నేడే జాషువా జయంతి

గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది.
కొ త్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. అది తన విధి విధానాలను, అభివృద్ధి నమూనాను రూపొందించుకుంటూ, అలాగే భాషా సాంస్కృతిక విధి విధానాలను, రాజధానిని ఎక్కడ ఏర్పరచాలన్న పనిలోనూ నిమగ్నమై ఉంది. తెలుగు సమాజాన్ని పరిపాలించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి భాషా విధానాన్ని (పాలనాభాషగా తెలుగు) రూపొందించుకొని తెలుగు భాష, జాతి, నిరంతరాయంగా ముందుకెళ్ళేట్టు చేయడంలో గురుతర బాధ్యత ఉంది. అందుకోసం మన పూర్వకవుల ప్రసక్తి, తెలుగుభాషను సుసంపన్నం చేసిన ఆధునిక భాషావేత్తలు, కవులు చేసిన కృషిని మరింత ముందుకు తీసుకుపోవలసి ఉంది.
తెలుగు సాహిత్యంలో ఆదికవిగా ప్రఖ్యాతుడైన నన్నయ మహాభారత రచనను జగద్ధితంగా చేస్తానని చెప్పినా, భారతంలో వాడిన భాష చాలావరకు సంస్కృతమే. పండిత భాషే. ఉభయ కవిమిత్రుడిగా ప్రఖ్యాతి గాంచి భారతాన్ని తెలుగువాళ్ళ కథలే అనుకునేంతగా తెలుగీకరించిన తిక్కన సోమయాజి కొన్ని వాడుక భాషా పదాలు, తెలుగు కొంచెం ఎక్కువే వాడినా ఆయన కవిత్వంలో సంస్కృతాంధ్ర భాషల కలయిక బాగా కనబడుతుంది. పోతే, తిక్కన తెలుగు ఎనిమిది వందలేండ్ల క్రితం నాటిది. రాచరిక వ్యవస్థ కాలం నాటిది. ఆధునిక అవసరాలకది సరిపోదు. శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అన్నప్పటికీ తెలుగుసాహిత్య వికాసానికెంతో అది తోడ్పడుతున్నప్పటికీ, భాష విషయంలో అతని కాలం నాటిది ప్రబంధ పండిత భాషే. ప్రకృష్టమైన బంధంతో కూడుకున్నదైన సంస్కృత పండిత భాషే రాయల కాలం నాటి భాష. ఇక శ్రీనాథుడి ప్రౌఢ గంభీర భాష గూర్చి చెప్పనవసరం లేదు. క్షీణ ప్రబంధయుగంలో కొంత తెలుగువాడబడినా సాహిత్య కారులుగా, భాషా వేత్తలుగా విశేష ప్రభావం చూపిన కవులు అంతగాకనబడరు. మధ్యయుగాల్లో వేమన ప్రజల భాషలో కవిత్వం రాసి, ప్రజలకోసం కవిత్వం చెప్పి మొట్ట మొదటి ప్రజాకవి అయ్యాడు. గురజాడ వాడిన వాడుక భాషలో కళింగ ప్రాంత ప్రాంతీయముద్ర, శ్రీశ్రీ భాషలో సంస్కృత పాండిత్య భాషా ప్రళయ ఘోష దర్శనమిస్తుంది. 20వ శతాబ్దంలో, ఇంకా చెప్పాలంటే ఇంతకముందరి తెలుగునాడు సమైక్యాంధ్రప్రదేశ్‌లో వివిధప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఆధునిక కవులు, వచన రచయితల రచనల్లో ప్రాంతీయ మాండలికాల హేల కనబడుతుంది. భావంలో వేమన మార్గాన్ని, భాషలో అచ్చమైన తెలుగునుడికారాన్ని తెలుగుదనాన్ని ప్రతిబింబింపజేస్తూ తీయనైన తెలుగులో రచనలు చేసిన ఆధునిక కవి గుర్రం జాషువా. అతడు పుట్టి పెరిగిన గుంటూరు ప్రాంత నేపథ్యం, కుల నేపథ్యం విశేషమైన జీవితానుభవాలను సమకూర్చి, అద్భుతమైన భాషను ఇచ్చింది. గుంటూరు ప్రాంత వ్యవహారిక భాషను సుమధుర సుందరమైన తెలుగు నుడికారంతో కవిత్వ భాషను చేసిన సామాజిక విప్లవకారుడు జాషువా. గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చేస్తున్న ఈ చారిత్రక సమయంలో, అదే విధంగా భాషా విధానాన్ని రూపొందించుకుంటున్న సమయంలో, దాదాపు శతాబ్ది క్రితం నుంచే ఆ భాషలో రచనలు చేసిన మహాకవి గుర్రం జాషువా కమనీయ సాహిత్యానికెంతో సుందర్భశుద్ధి ఉంది. ప్రస్తుత కాలానికి దాని అవసరమూ ఉంది.
జాషువా కావ్యాల్లోని ఏ పద్యం చదివినా హాయిగా, హృదయానందం కల్గించే విధంగా ఉంటుంది. అది కమ్మని తెలుగుభాష. ఆ కావ్యాలలో అందరికీ అర్థమయ్యే తెలుగుభాష దర్శనమిస్తుంది. మనల్ని తెలుగు మాగాణంలో విహరింపజేస్తుంది. జాషువా వాడిన కమ్మని తెలుగు నుడికారం వల్లనే భాష వల్లనే తెలుగుకు ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌, సుందర తెలుగు అన్న విశేషణాలు వచ్చాయి. గిడుగురామమూర్తి పంతులు తెలుగు భాషకు ఉన్న గొప్పతనం ఆ భాషలోని వ్యావహారిక పదాల వల్లనే వచ్చిందని చెప్పడంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తే మంచిది. జాషువా తెలుగుకు ఇంత తీయదనం, తెలుగుదనం ఎలా అబ్బిందో తెలుసుకోవాలంటే అతని జీవిత నేపథ్యంలోంచి వచ్చిన భాషా సౌందర్యాన్ని తిలకించాల్సిందే. జాషువా చదువుకున్న నాటి పరిస్థితులు, అంటరాని తనం విశృంఖల విహారం, దళితులు పొందిన అవవమానాలు, పీడిత కులాల బాధల్లోంచి ఆ భాష పుట్టింది. మొట్టమొదటి తెలుగు ప్రజాకవి వేమనలా ప్రజల భాషాసంప్రదాయాన్ని ఎన్నుకున్నారు. సాహిత్య ప్రయోజనం కేవలం ఆనందం కాదని ఉపదేశమని, ప్రజల కష్టసుఖాలను వెల్లడి చేసి సృజనాత్మక సాధనమని ప్రగతిశీల సామాజిక మార్పుకి అది ఎంతగానో దోహదపడుతుందని భావించి, తెలుగు నుడికారానికి గుడికట్టి దాన్ని స్వంతం చేసుకుని పద్యరచన చేశాడు. అట్లని, జాషువా పండిత భాషను అసలే వాడనేలేదని కాదు, జాషువా గొప్ప మానవీయ తాత్వికుడైన విద్యావంతుడు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, పురాణాలు, బైబిల్‌, ఖురాన్‌ లాంటి అన్ని ఉద్గ్రంథాలను ఔపోసన పట్టినవాడు. ప్రాచీన సాహిత్యంలో గాఢమైన అభినవివేశం, అనురక్తి ఉన్నవాడు. వీటనన్నిటితోపాటు ఆధునికతనూ అవగాహన చేసుకొన్నాడు. వీటి సమ్మిశ్రమంతో తనదైన పద్ధతిని ఎన్నుకొని అద్భుతమైన శైలిలో పద్యరచన చేసాడు. సాంప్రదాయక మూసలో పద్యం మునిగితేలుతున్న సమయంలో పద్య సాహిత్య రథచక్రాలను నేల మీదకి రప్పించి పద్యం ద్వారా ప్రజాస్వామిక, ప్రగతిశీల రచనలు చేయవచ్చని నిరూపించాడు. పద్యం నడ్డి విరుస్తానని ఓ కవి, తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టిస్తానని, భూకంపం సృష్టిస్తానని మరోకవి గర్జిస్తుంటే, జాషువా నిశ్శబ్దంగా పద్యాన్ని ప్రజాస్వామ్యీకరించి, అట్టడుగు దళిత జీవితాన్ని చిత్రించడానికి దాన్ని ఉపయోగించారు. పాతకొత్తల మేలుకలయికగా అటు ప్రాచీనతను, ఇటు నవ్య సాంప్రదాయాన్ని జీర్ణించుకొని కవితావ్యవసాయం చేసి అచ్చమైన తెలుగు కవి. తేలిక శబ్దాలతో తీయని శయ్యలతో కవిత్వ మల్లిన జాషువా తెలుగు-పక్కా తెలుగు సమాజపు తెలుగు.
జాషువాకి తెలుగునేలపై ఉన్న భక్తికి, తెలుగు కవులపై ఉన్న గాఢాభినివేశానికి ఇలాంటి ఉదాహరణలెన్నో కనబడతాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా అద్భుతంగా చిత్రించాడు. ఇలా తెలుగునేలలోని అణువణువు గురించి తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగునుడికారంతో కవితాయజ్ఞం కొనసాగించిన జాషువా తెలుగే సీమాంధ్ర తెలుగు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఈ సందర్భంలో జాషువా వాడిన తెలుగు కెంతో ప్రాధాన్యమున్నది. ఇప్పుడు ప్రామాణిక భాషగా వాడుతున్న పత్రికా భాష, సీమాం ధ్ర ప్రాంతపు సాహిత్య భాష కూడా జాషువా వాడిన భాషే. అయితే ప్రపంచీకరణం, కంప్యూటరీకరణం అంటూ ఏవేవో పోకడలు పోతున్న ఆధునిక సమయంలో ఇంగ్లీషే ప్రపంచమంటూ పరుగులుతీస్తున్న సయమంలో, జాషువా లాంటి విద్వత్కవి, పీడితుల కవివాడిన భాష గురించి ఆలోచించాల్సి ఉంది. ఇంగ్లీషును పూర్తిస్థాయిలో చదువుతూనే పాఠశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమం, అధికార భాషగా తెలుగును పూర్తిస్థాయిలో అమలుచేయాల్సి ఉంది. అందుకు అధికార భాషగా తెలుగును పూర్తి స్థాయిలో అమలుచేయాల్సి ఉంది. అందుకు విశ్వమానవ కవి యైున జాషువా చూపిన తెలుగు భాషా మార్గాన్ని అనుసరించాల్సింందే. ‘గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయ చేతన/ న్నెవ్విధి దూరినన్‌ నను వరించిన శారద లేచిపోవునే/ యివ్వసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు? గంటమూనెదన్‌/ రవ్వలు రాల్చెదన్‌ గరగల్‌ పచరించెద నాంధ్రవాణికిన్‌’ అని ఆంధ్ర దేశానికి అమూల్య, అనర్ఘ రత్నాలనదిగిన రచనలందించిన జాషువా ప్రాసంగికతలను (నేటి ఆవశ్యకతను) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భాషా విధానరూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాల్సిందే.
మన రాష్ట్రంలోని సాహితీవేత్తల విగ్రహాల్లో జాషువ విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయన సాహిత్య సమకాలీనతే. జాషువా సాహిత్యం సామాన్యులకు అంతగా దగ్గరైంది. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం జాషువా సాహిత్యం మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది.
ఇటీవలి కాలంలో తెలుగు భాషాభిమానులు భాషను బ్రతికించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. వారికి నా మనవి ఏమంటే జాషువా సాహిత్యాన్ని ఎంత బాగా ప్రజల్లోకి తీసుకెళితే అంత బాగా తెలుగుభాష మనగలుగుతుంది.
– డొక్కా మాణిక్య వర్రపసాద్‌
మాజీ మంత్రివర్యులు
(నేడు జాషువా జయంతి)

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.