తెలంగాణా సాహిత్యాన్ని అందించే ‘పొనుక’
- -ముదిగొండ శివప్రసాద్
- 22/11/2014

పొనుక- వ్యాస సంకలనం;
-డా.టి.రంగస్వామి,
వెల: రు.100/-
ప్రతులకు- విశాలాంధ్ర
అన్ని శాఖలు
తెలంగాణా ఉద్యమ ప్రభావంలో ఇటీవల తెలంగాణా సాహిత్య సాంస్కృతిక మూలాలను మూల్యాలను అనే్వషించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి జాతికి ఒక అస్తిత్వం ఉన్నట్లే ప్రతి ప్రాంతానికీ చరిత్ర, విలక్షణ సంస్కృతి ఉంటుంది. శాతవాహనుల కాలంనుండి మనకు కోటిలింగాల వద్ద తెలంగాణా మూలాలు లభిస్తున్నాయి. కాకతీయుల కాలంలో వింధ్యనుండి రామేశ్వరం వరకు వారి పరిపాలన సాగింది. ఆ తర్వాత అవిచ్ఛిన్నంగా ఏడువందల సంవత్సరాలు ముస్లిం పాలనలో తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని మరచిపోయారు. ఇప్పుడు తిరిగి జాతీయ పునరుజ్జీవనంలో భాగంగా సాహిత్య సామాజిక సాంస్కృతిక తత్వాలను పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన గ్రంథమే పొనుక అనే వ్యాస సంకలనం. ఇదొక తెలంగాణా మాండలిక పదం. వ్యవసాయ ఉత్పత్తులను మోసుకొనిపోయే వస్తువు. శబ్దరత్నాకరంలో పొనిక అనే రూపం మాత్రమే ఉంది. దానికి ముంజగడ్డి అని అర్థం ఇచ్చారు. డా.టి.రంగస్వామిగారి వ్యాసాలను మోసుకొని వచ్చిన పొనుక నిండా ఇక్కడి మట్టి సుగంధాలు వెలువడుతున్నాయి. రంగస్వామిగారు లోగడ చాలా గ్రంథాలు ప్రచురించి లబ్ధప్రతిష్టితుడైన రచయిత. ఇదొక వ్యాస సంకలనం. ఇందులో ఆయా సందర్భాలలో వెలువరించిన భిన్నాంశాలకు చెందిన రచనలు ఉన్నాయి. ఆముక్త మాల్యదనుండి ఇందూరు దాకా ఈ ప్రస్థానం సాగింది. కొన్ని వ్యాసాలు పరిధిలో సంక్షిప్తంగా ఉన్నాయి. వాటిని ఇంకా విస్తరింపవలసి ఉంది. ఇంద్రపురి ఇందూరుగా మారిందనే వివరణ సమంజసంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దులో చక్కెర పరిశ్రమ కేంద్రం బోధను ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని ఇంద్రవల్లభుడు పాలించినట్లు శాసనస్థమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇక్కడి ఇంద్ర నారాయణ దేవాలయ నిర్మాత ఈయనే. తర్వాతి కాలంలో అప్పాప్రగడ బోగప్పయ్య దీనిని పునరుద్ధరించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇక్కడి దేవాలయాలు కొన్ని మసీదులుగా మారాయి. దేవత్ మసీదు అలాంటిదే. ఈ చరిత్ర మొత్తం ఈతరం విద్యార్థులకు తెలియదు. కనీసం 1947కు ముందు కాశింరజ్వీ నాయకత్వంలో తెలంగాణాను పీడించిన రజాకార్ల గూర్చికూడా నేటి విద్యార్థులకు తెలియదు. ‘ముసలి నక్కకు రాజరికంబు దక్కునే’ అని గర్జించిన దాశరథి కవిత్వం వెనుక ఉన్న ఉద్యమస్ఫూర్తిని ప్రజలు మరచిపోకూడదు. టి.రంగస్వామిగారు ఒక వ్యాసంలో ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్టు రచయితల జాబితాను అందించారు. భూమికోసం భుక్తికోసం విముక్తికోసం రజాకార్లనుండి దొరలనుండి స్థానిక దొరల దోపిడీనుండి విముక్తి పొందటంకోసం 1947 ప్రాంతంలో తెలంగాణా ఉద్యమం వచ్చింది. 1947 ఆగస్టు 15 మొత్తం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణాకు ఎందుకు రాలేదు?? ఈ అంశాన్ని సాహిత్యపరంగా విశే్లషించిన ఒక చిన్న వ్యాసం ఇందులో ఉంది. ఇటు కులశేఖర ఆళ్వారుల మధుర భక్తినుండి అటు సర్దారు పాపారాయుడి వీరగాథవరకు చాలా అంశాలు ఈ వ్యాసాల్లో రచయిత తన పొనుకలో మోసుకొని వచ్చారు. వరదన్నగారి జీవిత చిత్రణ వ్యాసం బాగుంది. వీరికి అభినవ పోతన అనే బిరుదు సార్థకమైనదే. రామాయణంలో అతిథి పాత్రలు మంధర కైకేయి అనే వ్యాసంలో ఐతిహాసిక విశే్లషణ జరిగింది. కర్ణుడు లేని భారతం లేనట్లే కైకలేని రామాయణం లేదు. ఆమె ప్రేరణవల్లనే రాముడు అరణ్యాలకు వెళ్లి రావణ సంహారం చేశాడు. ఈ మహోపకారానికి మనం కైకమ్మను అభినందించాలి. కళారూపాల్లో సామాజిక సమస్యలేమిటి? మానవ సంబంధాలు నిన్న నేడు రేపు ఎలా ఉండబోతున్నాయి?? తమిళనాడులో తెలుగు సాహిత్యం వంటి వ్యాసాలు రచయిత పరిశోధనాసక్తిని ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా జీవన గీత కర్మయోగము- గీతాంజలి వ్యాసాలు రచయిత అభిరుచికి అద్దం పట్టాయి.
రంగస్వామిగారి సంకలనం చాలా బాగున్నా గ్రంథ రూపంలో వచ్చినప్పుడు వ్యాసాలను మరింత విస్తరించవలసిన అవసరం ఉందని అనిపిస్తుంది. నిబద్ధ దేశి- అనిబద్ధదేశి అనే విశే్లషణ గేయ (గాథ) కవితలో ఎలా ఉంటుందో సర్వాయిపాపడి వ్యాసంలో రచయిత చూపారు. మొత్తంమీద ఈ పొనక ప్రయోజనాత్మక గ్రంథంగా పాఠకుల ఆదరణను పొందుతుందని భావింపవచ్చు. భండారు నాగభూషణరావుతోబాటు వా

