అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో
- కాసుల ప్రతాపరెడ్డి, 9848956375
- 07/12/2014
అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానం సాహిత్యానికి మనుషులను ముఖ్యంగా యువకులను దూరం చేస్తుందనే అభిప్రాయం ఇంకా బలంగానే ఉంది. ఇంటర్నెట్ వంటి ఆధునిక సమాచార వినిమయ సాధనాలవల్ల యువత సాహిత్యంవైపు చూడడం లేదని కూడా భావిస్తూ వస్తున్నాం. స్పందనలు నశించి సెన్సిటివిటీ కోల్పోతున్నారనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. సెన్సిటివిటీ కోల్పోయినప్పుడు మనిషిలో స్పందనలు కరువవుతాయని అంటారు. అదేవిధంగా మనిషి ఒంటరి గుహలోకి పారిపోతున్నాడని, సామాజిక సంబంధాల ప్రాధాన్యత తగ్గిందని అనుకుంటూ వస్తున్నాం. కానీ అదంతా అపప్రథ మాత్రమేనని ఇటీవల వచ్చిన కవితా సంకలనాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి ఒంటరివాడవుతున్న మాట నిజమే గానీ ఆ ఒంటరితనాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు వర్తమాన కవులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుంటూనే వినూత్న రీతిలో కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అనుభవ వాదానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ అనుభవవాదం తెలుగు కవిత్వానికి కొత్తదేమీ కాదు. ఆధునిక కవిత్వానికి వచ్చినపుడు దాన్ని బైరాగితో మొదలుపెట్టవచ్చు కాబోలు. ఈ అనుభవవాదం రెండు రకాలుగా భిన్నమైంది. ఒకటి- ఇది ఇస్మాయిల్, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వంటి అనుభూతివాద కవులు మీదుగా నడిచి వచ్చింది కాదు. బాహ్యమైన దృశ్యాలను చూసి స్పందించి ఊహలను, ఆలోచనలను మాత్రమే ఆవిష్కరించే కవిత్వం కాదు. రెండోది- ఇది భౌతికమైన లేదా బాహ్యమైన అనుభవవాదం కన్నా ఆత్మగత అనుభవవాదానికి ప్రాధాన్యం ఇచ్చింది. అంటే ఆత్మికమైన అనుభవవాదం. తన ఆత్మగత అనుభవం నుంచి, అంటే అమూర్తమైన అనుభవం నుంచి వచ్చే అనుభవవాద కవిత్వం. ఈ రకంగా ఈ కవిత్వం వస్తువులోనే కాకుండా వ్యక్తీకరణ తీరులోకూడా సమూలమైన మార్పును తెలుగుకు అందించింది.
అఫ్సర్, సీతారాం, ప్రసేన్ వెలువరించిన రక్తస్పర్శ కవితా సంకలనంతో స్పష్టంగా ఇది తెలుగు కవిత్వంలో వ్యక్తీకరణ రూపం తీసుకుందని భావించవచ్చు. ఇది సామాజిక ప్రయోజనం కోసం సాహిత్యం అనే నినాదాన్ని తోసిపుచ్చే అనుభూతివాద కవులకు సంబంధించింది కాదు. ఏదైనా సరే, తన వైయక్తిక అనుభవం నుంచి వ్యక్తీకరించడమే దీని ప్రధాన లక్షణం. పులిపాటి గురుస్వామి, శ్రీకాంత్, ఎం.ఎస్.నాయుడు ఈ ఒరవడిని ముందుకు తీసుకుని వచ్చారు. యాకూబ్ తన పూర్వ కవిత్వానికి భిన్నంగా నదీ మూలం లాంటి ఇల్లు కవితా సంకలనం ద్వారా తనను తాను బ్రేక్ చేసి ఆ వైపు దూసుకొచ్చాడు. కొత్త కవుల ద్వారా మమేకం కావడంవల్ల అతని వస్తువులోనే కాకుండా వ్యక్తీకరణలోనూ మార్పు వచ్చింది కావచ్చు. మోహన్ రుషి, నందకిశోర్, బాలసుధాకరవౌళి, కాశిరాజు వంటి కవులు వస్తువులోనూ అభివ్యక్తిలోనూ కొత్తదనానికి పీఠం వేశారు, వేస్తున్నారు.
మోహన్ రుషి జీరో డిగ్రీ, బాలసుధాకర్ వౌళి ఎగరాల్సిన సమయం, నందకిశోర్ నీలాగే ఒకడుండేవాడు, కాశిరాజు భూమధ్యరేఖ వంటి ఇటీవల వచ్చిన కవితా సంకలనాలు తెలుగు కవిత్వానికి కొత్త పరీమళాన్ని అద్దాయి. వీరు తమ మూలాలనుంచి ఆధునికతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచీకరణ కారణంగా వచ్చిన భౌతికమైన మార్పులనే కాకుండా ఆత్మికమైన మార్పులు, అంటే మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను తమ మూలాల నుంచి పలుకుతున్నారు. జీవితానికి కొత్త అర్థాలు కూడా ఇస్తున్నారు. వీరు సామాజిక ప్రయోజనం కోసం సాహిత్య సృజన జరగాలనే నినాదానికి వ్యతికమేమీ కాదు. కులాలను, మతాలను, ప్రాంతాలను, జెండర్‌ను సానుకూల దృష్టితోనే, ప్రజాదృక్కోణం నుంచే చూస్తున్నారు. కానీ, దాన్ని వైయక్తికం చేసుకుని, ఆత్మగతం చేసుకుని తన వ్యక్తిగత అంతర్లోకాల నుంచి పలుకుతున్నారు. బాహిర్‌లోకానికన్నా అంతర్లోకాన్ని ప్రధానం చేసి మాట్లాడుతున్నారు.
చచ్చేలోపు చాలాసార్లు నిశ్శబ్దపు చావులకు గురవుతుండడమే జీవితం అని మోహన్ రుషి రాసిన వాక్యాన్ని ఎన్ని రకాలుగానైనా విశే్లషించుకోవచ్చు. ఆధునిక జీవితంలోని అన్నిరకాల పెడధోరణులకు, అంటే యాంత్రిక జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఆధునికతలోని సంక్లిష్టతను వ్యక్తం చేయడానికి వాక్యం కింద వాక్యాన్ని రాయాలనే నిబంధనను ఈ కవులు ఉల్లంఘించారు. మోహన్ రుషి కవిత చూస్తే ఇది వైయక్తిత అనుభవాలను బాహిర్లోకాలుగా, ఉమ్మడి అనుభవాలుగా మారుస్తున్నారు.
ఇటువంటి కవులు ఇంకా చాలామందే వున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినవి కొద్దిమంది కవితా సంకలనాలు మాత్రమే. అవి వస్తే ప్రస్తుత కవిత్వం డిక్షన్ మాత్రమే కాకుండా వస్తువు కూడా ఎంత మారిందో అర్థమవుతుంది. ఏదో ఒక వాదానికి కట్టుబడి కవిత్వం కవిత్వ విశే్లషణలో ఇరికిపోతాడు. కానీ, ఈ కవులు అటువంటి కవిత్వ వర్గీకరణకు అందకుండా పోతున్నారు. కవులను కాకుండా కవిత్వాన్ని మాత్రమే విశే్లషించే పరిస్థితి వచ్చినపుడు ఈ కవులకు కూడా కవిత్వ విమర్శలో చోటు దొరుకుతుంది.
–

