అల్లూరికి ఇల్లు కట్టిస్తున్న గజల్ శ్రీనివాస్

మన అల్లూరికి ఇల్లు
అల్లూరి సీతారామరాజు అనగానే మనకు స్వాతంత్య్ర పోరాటం గుర్తుకొస్తుంది. రంప తిరుగుబాటు మదిలో మెదులుతుంది. అడవిబిడ్డల హక్కుల కోసం బ్రిటిష్‌వారిపై ఆయన తిరగబడటం గుర్తుకొస్తుంది. తెలుగు నేల మీద అక్కడక్కడ ఆయన విగ్రహాలు కూడా కనిపిస్తుంటాయి. కాని ఆయన నివసించిన ఇల్లు, నడయాడిన స్థలాలు, మరణించిన ప్రాంతంలో నిర్మించిన సమాధిల పరిస్థితి దయనీమం. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి, ఆరేళ్ల వయసు దాకా అల్లూరి ఇంటిని పునరుద్ధరించటానికి ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌, అల్లూరి యువసేన, ఇంకా అనేక మంది ఆయన అభిమానులు పూనుకున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమయితే- అనేక మంది తెలుగు జాతి రత్నాలు నివసించిన భవంతులకు కొత్త ఆలంబన దొరుకుతుంది.
’’మొదటిసారి ఆ ఇంటిని చూసినప్పుడు- అక్కడ అల్లూరి నివసించాడంటే నమ్మలేకపోయా..’’ అంటారు గజల్‌ శ్రీనివాస్‌. అల్లూరి జన్మించింది పశ్చిమగోదావరి జిల్లాలోని పాండ్రంగి. అయితే మొదటి ఆరేళ్లు పెరిగింది మాత్రం భీమవరం సమీపంలోని మొగల్లులో. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా రకరకాల ప్రాంతాలకు వెళ్లాడు. ఆయనతో పాటుగా అల్లూరి కూడా ఊర్లు మారుతూ వచ్చాడు. ‘‘అల్లూరి కుటుంబం వేరే ఊరికి వెళ్లినప్పుడు దానిని ఒక తాహసిల్దారుకు అద్దెకు ఇచ్చి వెళ్లారు. చాలా కాలం ఆ కుటుంబం అక్కడే ఉంది. ఆ తర్వాత వారు కూడా వదిలి వెళ్లిపోవటంతో ఇల్లు దెబ్బతినింది. దాంతో ఆ కుటుంబం వారు అమ్మకం పెట్టడంతో మేము నాలుగు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాం’’ అని శ్రీనివాస్‌ ఆ ఇంటి కథను వివరించారు. స్థలాన్ని కొనుగోలు చేసి దాన్ని స్థానికంగా ఏర్పాటు చేసిన అల్లూరి స్మారక నిధికి అప్పగించారు.
ఇంటిని కొనుగోలు చేసి..
కేవలం కొనుగోలు చేయటమే కాకుండా- ఆ ఇంటిని అల్లూరి యథాతథ గృహంగా మార్చటానికి స్మారక నిధి ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఇంటిని అదే పద్ధతిలో పునఃనిర్మించాలంటే అంత సులభం కాదు. సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరాజు ఈ బాధ్యతలు చేపట్టారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో పురాతనమైన గృహాలను పరిశీలించి ఒక డిజైన్‌ను ఫైనల్‌ చేశారు. ‘‘కేవలం ఇంటిని మాత్రమే నిర్మిస్తే చాలదు. అందరికి స్ఫూర్తి నింపేలా ఒక మ్యూజియంలా మార్చాలనేది మా ఉద్దేశం. ఇది అధునాతన హంగుల్లో ఉంటుంది. ఇంటి లోపలికి ప్రవేశించిన వెంటనే ధ్యానముద్రలో ఉన్న అల్లూరి దర్శనమిస్తారు’’ అని శ్రీనివాస్‌ వివరించారు. ధ్యానముద్రలో ఉన్న అల్లూరి కంచు విగ్రహాన్ని రాజకుమార్‌ వడయార్‌ అనే శిల్పి రూపొందిస్తున్నారు. నాలుగు అడుగుల పొడవు, 300 కేజీల బరువుండే ఈ విగ్రహం అందరినీ విశేషంగా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ‘‘అల్లూరి మనందరికీ ఒక పోరాటయోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన జీవితంలో అనేక కోణాలున్నాయి. బ్రిటిష్‌ వారితో పోరాడే ముందే హిమాలయాలకు వెళ్లి వచ్చాడు. ఆయనకు ఆయుర్వేదం తెలుసు. జోతిష్యం తెలుసు. ఆయన కాళికాదేవి భక్తుడు కూడా. ప్రతి రోజు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట. ఇందుకు అనేక ఆధారాలున్నాయి. అందువల్ల ఆ ఇంటిని ధ్యాన మందిరంగా మార్చి అందరూ అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవటానికి వీలుగా మార్చాలనుకుంటున్నాం’’ అన్నారాయన.
ఇరవై లక్షల ప్రాజెక్టు..
ఈ మొత్తం ప్రాజెక్టుకు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు సాయం అందించటానికి విదేశాలలో ఉండే ఎన్నారైలతో సహా అనేక మంది ముందుకు వచ్చారు. 2015 జనవరి 9వ తేదీన దీనిని ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొగల్లులోనే 40 సెంట్ల భూమిలో- అల్లూరి జీవిత చరిత్రను ప్రతిబింబించేలా ’శౌర్య శిల్పారామం’ను నిర్మించాలన్నది మరొక ఆలోచన. స్థానికంగా ఒక దాత ఆ భూమిని స్మారక నిధికి విరాళంగా ఇచ్చారు. కేవలం అల్లూరికి మాత్రమే కాకుండా మిగిలిన తెలుగు వెలుగుల గృహాల పరిరక్షణకు తెలుగు ప్రజలు ముందుకు వస్తారని ఆశిద్దాం.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.