గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

స్పానిష్ మహిళ

‘’సంస్కార ‘’సినిమా పేరు వినగానే అందులోని కదా నాయిక స్నేహలతా రెడ్డి జ్ఞాపకం వస్తుంది .ఇందిర ఎమర్జెన్సీ లో చనిపోయిన స్నేహలత గుర్తొస్తుంది .పఠాభి భార్య అని తెలుస్తుంది .ఆమె జననం మనదేశం కాదని వింటే ఆశ్చర్యమూ వేస్తుంది .నాట్యం ,బాలల అభ్యుదయం ,ప్రగతి శీల స్వభావం  నటనా  అన్నిటికి మించి ఆప్యాయతా మూర్తీభవించిన స్నేహలతా రెడ్డి ఆరేబియా దేశంలో ఆడెన్ నగరం లో సంపన్నస్పానిష్  క్రైస్తవ కుటుంబం లో 1934లో జన్మించింది .పేరు స్నేహలతా పావెల్ .ఆమె తండ్రి రాయల్ ఆర్మీ సర్వీస్ కోర్ లో మేనేజర్ .

నేర్చిన నాట్య రీతులు

జబల్పూర్ లో ప్రాధమిక విద్య పూర్తీ చేసి  మద్రాస్ లో చదివి డిగ్రీ పాసైంది .బెంగుళూరు లో కదక్ నృత్యాన్ని సోహన్ లాల్ దగ్గర ,భారత నాట్యాన్ని మీనాక్షి సుందరం ఎల్లప్ప  ల వద్ద అభ్యసించి మెరుగులు దిద్దుకొంది .ఈ రెండు నాట్యాలలో గొప్ప ప్రావీణ్యం సాధించి దేశ వ్యాప్తంగా పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చి ప్రతిభా పాటవమూ ప్రదర్శించి మెప్పునూ పొందింది .పాశ్చాత్య నృత్య రీతులనూ తెలుసుకోవాలనే కాంక్ష ఆమెకు బాగా ఉండేది .అందుకోసం స్పెయిన్ దేశం వెళ్లి రెండేళ్ళు ఉండి వివిధ  పాశ్చాత్య నృత్య విధానాలను నేర్చి ఆకళింపు చేసుకొన్నది .

నాటక సమాజం –ప్రదర్శనలు

1959లో మద్రాస్ కు తిరిగి వచ్చి స్థిర పడింది .అక్కడి కళా కారులను సమీకరించి ‘’మద్రాస్ ప్లేయర్స్ ‘’అనే నాటక సమాజాన్ని నెల కోల్పింది .చాలా నాటక ప్రదర్శనలిచ్చి గుర్తింపు పొందింది. ఇబ్సన్ రాసిన ‘’పీర్ జ్యంట్ ‘’,షేక్స్పియర్ రచించిన ‘’ట్వెల్ఫ్త్  నైట్’’,టేన్నీసీ విలియమ్స్ రాసిన ‘’నైట్ ఆఫ్ ది ఇగూనా ‘’మొదలైన నాటకాలను ప్రదర్శించి పేరు తెచ్చుకోంది .ప్రసిద్ధ దర్శకులు డగ్లాస్ అల్జీర్స్ పీటర్ కో  వీటికి దర్శకత్వం వహించారు . తానూ స్వయంగా నటించి డైరెక్ట్ చేసిన నాటకాలలో ముఖ్యమైనవి –‘’ఏ వ్యూ ఫ్రం దిబ్రిడ్జ్ ‘’,’’దిహౌస్ ఆఫ్ బెర్నార్డా అలబా ‘’మొదలైనవి ఉన్నాయి.

తిక్కవరపు తో పెళ్లితో అయిన  –ఆంధ్రా కోడలు

.  .నెల్లూరుకువాసి తిక్కరపు పటాభి రామ రెడ్డి  అనేకవి సంపన్నుడు సామాజిక సేవకుడు స్నేహలతను వలచి వలపింప జేసుకొని ,ఆమెకోసం ఆస్తినీ త్యాగం చేసి  పెళ్లి చేసుకొన్నాడు  .అప్పటి నుండి స్నేహలతా రెడ్డి అయింది .వీరికుమారుడు కోణార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్య కారుడు .కూతురు నందనా రెడ్డి కార్మిక న్యాయ వాది,సంఘ సేవకురాలు .అప్పటికే రెడ్డి ‘’పఠాభి ‘’పేరు తో అభ్యుదయ వాద సంచలన  కవిత్వం రాసి ప్రాచుర్యం పొందాడు .ఛందస్సు ను అటకెక్కించి చిన్నయ సూరికి పాడే కట్టించి ,కొత్త సంప్రదాయాలతో కవిత్వం లో దూసుకు పోయాడు .‘’ఫిడేలు రాగాల డజన్ ‘’పఠాభి పంచాంగం ‘’లతో’’ పన్ ‘’(శ్లేష)ను పండించాడు .భర్త మార్గం లోనే స్నేహలత నడిచింది అభ్యుదయ భావాల తో మమైకం అయింది .

సంస్కార

పఠాభి కన్నడ భాషలో ‘’సంస్కార ‘’అనే గొప్ప చలన చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు .దీనికి ఆధారం   జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత యు. ఏ .అనంత మూర్తి  రాసిన సంస్కార నవల . అందులో స్నేహలత నాయిక పాత్ర పోషించింది .  గిరీష్ కర్నాడ్  . ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది .రాష్ట్ర పతి స్వర్ణకమలం అవార్డు తో బాటు అంతర్జాతీయ ప్రశంసలూ దక్కాయి .రెండవ సినిమా’’సోనే కంసారి ‘’ఒ నటించింది భర్త దర్శ కత్వం లో .ఆ సినిమా స్నేహలత మరణానంతరం 1977 లో విడుదలైంది .పఠాభి –చండ మారుత ,శృంగార మాస, దేవర కాడుకన్నడ  సినిమాలు కూడా తీసి డైరెక్ట్ చేశాడు .తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు , శ్రీకృష్ణార్జున యుద్ధం భాగ్య చక్రం సినిమాలు నిర్మించాడు .పఠాభి ని ”ఫాదర్ ఆఫ్ పారలల్ సినిమా ” సంబోధిస్తారు గౌరవంగా

సోషలిస్టు స్నేహలత-పౌరహక్కుల ఉద్యమం

స్నేహలత పై సోషలిస్ట్ నాయకుడు రామ మనోహర్ లోహియా ప్రభావం పడింది .ఆ భావాలకు ఆకర్షితురాలైంది .లోహియా నడుపుతున్న ‘’మ్యాన్ కైండ్’’మాస పత్రిక సంపాదక వర్గ సభ్యురాలైంది .పత్రిక ప్రచురణ బాధ్యతను స్వయం గా నిర్వహించి సోషలిస్టు భావ వ్యాప్తికి దోహద పడింది . ప్రసిద్ధ సోషలిస్ట్ నాయకుడు కార్మిక సంఘాల నేత జార్జి ఫెర్నాండెజ్ కు అత్యంత సన్నిహితురాలైంది స్నేహలత .ఈ సాన్నిహిత్యమే ఆమె మరణానికి దారి తీసింది .’’పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ‘’ను భార్యా భర్తలు స్థాపించి పౌరహక్కుల ఉద్యమాన్ని సోషలిస్ట్ పంధాలో నడిపారు .

 

పత్రికా వ్యాసంగం –

స్నేహలత ‘’ఫోకస్ ‘’అనే రాజ కీయ పత్రికను ,’’బాలల కోసం ‘’మ్యూజిక్ గార్డెన్ ‘’అనే బాల మాస పత్రికలను కూడా తన సంపాదకత్వం లో వెలువరించి తనకు ,ఆ పత్రికలకూ చిర కీర్తి నార్జించింది .

గౌరవ స్థానం

1956-57లో మద్రాస్ లో బాల నేరస్తుల కోర్టుకు ‘’గౌరవ మాజిస్త్రేట్ ‘’గా వ్యవహరించింది .1964 బ్రిటిష్ రాణి ఎలిజబెత్ భారతదేశం లో పర్యటిస్తూ మద్రాస్ వచ్చినప్పుడు స్నేహలత వ్యాఖ్యాతగా పని చేసింది .1967-68కాలం లో మద్రాస్ ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఉంది .

ఎమర్జెన్సీ లో వీరమరణం

1977 లో ఇందిరా గాంధితన ప్రాబల్యం కోసం  దేశం లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీ ని వ్యతిరేకించిన జయప్రకాష్ నారాయణ ,అటల్ బిహారీ వాజ్ పాయ్ లాల్ కృష్ణ ఆద్వానీ ,ఫెర్నాండెజ్   మధు దండా వతే ,స్నేహలతా ,పఠాబి  మొదలైన వారందరినీ అరెస్ట్ చేసి జైలు లో పెట్టించిన చీకటి రోజులు మనకు ఇంకా గుర్తు ఉంది .ఆ చీకటి రోజుల్లో ఆ రాక్ష ప్రభుత్వం స్నేహలత   కుటుంబాన్ని  కూడా జైలు లో పెట్టి ఎన్నో ఇబ్బందుల పాలు చేసింది .ఫెర్నాండెజ్ పై బరోడా డైనమైట్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు .ఫెర్నాండజ్ తో సాన్నిహిత్యం ఉన్నందున స్నేహలతనూ ఆ కేసులో ఇరికించారు .కాని ఫైనల్ చార్జి షీట్ లో స్నేహలతపేరు లేదు .అయినా ఆమెను బెంగుళూరు  జైలు లో నానా ఇబ్బందీ పెట్టారు .మనుషులు ఉండలేని పరమ దారుణమైన గదిలో ఆమెను ఉంచారు. అసలే అతి సున్నితం గా ఉండే ఆమె దీర్ఘకాలంగా ఉబ్బస వ్యాధితో బాధ పడుతూ  ఇవి తట్టుకో లేక పోయింది .ఆమె జైలు లో ఉండగానే అనారోగ్యం పెరిగిపోయింది .లంగ్స్ కు ఇన్ఫెక్షన్ సోకింది . .సమయానికి తగిన వైద్య సేవలను ప్రభుత్వం అందించ లేదు .ఆరోగ్యం విపరీత్ర్హం గా క్షీణించి పెరోల్ పై15-1-1977న విడుదల అయింది .అదే జైలు లో మరో సోషలిస్ట్ నాయకుడూ మాజీ రైల్వే మంత్రి మధు దండావాతే కూడా ఉన్నారు .స్నేహలత శ్వాస పీల్చుకోలేక పడుతున్న బాధ  అంతా ఆయనకు వినిపించేదని జ్ఞాపకాలలో రాశాడు .సరిగ్గా అయిదు రోజుల తర్వాత 20-1-1977 నస్నేహలతా రెడ్డి అసువులు బాసింది .  ఇందిరా ఎమర్జన్సీ బాధితులలో అసువులు బాసి వీర మరణం పొందిన మొదటి బాచీ నాయకులలో స్నేహలత ఒకరు .

పఠాభి నివాళి

2003పఠాభి అరవిందుని సావిత్రి కావ్యాన్ని ఆధారం గా చేసుకొని ‘’ఇన్ దిఅవర్ ఆఫ్ గాడ్ ‘’అనే నాటకం రాసి భార్య స్నేహలతకు అంకితమిచ్చాడు .ప్రేమ కోసం యముడినే ఎదిరించిన సావిత్రి తో స్నేహలతను పోల్చిరాశాడు.

మనవి- దాదాపు వారం రోజులుగా నేను మహిళామతల్లుల పై రాసిన పదికి పైగా వ్యాసాలన్నిటికి ఆధారం –శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురించిన ‘’20  వ శతాబ్దపు తెలుగు వెలుగులు (ఒకటి రెండు భాగాలు ) తెలుగు విజ్ఞాస సర్వస్వం ,వీకీ పీడియాలు  అని మనవి చేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

2 Responses to గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

  1. రవితేజ's avatar రవితేజ says:

    సర్, ఈ విలువైన వ్యాసాన్ని తెలుగు వికీపీడొయా లో జత చేయడానికి అనుమతి ఇస్తారుఆ???

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.