ధర్మ మార్గానికి దారిచూపే కొత్తమ్మ తల్లి
- -జి.కృష్ణమూర్తి
- 29/09/2014
అఖిలాండకోటి బ్రహ్మాండములకు అధిదేవతయైన భగవతి శ్రీ దుర్గాదేవియే సమస్త విశ్వానికి, ఉనికిని నిలబట్టేది. ఈ తల్లే లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపాలుగా తన్ను తాను సృజియంచు కొంటుంది. వైకుంఠ వాసునిచేత లక్ష్మిగా గౌరవింప బడినా, కైలాస వాసునికి అర్థనారీశ్వరి అయనా చతుర్ముఖునికి ఇల్లాలైనా ఆ తల్లి రూపాలే అవన్నీ. ఆ తల్లే నేడు శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళిలో శ్రీ కొత్తమ్మ తల్లిగా కొలువు దీరింది. కలియుగ ప్రభావం చేత మానవులల్లో దుష టచింతనలు కలుగుతున్నాయ. అటువంటి వాటిని పరిహరించి మానవులంతా ధర్మమార్గంలో నడిచేట్టు చేయటానికే ఈ తల్లి కాలాతీత, గుణాతీత శ్రీ ఆదిపరాశక్తి స్వరూపిణి శ్రీ కొత్తమ్మ తల్లిగా కొలువైంది. ఈ తల్లిని ఆరాధిస్తే, స్మరిస్తే, స్త్రోత్రం చేస్తే సర్వదుఃఖాల నుంచి, బాధల నుంచి రక్షణ పొంది, విముక్తులయ వారు ధర్మమూర్తులుగా మారుతారని భక్తుల పరిపూర్ణ విశ్వాసం.
స్థల పురాణం: 1925 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళికి చెందిన కమ్మకట్టు చినఅప్పలనాయుడు కోటబొమ్మాళి మండలం నారాయణవలసలో వారపు సంతకు ఎడ్లబండిపై వెళ్ళివస్తూ ఉండేవాడు. ఓ రోజు సంత నుంచి వస్తుండగా మార్గమధ్యలో ఓ ముతైదువ బండి ఆపి, ‘నాయనా ముసలిదాన్ని నాకు నీవు వెళ్ళే దారిలో నన్ను దించేయమని’అడిగింది. అందుకు చిన అప్పలనాయుడు సరేనని బండి ఎక్కించుకున్నాడు. వేకువజామున కోటబొమ్మాళి గ్రామంలోకి వెళ్ళిన తోవ, శ్రీ పట్నాయికుని వెంకటేశ్వరరావు గారి తోట వద్దకు బండి రాగానే ఆమె బండిని ఆపమని దేవతామూర్తి స్వరూపంగా దిగి తోటలోనికి వెళ్ళిపోయింది. అదిచూచి ఆశ్చర్యపోయి నోటమాటరాక నిల్చున్న వాడల్లా ఇంటికి వెళ్లిపో యాడు. ఆ తర్వాత చిన అప్పలనాయుడికి ఆ రాత్రి కలలో ఆమె కనిపించి, నేను కొత్తమ్మ తల్లిని, నీవు బండి ఆపిన తోటవద్ద నేను వెలిశాను. ప్రతి భాద్రపద మాసంలో వచ్చే పోలాల ఆమావాస్య తర్వాత వచ్చిన మంగళ, బుధవరాల్లో నీ ఇంటి వద్ద అర్చించి, గురువారం నాయుడు అమ్మవారి జంగిడిను నీ భార్య తలపై పెట్టి పసుపు కలశాలతోను, ఘటాలతోను, నృత్య వాయిద్యాలతో నా నివాసానికి వచ్చి నన్ను కొలిస్తే నీ కోర్కెలను తీరుస్తానని చెప్పింది. ఈ సంగతి ఊరివారందరికి చెప్పి అప్పలనాయుడు అమ్మ కొలువుకు బయలుదేరగా ఊరి వారంతా అమ్మ అనుగ్రహాన్ని పొందటానికి అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభంగా జరుపుతున్నారు. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా రాష్ట్రేతర ప్రాంతాల నుంచికూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కానుకల, విరాళాలు ఇచ్చి అమ్మవారి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ మూడు రోజులు భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ మండలంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

