నాన్న పాటకు నిత్య శ్రోతను ! అంటున్న కుమారుడు రత్నకుమార్

D25608368

నాన్న పాటకు నిత్య శ్రోతను !
అమృతం ఎన్నిసార్లు తాగితే తనివి తీరుతుంది? ఘంటసాల సంగీతం కూడా అంతే! మధు కలశంలో మధురమైన గీతాలను ముంచి శ్రోతలకు అందించినప్పుడు.. ఆ సంగీత దాహం ఎన్ని తరాలైనా తీరదు గాక తీరదు. ఆయన పాటల్ని ఎప్పుడు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్నంత కొత్తగా ఉంటుంది.
ఆయన జ్ఞాపకాలు కూడా అంతే! ఎన్నిసార్లు స్మరించుకున్నా.. సంగీత సాగర సముద్రంలో హాయిగా విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. నేడు ఘంటసాల జయంతి సందర్భంగా ఆయన కొడుకు ఘంటసాల రత్నకుమార్‌ను కలిసింది ‘నవ్య’.
‘‘ఘంటసాల అంటే శ్రోతలకు మహాగాయకుడు. నాకు తండ్రి, సంగీతవిద్వాంసుడు, మహానాయకుడు కూడా! మూర్తీభవించిన మానవత్వం ఆయనది. అందుకే అప్పటికీ, ఎప్పటికీ నాన్నే నా హీరో. నేను పీయూసీ చదివే రోజుల్లో చనిపోయారాయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్నను తలుచుకోని రోజు లేదు. ఆయన్ని స్మరించుకున్న తరువాతే ఏ పని అయినా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నేను డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నానంటే – అది నాన్నగారి పుణ్యమే. ఘంటసాలగారి నుంచి సంక్రమించిన భాష, గాత్రం, సంస్కారం వల్లనే అది సాధ్యం అయింది. ఏ అర్థాన్ని, ఏ భావాన్ని ఎలా వాడాలో నాన్న నుంచే నేర్చుకున్నాను. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నాను. అయితే – నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. ఉన్నత చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేసి, గౌరవనీయమైన స్థానానికి వెళ్లాలన్నది ఆయన కోరిక. అయినా సరే సంగీతం మీదున్న మమకారంతో ఆయనే నాకు ఆ విద్య నేర్పించారు. మొదట్లో నేనంత ఉత్సాహం చూపేవాడ్ని కాదు. మా అన్నయ్యకు సంగీతమంటే ఆసక్తి ఎక్కువ. అందుకే అతడిని సినిమా రంగంలో కొనసాగమన్నారు నాన్న. అన్నయ్య సుమారు ఇరవైకి పైగా వాయిద్యాలను పలికించేవారు. నాన్న సంగీత దర్శకత్వం చేపట్టిన సినిమాలకు అన్నయ్య పని చేశారు. అతను తమిళనాడు సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలో విద్వాన్‌ పట్టా అందుకోవడం విశేషం. అప్పట్లో అన్నయ్య పియానో అద్భుతంగా వాయించేవారు. నాన్నగారు పాడిన భగవద్గీతకు అన్నయ్య కీ బోర్డు ప్లేయర్‌. దురదృష్టం కొద్దీ అన్నయ్య అర్ధాయుష్షుతోనే తనువు చాలించడం విషాదం.
ఇసుకమీద చాప పరుచుకుని..
నాన్నగారితో మధురమైన జ్ఞాపకం మద్రాసులోని మెరీనా బీచ్‌కు వెళ్లడం. ఆయన విలాసవంతమైన ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. అందుకనే – ఎప్పుడు ఖాళీ దొరికినా అందర్నీ మెరీనాబీచ్‌కు తీసుకెళ్లడం అలవాటు. అక్కడ ఇసుకతిన్నెల మీద చాప పరుచుకుని హాయిగా పడుకునేవారు. మేమంతా ఆయన చుట్టూ చేరి అల్లరి చేసేవాళ్లం. ఇంట్లో కూడా అంతే! మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరుగుతున్నా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆడుకునేవాళ్లం. పిల్లల అల్లరికి ఏమాత్రం ఇబ్బంది పడేవారు కాదు నాన్న. పల్లెత్తు మాట అని ఎరగం. కోపం కూడా చాలా తక్కువ. పిల్లల గురించి ఎవరు ఫిర్యాదు చేసినా పెద్ద మనసుతో నవ్వి ఊరుకునేవారు. ఇక చదువు సంగతికొస్తే ఫలానా కోర్సు చేయండని, ఫలానాదే చదవండని కాని చెప్పేవారు కాదు. ‘‘పిల్లలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయించుకుంటారు’’ అనేవారు తప్ప జోక్యం చేసుకునేవారే కాదు. అప్పుడప్పుడు నేను రికార్డింగ్‌ థియేటర్‌కు వెళ్లేవాడ్ని. అంతకుమునుపే ఇంట్లో రిహార్సల్స్‌ను వినడం వల్ల సగం పాట వచ్చేది. ఆటల్లో ఉన్నాసరే, నాన్నగారి పాటలు పిల్లలందర్నీ అంతగా ఆకట్టుకునేవి. అయితే సంగీతం పట్ల ముందు తరాల వారి అభిరుచి ఏవిధంగా ఉండేదో నాన్న అంచనా వేసేవారట. అప్పుడప్పుడు అమ్మతో ‘‘నా తదనంతరం నా పాటల్ని నా పిల్లలు వింటారంటావా?’’ అనేవారట. ఆ విషయాన్ని మాతో చాలాసార్లు చెప్పింది అమ్మ. ఈ తరం సంగతి ఎలాఉందో కాని మా వరకు నాన్న పాటల్ని వినని రోజు ఉండదు. ఆయన పాటలు వినడంతోనే రోజు మొదలవుతుంది. ముగుస్తుంది. నాన్న పాట వినందే నిద్ర కూడా పట్టదు.
కులమతాలకు దూరం..
నాన్నకు కుల, మత పట్టింపుల్లేవు. మాది సో్త్రత్రియ బ్రాహ్మణ కుటుంబం. 1950 దశకం నాటి పరిస్థితులు ఏవిధంగా ఉండేవో అందరికీ తెలుసు. ఇవేవీ పట్టించుకునేవారు కాదు ఆయన. చాలా సందర్భాల్లో హరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలను చేసేవారు. ఒక రోజున గుర్రం జాషువాగారు మా ఇంటికి వచ్చారు. నాన్నగారు ఇంట్లో నుంచి ఎదురెళ్లి ఆయనకు స్వాగతం చెబుతూ ఇంట్లోకి వెళ్లారట. జాషువాగారు వెనకే వస్తున్నారనుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు నాన్న. వెనక్కి తిరిగి చూస్తే జాషువాగారు ఇంటి బయటే నిల్చుండిపోయారు. ‘‘అయ్యో, జాషువాగారూ.. ఎందుకు బయటే నిల్చుండిపోయారు?’’ అన్నారు నాన్న. ‘‘మీరు బ్రాహ్మణులు కదా! ఇంట్లోకి రావచ్చో.. లేదో’’ అని చెప్పారట ఆ మహాకవి. ఆ మాటలు విన్న నాన్న దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇద్దరు కలిసి భోజనాలు చేశారప్పుడు.
హిందుస్తానీ సంగీత విద్వాంసుడు బడేగులాం అలీఖాన్‌ ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇల్లే ఆతిథ్యం. నాటి సంగీతకారులంతా ఆయన శిష్యులే! నాన్నగారిని దక్షిణ భారతీయ శిష్యుడని అలీఖాన్‌ చెప్పేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు భోంచేయమని అమ్మ అడిగితే ‘‘వద్దమ్మా, మీరు బ్రాహ్మణులు కదా’’ అనేవారాయన. మా ఇంటి పైభాగంలోనే ఆయన వంట చేసుకునేవారు. ఒక్క రోజు మాత్రం మాతోనే భోంచేసేవారు.
సంకల్పబలం నిజమైంది..
అప్పటికే లాతామంగేష్కర్‌ భగవద్గీత బాగా పాపులర్‌ అయ్యింది. వాటిని నాన్నగారు విన్నారు. ఆవిడ సంస్కృత శ్లోకాలు చెబితే వాటికి ఆంగ్లంలో వాఖ్యానం వినిపించేవారు. అందుకే అది సామాన్యులకు, పామరులకు అందుబాటులో లేదన్నది నాన్నగారి భావన. ఆ లోటును పూడ్చేందుకు ఆయనే తెలుగు భగవద్గీతను పాడాలని నిర్ణయించారు. ఆ మహత్‌కార్యాన్ని 1973లో పూర్తి చేశారు. రికార్డు అయిన తర్వాత శ్రోతలు ఎలా స్వీకరిస్తారోనని మదనపడ్డారు. దురదృష్టం ఏంటంటే – ఆ రికార్డులు విడుదల కాకముందే నాన్నగారు మాకు దూరం అయ్యారు. ‘‘భగవద్గీత తరువాత సినిమా పాటలు పాడను’’ అని ఆయన ఏ క్షణాన ప్రతిన పూనారో తెలియదు కాని.. అదే నిజం అయ్యింది. అది ఆయన సంకల్పబలానికి నిదర్శనం.
‘‘ఇప్పుడు ఎంత మంది కొత్త గాయకులను ప్రోత్సహిస్తున్నారో నాకు తెలియదు కాని.. ఆ రోజుల్లో కొత్త వాళ్లకు బోలెడన్ని అవకాశాలు ఇచ్చారు నాన్న. ‘మాయాబజార్‌’లో ‘వివాహ భోజనంబు…’ పాటను కావాలనుకుంటే తనే పాడేవారు. కాని పాడలేదు. మాధవపెద్దిగారిచేత పాడించాలన్నది ఆయన ఆలోచనే! పిఠాపురం నాగేశ్వరరావు, పీబీ శ్రీనివాస్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్లను ఎంతో ప్రోత్సహించారు’’
‘‘మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెప్పేది భగవద్గీత. అలాంటిది మనిషి చనిపోయినప్పుడు భగవద్గీతను వినిపిస్తున్నారు. దాని వల్ల ఏమిటి ఫలితం..? అలా చేయడం నాన్నగారికి గౌరవం ఇచ్చినట్లు కాదు.’’
ఆఫీసుల్లో పనిచేసే బాయ్‌లను చూసినా ఆయన కనబరిచే ఆప్యాయత మాటల్లో చెప్పలేము. ఒకసారి స్టూడియోలో కాఫీ, టీలు తీసుకొచ్చే బాయ్‌ హఠాత్తుగా కనిపించలేదు. ‘‘ఆ కుర్రాడు ఏమయ్యాడయ్యా’’ అనడిగితే ‘‘రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు’’ అన్నారు. ఆ బాయ్‌ని గుర్తుచేసుకుంటూ.. ‘‘బహుదూరపు బాటసారి, ఇటు రా ఒక్కసారి…’’ అనే పాట రాశారు. ఆ పాట అప్పట్లో సూపర్‌హిట్‌.
ఈ రోజుల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చిత్రసీమ ఏ విధంగా స్పందిస్తున్నదో.. ఆ రోజుల్లోనే నాన్నగారు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి కొంత మొత్తాన్ని పోగు చేసి.. ప్రభుత్వాలకు అందివ్వడం చాలామందికి స్ఫూర్తినిచ్చింది.
గొంతు కేన్సర్‌తో నాన్న చనిపోయారన్న ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదు. వైద్యానికి సంబంధించి ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మే అలవాటు నాన్నది. ఆయనకు కేన్సర్‌ లేదు. హృద్రోగంతో చనిపోయారు. కొంతమందిని నమ్మి సరైన వైద్యం చేయించుకోకపోవడం వల్ల గొంతు పోయింది.
ఘంటసాలను తెలుగు సమాజం ఎన్నటికీ మరిచిపోదు. అమెరికాలో స్టాంపు విడుదల చేశారు. మన దగ్గర ఆయనవి పాతిక విగ్రహాలు వెలిశాయి. వర్ధంతులు, జయంతులు ఘనంగా చేస్తున్నారు. పాటలు వింటున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
విజయవాడలోని సంగీత కళాశాల నాన్నపేరు మీదనే ఉంది. అక్కడే మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది నా చిరకాలవాంఛ. మ్యూజియంలో నాన్నగారి వస్తువులన్నీ పెడితే బావుంటుంది. చివరగా ఆయన వేసుకున్న చెప్పులు, కళ్లజోడు, జుబ్బా, ఇతర వస్తువులన్నీ ఇస్తాను. నా వద్ద మూడు వేల పాటల రికార్డులు ఉన్నాయి. వాటిని కూడా మ్యూజియం కోసం అందజేస్తాను.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.