చౌరస్తా’లో తెలుగు భాష
- – ఎ. రజాహుస్సేన్, 9505517052
- 15/12/2014
భాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. రెండు రాష్ట్రాలమధ్య ఇప్పుడు భౌతికంగా హద్దులు- సరిహద్దులు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ భాష విషయంలోనే ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలకు కూడా అధికార భాష తెలుగే. రాష్ట్ర విభజన ముందువరకు అంటే అవిభక్త రాష్ట్రంలో తెలుగు మాట్లాడే 23 జిల్లాల్లో వేరే వేరే మాండలికాలు, రకరకాల యాసలున్నా స్థూలంగా ప్రామాణిక భాష ఒకటే వాడుకలో వుంది. తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాష చిన్నచూపునకు గురవుతోందన్న విమర్శ వుంది. తెలంగాణ భాషను మోటు భాషగా, అనాగరిక భాషగా ముద్రవేశారన్న ఆరోపణ కూడా వుంది. ప్రామాణికత ముసుగులో కోస్తాంధ్రకు చెందిన రెండున్నర జిల్లాల భాషే తెలంగాణ ప్రాంతంలో పెత్తనం చేస్తోందన్న భావన బలంగా వుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇపుడు వ్యావహారిక భాషలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని మాండలికాలు, యాసను వ్యవహారంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ఇప్పటిదాకా అధికారికంగా కొనసాగుతున్న ప్రామాణిక తెలుగుకు బదులు తెలంగాణ ప్రాంతంలోని మాండలికాలతో కూడిన భాష దశలవారీగా వ్యవహారంలోకి రాబోతోంది. మాండలిక భాష ప్రధాన స్రవంతిలో కలువబోతోందంటే మాండలిక యాస కూడా భాషలో చోటుచేసుకుంటుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాష, యాస అధికారిక రూపును సంతరించుకోబోతున్నాయి. తెలంగాణ భాష తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నంగా దీన్ని భావించాలి. ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే దీనివల్ల రాష్ట్రం రెండుగా చీలినట్లే తెలుగు భాష కూడా రెండుగా చీలిపోవాల్సి వస్తుందా? అంటే ఆంధ్ర ప్రాంతంలో ‘ఆంధ్ర తెలుగు’ (ప్రస్తుతం ప్రామాణికంగా అమల్లో వున్న భాష) తెలంగాణ ప్రాంతంలో ‘తెలంగాణ తెలుగు’ (కొత్త రూపును సంతరించుకోబోయే తెలంగాణ భాష)ను చూడబోతున్నామా? ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో ప్రామాణికంగా పరిగణింపబడే తెలుగు భాషే ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా వ్యవహారంలో వుంది. అయితే ఇకమీదట ఈ ప్రామాణిక భాష కేవలం ఆంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలకే పరిమితం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తెలంగాణ మాండలికాలతో కూడిన ‘తెలంగాణ భాష’ సాక్షాత్కరించనుంది. తెలంగాణ ప్రాంతంలోని పాఠశాలలు, ఇతర విద్యాలయాల్లో అలాగే అధికారిక కార్యకలాపాల్లో ఇక తెలంగాణ భాషే కనిపించవచ్చు. అలాగే పాఠ్యపుస్తకాల్లో కూడా ప్రస్తుత ప్రామాణిక భాషకు బదులు తెలంగాణ భాష చోటుచేసుకోబోతోంది. అంటే తెలుగు భాష ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా, తెలంగాణలో మరోవిధంగా వుండబోతోంది. రెండు రాష్ట్రాల్లో మాట్లాడేది, రాసేది తెలుగే అయినా అవి రెండు రకాలుగా వుండటంవల్ల ఏమైనా చిక్కులువస్తాయా? అన్నది భాషా పండితులు ఆలోచించాలి.
మాండలికాల్లో మట్టివాసన
ఏ భాషకైనా మాండలిక పదాలే మూలం. మాండలికాల్లో మట్టివాసన గుప్పుమంటుంది. శాస్త్ర ప్రకారం చూసినా కూడా ఏ భాషకైనా జీవధాతువు మాండలికమే.. వృత్తి పద పరిశీలన ఆధారంగా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగుదేశాన్ని నాలుగు భాషా మాండలికాలుగా విభజించారు. అందులో ఉత్తర మండలాన్ని (తెలంగాణ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో కోస్తా – రాయలసీమలకు ఆనుకొని వున్న ప్రాంతం) తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన భాషా మండలంగా భాషా శాస్తవ్రేత్త భద్రిరాజు గుర్తించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రత్యేక భాషా మండలంలో మాట్లాడే మాండలికాలతో తెలంగాణ భాష కొత్త రూపు సంతరించుకునే ప్రయత్నం మొదలైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో మాండలిక పదాలతోపాటు, తెలంగాణ ప్రాంత నుడికారాలు, జాతీయాలు, ఇతర వాడుక పదాల్ని చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే తన పని ప్రారంభించింది. అయితే హడావుడిగా ఏదో ఒకటి చేశాం అన్నట్లు కాకుండా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే తెలంగాణ మాండలిక పదాల్ని పాఠశాలల్లో పుస్తకాల్లో విస్తృతంగా వాడుక లోనికి తేవాలంటే ముందుగా మాండలిక పదకోశాల్ని సిద్ధం చేసుకోవాలి. వృత్తి పదకోశాల్లో ప్రస్తుతం కొన్ని మాండలిక పదాలు అందుబాటులో వున్నాయి. నలిమెల భాస్కర్ ‘తెలంగాణ పదకోశం’ కొంతవరకు ఉపయోగపడుతుంది. 1999లో ‘సామాజిక భాషా పరిశీలన’ అనే పథకం ద్వారా తెలుగు అకాడమీ జిల్లాల వారీగా ప్రచురించిన తెలుగు మాండలికాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. వీటితోపాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వాడుకలో వున్న మాండలిక పదాల్ని విస్తృతంగా సేకరించాల్సిన అవసరముంది. దీనికి సంబంధించి ఓ బృహత్ప్రయత్నం జరగాలి.
అలాగే తెలంగాణ మాండలికంలో వచ్చిన కవిత్వం ఇతర రచనల్లోని పదాల్ని పలుకుబళ్లను, పదబంధాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసిన వారున్నారు. తెలంగాణ పదాల సొగసు, మాధుర్యం, నాదం, ఆత్మ, ఆత్మీయత, సృజనాత్మకత, వౌలికత, సార్థకత, మట్టివాసనలు మరీ ముఖ్యంగా ఈ ప్రాంతపు ఉద్యమ జానపద సొగసులు తెలంగాణ భాషలో సమగ్రంగా ఆవిష్కరించబడాలి. నూతన భాషా విధానంలో వీటన్నిటిని క్రోడీకరించాలి. అలాగే ఇంట్లో పరిసరాల్లో నేర్చుకునే ‘ఇంటిభాష’ను విస్మరించకూడదు. ఇక తెలంగాణ నుడి, నానుడి పలుకుబడిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే తెలంగాణ జాతీయాల్ని, సామెతల్ని పొడుపు కథల్ని విస్మరించకూడదు. కరీంనగర్‌కు చెందిన వేముల పెరుమాళ్లు సుమారు 3000 జాతీయాల్ని సేకరించారు. వాటిని తెలంగాణ భాషా స్రవంతిలోకి తీసుకురావాలి. అలాగే తెలంగాణలో పాటకు, పద్యానికి కూడా ప్రత్యేక స్థానముంది. ఉద్యమకారులకు జానపదులకు ‘పాట’ ఊపిరైంది. అలాగే పల్లె పట్టుల్లో పద్యాలు హృద్యాలుగా అలరారాయి. మందార మకరంద మాధుర్యంలో పోతన భాగవత పద్యాల్ని ఇప్పటికీ పాడుకునే పల్లె ప్రజలున్నారు. పోతన పద్యాల్లోని తెలంగాణ మాండలికాల్ని బయటకు తీయాలి. సురవరం ప్రతాపరెడ్డి సీసపద్యాల్ని పాలమూరు మాండలికంలో రాసి మట్టి రుణం తీర్చుకున్నారు. ఈ విధంగా మాండలికాల్లో పద్యాలు రాసినవారు అనేకమంది వున్నారు. వీరి పద్యాల్ని సేకరించి అందులో మాండలికాలకు ఊపిరిపోయాలి. ఇక ‘కథ’ విషయానికొస్తే తొలితరం తెలంగాణ కథల్లో నాటి తెలంగాణ వ్యావహారికం కనిపిస్తుంది. తొలితరం తెలంగాణ కథలన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు. వీటిని సేకరించాలి. ఈ కథల్లో అరవై యేళ్ళ కిందటి తెలంగాణ జీవితం కనిపిస్తుంది. అప్పటి మాండలికం వినిపిస్తుంది.
నూతన భాషా విధానం ప్రకటిస్తారా?
తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాషలో చేపడుతున్న మార్పులు- చేర్పులకు సంబంధించి ఓ నూతన విధానం (పాలసీ) ప్రకటిస్తే బాగుంటుంది. దీనివల్ల బహిరంగ చర్చకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల భాషా నిపుణులు, పండితులు, భాషాభిమానులు తదితర వర్గాలనుంచి గుణాత్మకమైన సూచనలు, సలహాలు లభించే అవకాశముంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ‘బడిపలుకుల భాష’కు ‘పలుకుబళ్ల భాష’కు మధ్య చాలా వ్యత్యాసముంది. వ్యత్యాసాన్ని సవరించాలని ప్రభుత్వం భావించడం సహజమే. అయితే ఈ ప్రయత్నాన్ని ఏ కొందరికో పరిమితం చేయకుండా అందరినీ కలుపుకుపోవాలి. ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావు లేకుండా అవసరమైన వారందరినీ సంప్రదించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘చౌరస్తాలో’ వున్న మన తెలుగు సరైన మార్గంలో పయనించడానికి దిశా నిర్దేశం చేసినట్లవుతుంది.

