![]() |
ఉపనిషత్తుల్లో మనం చూసే యాజ్ఞవల్క్యుడు, భృగువు, ఉద్దాలకుడు మొదలైన అనేక రుషులు ఈ జ్ఞానం పై ప్రేమగలవాళ్లు, విద్యాలయాలు నడిపినవాళ్లు. ఆ విద్యాలయాల్లో వేలాదిమంది విద్యార్థులు ఉండినట్లు గమనిస్తాం. చరిత్రలో బహుశా అవే మొదటి యూనివర్సిటీలు కావచ్చు. (అందుకే ఈ నాటికీ ఎన్ని కష్టాలకు ఓర్చి అయినా పిల్లల్ని చదివించే అలవాటు మనకు ఉంది). ఆ విద్యాలయాల్లో free thinking కు ప్రాధాన్యత ఉండేది. గురువు, శిష్యులు నిర్భయంగా చర్చించుకుని సత్యాన్ని తెలుసుకోవాలని ‘సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై’ అనే మంత్రం చెబుతుంది. ‘మావిద్విషావహై’ – అంటే ఈ అన్వేషణలో ఉన్న మనం అభిప్రాయభేదాల వల్ల పరస్పరం కలహించుకోకుండా ఉందుము గాక అని కూడా అన్నారు. ఈ ఆలోచనా పద్ధతిలో సృష్టిని గూర్చి ఎలా చెప్పారో చూద్దాం.
విశ్వమంతా కేవలం చైతన్యమే అనేది ఉపనిషత్తుల్లో చెప్పే ముఖ్య విషయం. మరి ఈ చైతన్యమంటే ఒక వ్యక్తి కాదు. దీనికి భిన్నంగా మరో పదార్థం లేదు. మరి అలాంటప్పుడు మనం చూస్తున్న ప్రపంచం ఎలా వచ్చింది అనే విషయంపై చాలా ఆశ్చర్యకరమైన రీతిలో చెప్పారు. ఈ చైతన్యంతోనే ప్రకృతి అని మనం పిలిచే అనిర్వచనీయమైన శక్తి ఏర్పడిందనీ అందులో మొట్టమొదట మనం చూసే అనంతమైన ఆకాశం ఏర్పడిందనీ చెప్పారు. తర్వాత ఆకాశాద్ వాయు: — అంటే ఆ స్పేస్‌లో వాయువులు ఏర్పడ్డాయట. తర్వాత వాయో: అగ్ని: – అంటే ఆ వాయువులు అగ్ని రూపంగా మారాయి. అగ్నే: ఆప:- అంటే ఆ అగ్నులే ద్రవీభవించి నీరుగా ఏర్పడింది. ఆ ద్రవపదార్థమే క్రమక్రమంగా భూమిగా మారింది. పృథివ్యా ఓషదయ:- ఈ భూమి ప్రకృతిలోని వృక్షప్రపంచానికి ఆధారమైంది. ఈ వృక్షాలు, మొక్కలు వాటిలో పండే ధాన్యాలూ అన్నంగా మారాయి. అన్నాత్ పురుష: అంటే ఆ అన్నమే జీవకోటికి మూలమైంది. ఇక్కడ ‘పురుష’ అనే పదం మనిషి అనే అర్థంలో కాదు. చీమ నుండి మొదలు రాక్షసబల్లి వరకూ అన్ని జంతువులకూ వర్తిస్తుంది. వీటన్నింటికీ వేదాంతం పెట్టిన సాధారణ నామదేయం జీవి అని. ప్రతి జీవి కూడా అన్నాన్ని తింటూ తను కూడా మరోజీవికి అన్నంగా మారుతుందట.
వేదాంత పుస్తకాలు చదవడం ప్రారంభించిన రోజుల్లో తైత్తిరీయ ఉపనిషత్తులోని పై చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. మనం సైన్సులో హైస్కూలు స్థాయిలో నెబులార్ సిద్ధాంతమని చదువుతాం. అందులో ఈ సృష్టి అంతటికీ మొదలుగా ‘నెబులా’ అనగా వాయువుల సమూహాలు ఏర్పడ్డాయనీ, వాటిలో అగ్ని తీవ్రత ఉండేదనీ అది క్రమక్రమంగా ద్రవంగానూ, ఘనపదార్థంగానూ మారి నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయని చదువుతాం. అలాగే జీవుల పుట్టుక గురించి 19వ శతాబ్దంలో డార్విన్ అనే అతను ప్రకృతి నుంచి క్రమక్రమంగా అనేక జీవులు ఏర్పడ్డాయని చెప్పాడు. ఉపనిషత్తుల్లో వివిధ జంతువులు ఏర్పడిన విధానాన్ని డార్విన్ చెప్పినట్లుగా చింపాంజి లాంటి జంతువుల నుండి మనిషి వచ్చాడని చెప్పకపోయినా వృక్షప్రపంచం నుంచే జంతుప్రపంచం వచ్చినట్లు చెప్పారు. ఉపనిషత్తులో పై చెప్పిన విషయం భౌతిక శాస్త్రంలో మనం చదివే నెబులార్ సిద్ధాంతాన్ని జంతుశాస్త్రంలో చదివే డార్విన్ సిద్ధాంతాన్ని కలిపి చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఇంత ఆశ్చర్యకరమైన విషయాన్ని హైస్కూలు స్థాయిలో ఉన్న విద్యార్థులందరికీ తెలిస్తే వారికి మన పూర్వీకులు ఎంత శాసీ్త్రయంగా ఆలోచించారో తెలుస్తుంది.
డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు ప్రపంచ ం ఆశ్చర్యపోయింది. అనేక దేశాల్లో మతవ్యవస్థలు దీన్ని వ్యతిరేకించాయి. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ నాటికీ కొన్ని రాషా్ట్రలలో ఈ సిద్ధాంతాన్ని చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారు. పై ఉపనిషత్తులో చెప్పిన విషయం మతగ్రంథాలు చెప్పే creationism కు వ్యతిరేకంగా ఉందంటూ మతపెద్దలు దాన్ని అడ్డుకోవడం జరుగుతూనే ఉంది. మనదేశంలో ఏ మత వ్యవస్థ నుండీ కూడా ఎలాంటి వ్యతిరేకత రాకపోవడానికి కారణం మన మూలగ్రంధాల్లో శాసీ్త్రయ దృక్పథం ఉండడం వల్లనే.
‘వేదాల్లోనే అన్నీ ఉన్నాయష’ అనేమాట అజ్ఞానంతో కూడినదనైనా వేదాల్లో ఏమీలేదు అనడం అంతకన్నా ఎక్కువ అజ్ఞానం. ప్రపంచంలోని మూల సత్యాలు తెలుసుకోవాలని ఇవాళ శాస్త్రజ్ఞులు ఎంత ఆరాటపడుతున్నారో ఆనాడూ కొంతమంది అలాగే ఆరాటపడ్డారు. వాళ్లు రుషులు కావచ్చు. బౌద్ద బిక్షువులు కావచ్చు లేదా మరో సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు. వీరెవరికీ ఒక మతం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కానీ, రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశం కానీ లేదు. హేతుబద్ధంగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవడమే వీరి ఆకాంక్ష.
మరి మనం పురాణాల్లో బ్రహ్మదేవుడు అంటూ నాలుగు తలల దేవుడు ఒకాయన ఉన్నాడనీ, అతనికి సరస్వతి అనే భార్య ఉందనీ, ఆయన ప్రపంచంలోని జంతువుల్ని, మనుషుల్ని సృష్టి చేస్తూంటాడనీ మరోవైపు పుస్తకాల్లో చదువుతూంటాం. ఇది ఎలాగ అని ప్రశ్నిస్తే ఈ గ్రంఽధాలు secondary texts అని ఇదివరలో చెప్పుకున్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకే విషయాన్ని రెండు స్థాయిల్లో చెప్పడం ప్రాచీనుల ప్రత్యేకత. ఆలోచన శక్తి ఉండి సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన ఉన్నవాడికి మొదటి స్థాయిలోనూ, అలాంటి తపన లేనివాడికి, కేవలం మతవిశ్వాసాల్ని పాటిస్తూ సమాజం, సంసారం, ధన సంపాదన మొదలైన వాటిలో మునిగి సాధారణ జీవితం గడిపేవాడికి రెండవ స్థాయిలో, అంటే పురాణాల కథలరూపంలో చెప్పారు. పురాణాల్లో చూసే బ్రహ్మదేవుడు, వే దాంతంలో చెప్పే బ్రహ్మ అనే చైతన్యము రెండూ వేరువేరని ఇదివరలో చెప్పుకున్నాం. చైతన్యంలో ఏర్పడిన సృజనశక్తినే. symbolic గా పురాణాల్లో బ్రహ్మదేవుడు అని చెప్పడం జరిగింది. ఇతనికున్న నాలుగు తలలూ నాలుగు వేదాలను సూచిస్తాయి. సృష్టి చేయడానికి తెలివి అవసరం కాబట్టి చదువుల తల్లియైున సరస్వతీదేవిని ఇతనికి భార్య అన్నాం. విషయం తెలిసిన వాడికి ఇది కేవలం సింబాలిక్ అని తెలుస్తుంది. తెలియని వాడికి ఇదొక దేవతా స్వరూపం, దీన్ని ఆరాధించాలి అనే భావన ఉంటుంది. అంతేకాని బ్రహ్మదేవుడు ప్రకృతిలోని ఏనుగుల్నీ, పులుల్నీ, అడవుల్నీ సృష్టిస్తున్నాడనీ, తన గంటంతో మన తలవ్రాత రాస్తున్నాడనీ దాన్నిబట్టి మన కష్టసుఖాలున్నాయనీ భావించడం చిన్నపిల్లల అవగాహన.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ


