![]() |
నా అసలు పేరు సులోచన. నా ఫ్యామిలీ మొత్తం సినిమావాళ్లే. నాన్న కృష్ణకుమార్ కొరియోగ్రాఫర్. అమ్మ సరోజ హెయిర్ డ్రెస్సర్. నానమ్మ కృష్ణాభాయి నటి. ఇంకా చెప్పాలంటే మా పెద్దమ్మ హెయిర్ డ్రెస్సర్, పెదనాన్న, అంకుల్ కెమెరామెన్లు. ఇలా మా కుటుంబంలో అందరూ సినిమాతో ముడిపడినవాళ్లే. నాన్న మరాఠి, అమ్మ తెలుగు. రాజమండ్రి దగ్గర కొవ్వూరు మా అమ్మ పుట్టిల్లు. మా ముత్తాత అంటే నాన్నమ్మ వాళ్ల నాన్నగారు మహారాష్ట్రలో స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారట. ఆ రోజుల్లో అక్కడ గొడవలు ఎక్కువ జరుగుతుండడంతో ముగ్గురు కూతుళ్లతో అక్కడ ప్రశాంతంగా జీవించలేమని నాన్నమ్మవాళ్లు చెన్నైకి వచ్చేశారట. నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ఇండస్ర్టీకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. తమిళం తప్ప నాకు వచ్చిన భాషలన్నీ సినిమా నేర్పినవే. నేను పెద్దగా చదువుకోలేదు. పది పూర్తయిన తర్వాత చదువు మానేశాను. దీనికి కారణం సినిమాల్లో నటించాలనే తపనే.
తొలిసారి తెలుగులోనే..
రజనీకాంత్, శ్రీప్రియ నటించిన ‘కోకిలమ్మ చెప్పింది’లో తొలిసారిగా నేను వెండితెరపై కనిపించాను. నాకప్పుడు పదేళ్ల వయసు. ఆ సినిమా షూటింగ్‌కి అమ్మతోపాటు నేనూ వెళ్లేదాన్ని. ఆ సినిమాలో పిల్లలకు డ్యాన్స్ నేర్పించే సన్నివేశం ఒకటి ఉంది.. పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్న సన్నివేశం తీస్తున్నారు. నేను డ్యాన్స్ బాగా చేస్తానని తెలిసి మిగతా పిల్లలతోపాటు నాకూ మేకప్ వేయించి, ఆ సన్నివేశంలో నటింపజేశారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమాలో నటించలేదు. ఒక రోజు నాకు స్కూలు లేకపోవడంతో ఊర్వశి శారద నటిస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్లాను. అప్పట్లో మా అమ్మ, శారదగారికి హెయిర్‌డ్రస్సర్‌గా వ్యవహరించేది.
నేను సెట్‌లో నిల్చుని షూటింగ్ చూస్తున్నా. అక్కడే ఉన్న మలయాళం డైరెక్టర్ ఒకాయన నన్ను చూసి ‘చాలా అందంగా ఉంది. నా సినిమాకి ఇటువంటి అమ్మాయే కావాలి’ అని నా కోసం వాకబు చేశారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహీత కేజీ జార్జ్. అమ్మానాన్నలు అంగీకరించడంతో హీరోయిన్ అయిపోయా. అప్పుడు నాకు 13 ఏళ్లు. మలయాళంలో జార్జ్ తీసిన ‘ఇని అవళ్‌ఉరంగట్టె’ నా తొలి సినిమా. హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అది. నటన గురించి ఏమీ తెలియకుండానే అలా హీరోయిన్ అయిపోయా. ఆ సినిమాలో ఏం చేయాలో, ఎలా చేయాలో జార్జే చూసుకున్నారు. ఇప్పుడంటే వర్క్‌షాపులు, ఫిలిం ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయిగానీ, మా రోజుల్లో పెద్దల్ని చూసి నేర్చుకోవడమే. నా మొదటి సినిమా కథ కూడా నాకు తెలియదు. ఈ సినిమాలో నటించడానికి ముందు ‘ఈ అమ్మాయి ఓకే… హీరోయిన్ ఈమే’ అని చెప్పారంతే. అప్పట్లో తమిళం, మలయాళంలో సులక్షణ అనే మరో నటి ఉండడంతో, కేజీ జార్జ్ నా పేరుని అనురాఽధగా మార్చారు. ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. 30కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. తెలుగులో చంద్రమోహన్‌తో ‘పంచకల్యాణి’, రంగనాథ్‌తో ‘ఊరు నిద్ర లేచింది’… ఇంకా కొన్ని సినిమాలు చేశాను. ఎందుకో తెలీదు ‘ఊరు నిద్ర లేచింది’ విడుదల కాలేదు. అందులో జట్కా బండి నడిపే అమ్మాయి పాత్ర నాది. పేరు ‘పంచకల్యాణి. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.
డ్యాన్సర్‌గా నా ప్రస్థానం..
హీరోయిన్‌గా 30కిపైగా సినిమాలు చేసిన అమ్మాయి క్లబ్ సాంగ్‌లకి, వాంప్ పాత్రలకి పాపులారిటీ అయ్యిందేమిటా అనుకుంటున్నారా! దానికో కథ ఉంది. మలయాళంలో చేస్తున్న ఒక సినిమాలో (పేరు గుర్త్తులేదు) డ్యాన్స్ నేపథ్యమున్న హీరోయిన్ క్యారెక్టర్ నాది. కుటుంబ పోషణ కోసం డ్యాన్స్‌లు చేసే పాత్ర. మామూలుగానే డ్యాన్సర్‌ని. ఇక డ్యాన్స్ క్యారెక్టర్ కావడంతో అదరగొట్టేశాను. ఆ సినిమాలో నా డ్యాన్స్‌లు చూసి రఘురాం మాస్టారు ఐటమ్‌సాంగ్‌లో నటించమని అడిగారు. అప్పట్లో ఆ పాటలకి సిల్క్‌స్మితని మించిన వాళ్లు లేరు. అప్పటికి ఆమెతో నాకు పరిచయం లేదు. చాలా బిజీగా ఉండేది. పైగా గర్వంగా ఉండేదనేవారు. ఎక్కువగా గొడవ పడేదట. దాంతో మాస్టర్లు ఆమెకు ప్రత్యామ్నాయంగా నన్ను అడిగి, ఒప్పించేశారు. చేసిన ప్రతి పాట హిట్టే. నాకూ క్రేజ్ పెరిగింది. దీంతో అవే పాత్రలు రావడం మొదలయ్యాయి. ఆ పాటలేంటని అడగకండి, చాలా ఉన్నాయిగానీ మర్చిపోయాను.
హీరోయిన్‌గా ప్రారంభించిన నేను డ్యాన్సర్‌గా మారినప్పుడు మొదట్లో ఫీలయ్యాను. కానీ, రఘురాం మాస్టారు చెప్పిన మాటలు నటిగా నా దృక్పథాన్నే మార్చేశాయి – ‘ఒక్కసారి సినిమా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన తరవాత నెంబర్ వన్ కావాలన్నదే నీ లక్ష్యం కావాలి. హీరోయిన్, అమ్మ, అక్క, క్లబ్ డ్యాన్సర్, వ్యాంప్… ఇలా ఏ పాత్ర చేశామన్నది ముఖ్యం కాదు. మీరు చేసింది జనాలకి నచ్చిందా, లేదా, మీరు బాగా చేశారా లేదా అన్నదే ముఖ్యం’ అన్న ఆయన మాటలు నాపై బాగా పనిచేశాయి. నేను బాగా నటించానా, లేదా అన్నదే నాకు ముఖ్యం. ఆ పాత్రలు మంచివా, చెడ్డవా అన్నది అనవసరం. బాడ్ క్యారెక్టర్లు చేయడం వల్ల మేము బాడ్ కాలేదు. బాడ్ క్యారెక్టర్లు చేశామే గానీ, మా క్యారెక్టర్ బ్యాడ్ కాదు. అది ప్రజలు తెలుసుకోవాలి.
ప్రేమ-పెళ్లి..
1987లో నా పెళ్లి జరిగింది. మావారు సతీష్‌కుమార్ కూడా కొరియోగ్రాఫరే. ఇండస్ర్టీలో మేము మంచి ఫ్రెండ్స్. మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఆయనతో మాట్లాడొద్దన్నారు. కలిసి ఎక్కడికి వెళ్లొద్దన్నారు. పెద్దవాళ్లు ఏది చేయొద్దని చెబితే దానికి విరుద్ధంగా చేసే వయసు మాది. ఇక తప్పక ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. మాకు ఇద్దరు పిల్లలు అభి (అభినయశ్రీ), కెవిన్. అభికి ఏడెనిమిదేళ్లప్పుడు మావారికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. కదలలేని స్థితికి చేరుకున్నారు. దాంతో ఇల్లు, పిల్లల బాధ్యత నాపైనే పడింది. మావారికి అన్నం తినిపించడం, డ్రెస్ మార్చడం, నడిపించడం అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. అలా పదకొండేళ్లుగా కాపాడుకోగలిగాను. కొంచెం జ్ఞాపకశక్తి వచ్చి, బాగవుతుంది అనుకునే సమయంలో (2007) గుండెపోటు వచ్చి మాకు శాశ్వతంగా దూరమయ్యారు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అది.
సిల్క్‌స్మితతో అనుబంధం..
సిల్క్‌స్మిత మొదట్లో నాతో మాట్లాడేది కాదు. ఆమె సొంత సినిమాలో నేను నటించా. ఆ తర్వాత బాగా మాట్లాడేది. మా మధ్య చనువు పెరిగింది. అప్పటి నుండి మేం మంచి ఫ్రెండ్స్‌గా మారాం. చాలా మంది సిల్క్ స్మితకు పొగరు అనుకునేవారు. కానీ ఆమె ఒక చిన్నపిల్లలాంటిది. అప్పుడప్పుడూ ‘మీరందరూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలతో స్థిరపడ్డారు. నాకే ఏమీ లేదు’ అని బాధపడేది. వేరే ప్రాబ్లమ్స్ గురించి చెప్పేది కాదు. ఏమైనా తనలో తనే దాచుకుంటుంది. బయటపడదు. అదే ఆమె బలహీనత. ఎంత క్లోజ్‌గా ఉన్న వారితో అయినా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడేది కాదు. ఒక గిరి గీసుకుని, అందులోనే ఉండిపోయింది.
బయటికి కనిపించే సిల్క్‌స్మిత వేరు, లోపల వేరు. ఆమె చనిపోవడానికి ముందు రోజు ఫోన్ చేసి- ‘మా ఇంటికి రావే..’ అని అడిగింది. ఆ రోజే మా ఆయన బెంగుళూరు నుండి వస్తున్నారు. అభికి, కెవిన్‌కి స్కూల్ ఉంది. వాళ్లని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని చెప్పాను. ‘ఇప్పుడు రాలేవా? ఇప్పుడు రాలేవా?’ అని పదే పదే అడిగింది. తన గొంతులో ఉండే వేదనను పసిగట్టలేకపోయాను. ఆ రోజు నేను వెళ్లలేకపోయాను. ఒక వేళ ఆ రోజు నేను వెళ్లుంటే తను బాధలు చెప్పుకొనేదేమో.. కొంత సాంత్వన లభించి ఆత్మహత్య చేసుకొనేది కాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది.
మేం దూరం కాలేదు
అభి పుట్టిన తరువాత సినిమాలకు దూరమయ్యాను. వాస్తవానికి నేను దూరం కాలేదు. ఇండసీ్ట్రనే దూరం చేసుకుంది. పెళ్లయిపోయింది.. గ్లామర్ ఉండదు.. అని అవకాశాలు ఇవ్వలేదు. సినిమా ఇండస్ర్టీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఇంకా నటించాలన్న ఆసక్తితోనే ఉంటారు. ఏదో ఒక పాత్ర చేయాలనుకుంటారు. నేను మొదట హీరోయిన్‌గా చేశాను, తరువాత డ్యాన్సులు చేశాను. కొంచెం వయసు మీద పడింది కాబట్టి ఇప్పుడు గ్లామర్‌గా చేయలేనుగానీ, అక్క, అమ్మ, అత్త పాత్రలు చేయగలను కదా! నా వరకూ నాకు అప్పుడప్పుడు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘ఒరేయ్ రిక్షా’లో పోలీసుగా చేశాను. ‘అంతరంగాలు’ సీరియల్‌లో నటించాను. ప్రస్తుతం ‘దైవమగన్’ సీరియల్‌లో చేస్తున్నాను. నా సమకాలీనుల్లో చాలా మంది సినిమాలకు కావాలనే దూరమైపోయారు. నేను ఇంకా కొనసాగుతుండడానికి కారణం ఏంటని కొంతమంది అడుగుతుంటారు. అది వాళ్ల వాళ్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా! జయమాలిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. నేను ఇలా వున్నాను. శాంతి (డిస్కో) వచ్చింది. చాలా బిజీగా చేసింది. శ్రీహరిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు తన ఫ్యామిలీ, తన ఇల్లు, పిల్లలు అంతే. వారి బ్యాక్‌గ్రౌండ్ అలా మారిపోయింది. చాలా మంది అలాగే సినిమాలకు దూరమయ్యారు.
ఎప్పుడూ బాధపడలేదు
సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఏనాడూ సినిమాల్లోకి ఎందుకొచ్చానురా అని బాధపడింది లేదు. అలాగే ఇటువంటి పాత్రలు చేశానే అని ఫీలైందీ లేదు. నేను అన్ని రకాల పాత్రలు చేశాను. హీరోయిన్‌గా చేశాను, బెల్లీ డ్యాన్సులు చేశాను, కామెడీ చేశాను, ఐటమ్‌సాంగ్స్, వాటితోపాటు క్యారెక్టర్ రోల్స్ చేశాను. సుమన్ నటించిన ఒక సినిమాలో చెల్లెలి పాత్ర చేశాను. చాలా మంచి పాత్ర అది. సానుభూతి కలిగించే పాత్ర. సూపర్ సోలో డ్యాన్సర్‌గా వున్నప్పుడే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే ‘కల్పన’లో హీరో కల్యాణ చక్రవర్తికి గుడ్డి చెల్లెలిగా నటించాను. ఏ పాత్ర నాకు బాగా పేరు తెచ్చిందన్న విషయాన్ని నేనంతగా పట్టించుకోను. హీరోయిన్‌గాచేస్తేనే పేరా? సాంగ్స్‌కి వచ్చినా పేరు పేరే కదా. నేను చేసిన పాత్రలన్నీ నాకు ఇష్టమే. వ్యాంప్ పాత్రలు చేసినందుకు నేనేమి బాధపడడం లేదు. నటిగా చాలా సంతృప్తితోనే ఉన్నాను. ఒకప్పుడు మేము చేసిన డ్యాన్సులనే హీరోయిన్లు కూడా చేస్తున్నారు. మా రోజుల్లో అయితే ఈ పాటలకి లేదా వ్యాంప్ పాత్రలకి పలానా వాళ్లే కావాలని ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు అన్ని పాత్రలూ ఒక్కరే చేసేస్తున్నారు. చేయడానికి హీరోయిన్లు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఫ్యాన్సీగా ఒక అమౌంట్ తీసుకుని, మూడు నాలుగు రోజులు చేస్తే సాంగ్ అయిపోతుంది కదా!


