వెయ్యి వారాలు లేజాయేంగే
- 07/12/2014
- — ఆదిత్య
* ఊరూరా ప్రభంజనమే.. ఓ తీర్థానికో, ఓ పుణ్యక్షేత్రానికో వెళ్తున్నట్లు కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్లు కట్టుకుని మరీ ఆ సినిమా చూసేందుకు తరలి వెళ్లేవారట! ఎన్టీఆర్, అంజలీదేవి ఎక్కడ కనిపించినా వారిని ‘సీతారాములు’గానే భావించి మంగళహారతులు పట్టేవారు.. ‘తెలుగింటి సీత’ అంజలీదేవి ఎదురైతే చాలు- ‘ఎన్ని కష్టాలు పడ్డావు తల్లీ..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారట! 1963లో తెలుగునాట ‘లవకుశ’ విడుదలైనపుడు ఎక్కడ చూసినా ఇలాంటి ముచ్చట్లే.. *** * మొట్టమొదటి ‘సంపూర్ణ తెలుగు టాకీ’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ‘భక్తప్రహ్లాద’ సినిమా 1932లో మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలెస్’లో విడుదలైంది.. ‘ప్రేక్షకులచే హాలు క్రిక్కిరిసి పోవుచున్నది.. గనుక ముందుగా స్థలము కొరకై జాగ్రత్త పడుడు.. ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూచు యవకాశము పోగొట్టు కొనకుడు..’ అంటూ అప్పట్లో ఇచ్చిన ప్రకటనలు- సినిమాల పట్ల జనాలకు ఎంత మోజుందో చెప్పకనే చెబుతాయి… *** * భారతీయ చలనచిత్ర పితామహుడు దాదా ఫాల్కే మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశలో తన రెండో చిత్రం ‘లంకాదహన్’ (1917) ఎన్నో వ్యయప్రయాసల నడుమ పూర్తి చేశారు.. ఆ సినిమా విడుదలైనపుడు టిక్కెట్లకు అంచనాలకు మించి డిమాండ్.. కౌంటర్ల వద్ద అదుపుచేయలేనంతగా జన సందోహం.. మామూలు ప్రదర్శన వేళలతో ఇక లాభం లేదని భావించి బొంబాయిలోని ‘వెస్ట్‌ఎండ్’ థియేటర్ యాజమాన్యం ఉదయం నుంచి సాయంత్రం చీకటిపడే వరకూ వరుసగా ఆటలు ప్రదర్శించినా తగ్గని ప్రేక్షక జనం.. దూరప్రాంతాల నుంచీ జనం తండోపతండాలుగా రావడంతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఎటుచూసినా ఎడ్లబండ్లే.. ఇదే ‘లంకాదహన్’ను చూసేందుకు పూణెలోని ‘ఆర్యన్’ థియేటర్‌లోకి జనం తలుపులు బద్దలు కొట్టుకుని లోనికి చొచ్చుకుపోయినంత సాహసం చేశారట! మద్రాసులో ఈ సినిమా ప్రదర్శించినపుడు భారీగా వచ్చిన వసూళ్లను ఎడ్లబండిపై పెట్టుకుని పోలీసుల కాపలాతో తరలించారట! *** ఒక సినిమా నూరు రోజులు ఆడితేనే గొప్ప వేడుక చేసుకుంటారు అభిమానులు… అదే సినిమా ఏళ్లు, దశాబ్దాలు పూర్తి చేసుకుంటే యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకూ అరుదైన సంబరమే… ఒక సినిమా తొలిసారి చూసిన అనుభూతే- ఇరవయ్యోసారి చూసినా కలిగిందంటే, ముప్ఫయి ఆరోసారి ఇంకాస్త కొత్తగా అనిపించిందంటే, ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందంటే- నిస్సందేహంగా ఆ సినిమాను ‘క్లాసిక్’ అనక తప్పదు. అచ్చంగా అలాంటి సినిమా- ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’. చాలా చిత్రాలు సాదాసీదాగా ఉంటూ కాలగర్భంలో కలిసిపోతాయి. కొన్ని మాత్రమే జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, రాబోయే సినిమాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఎన్ని వేల సినిమాలు వచ్చినా తమ ప్రత్యేకతను పదిలంగా నిలబెట్టుకుంటాయి. 1995 అక్టోబర్ 20న దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించిన ‘దిల్‌వాలే..’ను ఇప్పటికీ ముంబైలోని ‘మరాఠా మందిర్’ థియేటర్‌లో నిరాటంకంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి అక్షరాలా ‘వెయ్యి వారాల’ ప్రదర్శన పూర్తికాబోతోంది.. అందుకే ఈ శతాబ్దపు అద్భుత చలన చిత్రంగా ఇది కొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైనపుడు ఇంతటి సంచలనాత్మక విజయం సాధిస్తుందని, వెయ్యి వారాల సుదీర్ఘ ప్రదర్శనతో ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దర్శక,నిర్మాతలు ఊహించి ఉండరు! ఎన్నిసార్లు చూసినా… టీవీ ముందు కూర్చుని చేతిలో రిమోట్ కదులుతూంటే- అనుకోకుండా ఏదో ఒక చానల్‌లో ‘దిల్‌వాలే..’ తగులుతుంది… ఎప్పుడో చూసిన సినిమా అయినా మనం దృష్టి మరల్చుకోలేం.. సరదాగా కొద్దిసేపు చూసి మరో చానల్‌కు వెళ్లామనుకుంటాం.. అయితే- ఆ సంగతే మరచిపోతాం… సన్నివేశాలు మారుతుంటాయి.. సమయం గడిచిపోతుంటుంది.. ఆ సినిమాలో మమేకమైపోతాం.. ‘శుభం’ కార్డు పడేవరకూ అప్రయత్నంగానే సినిమా చూసి ఆస్వాదిస్తాం.. ప్రతిసారీ ఇదే విధమైన అనుభూతి.. ఎనే్నళ్లు గడిచినా ఇలాంటి అనుభవమే.. ఇదీ- ‘దిల్‌వాలే..’ ఘనత! ‘యశ్‌రాజ్ ఫిలింస్’ నిర్మాణంలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రేమకథా చిత్రాల్లో కలికితురాయిగా నిలిచింది. టీనేజీ ప్రేమకథలను వెండితెరపై ఎంత అద్భుతంగా, రసరమ్యంగా ఆవిష్కరించవచ్చో నిరూపించిన ఈ సినిమా ఇప్పటి తరానికి ‘మార్గదర్శి’గా నిలిచింది. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుట్టాయని అనిపిస్తుంది. ఆ పాత్రల్లో మరొకరిని ఊహించలేం. ఈ సినిమాని వేరే నటీనటులతో మళ్లీ నిర్మించినా ‘రీ ప్లేస్‌మెంట్’ ముమ్మాటికీ అసాధ్యం. ఇంత గొప్పగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మెప్పించినందునే ఈ సినిమా భారతీయ చలనచిత్ర సీమలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. అచ్చమైన ప్రేమకథ… ‘దిల్‌వాలే..’లో ప్రేమజంట రాజ్ (షారుఖ్), సిమ్రన్ (కాజోల్)లను చూస్తున్నంత సేపూ మన ఇంటి పక్కనే- మనకు తెలిసిన ఓ అమ్మాయి, అబ్బాయిని చూసిన అనుభూతిని పొందుతాం. అచ్చమైన ప్రేమకథతో కుటుంబ నేపథ్య చిత్రాలకు ఇది ప్రేరణగా నిలిచింది. సరదా ఇతివృత్తం, గిలిగింతలు పెట్టే ప్రేమ సన్నివేశాలు, హాయిగా సాగే కామెడీ, హృదయాలను బరువెక్కించే దృశ్యాలే లేని కథనం, మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన పాటలు, కమ్మటి నేపథ్య సంగీతం, అలరించే విదేశీ లొకేషన్లు… ఇవన్నీ సమపాళ్లలో సమకూరి ప్రేక్షకుల్ని మెప్పించాయి, మత్తెక్కించాయి, మైమరపించాయి.. విమర్శకుల ప్రశంసలనూ అందుకున్నాయి.. ఎన్ని వసంతాలు గడిచినా ఈ సినిమాను నిత్యనూతనంగా నిలబెట్టాయి.. తరాలు మారినా తరగని వినోదం అందించాయి.. టీనేజీ యువత ప్రేమకు సంబంధించిన కథే అయినప్పటికీ- వైవిధ్య భరితంగా కథనం సాగిన తీరు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక, కథ గురించి చెప్పాలంటే- సెలవుల్లో విదేశీ పర్యటనకు వెళ్లిన యువజంట రాజ్, సిమ్రన్ అక్కడ అనుకోని రీతిలో కొన్ని సంఘటనలను ఎదుర్కొంటారు. ఆ నేపథ్యంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమగా చిగురిస్తుంది. సిమ్రన్ తల్లిదండ్రులను మెప్పించి, ఒప్పించి చివరికి ఆమెకు మూడుముళ్లు వేసి హీరో విజయం సాధిస్తాడు. తండ్రి చూసిన వరుడికి బదులు రాజ్‌నే ఆమె పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. సంప్రదాయ బద్ధమైన రెండు కుటుంబాలకు చెందిన పెద్దల మనసులను గెలిచి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి హీరో,హీరోయిన్లు తమ ప్రేమను సాకారం చేసుకుంటారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ కుటుంబ నేపథ్యాన్ని బాలీవుడ్‌కు పరిచయం చేసిన సినిమాగా ‘దిల్‌వాలే..’ చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రేమ సన్నివేశాలే కాదు, అమెరికా, స్విట్జర్లాండ్, భారత్‌లో అద్భుత ప్రకృతి దృశ్యాలు ఇందులో కనువిందు చేస్తాయి. 1995 అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలైనపుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ విశే్లషకులు సమీక్షలు చేసి నటీనటులను, దర్శక నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తారు. బాలీవుడ్‌లో అత్యధిక స్థాయి వసూళ్లను సొంతం చేసుకున్న రెండో చిత్రంగా ‘దిల్‌వాలే..’ నిలిచింది. (సల్మాన్ ఖాన్ నటించగా 1990లో విడుదలైన ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ అత్యధిక వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.) ప్రపంచంలోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. పది ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డులతో పాటు ‘ఉత్తమ వినోదాత్మక చిత్రం’గా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. వందేళ్ల కాలంలో అభిమాన సినిమా… భారత్‌లో సినీ పరిశ్రమ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయన సందర్భంగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఆన్‌లైన్ సంస్థ ‘సనోనా’ నిర్వహించిన సర్వేలో అధికశాతం మంది తమ అభిమాన చిత్రంగా ‘దిల్‌వాలే..’ వైపు మొగ్గు చూపారు. ‘రొమాంటిక్ కామెడీ’గా ఇంతగా అలరించిన భారతీయ సినిమా మరొకటి లేదని ఆన్‌లైన్ సర్వేలో తేలింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్లలోనూ ఈ సినిమా అగ్రభాగాన నిలిచింది. బాలీవుడ్ సినీ నిర్మాతల్లో దిగ్గజమైన యాశ్ చోప్రా కుమారుడైన ఆదిత్య చోప్రా ఈ సినిమాకు కథను రూపొందించి దర్శకత్వం వహించారు. షారుఖ్, కాజోల్ నటనతో పాటు జ తిన్-లలిత్ అందించిన స్వరాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. విదేశాల్లో చిత్రీకరించినప్పటికీ అప్పట్లో కేవలం నలభై మిలియన్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు. బాలీవుడ్‌లో ‘ఆల్ టైమ్ క్లాసిక్’లుగా నిలిచిన మొదటి పది సినిమాల్లో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. రాజ్‌కపూర్ నిర్మించిన ‘ఆవారా’ (1951), మెహబూబ్ ఖాన్ రూపొందించిన ‘మదర్ ఇండియా’ (1957), రమేష్ షిప్పీ సృష్టించిన ‘షోలే’ (1975) సినిమాలను వెనక్కి నెట్టేసిన ఘనత ‘దిల్‌వాలే…’కే దక్కింది. షారుఖ్‌కు అనుకోని ఛాన్స్… ‘రాజ్’గా మెప్పించిన షారుఖ్ ఖాన్‌కు ఈ సినిమాలో అనుకోని రీతిలో హీరో పాత్ర లభించింది. మొదట హీరో పాత్రకు సైఫ్ అలీఖాన్‌ను ఎంపిక చేయాలని ద ర్శక, నిర్మాతలు భావించారు. ఆ తర్వాత ఊహించని విధంగా షారుఖ్‌ను ఎన్నుకున్నారు. తన 30వ జన్మదినం ముందు విడుదలైన ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన నట జీవితంలో మైలురాయిలా నిలుస్తుందని అనుకోలేదని షారుఖ్ ఇప్పటికీ చెబుతుంటాడు. ఇందులో ఆయన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతుంటాయి. నట దిగ్గజం రాజ్ కపూర్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇందులో హీరో పేరును ‘రాజ్’గా దర్శకుడు ఆదిత్య చోప్రా ఖరారు చేశారు. ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ ఈ సినిమాకు పేరును సూచించారు. అనుపమ్ ఈ సినిమాలో షారుఖ్ తండ్రిగా నటించారు. ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలు ‘దిల్‌వాలే..’కు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. టీవీ నటి మందిరా బేడీ ఈ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ఇందులో ఆమె షారుఖ్‌ను ప్రేమిస్తుంది. అయితే, షారుఖ్ మాత్రం కాజోల్ వెంటపడతాడు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ షారుఖ్ స్నేహితుడిగా నటించారు. ఈ సినిమా పాటల కోసం సుదీర్ఘ కాలంపాటు కసరత్తు జరిగింది. గీత రచయిత ఆనంద్ బక్షీ, సంగీత దర్శకులు జతిన్-లలిత్‌లను విసిగించి మరీ పాటలన్నీ అద్భుతంగా వ చ్చేలా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత షారుఖ్‌కు భారత్‌లోనే కాదు విదేశాల్లో సైతం అభిమానుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బాలీవుడ్‌కు సంబంధించి ఉత్తమ ‘వెండితెర జంట’గా షారుఖ్-కాజోల్ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ ఇద్దరిలాగే ప్రేమలో విజయం సాధించాలన్న తపన ఎంతోమంది యువతీ యువకుల్లో మొదలైంది. టీనేజీ ప్రేమికులంతా తమను షారుఖ్, కాజోల్‌తో పోల్చుకోవడం ఈ సినిమాతో ప్రారంభమైంది. ఎన్ని అవాంతరాలు, వైరుధ్యాలు ఉన్నా ప్రేమకు అవి అడ్డుగోడలు కావని, ప్రేమదే అంతిమ విజయం అని భావించే యువత సంఖ్య పెరిగింది. దశాబ్దాలు గడిచినా ‘రాజ్,సిమ్రన్’ పాత్రలు నిజమైన ప్రేమకు ప్రతీకలుగా నిలిచిపోయాయి. కొత్త ట్రైలర్ విడుదల… ఈ నెల 12 నాటికి వెయ్యి వారాల ప్రదర్శన పూర్తవుతున్న సందర్భంగా ‘దిల్‌వాలే..’ కోసం సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. ప్రపంచ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పాటు ఆడుతున్న సినిమాగా అద్భుత రికార్డును సృష్టించిన సందర్భాన్ని పురస్కరించుకుని ట్రైలర్‌ను విడుదల చేసినట్లు ‘యశ్‌రాజ్ ఫిలింస్’ సంస్థ ప్రకటించింది. * ‘మరాఠా మందిర్’ మాయాజాలం.. ముంబైలోని ‘మరాఠా మందిర్’లో 1995 అక్టోబర్ 20 నుంచి నిరాటంకంగా నడుస్తున్న ‘దిల్‌వాలే…’ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదే ముంబైలోని మినర్వా థియేటర్‌లో అమితాబ్, ధర్మేంద్ర నటించిన ‘షోలే’ (1975 నుంచి 1980 వరకూ) అయిదేళ్ల పాటు నడిచింది. ఆ రికార్డును ‘దిల్‌వాలే..’ ఏనాడో అధిగమించడంతో ‘మరాఠా మందిర్’ దేశ వ్యాప్తంగా చిరపరిచితమైంది. చాలాకాలం రోజుకు నాలుగు ఆటలుగా నడిచినా, కొన్నాళ్లుగా ఉదయం ఆటకే దీన్ని పరిమితం చేశారు. ఇప్పటికీ ప్రతి రోజూ సగటున 50 శాతం వరకూ సీట్లు నిండిపోతాయని, వారాంతాల్లో, సెలవుదినాల్లో మాత్రం ‘హౌస్ ఫుల్’ అవుతుందని ‘మరాఠా మందిర్’ యాజమాన్యం చెబుతోంది. షారుఖ్, కాజోల్‌తో పాటు బాలీవుడ్ నటీనటులెందరో ఈ థియేటర్‌కు వస్తుంటారు. 100 వారాలు, 500 వారాలు, 700 వారాలు గడిచిన సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు జరిపారు. కూలీలు, గృహిణులు, మధ్య తరగతి వారు, గృహిణులు, విద్యార్థులు … ఇలా అన్ని వర్గాలకు చెందిన వారూ ఇప్పటికీ థియేటర్ వద్ద ‘క్యూ’ కడుతుంటారు. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా తమకు కొత్తగానే ఉంటుందని వారు చెబుతుంటారు. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్లు (కూలీలు) ఖాళీ దొరికినపుడల్లా దీన్ని చూస్తుంటారు. ఈ సినిమాను 80-90 సార్లు చూసినవారు కూడా తమకు తెలుసునని థియేటర్ సిబ్బంది చెబుతుంటారు. రైల్వే స్టేషన్‌కు, బస్ స్టేషన్‌కు, మంచి రెస్టారెంట్లకు సమీపంలో ఉన్నందున మరాఠా థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ థియేటర్‌లో ఏసీ, సౌండ్ సిస్టమ్, సీటింగ్ తమకు నచ్చుతాయని ప్రేక్షకులు ఎగబడుతుంటారు. టిక్కెట్ ధరలు కూడా అందుబాటులో ఉండడంతో ఈ థియేటర్‌లో సినిమా చూసేందుకు పేద, మధ్య తరగతి ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. ఇదే థియేటర్‌లో 1953లో విడుదలైన ‘మొఘల్-ఇ- అజామ్’ నాలుగేళ్లు నడిచిందని పాతతరం వారు గుర్తు చేస్తుంటారు. షాగిర్డ్, జానీ మేరా నామ్, ఇత్త్ఫోక్, ఖిలాడీ, కర్మ, ధరమ్ కాంటా, మిస్టర్ ఇండియా, కూలీ నెంబర్ 1, సర్ఫ్‌రోష్, గదర్- ఏక్ ప్రేమ్ కథ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఇదే థియేటర్‌లో ప్రదర్శించారు. లాభాలు లేకున్నా.. కొన్నాళ్లు కలెక్షన్ల కనక వర్షం కురిసినా, ఇటీవలి కాలంలో లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నామని ‘మరాఠా మందిర్’ మేనేజర్ మనోజ్ దేశాయ్ చెబుతున్నారు. సినిమా ప్రదర్శనకు సంబంధించి నెలకోసారైనా యశ్‌రాజ్ ఫిలింస్ ప్రతినిధులతో తాము సమావేశమవుతుంటామని ఆయన తెలిపారు. వెయ్యి వారాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున వేడుకలు జరిపే విషయమై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని ఆయన అంటున్నారు. హీరో, హీరోయిన్లు షారుఖ్, కాజోల్‌తో పాటు దర్శక, నిర్మాతలతో చర్చించి వేడుకలను నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని దేశాయ్ చెప్పారు. వెయ్యి వారాల అనంతరం ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అవకాశం ఉన్నంత వరకూ ఈ సినిమాను ప్రదర్శించాలని దర్శకుడు ఆదిత్య చోప్రా, తాను కలిసి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 11-30 గంటలకు ఒక ఆట మాత్రమే ప్రదర్శిస్తున్నామని, మిగతా మూడు షోలు వేరే సినిమాలు నడుస్తాయని ఆయన చెప్పారు. ‘ఆట’ల్లో మేటి.. ఈ చిత్రాలు.. బాలీవుడ్‌లో ఎక్కువ ఆటలు ప్రదర్శించిన పది అగ్రశ్రేణి సినిమాల్లో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘టాప్ టెన్’ జాబితా ఇలా ఉంది.. 1. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995) – ఇప్పటికీ ఆడుతోంది. నటీనటులు: షారుఖ్ ఖాన్, కాజోల్, అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ దర్శకుడు: ఆదిత్య చోప్రా 2. షోలే (1975) – 286 వారాలు (5 ఏళ్లు) నటీనటులు: అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని, సంజీవ్ కుమార్ దర్శకత్వం: రమేష్ షిప్పీ 3. మొఘల్-ఇ-అజామ్ (1960) – 150 వారాలు ( 3 ఏళ్లు) నటీనటులు: పృథ్వీరాజ్ కపూర్, మధుబాల తదితరులు దర్శకత్వం: కె.ఆసిఫ్ 4. కిస్మత్ (1943)- 150 వారాలు – ( 3 ఏళ్లు) నటీనటులు: అశోక్‌కుమార్, ముంతాజ్, షాన్‌వాజ్ దర్శకత్వం: జ్ఞాన్ ముఖర్జీ 5. బర్సాత్ (1949)- 100 వారాలు నటీనటులు: రాజ్ కపూర్, నర్గీస్, ప్రేమ్‌నాథ్ దర్శకత్వం: రాజ్ కపూర్ 6. మైనే ప్యార్ కియా (1989)- 50 వారాలు నటీనటులు: సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ దర్శకత్వం: సూరజ్ ఆర్ బర్జాత్యా 7. కహోనా ప్యార్ హై (2000) 50 వారాలు నటీనటులు: హృతిక్ రోషన్, అమీషా పాటిల్ దర్శకత్వం: రాకేష్ రోషన్ 8. హమ్ ఆప్‌కే హై కౌన్ ( 1994)- 50 వారాలు నటీనటులు: సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ దర్శకత్వం: సూరజ్ ఆర్ బర్జాత్యా 9. మహాబతీన్ (2000)- 50 వారాలు నటీనటులు: అమితాబ్, షారుఖ్ ఖాన్, ఉదయ్ చోప్రా దర్శకత్వం: ఆదిత్య చోప్రా 10. రాజా హిందుస్థానీ (1996)- 50 వారాలు నటీనటులు: అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ దర్శకత్వం: ధర్మేష్ దర్శన్ విసుగన్నదే లేదు.. ‘దిల్‌వాలే..’ సినిమాను ఇన్నాళ్లుగా ప్రదర్శిస్తున్నా తన పనికి సంబంధించి విసుగన్నదే లేదని ‘మరాఠా మందిర్’లో ప్రధాన ప్రొజెక్టర్ ఆపరేటర్ జగ్జీవన్ మారు అంటున్నారు. నలభై ఏళ్లుగా ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, దాదాపు 19 ఏళ్లుగా ‘దిల్‌వాలే..’కు రీళ్లు మార్చే పనిలో ఉన్నా ఏనాడూ విసుగు పుట్టలేదని ఆయన అంటున్నారు. ఇప్పటికీ ఆయనే స్వయంగా రీళ్లను ఎక్కించే పని చేస్తుంటారు. తక్కువ మొత్తంలో టిక్కెట్ ధరలు, సంతృప్తికరమైన సీటింగ్ వంటి కారణాలతో తమ థియేటర్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోందని ఆయన అంటున్నారు. ముంబై నగరాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు చాలామంది ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారని ఆయన తెలిపారు.

