పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు
కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురం సమ్రాట్ గా పట్టాభి షేకం జరిగాక ,ధర్మరాజు కాకుండా మిగిలిన నలుగురు సోదరులు శ్రీ కృష్ణుని సందర్శించి ,రాబోయే కలియుగ విశేషాలు వివరించమని ప్రార్ధించారు .సరే అన్న ఆయన తాను నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు సంధిస్తానని ,వాటిని వెంబడించి ఒక్కో దిక్కులో బాణం పడి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అక్కడ తాము ఏమి గమనించారో తిరిగి వచ్చి తెలియ జేయమని చెప్పాడు .అలాగే పాండవులు నలుగురు బాణాలు వెళ్ళిన తలో దిక్కుకు బయల్దేరి వెళ్ళారు .
ముందుగా అర్జునుడు వెళ్ళిన దిక్కులో ఒక కోయిల మధురంగా గానం చేస్తూ కాలికింద కుందేలును పొడుచుకు తింటూ అతి ఆనందంగా కనిపించింది .బిత్తర పోయిన అర్జునుడు ఈ విషయాన్నివెళ్లి కృష్ణుడికి చెప్పాడు .భీముడు వెళ్ళిన దిక్కులో నాలుగు బావులు కనిపించాయి వాటిలో మూడిట్లో నీరు నిండా ఉన్నాయి నాలుగోది నీరు లేకుండా ఖాళీగా ఉంది.పరిగెత్తుకు వెళ్లి బావకు చెప్పాడు .నకులుడు బాణంపడి ఉన్న చోటుకు వెళ్లి చూస్తే అప్పుడే పుట్టిన లేగదూడను ఒళ్లంతా ఆప్యాయంగా దూడ ఒళ్ళంతా పుళ్ళు పడేదాకా నాకుతున్న ఆవు కనబడింది .సహదేవుడు చోసిన బాణం దగ్గర ఒక పెద్ద కొండ మీదనుంచి పెద్దబండరాయి దొర్లి పడుతూ కిందకు వస్తూ ఒక చిన్న మొక్క అడ్డం వస్తే ఆగిపోవటం గమించాడు .కవలలు కూడా తామిద్దరూ చూసిన వాటిని శ్రీ కృష్ణుడికి నివేదించారు .దీనిభావమేమి తిరుమలేశా అంటూ నలుగురు బిక్కమోహంతో బావ ను అడిగారు .ఆయన విశదంగా వివరించాడు .
అర్జునుడు చూసిన కోయిల- కుందేలు విషయం లో రాబోయే కలికాలం లో విజ్ఞులైన వివేకులు ధనవంతులు కూడా తమ సంపదను ఆనందంగా అనుభవిస్తూ ప్రక్కనే ఉన్న పేదవారిపై దయా,దాక్షిణ్యం , జాలిలేకుండా పీడిస్తూ వారి సంపదపై బతుకుతూ రాక్షసానందాన్ని కోయిల పొందినట్లుగా పొందుతారు అని భావంగా చెప్పాడు .భీముడు చూసిన నూతుల విషయాన్ని వివరిస్తూ ప్రక్కన అతి పేదవాడున్నా వాడికి గుక్కెడు నీళ్ళు అందించి దాహం తీర్చాలన్న ఆలోచన రాని వారు కలియుగం లో ఉంటారు అనిచెప్పాడు.నకులుడు చూసిన ఆవు దూడ విషయం లో –కలియుగం లో తమ తలిదండ్రులు అతి ప్రేమతో గారాబంగా పిల్లలను పెంచి చెడగొడతారుఆవులాగా అన్నాడు .అతిప్రేమతో నాకుతూ తనపిల్లకు పుళ్ళు పడ్డాయని కూడా గ్రహించని ఆవులాగా ,పుత్ర వ్యామోహం, సంతానం పై అతి ప్రేమ పిల్లలను చెడ గొడతాయన్నాడు .సహదేవుడు చూసిన దొర్లే కొండమీది రాయి –కలియుగం లో మానవులు నైతిక విలువలు కోల్పోయి బండరాయిలాగా పై స్థాయినుంచి పతనం చెందుతూ ,చివరికి ఆబండరాయి చిన్న మొక్క అడ్డురావటం తో ఆగిపోయినట్లు భగవద్భక్తి, భగవన్నామం వలన పతనం నుంచి కాపాడుకొంటారన్నాడు . అని కలియుగ రహస్యాలు వివరించాడు శ్రీ కృష్ణ పరమాత్మ.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-10-18-ఉయ్యూరు
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D