బడుగు మేధావుల వౌనమేల?
- – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
- 07/12/2014
భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ పనిచేస్తుంటే, అందుకు పరోక్షమైన, ప్రత్యక్షమైన విధాలుగా అధికార వ్యవస్థల సహకారం కూడా ఉంటుం ది. ఇది అందరికీ తెలిసిన సాధారణ సత్యం. న్యాయం గా, నిష్పాక్షికంగా ఆలోచించేవారు ఈ పరిస్థితులనూ గుర్తించి అవి రెండుచోట్ల కూడా మారాలంటారు. కాని కొందరు బడుగు మేధావుల విషయంలో అట్లా జరగటం లేదు. వారు భారతదేశంలోని చెడును మాత్రం గుర్తించి ఖండిస్తూ, అమెరికాలో నల్లవారికి అంతా స్వర్గ్ధామమేనని వాదిస్తుంటారు. అందుకే ఈ వ్యాసం రాయవలసి వస్తున్నది.
అమెరికాలో నల్లవారిని ప్రస్తుతం రెండు హత్యలు కుదిపివేస్తున్నాయి. ఫెర్గ్యూసన్ పట్టణంలో మైఖేల్ బ్రౌన్ అనే 18 సంవత్సరాల నల్లజాతి యువకుడిని ఆగస్టులో డారెన్ విల్సన్ అనే తెల్లజాతి పోలీస్ కాల్చి చంపాడు. తర్వాత ఇటీవల తామీర్ రైస్ అనే 12 సంవత్సరాల నల్లజాతి బాలుడిని క్లేవ్‌లాండ్‌లో మరొక తెల్లజాతి పోలీస్ కాల్చివేసి ప్రాణాలు తీసాడు. ఈ రెండు ఘటనలను పురస్కరించుకుని మొత్తం అమెరికాలో నల్లజాతి అంతా ఆందోళనలు సాగిస్తున్నది. కాని, నేను గమనించినంతవరకు, ఇక్కడి బడుగు మేధావులు, రచయితలు ఎవరూ దానిపై స్పందించటం లేదు. అమెరికాలో నల్లవారికి ఎటువంటి సమస్యలు లేక స్వర్గం వంటి పరిస్థితులు ఉన్నాయనే తమ వాదనలను వారిపుడు ఇంకా సమర్ధించుకోవటమో, ఖండించుకోవటమో చేయాలి. కాదంటే, ఇతరత్రా అంతా గొప్పగానే ఉందని, ఈ రెండు ఘటనలు మినహాయింపుగా జరిగిన పొరపాట్లని రుజువుచేయాలి. మైఖేల్ బ్రౌన్, తామీర్ రైస్ ఇద్దరూ నిరాయుధులే. ఫెర్గ్యూసన్‌లో సాధారణమైన సమస్య ఏదో తలెత్తగా దానిని నియంత్రించేందుకు వెళ్లిన పోలీసు అందుకు ఇతర పద్ధతులేవీ అనుసరించకుండా నేరుగా గన్‌తో కాల్పులు జరిపాడు. రైస్ అనే బాలుని విషయంలో అంతకన్నా దారుణంగా జరిగింది. అతను ఒక పార్క్ దగ్గర బొమ్మ తుపాకీకి అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. శే్వతజాతీయుడొకరు పోలీసులకు ఎమర్జెన్సీ ఫోన్ చేసాడు. పోలీసులు తమ వాహనంలో వచ్చి దిగీ దిగగానే ఆ పిల్లవాడిని కాల్చారు. ఇది నిజం కాదని వాదించారు గాని, తర్వాత వెలుగులోకి వచ్చిన ఫొటోలు వారు వాహనంలోంచి దిగటానికి కాల్పులు జరపటానికి మధ్య కేవలం కొన్ని క్షణాల వ్యవధి ఉన్నట్లు తేల్చి చెప్పా యి.
నల్లవారికి స్వర్గమైన అమెరికాలో ఇదెట్లా సాధ్యమైంది? ఇది చాలదన్నట్లు మరొకటి జరిగింది. 18 ఏళ్ల బ్రౌన్‌ను కాల్చిన పోలీసును ప్రాసిక్యూట్ చేయాలన్న డిమాండ్ నల్లవారినుంచి, ఇతర ప్రజాస్వామిక వర్గాలనుంచి వచ్చింది. బ్రౌన్ నిరాయుధుడైనప్పటికీ తనపైకి దూసుకువచ్చాడని, తనవద్దగల తుపాకీని లాక్కుని తననే కాల్చగలడన్న భయం కలిగిందని, అందువల్ల తన ప్రాణరక్షణకోసం కాల్చానని పోలీసు వాదించాడు. దానితో అక్కడి గ్రాండ్ జ్యూరీవారు ఆయనను ప్రాసిక్యూట్ చేయనక్కరలేదని తీర్పు చెప్పారు. బాలుని విషయమై ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. అమెరికాలో ఇటువంటివి అరుదుగా జరిగితే పట్టించుకోనక్కరలేదు. కాని ఇవి ఒక పద్ధతి ప్రకారం, వ్యవస్థీకృత రూపంలో, తరచు జరిగినా దానిని స్వర్గసీమ అనవచ్చునా? స్వర్గసీమగా అభివర్ణించే మన మేధావులు, రచయితలు కొందరికి అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏమిటో నిజంగానే తెలియదా?
నల్లవారికి ఇటువంటి అనుభవాలు అరుదుకాదని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. ఉదాహరణకు ‘మాల్కం ఎక్స్‌గ్రాస్‌రూట్స్ మూవ్‌మెంట్’, న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ నివేదికలతోపాటు, సాక్షాత్తూ శే్వత జాతీయులే నిర్వహించే ‘యుఎస్‌ఎ టుడే’ పత్రిక రిపోర్టులను గమనిస్తే, నల్లవారి అణచివేత ఎంత ఉద్దేశపూర్వకంగా, ఎంత వ్యవస్థీకృతంగా సాగుతున్నదో గ్రహించవచ్చు.
పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, విజిలేంట్స్ అని తమనుతాము పిలుచుకునే గ్రూపులవారు 2012లో ‘‘కనీసం’’ 313 మంది నల్లవారిని కాల్చి చంపారు. కాని వాస్తవ సంఖ్య ఇంతకన్న చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో శాంతి భద్రతల సంస్థలు మొత్తం పదిహేడు వేలున్నాయి. (17,000). వాటిలో సుమారు 750 మాత్రమే ఈ తరహా ఘటనల వివరాలను డేటాబేస్‌కు అందజేస్తాయి. దానినిబట్టి వాస్తవమైన సంఖ్యలు వేలల్లో ఉంటాయనాలి. అమెరికా జనాభాలో నల్లవారి సంఖ్య సుమారు 13 శాతం. అటువంటి స్థితిలో కేవలం వారిని కాల్చి చంపటమే వేల సంఖ్యల్లో ఉంటే అదెంత గొప్ప స్వర్గమో మన మేధావులు మాత్రమే వివరించగలరు.
పోలీస్ సంస్థలు, ఇతర భద్రతా సంస్థలు ఈ స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నాయంటే, దాని వెనుక అణచివేతలు ఎంత తీవ్రంగా, ఎంత విస్తృతంగా ఉంటాయో ఊహించటం కూడా కష్టమే. నల్లవారి జనాభా 13శాతం కాగా, ఖైదీలలో వారు సుమారు 40 శాతం ఉంటారు. ఒకే విధమైన నేరాలకు నల్లవారిని, తెల్లవారిని అరెస్టుచేయటం నుంచి మొదలుకొని జైళ్లలోకి పంపడం వరకు అడుగడుగునా వివక్షతే. తెల్లవారికి కనీస శిక్షలైతే నల్లవారికి గరిష్ఠ శిక్షలని పై సంస్థలు రూపొందించినట్టు నివేదికలు చెప్తున్నాయి. న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యయనం ప్రకారం, అరెస్టయే నల్లవారిలో సుమారు 90 శాతం మంది అమాయకులు. కాల్పులకు గురై చనిపోయిన వ్యక్తులలో 44 శాతం మంది నిరాయుధులు. 27 శాతం సాయుధులైనట్లు పోలీసులు ఆరోపించి అందుకు ఆధారాలు చూపలేకపోయారు. దానిని కలిపితే నిరాయుధుల సంఖ్య 71 శాతం. అయినప్పటికీ పోలీసులు తమవద్ద ఆయుధాలు ఉండి కూడా, తాము ‘‘ప్రాణభయంతో’’ కాల్చామని వాదించారు. అట్లా వాదించినవారు 47 శాతం ఉన్నట్టు పైన పేర్కొన్న నివేదికలు వెల్లడించాయి. యుఎస్‌ఎ టుడే పత్రిక కథనం ప్రకారం, పోలీసులు కాల్చి చంపుతున్న నల్లవారిలో 18 శాతం మంది 21 సంవత్సరాల లోపు వయసువారు. ఇందుకు భిన్నంగా తెల్లవారి సంఖ్య 8.7 శాతం.
ఈ విధమైన నిర్బంధాలు, జైళ్లు, కాల్చివేతలకు మూలాలు నల్లవారిని బానిసలుగా మార్చి ఉపయోగించుకున్న అమెరికన్ పెట్టుబడిదారీ చరిత్రలో ఉన్నాయని, బానిసత్వం రద్దయిన అనంతరం ఏడు దశాబ్దాల కాలంలోనూ వారి పట్ల వివక్షలు ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో కొనసాగుతూనే ఉన్నాయని పై నివేదికలు చెప్తున్నాయి. నల్లవారిలో హింసా ధోరణులు ఎక్కువని, వారు ప్రమాదకారులని అసలు పోలీస్ రిక్రూట్‌మెంట్, శిక్షణ, విధానాల రూపకల్పన సమయాలలోనే తెల్లవారికి అభిప్రాయం కలిగింపజేస్తారు. ఇక సమాజంలో జాతి వివక్షాధోరణులు ఉండనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యం వల్లనే తెల్ల పోలీసులు నిర్భయమైన రీతిలో అతిగా వ్యవహరించి తామీ రైస్ వంటి పిల్లలను కూడా కాల్చి చంపుతున్నారు. అక్కడి నిపుణులు దీనిని నల్లవారికి, తెల్లవారికి మధ్య ‘‘నిరంతర యుద్ధం’’, ‘‘ప్రచ్ఛన్న యుద్ధం’’ వంటిదని అభివర్ణిస్తున్నారు.
దీనంతటి మధ్య నల్లవారికి అమెరికన్ స్వర్గం ఎక్కడున్నదనేది ప్రశ్న. నల్లవారు సాగించిన అనేకానేక ఉద్యమాలు, పోరాటాల అనంతరం బానిస వ్యవస్థ రద్దుకావటంతోపాటు వారికోసం అక్కడి ప్రభుత్వాలు వివిధ అవకాశాలు కల్పించాయి. అది జరగనట్లయితే అసంతృప్తి ఇంకా తీవ్రమై ఆ వ్యవస్థకు విపత్కరమైన పరిస్థితులు ఎదురై ఉండేవి. నల్లవాడైన ఒబామా దేశాధ్యక్షుడైనంత మాత్రాన వారికి మారింది ఏమీ కన్పించదు. మరి దీనంతటి మధ్య, మన బడుగు మేధావులు కొందరంటున్న అమెరికన్ స్వర్గమెక్కడ? ఈ తాజా ఘటనలు రెండు అక్కడి నల్లవారిని ఊపివేస్తున్న సందర్భంలో వారిందుకు వివరణ ఇవ్వాలి.
అసలు విషయమంటే ఈ తరహా మేధావులకు ఆర్థిక సంస్కరణలు, అమెరికా మెరుపులు కలిసి కళ్లు మిరుమిట్లు గొలిపించాయి. తమ వ్యక్తిగత కెరీరిజానికి అందులో అవకాశాలు కన్పించాయి. దానితో వాస్తవాలను, విచక్షణను బుద్ధిపూర్వకంగా విస్మరించారు. ఇండియాలో గాని, అమెరికాలోగాని ఈ వర్గాలకోసం జరుగుతున్నదేమిటి, వారి పట్ల గల అణచివేత ఏమిటి అన్న ప్రశ్నలను నిక్కచ్చిగా చూసి బేరీజువేయటానికి బదులు సమతులనాన్ని, సంయమనాన్ని కూడా కోల్పోయారు. అందుకే ఇండియా సంపూర్ణ నరకం వలె, అమెరికా సంపూర్ణ స్వర్గం వలె కనిపిస్తున్నాయి. రెండూ తప్పేనని, వాస్తవం ఆమధ్య ఎక్కడో ఉంటుందని మరిచిపోయారు.

