ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4

331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ఆభిరాజ్ రాజేంద్ర మిశ్ర 1943లో ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ జిల్లా ద్రోణిపూర్ లో పండిట్ దుర్గా ప్రసాద్ మిశ్ర ,అభిరాజ్ దేవి దంపతులకు జన్మించాడు .ఈయన  దీక్షా గురువు జగద్గురు  రామ భాద్రాచార్య .సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్  యూనివర్సిటి సంస్కృత ఆచార్యుడుగా పని చేశాడు .ఇండోనేషియాలో అతిప్రాచీన విశ్వవిద్యాలయం యూని వర్సిటి ఆఫ్ ఇండోనేషియా కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .సంస్కృత హిందీ ఇంగ్లిష్ భోజపురి భాషల్లో చాలా గ్రంధాలు రాశాడు .

అందులో ‘’సంస్కృత శతకం ‘’ముఖ్యమైనది .మిగిలిన వాటిలో ఇక్షుగంధ,అరణ్యాని , అభిరాజ్ యశోభూషణం ,ధరా మండవీయాం ,,జానకీ జీవనం ,మధుపం ,సప్త ధారా ,అభిరాజ సహస్రకం ,నాట్య పంచగవ్యం ,నాట్య పంచామృతం ,వాగ్ వధూటి ,మ్రిద్వికా ,శ్రుతిమ్భర ,సువర్ణ ద్వీప రామకధ,సాంస్క్రిట్ సాహిత్యమే అన్యోక్తి ,పోయెట్రి అండ్ పోయేటిక్స్ ,బాలీద్వీప సాహిత్య సంస్కృతీ ,హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ బహాసా ఇండో నేషియా ఉన్నాయి .

అభిరాజ్ కు ‘’ఇక్షుగంధ’’సంస్కృత రచనకు గాను సాహిత్య అకాడెమి పురస్కారం 1988లో లభించింది.2002లో ప్రెసిడెంట్ అవార్డ్ ,వాల్మీకి సమ్మాన్,వాచస్పతి సమ్మాన్,ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ వారి విశ్వభారతి సమ్మాన్ లు అందుకొన్న కవి దిగ్గజం అభిరాజ్ రాజేంద్ర మిశ్ర .పదవీ విరమణ తర్వాత సిమ్లాలో స్థిరపడ్డాడు .

332-‘’అపశ్చిమః  పశ్చిమే’’ యాత్రా సాహిత్య కర్త –డా.హెచ్.ఆర్. విశ్వాస (20 వ శతాబ్దం )

డా.హెచ్. ఆర్ .విశ్వాస కర్ణాటకలోని మా౦గలూర్ నివాసి .సంస్కృత భాష పునరుజ్జీవనం కోసం బాగా కృషి చేశాడు .ప్రసిద్ధ  కన్నడ రచయిత భైరప్ప రాసిన ‘’ఆవరణ ‘’ను సంస్కృతం లోకి అనువాదం చేసి సాహిత్య అకాడెమి పురస్కారం పొందాడు .’’సంభాషణ సందేశ ‘’ సంస్కృత మాసపత్రిక 5ఏళ్ళు నడిపాడు .సంస్కృత భారతి సంస్థ కు అఖిలభారతీయ ప్రాక్ శిక్షణాప్రముఖ్,ప్రకాశనా ప్రముఖ్ గా చాలాకాలం పని చేశాడు  .2011 జనవరి లో మొదటి ప్రపంచ సంస్కృత గ్రంథ ఉత్సవం వర్కింగ్ కమిటీ సభ్యునిగా సేవలందించాడు .రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వారి సంస్కృత పాఠాల బోధనలో టీచర్ గా ఉన్నాడు. వీటిని   డి.డి.భారతి ,జ్ఞాన్ దర్శన్ కేంద్రాలు ప్రసారం చేశాయి .’’హోస దిగంత’’పత్రికలో ప్రతివారం ‘’సంగత ‘’ శీర్షిక నిర్వహించాడు .కర్నాటక ప్రభుత్వ౦ ప్రచురించే 5,6,7తరగతుల సంస్కృత పుస్తకాల సిలబస్ కమిటి సభ్యుడుగా ఉన్నాడు .

విశ్వాస సంస్కృతం లో ఏం ఏ చేసి కువెంపు యూనివర్సిటినుండి డాక్టరేట్ తోపాటు ‘’విద్వత్ డిగ్రీ’’ పొందాడు .భార్య శాంతలకూడా సంస్కృత భారతిలో పని చేస్తుంది .సంస్క్రుతానువాదం’’ ఆవరణ ‘’కు ఆరునెలలు పట్టింది .2008 నవంబర్ లో ఆవిష్కరణ జరిగింది .ఈయన కన్నడ పుస్తకం ‘’మత్తే హోత్తు హీబ్రూ హనాతే’’ను సంస్కృత పండితుడు  జి .వెంకట సుబ్బయ్య ఆవిష్కరించాడు.2006లో ఇది బెస్ట్ సెల్లర్ అయింది .భైరప్పరాసిన ‘’పర్వ ‘’ను కూడా సంస్కృతం లోకి అనువదించబడి 2012లో విడుదలైంది ..’’మార్జాలస్య ముఖం దృష్టం ‘’అనే నాటికల సంపుటి కి  సాహిత్య అకాడేమి నుంచి  బాలసాహిత్య పురస్కారం 2013లో అందుకొన్నాడు  .సంస్కృతం లో ‘’అప శ్చిమః పశ్చిమే’’అంటే’’ తూర్పు వాడు పశ్చిమం ‘’లో అన్న సంస్కృత యాత్రా సాహిత్య౦ ,’’హేమచ్ఛటికా’’  (స్వర్ణ మృచ్ఛకటిక),’’ సంస్కృత బోధకుల హాండ్ బుక్ గా’ కౌశలబోధిని’’  ‘’ఆవరణ ‘’రాశాడు .కన్నడం లో రెండుపుస్తకాలు తెచ్చాడు .అనాలిసిస్ ఆఫ్  సెన్టేన్న్సేస్ ఇన్  సాంస్క్రిట్’’అనే పరిశోధనా పత్రం రాశాడు .

333 –సంస్కృత వ్యాప్తి చేసిన ఆర్య సమాజ ఆచార్య –పండిత గోపదేవ్ (1896-1996)

పండిత గోపదేవ్ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కూచిపూడి గ్రామములో కావూరి రామయ్య, అచ్చమాంబ దంపతులకు 1896, జులై 30 న జన్మించాడు. గోపదేవ్ సామాన్య కర్షక కుటుంబములో పుట్టాడు. చిన్నతనములో పొలం పనులు చేసుకుంటూ తండ్రికి చేదోడుగా ఉండేవాడు. కొంత వయస్సు వచ్చిన తర్వాత స్వంత ఆసక్తితో అక్షర జ్ఞానం సంపాదించాడు. చదువు మీద జిజ్ఞాస పెరిగింది. బెల్లంపల్లి వెంకటనారాయణ వద్ద చదువుకొని ఉపాధ్యాయ శిక్షణ కూడా పొందాడు. 1922లో గుంటూరు జిల్లా బోర్డు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగములో చేరిన కొత్తలోనే పెళ్ళి జరిగింది. భార్య వివాహము జరిగిన కొద్ది కాలానికి చనిపోయింది. శేషజీవితం బ్రహ్మచర్యములోనే గడపాలని దీక్ష బూనాడు.

సంస్కృత విద్య
కూచిపూడి దగ్గరలోని అమృతలూరు లో సంస్కృత పండితులను ఆశ్రయించి పంచకావ్యాలను, నాటక సాహిత్యము చదివాడు. కావూరు సంస్కృత పాఠశాలలో తర్క, మీమాంస శాస్త్రములు చదివాడు. వేద వేదాంగములు అభ్యసించడానికి పండితులను కోరగా నిరాకరించబడ్డాడు. కేరళ, లాహోరు, వారణాసి పర్యటించి, విసిగి చివరకు ఢిల్లీ లో స్వామి శ్రద్ధానంద స్మారక విశ్వవిద్యాలయములో 1927లో విద్యార్థిగా చేరాడు. అచటనే ఉపనయన సంస్కారం జరిగింది. గోపయ్య గోపదేవ్ శాస్త్రిగా మారాడు. విద్వాంసుల వద్ద వేదోపనిషత్తులు క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకున్నాడు. ఆదర్శవంతమైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. లాహోరు లోని ఉపదేశక విశ్వవిద్యాలయములో చేరి అచట స్వతంత్రానందస్వామి వద్ద సంస్కారవిధి, తర్కము, మీమాంస, వేదానంద స్వామి వద్ద వ్యాకరణము నేర్చుకున్నాడు. అచటనే ఆర్యసమాజ పరిచయం, ప్రవేశం జరిగాయి. దర్శన వాఙ్మయం చదివే కోరికతో పోఠోహోర్ గురుకులము చేరి పండిత రామోపాధ్యాయుల వద్ద శిష్యుడిగా చేరాడు. 1933లో జగద్గురు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల పరిచయముతో పీఠాధిపతుల వద్ద వేదాంత దర్శనము చదివే భాగ్యము కలిగింది.

ఆర్య సమాజము
తరువాత స్వగ్రామము కూచిపూడి చేరి, పండిత గంగాప్రసాద్ ఉపాధ్యాయ ప్రోత్సాహముతో వైదిక ధర్మాన్ని, వైదిక సంస్కృతినీ ప్రచారం చేయాలనే ఆశయముతో 1939లో ఆర్య సమాజము స్థాపించాడు. తెలుగు నాట అనేక ప్రాంతాలలో ఆర్యసమాజాన్ని గురించి, మహర్షి దయానంద సరస్వతి సందేశాల గురించి ప్రచారము చేశాడు. అనేక చోట్ల ఆర్యసమాజాలు స్థాపించాడు. కూచిపూడిలో 1946లో మహిళా ఆర్యసమాజము కూడా స్థాపించి స్త్రీలకు వేదాభ్యాసము చేశాడు. హైదరాబాదులో దయానంద సరస్వతి ఉపదేశక విద్యాలయములో ఉపదేశకునిగా పనిచేసి డెబ్బది పైగా గ్రంథాలు రచించాడు.

పురస్కారాలు
1922లో దయానంద సరస్వతి వారి పురస్కారము పొందాడు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ “కళాప్రపూర్ణ” బిరుదుతో గౌరవించింది.

మరణం
నిస్వార్ధముగా వైదికథర్మ ప్రచారానికి జీవితము అంకితము చేసిన గోపదేవ్ 1996, అక్టోబర్ 22 న మరణించాడు.

334-అముద్రిత సంస్కృత కావ్యకవి –తెలకపల్లి విశ్వనాథ శర్మ (1940-2016)

తెలకపల్లి విశ్వనాథ శర్మ ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు.[1]

జీవిత విశేషాలు
ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1963లో సంస్కృత విభాగంలో, ఎం.ఏ గోల్డ్‌మెడల్ పొందిన తొలి వ్యక్తిగా వినుతికెక్కారు.[1] ఆయన హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. తర్వాత 1965లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి 1993లో పదవీ విరమణ చేశారు.[2] ప్రాకృతం, తెలుగు, సంస్కృతం, గ్రీకు సహా ఇతర విదేశీ భాషలపై పట్టు ఉన్న విశ్వనాధ శర్మ సంస్కృతాంధ్ర కవితలు అముద్రితంగానే ఉన్నాయి. దూరదర్శన్‌లో కొన్నేళ్ళపాటు విశ్వనాధ శర్మ భాషణలతో పాటు శివపురాణ కార్యక్రమం నిర్వహించారు. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించడంలో ఘనాపాఠీగా పేరున్న ఆయన రాసిన పరాశర మాధవీయం, కాళిదాస జ్యోతిష గ్రంథం బహుళ ప్రాచుర్యం పొందాయి.

మైసూరులోని దత్తపీఠాథిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో విశ్వనాథశర్మ దాదాపు ఐదు సంవత్సరాలు సంస్కృతం బోధించారు.[3] అనేక గ్రంథ, శాస్త్రాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాలన్న ఆయన తృష్ణను మాజీ డిజిపి అరవిందరావు నెరవేర్చారు. అరవిందరావు చేయూతతో అనేక సంస్కృత గ్రంథాలను, విశ్వనాథశర్మ తెలుగులోకి అనువదించారు.[1]

వ్యక్తిగత జీవితం
ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మే 10 2016 న మరణించారు.

335-వీరశైవ గురుకుల స్థాపకులు సంస్కృత సాహిత్యోసకులు –శ్రీ చిదిరె మఠం వీరభద్ర శర్మ (1906-1948)

చిదిరెమఠం వీరభద్రశర్మ ఆధ్యాత్మికవేత్త,వీరశైవ గురుకుల స్థాపకులు,బహుభాషాకోవిదులు,విభూతి అనే సారస్వతపత్రికా స్థాపకులు, శ్రీ జగద్గురు విశ్వారాధ్య పీఠాధ్యక్షులు.

బాల్యం,విద్యాభ్యాసం
శ్రీ వీరభద్ర శర్మగారు నల్గొండ జిల్లాలోని చర్లపల్లె అను గ్రామమున, వీరశైవమతము నందు గురు వర్గమునకు చెందిన మాహేశ్వర శాఖలో సం.1906లో శ్యామలాంబ, నాగభూషణు నామాంకితులగు దంపతులకు జన్మించిరి. తల్లిదండ్రులకు వీరు ఏకైక పుత్రులు. వీరికొక కనిష్ఠ సోదరిమాత్రము ఉండెను. నల్గొండ జిల్లాలోని 70 గ్రామాలకు చిదిరెమఠము కుటుంబమువారె మఠస్థులుగా ఉండిరి. 14 ఏండ్లు వయస్సు వచ్చులోపలనే తల్లితండ్రులు చనిపోవుటచేతను, జ్ఞాతులు, బంధువులు వీరి ఆస్తులను అపహరించుటచేతను, మరికొంతకాలమునకు వివాహితాయిన సోదరికూడ మరణించుటచేతను ఆదరించువారే లేక చిన్నతనమున బహుకష్టములకు లోనయిన శర్మగారు జన్మస్థలమును విడిచి హైదరాబాదు, నీరడగుంభ, నారాయణపేట మున్నగు తవులకేగి వీరశైవుల ఇండ్లలో భిక్షాటన మొనర్చుచు, సంస్కృత విద్యాభ్యాసము గావించిరి. త్వరలోనే వీరు కావ్యనాటక అలంకార సాహిత్యము సంపాదింపగలిగి వీరి తెలివితేటలకు, నైపుణ్యమునకు సంతసించి హైదరాబాదులో హైకోర్టు వకీలుగా నుండిన శ్రీ దేశ్ ముఖ్ బాబూరావు గారు, శ్రీ మహంతుమఠము చెన్నబసవయ్య అను వారు వీరిని ఆదరించిరి. 18 ఏండ్లకే సంస్కృతముతో పాటు ఆంధ్ర, కర్ణాటక భాషలయందు పాండిత్యమును సంపాదించిరి.

ఆధ్యాత్మిక పరిమళం
1922సం. ప్రాంతమున శ్రీ శివకోటి వీరభద్రయ్య అను మహేశ్వరులు- పరమశివభక్తి సంపన్నులు పెక్కుదివ్య క్షేత్రములు సేవించి ద్వాదశజ్యోతిర్లింగములలో ఒకటి అగు వైద్యనాధేశ్వరలింగమును అభిషేకమొనరింపబోవ అచ్చటి బ్రాహ్మణులు ప్రతిఘటించిరట. అందుపై వీరశైవులకు వేదాధికారము కలదా, లేదా అను విషయమున వాదాములు కలిగి అవి న్యాయస్థానముల కూడ నెక్కెనట. ఈ వివాదపరిష్కారవిషయమున నిజాము హైకోర్టువారు 1923-24సం.లో ఒక పండితసభనేర్పరచిరి. అదివరకు కాశీక్షేత్రములో విద్యనభ్యసించి వేదతీర్ధ పట్టము పొంది, ధార్వాడజిల్లాలో చౌడదానపురమఠాధ్యక్షులుగా నుండిన శ్రీ విరూపాక్షఒడయరు మహాస్వాములవారు పండితసభలో వీరశైవపక్షమున ప్రధాన పండితులుగా నుండిరి. అప్పుడు ప్రమాణ గ్రంధపరిశీలనాదికములలో వారికి శ్రీ వీరభద్రశర్మగారు కూడ తోడ్పడుచుండిరి. తుదకు హైకోర్టు వారు వీరికి అనుకూలముగా తీర్పు నిచ్చుట వలన, శ్రీ వీరభద్రయ్య గారు శ్రీ వీరభద్రశర్మ గారి చాకచక్యమునకు మిక్కిలి సంతసించి కాశీ క్షేత్రమునకు పోయి చదువుటకు సంస్కరించిరి. అటుపై వీరు విద్యాభ్యాసమొనర్చి స్మృతితీర్ధ, కావ్యతీర్ధ, ధర్మాచార్య, సాహిత్యవిశారద మున్నగు పట్టపరీక్షలందు కృతార్ధులయిరి. 1929 వ సం.లో వీరు హిమాలయము లకు సుమారు 500 మైళ్ళు కాలినడక సాగించి ఆయా విషయములను వివరించు నొక గ్రంధుము కూడా వ్రాసిరి. వీరు బ్రాహ్మీ లిపియందు అనేక దుర్గమ శాసనములను వీరు పఠించి ప్రకటింపగలిగిరి.

హిమాలయము నుండి తిరిగి రాగానే, కొంతకాలము యాదగిరి అందలి శంకరసంస్కృత కళాశాల అధ్యక్షులుగా పనిచేసిరి. అటు తరువాత శ్రీమటికె నాగయ్య అను భక్తవరులు దానపూర్వకముగ నొసగిన ధర్మనిలయమున వీరు వీరశైవగురుకులమున, శైవభారతీభవనమును సికింద్రాబాదులో నెలకొల్పి వీరశైవ విద్యార్ధులకు ఉచితముగా విద్య చెప్పుచుండిరి. అందే శివధర్మ గ్రంధమాలికను కూడ స్థాపించి వీరశైవ మహాత్ములు, రేణుక విజయము, శ్రీకరభాష్యము, శివపంచస్తని మున్నగు గ్రంధములు పదకొండు ప్రకటించిరి. బహుధాన్య సంవత్సర మహాశివరాత్రి దినమున విభూతి అను పేరుతో ఒక సారస్వతపత్రికను ప్రారంభించి రమారమి 4 సం. నిర్వహించి శైవమతసేవచేసిరి. వీరు బ్రహ్మ చర్యమును చేపట్టిరి.

జీవితకాలములో ఆహారవిహారములయందు వీరు పెక్కు నియమములు పాటించిరి.నెలకొక దినము మౌన వ్రతము పాటించుచుండిరి.ఆరోగ్యము చెడిన చివరి 8 కొద్ది నెలలు ఆహారమును విసర్జించిరి గాని స్నాన జప పత పాద్యనుష్ఠానముల నొక్కింతయు విరమింపరయిరి.25-1-1948న శ్రీ వీరభద్ర శర్మగారు 42వ ఏట నే సిద్ధిపొందారు .

336-శ్రీ దత్త పీఠ విద్యాధికారి- శ్రీ కుప్పా వేంకట కృష్ణమూర్తి (20వ శతాబ్దం )

భారతీయ వేదాలలో అన్నీవున్నాయి. అని అందరు అంటుంటారు. కాని వెలికి తీసి సామాన్య ప్రజలకు తెలియ జేయడాని కొందరు కృషి చేస్తుంటారు. వారిలో కుప్పా వేంకట కృష్ణమూర్తి గారు ఒకరు.; .

ఉద్యోగము
కుప్పా వేంకట కృష్ణ మూర్తి గారు గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు ఉద్యోగంలో చేరారు. ఇతని తండ్రి కుప్పా లక్ష్మణావధాని. తరువాతి కాలంలో ఆయన శ్రీజనార్దనానన్ద సరస్వతీ స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు. తండ్రి నుంచి వారసత్వంగా లభించిన వేద విద్వత్తు ఆయనను బ్యాంకు వుద్యోగంలో నిలవనీయ లేదు. ఆధునిక విద్య, ఉపాధి మార్గం నుంచి వేదాల వైపు నడిపించింది. ఫలితంగా ఆయన 37వ ఏటనే బ్యాంకు ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి వేద పరిరక్షణ, వేద విజ్ఞాన వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తున్నారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో పట్టు ఉండటం వల్ల వేద విజ్ఞానాన్ని సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో అందించే మహాత్తర కార్యక్రమం చేపట్టారు.

ఆధునిక – వేద విజ్ఞానాల సంగమం
అటు ఆధునిక విజ్ఞానం, ఇటు వేద విజ్ఞానాల మేలు కలయికగా ఉండే కృష్ణమూర్తి అవధూత దత్తపీఠంలో విద్యాధికారిగా, ట్రస్టీగా పనిచేశారు. 1986లో శ్రీదత్తదర్శనం చిత్రానికి సంభాషణలు కూడా రాశారు. ఆ తరువాత దశాబ్ద కాలం క్రితం వేదాలపై శాస్త్రీయ పరిశోధన సంస్థ (ఐసర్వ్) ను స్థాపించి వేదాల వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 36 జాతీయ సమ్మేళనాలు రచించారు. 30కి పైగా ఆధ్యాత్మిక, వైజ్ఞానికి గ్రం«థాలు ప్రచురించారు. 11 ఆధునిక వైజ్ఞానికి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని ఆయుర్వేదం, పాణినీయ వ్యాకరణం ద్వారా నూతన కంప్యూటర్ లాజిక్ ఆవిష్కరణ, నవీన వైజ్ఞానిక రీతులలో పురాతన సంఘటనల కాలనిర్ణయం, సనాతన భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్ర, వైదిక పద్ధతుల్లో భూకంపాది ఉత్పాతాల నిర్ణయం, అధర్వణ వేద పరిశీలన వంటి పరిశోధన ప్రాజెక్టులను అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు

30 గ్రంథాల రచన
ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషల్లో ఆయన ఇప్పటి వరకు 30 గ్రంథాలు రచించారు. యోగావశిష్ఠ హృదయం నాలుగు గ్రం«థాలు తెలుగు వచనం, ఆంగ్లంలో కూడా రచించారు. గురు తత్వ, గురు సచ్చిదానంద సద్గురు చరిత్ర, అధ్యాయ శ్లోకావళి, యోగ తారావళి, రుద్ర ప్రపంచ సత్వం ఆయన రచించిన

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.