దశదిశలా ‘దశమి’

దశదిశలా ‘దశమి’

దసరా… అందరినీ అలరించే పండగ. విజయాలను అందించే పర్వదినం. దేశంలో ఎక్కువ ప్రాంతాలలో దసరా సందర్భంగా అమ్మవారిని పూజిస్తే ఉత్తర భారతంలోని కొన్నిచోట్ల రాముడినీ ఆరాధిస్తారు. దసరా వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకుంటారు. ఒక్కోచోట, ఒక్కో పేరుతో ఈ పండగను పాటిస్తారు. ప్రాంతాలనుబట్టి వేడుకల తీరుతెన్నులు, సంప్రదాయాలు మారిపోతుంటాయి. ఆంధ్రలో నవరాత్రులకు అమ్మవార్లు వివిధ అవతారాల్లో దర్శనమివ్వడం, బొమ్మల కొలువులు ప్రత్యేకమైతే తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేకం. ఇక కర్నాటకలో మైసూరు దసరా ఉత్సవాలు కనువిందు చేస్తాయి. ఆ తరువాతి స్థానం పశ్చిమబెంగాల్‌దే. ముఖ్యంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసే పండల్ (మండపాలు) ఆకర్షణ అంతాఇంతా కాదు. అలాగే, హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో జరిగే ఉత్సవాలకూ పేరుంది. దసరా వస్తే అందరి కళ్లూ మైసూరువైపే చూస్తాయి. విద్యుద్దీపకాంతులతో, బంగారువర్ణంతో ధగధగలాడే రాజభవనాన్ని చూడడానికి రెండుకళ్లూ చాలవు. 404 సంవత్సరాల క్రితం ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో నాలుగు కీలక ఘట్టాలున్నాయి. యునెస్కో గుర్తింపునకు నోచుకున్న వేడుక ఇది. మైసూరు దసరా ఉత్సవాన్ని కర్నాటక ప్రభుత్వం రాష్టప్రండుగగా గుర్తించింది. 15వ శతాబ్దంలో శ్రీరంగపట్నంలో విజయనగర రాజులు తొలిసారి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. వడయారు రాజులు అధికారంలోకి వచ్చాక 1610లో తొలిసారి మైసూరులో ఈ వేడుకలు నిర్వహించారు. అప్పటినుంచి నిరాటంకంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 2010లో చతుశ్శతాబ్ది వేడుకలుగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. పసిడి కాంతుల్లో ప్యాలెస్ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే పదిరోజులూ మైసూరు ప్యాలెస్‌ను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. రోజూ లక్ష దీపాలు వెలిగించడం ఇక్కడి సంప్రదాయం. పదిరోజులూ రాత్రి 7 నుంచి 10 గంటలవరకు పసిడికాంతులతో ప్యాలెస్ వెలిగిపోతుంది. కోటి రూపాయలు ఇందుకోసం వెచ్చిస్తారు. విద్యుల్లతలతో మెరిసిపోయే రాజప్రాసాదాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. నిర్ణీతవేళల్లో రాజభవనంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు అనుమతి ఉంది. అమ్మవారి సేవలో… ఆ మూడు ఏనుగులు.. వడయారు రాజుల ఇలవేల్పు చాముండేశ్వరి దేవి. ఆమె ప్రతిమకు రోజూ రాజప్రాసాదంలో స్వయంగా రాజే అర్చన చేస్తారు. అయితే, గత ఏడాది మైసూరు రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయారు మరణించడంతో ఈసారి ఎవరు పాల్గొంటారన్నది ప్రశ్న. దసరానాడు అమ్మవారిని ఏనుగుపై అంబారీపై అమర్చిన బంగారు సింహాసనంపై ఉంచి ప్రజల సందర్శన కోసం ఊరేగిస్తారు. మైసూరు ప్యాలెస్ నుండి బన్ని మంటపం వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు పాల్గొంటాయి. దీనినే జుంబో సవారీ అంటారు. నిజానికి బన్ని అంటే శమీ అని అర్థం. శమీచెట్లు ఉన్న మంటప ప్రాంతమే బన్నిమంటపం. ఈ ఊరేగింపునకు ముందు రాజభవనంలో ప్రత్యేక దర్బారు నిర్వహించడం సంప్రదాయం. 1805లో మూడవ కృష్ణరాజ వడయార్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. రాజకుటుంబీకులు, అతిథులు, అధికారులు, సామాన్యులు ఈ దర్బారులో పాల్గొంటారు. అశోక విజయదశమి వౌర్యసామ్రాజ్యాధినేత అశోకుడు దసరా నాడే బౌద్ధ మతం స్వీకరించాడని చెబుతారు. అందుకే దసరాను అశోక విజయదశమిగా బౌద్ధం స్వీకరించినవారు పాటిస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో ఈ సంప్రదాయం ఉంది. బాలాసాహెబ్ అంబేద్కర్ కూడా అశోక విజయదశమి నాడే బౌద్ధం స్వీకరించారు. నాగపూర్‌లో 1956 అక్టోబర్ 14న దసరా నాడు ఆయన బౌద్ధంలోకి మారారు. దమ్మచక్ర పరివర్తన్‌గా పిలుచుకునే ఈ వేడుకకు పెద్దసంఖ్యలో అంబేద్కర్ అభిమానులు పాల్గొంటారు. ఎక్కడ..? ఎన్నాళ్లు..? * నేపాల్‌లో విజయదశమి వేడుకలు పదిహేనురోజులపాటు నిర్వహిస్తారు. దసరాను దశిన్‌గా వ్యవహరిస్తారు. కుటుంబంలో చిన్నవారికి పెద్దలు ఆశీర్వచనం చేస్తూ నుదుటిన తిలకం దిద్దుతారు. జమర్ అనే వస్తువును బహూకరిస్తారు. అది విజయాలను అందిస్తుందని వారు భావిస్తారు. * బంగ్లాదేశ్‌లో ఐదు లేదా ఆరు రోజులపాటు దసరా వేడుకలు చేస్తారు. ఇక్కడి హిందువులు, ముఖ్యంగా బెంగాలీలు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. ఢాకాలోని రామకృష్ణమఠం ఆధ్వర్యంలో దక్షేశ్వరి ఆలయంలో దుర్గాపూజలు నిర్వహిస్తారు. శ్రీలంకలోనూ దసరా పాటిస్తారు. * మహారాష్టల్రో పదిరోజులపాటు చేస్తారు. బంధువులు, స్నేహితులు దసరా నాడు అప్త అనే మొక్క ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆరోగ్యాన్ని, సంపదను, ఆయుష్షును పెంచే పవిత్ర పత్రమని వారు భావిస్తారు. అదేరోజు సామూహిక విందు కార్యక్రమంలో అంతా పాల్గొంటారు. * తమిళనాడులో లక్ష్మి, సరస్వతి, శక్తిలను పూజిస్తారు. పదిరోజుల వేడక ఇది. కులశేఖరపట్నంలోని ముత్తురమ్మన్ ఆలయంలో కొలువైన శివ, శక్తిలను పూజిస్తారు. చివరిరోజు దాదాపు 15 లక్షల మంది ఇక్కడ పూజల్లో పాల్గొంటారు. విభన్న వస్తధ్రారణలతో నిష్టగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. దసరా….దశ.. హర మనిషిలో ఉండే పది చెడు విషయాలను హరించేది దసరా (దశ..హర). ఆ పది చెడు లక్షణాలకు గుర్తుగా రావణుడి పది తలలను ఉదహరిస్తారు. కామం, క్రోధం, మోహం, లోభం, మద, మాత్సర, స్వార్థం, అన్యాయం, అమానవత, అహంకారం అనేవి ఆ పది లక్షణాలు. మనిషిని చెడుమార్గంలోకి నెట్టేవి అవే. అందుకే చెడుకు సంకేతమైన రావణుడి బొమ్మను దగ్ధం చేస్తారు. విజయాలకు గుర్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు చండీహోమం చేసి రావణుడిని తుదముట్టించే తరుణోపాయాన్ని అమ్మవారి ద్వారా తెలుసుకున్నాడని ప్రతీతి. యుద్ధంలో విజయదశమి నాడే రాముడు విజయాన్ని సాధించాడని చెబుతారు. ద్వాపర యుగంలో విరాటుని కొలువులో ఉన్న పాండవుల గుట్టును రట్టుచేసే ఉద్దేశంతో గో సంపదను దోచుకునేందుకు కౌరవులు కుట్రపన్నుతారు. సరిగ్గా విజయదశమి నాడే పాండవులు జమ్మిచెట్టుపై ఉన్న ఆయుధాలను తిరిగి తీసుకుని, విజయాన్ని సాధించారు. మహిషాసురుడితో తొమ్మిదిరోజులపాటు యుద్ధం చేసి పదోరోజు.. అంటే విజయదశమి నాడు దుర్గాదేవి అతడిని సంహరించి విజయం సాధించిదని భక్తుల విశ్వాసం. అందుకే మంచికి, విజయానికి విజయదశమి సంకేతంగా భారతావని భావిస్తుంది. కులు దసరా హిమాచల్ ప్రదేశ్‌లో కులు లోయలో జరిగే దసరా వేడుకలకు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రప్రభుత్వం దీనిని అంతర్జాతీయ పండగగా ప్రకటించి నిర్వహిస్తోంది. కులు సామ్రాజ్యాధినేత జగత్‌సింగ్ 17వ శతాబ్దంలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. దసరా నుంచి ఏడురోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. శాపవిమోచన కోసం రఘునాథుడిని పూజించాలన్న సూచనతో జగత్‌సింగ్ ఈ వేడుకలను ప్రారంభించారు. మైసూరు దసరా వేడుకల తరువాత ఇక్కడికే పెద్దసంఖ్యలో పర్యటకులు వస్తారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులు ఎక్కువగా పాల్గొనే ఈ ఉత్సవాల్లో రథంపై జరిగే రఘునాథుడి యాత్రకు లక్షల్లో భక్తులు హాజరవుతారు. రామ్‌లీలకు యునెస్కో గుర్తింపు దసరా ఉత్సవాలు అమ్మవారికి సంబంధించినవి అయినప్పటికీ ఉత్తర భారతం, కొన్ని దక్షిణ భారత ప్రాంతాలలో రాముడి లీలలను నాటకరూపంలో ప్రదర్శిస్తారు. రామాయణ ఘట్టాన్ని గుర్తుకు తెస్తారు. దసరా వేడుకల్లో చివరిదైన విజయదశమి నాడు రామ్‌లీల కథను ముగించి రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారు. బాణసంచా కాలుస్తారు. శీతాకాలం ప్రారంభమయ్యేవేళ వాతావరణ మార్పులు, కాలుష్యాన్ని తొలగించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటారు. దీనిని సామాజిక సాంస్కృతిక విశిష్ట కార్యక్రమంగా యునెస్కో 2005లో పేర్కొంది. అపురూప మానవీయ దృశ్యకావ్యంగా దీన్ని అభివర్ణించింది. ఆ తరువాత భారత ప్రభుత్వం రెండున్నర గంటల నిడివిగల రామ్‌లీల డాక్యుమెంటరీని రూపొందించి యునెస్కోకు బహూకరించింది. రామ్‌లీలపై ఆకాశవాణిలో వచ్చిన కార్యక్రమం కూడా ఎన్నో బహుమతులను అందుకుంది. * ఈసారి రాజులేకుండా దర్బారు.. మైసూరు దసరా ఉత్సవాలలో రాజదర్బారు ప్రత్యేకం. వడయారు రాజవంశ ప్రతినిధి శ్రీకంఠదత్త నరసింహరాజ వడయారు ఈ దర్బారులో పాల్గొనేవారు. గత ఏడాది ఆయన మరణించడం, వారసులు లేకపోవడంతో ఈసారి దర్బారులో బంగారు సింహాసనంపై అధిష్ఠించేవారు లేరు. అయితే, రాజఖడ్గాన్ని సింహాసనంపై ఉంచి దర్బారు నిర్వహిస్తామని ప్యాలస్ క్యురేటర్ నరసింహ ప్రకటించారు. అంబారీపై అమ్మవారు మైసూరు దసరా ఉత్సవాల్లో ముఖ్య ఆకర్షణ ఏనుగులపై చాముండేశ్వరి మాత ఊరేగింపు. ఈ ఊరేగింపులో పాల్గొనే ఏనుగులు ఏడాదిలో 11 నెలలు అడవుల్లోను, ప్రత్యేక జూలలోనూ ఉంటాయి. దసరాకు నెలరోజులముందు మైసూరు చేరుకుంటాయి. నగరహోళ్ నేషనల్ పార్కు నుండి అవి వచ్చేటపుడు హన్సూర్ తాలూకాలోని ఓ గ్రామం వద్ద రాజకుటుంబీకులు, స్థానికులు వాటిని ఆహ్వానిస్తారు. రాజప్రాసాదంలో వడయారు రాజవంశీకులు ఆరాధించే చాముండేశ్వరి విగ్రహాన్ని, రాజఖడ్గాన్ని 750 కిలోల బరువుండే బంగారుమంటపంపై ఉంచి దానిని ఏనుగుపై ఊరేగిస్తారు. ఈ ప్రదర్శనలో 16 ఏనుగులు పాల్గొంటాయి. దాదాపు 70 ఏనుగులకు 240మంది మావటీలు శిక్షణ ఇస్తారు. వాటిలో పదహారు ఏనుగులను ఎంపిక చేస్తారు. ఈ నెల్లాళ్లు వాటిని ప్రత్యేక అతిథులుగా రాజకుటుంబం పరిగణిస్తుంది. వెన్న, గోధుమ, చెరకు, బెల్లం, అన్నం, వేరుశనగ, కొబ్బరి, వెన్న, పెసర, జీడిపప్పు, కాస్త ఉప్పు కలిపిన ఈ పదార్థాలను వీటికి పెడతారు. ఇక కొమ్మలు, ఆకులు, గడ్డి అదనం. మొత్తమీద ఒక్కో ఏనుగుకు రోజుకు 400 కిలోల ఆహారాన్ని అందిస్తారు. రెండుపూటలా వాటికి ఈ విందు ఉంటుంది. ఊరేగింపులో 16 ఏనుగులు పాల్గొన్నప్పటికీ చాముండేశ్వరి మాతను మోసే ఏనుగుకు మాత్రం ప్రత్యేక గుర్తింపుఉంది. ప్రజలు దానిని ఆరాధిస్తారు. ప్రదర్శనలో పాల్గొనే అన్ని ఏనుగులనూ రంగులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. అంబారీని ఆకర్షణీయంగా అలంకరిస్తారు. జమ్మి ప్రత్యేకతలెన్నో.. గుబురుగా, ఏపుగా పెరిగే జమ్మి- ఓ ఔషధ వృక్షం. జమ్మిచెట్టుపై ఆయుధాలు ఉంచిన పాండవులు దానిని పూజించి విజయం సాధించారు. అందుకే దసరానాడు జమ్మి (శమీ)కి పూజలు చేస్తారు. ఆలయాల్లోనూ ఇది పాటిస్తారు. జమ్మి ఆకులను అయినవారికి ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది శుభప్రదమని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆపతి, షను మొక్కల ఆకులనూ దసరా పూజల్లో వాడతారు. ఆయుర్వేదంలో ఈ ఆకులను యాంటీ బయాటిక్‌గా, సెప్టిక్ నిరోధక ఔషధాల తయారీలో వాడతారు. జమ్మిచెట్టును రాజస్థాన్ రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయవృక్షంగా గుర్తించింది. బహరైన్ ప్రభుత్వం అక్కడి ఎడారిలో 400 ఏళ్లనాటి జమ్మిచెట్టును అపురూపంగా చూసుకుంటోంది. నీటినిల్వలను పెంచడంలో దీనికి సరిసాటి లేదని పరిశోధకులు చెబుతారు. బతుకమ్మ పండగ…. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండగ దసరా వేడుకలతో ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక వచ్చిన తొలి దసరాతో బతుకమ్మ ను రాష్ట్ర పండగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రభుత్వం నిర్ణయించింది. బతుకును ఇచ్చే అమ్మ అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ కాలంలో లభించే పూలతో ఓ పళ్లెంలాంటి పాత్రలో రోజుకో వరుస చొప్పున నవరాత్రులలో తొమ్మిది వరసలతో తీర్చిదిద్దిన పూలవరుసల బొమ్మ- బతుకమ్మను రోజూ ఇంటివద్ద పూజిస్తారు. గుమ్మడి, దోస పూలు, ఆకులు, అల్లి, గడ్డి, వాము పువ్వులు, గునుగు, తంగేడు, బంతి,చామంతి, తామరపువ్వులతో బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఇవన్నీ ఔషధ మొక్కలే కావడం గమనార్హం. ఆ తరువాత దసరా నాడు సద్దుల బతుకమ్మగా పిలిచి ఇంటివద్ద పూజించాక…అంతాకలిసి…అందరి బతుకమ్మలను ఓ చోట పేర్చి పాటలు పాడుతూ మహిళలు కోలాహలంగా ఆడతారు. సంప్రదాయ ప్రసాదాలు నివేదించాక బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. నైవేద్యాలను జొన్న, సజ్జ, మొక్కజొన్న, పల్లి, పెసర, మినుములు, బియ్యం, జీడిపప్పు, బెల్లంతో చేస్తారు. అంతకుముందు బతుకమ్మ పైభాగంలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజిస్తారు. పసుపును తీసుకుని మంగళ సూత్రానికి పూసి అమ్మవారి ఆశీస్సులు కోరతారు. బొమ్మల కొలువు దసరా నవరాత్రి ఉత్సవాల రోజుల్లో బొమ్మలకొలువులు నిర్వహించడం ఓ సరదా, సంప్రదాయం. ఇది ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు చేస్తారు. వివిధ రకాల బొమ్మలను సేకరించి, ఓ సార్వజనీన ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇది ఓ ఉమ్మడి ప్రపంచాన్ని తలపిస్తుంది. ముత్తయిదువులను పిలిచి వాయనాలు ఇస్తారు. చిన్నపాటి పూజతంతు చేస్తారు. ప్రధానంగా ఇది వేడుక మాత్రమే. ఆంధ్ర, కర్నాటకలలో కొన్ని ప్రాంతాల్లో ఇది కన్పిస్తుంది. బొమ్మలకొలువును గొలు అని కూడా పిలుస్తారు. బెంగాల్…పండాల్… పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజగా శరన్నవరాత్రులను నిర్వహిస్తారు. పూజలకు ఎంత విలువ ఇస్తారో అమ్మవారి విగ్రహాలు కొలువుదీరే మండపాలు (పండల్)ను అంత విభిన్నంగాను, ఆధునికతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతారు. భారీ వ్యయ, ప్రయాసలతోఇవి ఏర్పాటు చేస్తారు. భారీ వెదురుబొంగులు, రంగురంగుల చేనేత వస్త్రాలను ఉపయోగించి వేసే సెట్టింగులనే పండల్స్‌గా పిలుస్తారు. అవి భారీసైజులో ఉంటాయి. లక్షల్లో ఖర్చు ఉంటుంది. సృజనాత్మక, ఆధునికత జోడించి వీటిని రూపొందిస్తారు. కోల్‌కతాలో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. అమ్మవారి విగ్రహాల తయారీకి నియమ నిబంధనలున్నాయి. పూరీ జగన్నాథ రథయాత్ర జరిగిన రోజున గంగానదీ తీరంలో తీసిన బంకమట్టితో మాత్రమే అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తారు. వీటికి రసాయన రంగులు అద్దరు. బొమ్మలు తయారుచేసే కళాకారులు ఆ పనిలో ఉన్నంతకాలం మాంసాహారానికి, మద్యానికి, సంసార సుఖానికి దూరంగా ఉంటారు. ***

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.