చర్మ విజ్ఞాన శాస్త్ర నిపుణులు –డా .యలవర్తి నాయుడమ్మ
10-9-19 22 గుంటూరు జిల్లా తెనాలి తాలూకా యలవర్రు లో రైతు కుటుంబం లో జన్మించిన యలవర్తి నాయుడమ్మ ,అక్కడే ప్రాధమిక విద్య నేర్చి ,గుంటూరు ఎ .సి .కాలేజిలో ఇంటర్ చదివి ,19 43 లో బెనారస్ హిందూ యూని వర్సి టిలో బి .ఎస్ .సి .డిగ్రీ పొంది ,మద్రాస్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ లో చేరి ,సునుశిత మేదావి అవటం తో ఆ సంస్థ ఆయన్ను లెదర్ టెక్నాలజిలో పరిశోధనలకోసం బ్రిటన్ పంపింది .అక్కడి అధ్యయనం పూర్తయ్యాక అమెరికాలో లీహై యూని వర్సిటి లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం పై డాక్టరేట్ అయ్యారు .అక్కడే చర్మ శుద్ధి పై వివిధ పరిశోధనలు చేసి 1943 లో మద్రాస్ వచ్చి ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ లో సైంటిస్ట్ గా చేరి ,రెండేళ్ళు పనిచేసి మళ్ళీ అమెరికా వెళ్లి లోగడ తాను చేసిన పరిశోధనలకు మెరుగులు దిద్దారు .1951 లో ఇండియావచ్చి సెంట్రల్ లెదర్ రిసెర్చ్ యూని వర్సిటిలో సైంటిస్ట్ అయ్యారు .ఎన్నో ప్రణాలికలు రూపొందించి చర్మకార పరిశ్రమ అభి వృద్ధికి విశేష కృషి చేసి ,కేంద్ర చర్మ పరిశోధకాభివృద్ధి ,కి సంస్థను సాటిలేని మేటి సంస్థగా తీర్చి దిద్దారు .1956 లో దీనికి డైరెక్టర్ అయ్యారు .జాతీయ స్థాయిలో ఈ సంస్థ ఎదిగి పారిశ్రామిక ,గ్రామీణాభి వృద్ధి సంస్థగా గణనీయై మైన సేవలందించింది .ప్రొఫెసర్ నాయుడమ్మ ఖ్యాతి దేశ విదేశాలలో మారు మోగింది .
నాయుడమ్మ సామర్ధ్యానికి తగిన హోదాలెన్నో పొందారు .కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రి యల్ రిసెర్చ్ సంస్థకు 19 71 -77 వరకు డైరెక్టర్ జనరల్ అయ్యారు .1981 లో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూని వర్సిటి వైస్ చాన్సలర్ గా ,మద్రాస్ యూని వర్సిటి ఆనరరి ప్రొఫెసర్ గా ,సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ కు డిస్టి౦గ్వి ష్డ్ సైంటిస్ట్ గా సేవలందించారు .చర్మ పరిశోధనలోనేకాకుండా ఖనిజాలు వృక్షాలు ఆల్డే హైడ్స్ మొదలైన వాటి కలయిక ,నిర్మాణ శైలి లలోనూ విశేష పరిశోధనలు గావించారు ,ఇవన్నీ తోళ్ళను పదును చేయటానికి కొత్త ఏజెంట్స్ గా పనికొస్తాయని రుఉజువు చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు .’’జన్మ చేత రైతును ,వృత్తి చేత అస్ప్రు శ్యు డను’’అని డా నాయుడమ్మ తనపై తాను జోక్ వేసుకొన్నారు .ఆయనవలన మన చర్మ కార వస్తువులకు అంతర్జాతీయ ప్రమాణం ,నాణ్యత గిరాకీ హెచ్చింది .
అలీన దేశాలకు ,ఇతర దేశాలకు మధ్య స్నేహ వారధిగా నాయుడమ్మ విఖ్యాతి గాంచారు .మద్రాస్ CRRIలో వివిధ ప్రయోగాలకుకావలసిన లేబరేటరీల రూపకల్పనకు ప్రణాలికలు తయారు చేసి ,డిజైన్ ల రూప కల్పన చేశారు .ఆ సంస్థ పేరు చెబితే ఎవరికైనా నాయుడమ్మ గుర్తుకొస్తారు .దాని సర్వతోముఖాభివృద్ధికి అహరహం శ్రమించిన విజ్ఞాని .అత్యాధునిక శైలిలో తోళ్ళ పదును ,శుద్ధి కి పైలట్ ప్లాంట్ లనుమొదటి సారిగా జాతీయ స్థాయిలో నెలకొల్పటం లో దోహదపడ్డారు .సమాచారం అందరికి అందుబాటులో ఉండాలని భావించి ‘’లెదర్ సైన్స్ ‘’పత్రిక స్థాపించి సంపాదకులైనారు .
నాయుడమ్మగారి సునిశిత మేధా శక్తి గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు గా నియమించి గౌరవించారు .తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులుకూడా అయన నే కొనసాగించారు .తమిళనాడు ప్రభుత్వానికీ గౌరవ సలహాదారయ్యారు .1977 ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమి ,ఇండియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,ఇండియన్ స్టాండర్డ్ ఇన్ స్టి ట్యూట్ సంస్థల ఫెలోషిప్ పొంది,పరిశోధనలో సాటి లేని వారనిపించుకొన్నారు .మనదేశం లోనే విదేశాలలోని సంస్థలూ ఆయనకు విశేష గౌరవాన్నిచ్చాయి .అమెరికన్ లెదర్ కేమిస్ట్స్అసోసియేషన్ ,ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ లెదర్ ట్రేడ్ కేమిస్ట్స్ మొదలైన సంస్థలు గౌరవ సభ్యుని చేసి గౌరవించాయి .అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ కెమికల్ సొసైటీ ,ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ కేమిస్త్స్ కు అధ్యక్షులు .అంతర్జాతీయంగా ఇంతటి ఘనకీర్తి సాధించినా ,సభలు , సమావేశాలలో ‘’నాపేరు నాయుడమ్మ అంటారండీ ‘’అని అత్యంత వినయంగా కొత్తవారితో పరి చయం చేసుకొనేవారు .నిరాడంబరత ,వినయ విధేయతలు సునిసిత మేధా శక్తి ఆయన ప్రత్యేకతలు ఐరాస సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకుని దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు.
మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు సైన్స్ ,టెక్నాలజీ లను ఉపయోగించి వెనుకబడిన జిల్లాలను దత్తత తీసుకొని అభి వృద్ధి చేయటానికి కృషి చేసి సత్ఫలితాలు సాధించారు .1965 లో గుజరాత్ లోని వడోదర లో ఉన్న ఎం .ఎస్ .యూని వర్సిటి వారు డాక్టర్ కే .జి నాయక్ గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించింది .1971 లో కేంద్ర ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసింది .ఇంగ్లీష్ లో రమణీయంగా ,తెలుగు లో కమ్మగా తియ్యగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత .నాయుడమ్మ గారికి కళా పిపాస బాగా ఉండేది .ఎన్టి రామారావు హీరోగా ఎస్. డి .లాల్ డైరెక్టర్ గా తీసిన ‘’రాజపుత్ర రహస్యం ‘’జానపద చిత్రానికి నాయుడమ్మగారు నిర్మాత .ఇందులో మనిషి ఏ ప్రాంతం లో పెరిగితే ఆ భాష మాత్రమే మాట్లాడుతాడు ‘’అనే వైజ్ఞానిక సత్యాన్ని ఆవిష్కరించారు .అలాగే దీనిలో హీరో చిన్నతనం లో అడవి జంతువుల సహవాసం లో పెరిగినప్పుడు కేవలం సైగలే చేస్తూంటాడు .తరువాత జనారణ్యం లోకి వచ్చాక మాటలు నేర్చుకొంటాడు .
1985 జూన్ 23 మాంట్రియాల్ లో జరిగే సదస్సులో పాల్గొని ఇండియారావటానికి లండన్ ‘’కనిష్క ‘’ విమానం ఎక్కగా అది పేలిపోయి డా నాయుడమ్మ దుర్మరణం పాలయ్యారు .ఆయనతోపాటు 331 మంది నిర్దాక్షిణ్యంగా చంపి వేసింది ఒక నరహంతకుల ముఠా అని విచారణచేసిన దర్యాప్తు సంస్థ 20 05 మార్చి మూడవ వారం లో తీర్పు నిచ్చింది ఈ తీర్పు చరిత్రలోనే అసమర్ధపు, నిరాశాజనక దర్యాప్తుగా ప్రసిద్ధి చెందింది .నాయుడమ్మగారి కుమారుడు శ్రీ రతీష్ నాయుడమ్మ ఈ తీర్పుపట్ల ఆవేదన వ్యక్తపరచారు .కనిష్క పేల్చివేతలో ముద్దాయిలను నిర్దోషులుగా బ్రిటిష్ కొలంబియా సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అన్యాయం అని లోకమంతా కోడై కూసింది .భారత ప్రభుత్వమూ ఉదాసీనతగా వ్యవహరించింది .కిరాతక ,అమానుష చర్యకు ఎందరో బలయ్యారు .భారత దేశం,ఆంధ్రరాష్ట్రం ఒక అంతర్జాతీయ మేధావి సైంటిస్ట్ విలువైన జీవితాన్ని కోల్పోయింది .
2006 జూన్ 23 హైదరాబాద్ లో ఆంద్ర ప్రదేశ్ సైన్స్ అకాడెమి ఆధ్వర్యం లో జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్తహలో ప్రొఫెసర్ నాయుడమ్మ స్మారక సభ జరిగింది .శాస్త్ర రంగం లో విశేష కృషి చేసి ,ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డా, జి త్యాగరాజన్ కు ‘’నాయుడమ్మ స్మారక స్వర్ణ పతకం ‘’బహూకరించారు .నాటి ఆర్ధికమంత్రి శ్రీ రోశయ్య ,నాయుడమ్మ గారు సాధించిన విషయాలపై కేంద్రం ఒక డాక్యుమెంటరి ఫిలిం రూపొందించాలని కోరారు
డా. యలవర్తి నాయుడమ్మ మెమొరియల్ అవార్డ్
తెనాలి లో 1986 లో ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.వై నాయుడమ్మ సంస్మరణార్థం స్థాపించిన అవార్డును సైన్స్, టెక్నాలజీ, రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.
ఈ అవార్డ్ పొందిన ప్రముఖులు టి.రామస్వామి, ఎ శివతాను పిళ్ళై, నోరి దత్తాత్రేయుడు, శామ్ పిట్రోడా, జి. మాధవన్ నయర్, కోట హరినారాయణ, వి.కె. ఆత్రె, ఆర్. చిదంబరం, ఆర్.ఎ. మశేల్కర్ జె.ఎస్. బజాజ్, కె. కస్తూరిరంగన్, వెర్ఘీస్ కురిఎన్, ఎస్.జెడ్. ఖసిం, ఎం.జి. కె.మీనన్ మరియు ఎం.ఎస్. స్వామినాథన్ వి.కె. సరస్వత్ (2009) తదీతరులు…
.19 90 లో అవార్డ్ గ్రహీత –శ్రీ ఏం జి కే మీనన్ .20 05 లో యూని వర్సిటి ఆఫ్ కొలరాడో ఫెలో ప్రొఫెసర్ బెర్నార్డ్ అమడైకు ,20 06 లో భారత టెలికాం విప్లవ శిల్పి శ్యాం పెట్రోడాకు అంద జేశారు .
“సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం” అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు. ఈ సహాయమును దానంగా పరిగణించనూలేదు. తాను సహకరిస్తున్నట్లుగా అన్యులెవరికీ తెలియకుండా గుప్తంగా అందిస్తూ వచ్చారు.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-8-18 –ఉయ్యూరు
—

