గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82
123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి
బాల్యం –విద్యాభ్యాసం-ఉద్యోగ జీవితం
మానవల్లి రామ కృష్ణ కవి గారు మద్రాస్ లోని నుంగంబాకం లో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో 1866 లో జన్మించారు .తండ్రి రామ శాస్త్రి .తండ్రి ,తాత గారు అష్టా దశ భాషా ప్రవీణులు .తండ్రి నాట్య శాస్త్ర వ్యాఖ్యాత .కవిగారు చెన్నై లో బి ఏ .పాసై సంస్కృతం లో ఏం .ఏ .చేశారు .మద్రాస్ చింతాద్రి పేట మిడిల్ స్కూల్ ,క్రిస్టియన్ కాలేజి హైస్కూల్ లో ,పచ్చయప్ప కళాశాల ఉన్నత పాఠ శాలలో అధ్యాపకులుగా పని చేశారు .ఆరు భాషలో పాండిత్యం సాధించటం వలన వీరిని ‘’కవిగారు ‘’అని సంబోధిస్తారు మర్యాదగా .
తర్వాత కవిగారు వన పర్తి సంస్థానం లో గ్రంధ ప్రచురణ కార్య నిర్వాహకులుగా పదేళ్ళు పని చేశారు .పిమ్మట మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండా గారం ప్రాచీన తాల పాత్ర గ్రంధ సంపాదన శాఖకు అధ్యక్షులుగా ఆరేళ్ళు సేవలందిం చారు .మద్రాస్ ప్రభుత్వ విద్యా శాఖలో చేరి ,రాజ మండ్రి ప్రభుత్వ కాలేజి లో అధ్యాపకులుగా కొంతకాలం ఉన్నారు .అనంతరం తిరుపతి దేవస్థాన విద్యా శాఖాదికారిగా 1935 వరకు కోన సాగారు .మద్రాస్ విశ్వ విద్యాలయ చరిత్ర శాఖలో మెకంజీ రికార్డుల పరిశోధనాలయం లో ఆరు సంవత్సరాలుఉన్నారు . దశాబ్ద కాలం తిరుపతి పరిశోధనాలయ సంస్కృత శాఖలో రీడర్ గా ,ఉండి కొంతకాలం డైరెక్టర్ పదవినీ చేబట్టారు .
ప్రాచీన గ్రంధ సేకరణ –పరిశీలన –ముద్రణ
ద్రావిడ ,కన్నడ ,ప్రాచ్య మళయాళాది భాషలలో గొప్ప పాండిత్యం పొందారు .ప్రాచీన సంస్కృత ,ఆంద్ర సాహిత్య మన్నా ,ఆ భాషా చరిత్ర విమర్శా పరిశీలనం అన్నా కవి గారికి పరమ ప్రీతి .ప్రాచీన గ్రంధ సంపాదనకోసం పరిశీలనకోసం ఏంతో స్వంత ధనాన్ని వెచ్చించిన సాహితీ ప్రియులు .ప్రాచీన గ్రంధ పరిశీలన ,సంస్కరణ లలో శబ్దార్ధ స్వరూప నిర్ణయం లో వీరి ప్రజ్ఞ సునిశితమై అనితర సాధ్యమైనది .సంస్కృతాంధ్రాలలో సరస సహజ సుందరం గా కవిత్వం చెప్పే నేర్పు కవి గారిది .బహు శాస్త్రాలలో వీరి ప్రవేశం,పాండిత్యం మహా విశేషమైనవి .సౌజన్యం ,సహృదయత కవిగారికి సహజాతాలు .వన పర్తి లో ఉండగా ‘’విస్మ్రుతికవులు ‘’శీర్షిక తో అనేక ప్రాచీన గ్రంధాలను సంస్కరించి ప్రచురించారు .వీటిలో నన్నే చోడుని కుమార సంభవం ,వల్లభ రాయని క్రీడాభిరామం ,మడికి సింగన సకల నీతి సారం ,బద్దె భూపాలుని నీతి శాస్త్ర ముక్తావళి ,భైరవి కవి రాసిన శ్రీ రంగ మహాత్మ్యం ,ప్రబంధ మణిభూషణం ,వేంకటేశ ఉదాహరణం ,ఆంద్ర తిరువాయ్ ,ఉన్నాయి . కవిగారు ‘’దక్షిణ భారత సంస్కృత గ్రంధ మాల ‘’అనే సంస్థను స్థాపించి అతి ప్రాచీన సంస్కృత గ్రంధాలను పరిశీలించి ముద్రించారు .ముద్రించిన వాటిలో దండి రచించిన ‘’అవంతి సుందరి కద‘’,’’చతురర్భాణీ అంటే శూద్రకుని పద్మ ప్రాభ్రుతకం ,ఈశ్వర దత్తుని ‘’ధూర్త విట సంవాదం ‘’,వరరుచి రాసిన ‘’ఉభయాభిసారిక ‘’,శ్యామలకుని ‘’పాద తాడితం ‘’అనే భాణ చతుస్టయం ,భోజుని ‘’శృంగార ప్రకాశం ‘’,దిజ్ఞాగుని ‘’కుందమాల నాటకం ‘’,విజ్జిక రాసిన ‘’కౌముదీ మహోత్సవ నాటకం ‘’,’’వత్స రాజ చరితం ‘’,.ఇంత శ్రద్ధగా ప్రాచీన గ్రంధాలను సేకరించి పరిష్కరించి పరిశీలించి ముద్రించారు రామ కృష్ణ కవిగారు .సాహిత్య లోకం వారికి ఏంతో రుణ పడిఉంది .
కవిగారి రచనా పాటవం
కవిగారు కొన్ని స్వతంత్ర కావ్యాలు రచించారు .అందులో ‘’మృగవతి –రసవత్కావ్యం ‘’,వసంత విలాసం ‘-,కళా పూర్ణోదయాన్ని పోలిన తొమ్మిది ఆశ్వాసాల ఉత్తమ కావ్యం అముద్రితం .’’పాటలీపుత్రకం ‘’అనేది మరొక పద్య కావ్యం .’’కలింగ సేన ‘’,మాలతీమాధవం ‘’,అనేవి ప్రకరణాలు .భరతుని నాట్య శాస్త్రాన్ని అభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తో పరిష్కరించి గైక్వాడ్ ఓరిఎంటల్ గ్రంధ మాలలో మూడు భాగాలుగా ప్రచురించారు .ఇంకో భాగం అముద్రితం గానే ఉండిపోయింది .ఇది కవిగారి నాట్య శాస్త్ర జ్ఞానానికి ,సర్వం కష ప్రజ్ఞకు ఉదాహరణ .అలాగే ‘’భారత కోశం ‘’అనే మరో అపూర్వ గ్రంధం లో నాట్య శాస్త్ర సంబందాలైన పదాలన్నిటినీ అర్ధ వివరణ తో ,లక్షణ ఉదాహరణలతో అకారాదిక్రమం గా కూర్చారు .జ్ఞాన వయో వృద్ధులైన కవిగారు రాసిన ఈ గ్రంధాన్ని తిరుపతి దేవస్థానం ప్రాచ్య పరిశోధనాలయం ముద్రించి గౌర వించింది.
కవిగారు భాస నాటకాలను కొన్నిటిని అనువదించారు .ఇవికాక ఇంకా చాలా గ్రంధాలను రాశారు .కవి గారు సేకరించి సంస్కరించిన అనేక సంస్కృత గ్రందాలెన్నో ఇంకా అముద్రితాలుగానే ఉండిపోవటం బాధాకరం .ఇంత సరస్వతీ సేవ చేసిన కవి గారికి లక్ష్మీ ప్రసన్నం మాత్రం కాలేదు .ఇది లోకం లో సహజమే కదా .జీవిత చరమాంకం లో ఈ పండిత కవి ఆర్ధిక బాధలను ఎదుర్కొన్నారు .ప్రభుత్వం అంద జేసిన ఉపకార వేతనం తో జీవించాల్సి వచ్చింది పాపం .రామ క్రిష్ణ కవిగారు పూనుకొని ఉండక పొతే అమూల్య ప్రాచీన గ్రంధాలు వెలుగు చూసి ఉండేవికాదు .తొంభై ఒక్క ఏళ్ళు జీవించిన ఈ సాహిత్యోప జీవి మానవల్లి రామకృష్ణ కవిగారు 21-9-1957లో మద్రాస్ లో మరణించి సరస్వతీ సాయుజ్యంపొందారు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు

