షత్రియ ధర్మాన్ని పాటించమని చెబితే యుద్ధం వస్తుందని అర్థం. క్షత్రియధర్మం పాటించమని చెబితే యుద్ధం చేయమని ప్రోత్సహించడమేనని అర్థం వస్తుంది. అలాగే బ్రాహ్మణులు అహింసను పాటిస్తూ హింసను ప్రోత్సహిస్తారని అర్థం. అందువల్ల గీతాసారం అసమానతలను సృష్టించడం, హింసను ప్రోత్సహించడమేనని అర్థం.
– బి. సైదులు,
కురవి, వరంగల్‌

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.