గీర్వాణ కవుల కవితా గీర్వాణం -10
11-దిగంబర జైన కవి -‘’అసగ’’
క్రీ శ.800లో జన్మించిన ఆసగ కవి దిగంబర జైనుడు .సంస్కృత కన్నడ భాషలలో గొప్ప కవి .సంస్కృతం లో అసగ రాసిన గ్రంధం ‘’వర్ధమాన చరిత్ర ‘’.ఇందులో పద్దెనిమిది సర్గలున్నాయి .ఈ కావ్యాన్ని 853లో రాశాడు .ఇదే చివరి జైన తీర్ధంకరుడు వర్ధమాన మహా వీరుడు ‘’జీవితం పై వెలువడిన మొదటి గ్రంధం .అసగ సంస్కృతం లో ఎనిమిది రచనలు చేశాడు .కన్నడం లో కూడా చాలా రాశాడని అంటారు కాని కాళిదాసు ‘’కుమార సంభవ ‘’కావ్యానికి అసగ కన్నడం లో రాశాడని చెప్ప బడే ‘’కర్నాటక కుమార సంభవ కావ్యం ‘’కూడా లభించటం లేదు .ఈ కావ్యాన్ని తరువాతికవులు పేర్కొన్నా అసలు రచన అలభ్యం .రాష్ట్ర కూట రాజుల్లో మూడవ కృష్ణ పాలనలో ఉన్న కన్నడ కవి ‘’శ్రీ పొన్న ‘’పై అసగ ప్రభావం ఎక్కువ అంటారు .జైన తీర్ధంకరుల చరిత్ర రాసిన తరువాతి కవులు అసగ ప్రభావము ,స్పూర్తి తోనే రాశారు .’’శబ్ద మణి దర్పణం’’ రచించిన కేసి రాజు కవి 1260 లో అసగ కన్నడ సాహిత్యం లో పేరెన్నిక గన్న కవి అని, అతని సంస్కృత రచన ప్రశస్తి చెందిందని రాశాడు .
అసంగ లేక అశోక శబ్దానికి అపభ్రంశమే ‘’అసగ ‘’అన్నారు .క్రీ శ.800-878కాలం లో పరిపాలించిన రాష్ట్ర కూట రాజు అమోఘ వర్షు ని సమకాలీనుడు .రాజాస్తానకవి గుణ వర్మ తో సరి సమానమైన కీర్తి ప్రతిష్టలను రాజాస్థాన ప్రవేశం లేకుండానే రచనల ద్వారా పొందాడు అసగ .వర్ధమాన చరిత్రలో తాను ఎనిమిది కావ్యాలు రాసినట్లు చెప్పుకొన్నాడు కానీ ఇది తప్ప ఏదీ మిగల్లేదు .విరాళా నగరం లోను చోడ దేశం లోని చోడ విషయ నగరం లో ను ఉండి కవిత్వం రాశానని చెప్పుకొన్నాడు .అవి రాష్ట్ర కూట రాజు శ్రీనాధుని రాజ్యం లో ఉండి ఉంటాయి .శాంతి పురాణం లోని కవి ప్రశస్తి పద్యాలలో అసగ తాను జైన కుటుంబం లో జన్మించానని చెప్పి తాన ముగ్గురు గురువులను పేర్కొన్నాడు .అందులో భావకీర్తి ఒకడు .ఇంతకు మించి అసగ ఏమీ చెప్పుకోలేదు .
అసగ అనంతరం 950 కాలం వాడైన కన్నడ కవి శ్రీ పొన్న అసగ రాసిన వాటిని ఉపయోగించుకొని రచన చేశానని చెప్పుకొన్నాడు .తాను అసగ కంటే గొప్ప కవిననీ ప్రకటించుకొన్నాడు .చంద్రానుపాసన వంటి కావ్యాలు రాసిన జయకీర్తి , తరువాతి కాలపు కవులు అసగ పాండిత్యాన్ని ,కవితా ప్రతిభను ప్రస్తుతించారు .అసగుని కర్నాట కుమార సంభవ కావ్యాన్ని ఉటంకించారు .దుర్గా సింహ ,జయ సేన ,జయకీర్తి అసగను దేశి కన్నడం లో గొప్ప కవి అన్నారు .అంటే సాంప్రదాయ లేక ప్రాంతీయ భాషాకవి అని అర్ధం .భాషా చరిత్ర కారుడు ఏ.కే వార్డర్ మాత్రం అసగ మహా గొప్ప సంస్కృత కవి అన్నాడు .పదకొండవ శతాబ్దికి చెందిన కన్నడ వ్యాకరణ కర్త రెండవ నాగ వర్మ మాత్రం అసగ పాండిత్యం పొన్న పాండిత్యానికి సరిపోలుతుందని తేల్చాడు . పన్నెండవ శతాబ్ది కన్నడ రచయిత బ్రహ్మ శివ అసగ ని ‘’రాజక ‘’అన్నాడు గౌరవం గా .అంటే కన్నడ సాహిత్యం లో సుప్రసిద్ధులలో అసగ ఒకడు అని అర్ధం .పదహారవ శతాబ్దం లో విజయనగర సామ్రాజ్య పతనం వరకు అసగ సాహిత్యం కన్నడ దేశం లో గొప్ప ప్రచారం పొందింది .అసగ రాసిన కన్నడ గ్రంధాలు లభ్యం కాక పోయినా అతని పేరు కన్నడ సాహిత్యం లో దిగ్గజాలైన అగ్గల ,మనసిజ ,శ్రీ వరద దేవ ,గుణా నంది సరసనే ఉన్నది .పదవ శతాబ్ది వాడైన అపభ్రంశ కవి ‘’ధవాల్ ‘’అసగుడు హరివంశ పురాణం రాశాడని పొగిడాడు .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-14-ఉయ్యూరు

