కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం

కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం

మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు  హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల ‘’కవిత్వం ,వ్యక్తిత్వం ‘’పై ఒక సమగ్ర  బృహద్గ్రంథాన్ని ప్రచురించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .దాన్ని నాపై అభిమానంతో నాకు పంపగా 25-7-19 చేరింది .పాదుషా గారి గురించి అందులో ఎందరెందరో ఎన్నెన్నో విధాల చెప్పారు .అయితే నాకు బాగా ఇష్టుడైన రచయిత ఆచార్య ఎస్వి జోగారావు గారు పట్టిన ‘’నీరాజనం ‘’లో అన్ని విషయాల్లు ఉన్నందున ,’’ఏది తెలిస్తే సకలం తెలుస్తుంది ‘’అన్న ఉపనిషత్ వాక్యం పై నమ్మికగా ,దానిలోని ముఖ్యవిషయాలతో సాహితీ బంధువులకు, ఈ తరం పాఠకులకు శ్రీవారి శేముషిని తెలియ జేస్తున్నాను .

  ‘’పువ్వాడ వారి రచనలు ప్రాచీన ,అధునాతన రీతుల సమ్మేళనం .సంప్రదాయం ,నవ్యత్వాల సమన్వయము .సంస్కృతాంధ్ర పదాల పోహళింపు తో వారి పద్యాలు మధుర గంభీర ప్రసన్న ధారా విలసితాలు. కవితా శైలి లాలిత్య ,ప్రౌఢ గుణ శోభిత౦గా  ,వైదర్భీ రీతితో సహృదయ రంజకాలుగా ఉంటాయి .కవిత ,పాలవెల్లి ,శతపత్రం ఖండికలు ,గోవత్సం ,తాజమహలు ,దారా ఖండకావ్యాలు ఆకాశవాణి ద్వారా విస్తృత ప్రచారం పొందాయి .రాసిన 15 నాటికలలో 9మాత్రమె ముద్రితాలు .వ్యాస సంపుటులుగా ఏరువాక ,మధుకలశం ,ఆంద్ర తేజం మొదలైనవి ఆయన శేముషికి నిదర్శనాలు . ముఖ్యంగా చారిత్రిక వస్తువులను తీసుకొని కవిత రూపకం నవలలు గా రసరమ్య శైలిలో మలచారు .వీరికి అత్యంత అభిమాని సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణ దేవరాయలు .ఆయనపై ప్రచారం లో ఉన్న గాథలకు అక్షర రూపమిచ్చి ‘’ఔరా !,ఎవరు ? చారిత్రిక నవలలు అల్లారు .ఆంద్ర సామ్రాజ్యం రాయలనాటి చారిత్రిక విషయమైన పద్యకావ్యం .రాయలనేకాదు,మహామంత్రి తిమ్మరుసు వ్యక్తిత్వాలను ఉదాత్తంగా  వర్ణించి  శోభ కూర్చారు .పాలవెల్లిలోని ‘’ఆంద్ర భోజ ‘’,ఆంద్ర తేజం లోని ‘’రాయలు –తిమ్మరుసు ‘’కూడా విజయనగర సామ్రాజ్య గాథలే .ప్రతాప రుద్రమదేవి కాకతీయ వీరుల ,సహపంక్తి పల్నాటి వీరుల చారిత్రిక నాటికలే .కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత తెలంగాణాలో జరిగిన సంఘటనలకు స్పందించి ‘’రక్త తర్పణం ‘’బుర్రకథ’రాశారు .ఇందులో వారి పరిశోదనా దృష్టి గోచరమౌతుంది .పువ్వాడ వారి విమర్శ వివేకానికి అద్దంపట్టేవి తిక్కన ,శ్రీనాధ ,పోతనలపై వ్యాసాలు .

 ‘’  దేశ భక్తి పులకా౦కితులై జాతీయ నాయకులైన లాలాలజపతి రాయ్ మహాత్మా గాంధీ మున్నగు వారిపై ప్రశంసా కవితలు కూర్చి మూర్తీభవించిన తమ జాతీయాభిమానాన్ని చాటారు .’’గోవత్సం ‘’కరుణ రస స్వతంత్ర కావ్యం .భారతీయ ధార్మిక జీవనానికి ప్రతీక .ధర్మం నాలుగుపాదాలతో వర్ధిల్లాలి అన్నట్లుగా నాలుగు భాగాలుగా విజ్ఞతత తో రాశారు .విభాగ శీర్షికలలో  ప్రజ్ఞ కనబరచి, కృతులకు సౌస్టవాకృతి కూర్చారు .’’దారా ‘’కావ్యం అయిదుఖందాలు గా రాయటం లో నాయకుని పంచప్రాణాలు ప్రకృతిలో విలీనం కావటాన్ని సూచిస్తుంది .అలాగే ‘’ఆంద్ర సామ్రాజ్యం ‘’లో అయిదు సర్గలు –రాజాజ్న,అసిధార ,ధర్మ సూచీ ,ఉపదేశం ,అభిషేకం ఈ దృష్టి నే సూచిస్తాయి .కావ్యం అసంపూర్ణమే అయినా రాయల పట్టాభి షేకం తో ముగిసి సమగ్రరూపం పొందింది .లాక్షణికుల పంచ సందుల సూత్రాన్ని ఒడిసిపట్టుకొని రాశారు .చోడవరపు జానకి రామయ్యగారితో కలిసి అల్లిన ‘’కవిత ‘’సంపుటి లో శీర్షికలు తొలిచూపు ,మలిచూపు,తుది చూపు అర్ధవంతాలై ప్రత్యేకత కనపరుస్తాయి .

 ‘’ జాతీయాభిమానం పుష్కలంగా ఉన్న పువ్వాడవారు సంకుచిత మనస్కులు కారు .మొఘల్ సామ్రాజ్య షాజహాన్ ,దారా ల కరుణ గాథను కళ్ళకు కట్టించారు .వీరి తాజమహల్ ,దారా కావ్యాలను జంటకావ్యాలనవచ్చు ,జాషువాగారి ‘’ముంతాజమహల్’’తర్వాత అంతటి  ప్రాచుర్యం పొందింది పువ్వాడవారి ‘’తాజమహల్ ‘’.జాషువా గారి ‘’రాణి విడచిపోయె రాజు నొంటరి జేసి-రాజు విడిచిపోయె రాజ్యరమను –రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్ర-తాజీ విడువ లేదు రాజసంబు ‘’అనే చివరిపద్య భావానికి , పువ్వాడ వారి –‘’మొగలు ప్రభుత య౦తర్హితమగుట కేమి –చందురుని చల్వతో తాజి చలువ   నిలుచు –కాలవాహిని తాజి మ్రింగగలనాడు –నిలుచు నీ తాజిప్రణయ సందేశగీతి ‘’పొడిగింపుగా ఉందన్నారు ఆచార్య ఎస్వీ .జాతీయ సమైక్యతకు ప్రాతినిధ్య మైన పువ్వాడ వారి గోవత్సం,తాజమహల్ ,దారా లు కరుణ రస పోషణలో ఆయన వైదగ్ధ్యాన్ని ఎలుగెత్తి చాటాయి అని ఎస్టిమేట్ చేశారు .

‘’  బందరులో 40 ఏళ్ళు గడిపిన శేషగిరిరావుగారికి బందరు అంటే పంచప్రాణాలు ,వీరాభిమానం ‘’రస ప్రబుద్ధులకు స్వస్థాన వేషభాషలు సహజాలంకారం ‘’అన్నాడట ఆదికవి నన్నయ .అలాగే రావు గారు బందరుపై ‘’  బృందావనం’’శీర్షికతో కోపల్లె హనుమంతరావు ,పట్టాభి సీతారామయ్య ,ముట్నూరి కృష్ణారావు ప్రభ్రుతుల పై ప్రశంసా పద్య లహరి పారించారు .బందరును సాహితీ సుక్షేత్రంగా మలచిన కవితా గురుపీఠాలైనచెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి ,పింగళి లక్ష్మీకాంతం ల పైనా ఆరాధనాభావ పద్య సుమమాలలల్లారు .విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో తన నాటికా ప్రసారానికికి ప్రోత్సహించిన శ్రీ బందా కనకలింగేశ్వరరావు గారిని విశిష్టంగా స్మరిస్తూ ‘’సహపంక్తి ‘’రూపకాన్ని అంకితమిచ్చారు .

‘’సృష్టిలో కాని ,విమర్శలోకాని ఏదైనా  వైశిష్ట్యం లేకపోతె రచయితకు కలం పట్టవలసిన పని లేదు ‘’అని పువ్వాడ వారిసిద్ధాంతం.

‘’నీ జగన్నాధ పండితరాయలె షాజహాన్ ఆస్థానకవిమణి,నీ శిల్ప చాతుర్యమే ముంతాజ్ వెండి  కుంకుమ బరిణ,నీ అమరావతీ అఖిల విద్యలే ఖండఖండా౦తరాక్రాంత కళలు ,నీ త్యాగరాజ వాణి మరందమే దక్షిణ దేశ సంతర్పణ –

‘’భారతీయుల సంస్కృతి ప్రాభవమున –నాడు నేడును ,నీవాడు నాణె గాడు

నాడు మరువకు ,నేడు వెన్కాడ బోకు –  రమ్ము రమ్మాంధ్ర  కొమ్ము నీరాజనమ్ము ‘’అని తెలుగు దేశానికి నీరాజనం పలికి ,తెలుగువారిని ఎలుగెత్తి పిలిచారు కవిపాదుషా.’’

 ఇంతవరకు చెప్పినది అంతా శ్రీ ఎస్వి జోగారావుగారి గారు చెప్పిందే .నేను  పుస్తకం ,ఆయన సాహిత్య వ్యక్తిత్వాలన్నీ చదివి  రాయాల్సిన పెద్దపని ఆచార్యశ్రీ వ్యాసం తప్పించింది .వారికి నమోవాకాలు .

  ఇవికాక కొన్ని విషయాలు .కృష్ణాజిల్లా మొవ్వలో శేషగిరిరావుగారు 12-7-1906లో శ్రీమతి అన్నపూర్ణమ్మ ,శ్రీ సుందరరామయ్య దంపతులకు జన్మించారు .స్వయం కృషితో ఉభయభాషా ప్రవీణ ,పిఒఎల్ పట్టాలు పొందారు .విజయవాడలో 1928నుంచి 34వరకు ,6ఏళ్ళు ,బందరుహిందూ హైస్కూల్ లో 1934నుంచి -35వరకు తెలుగుపండితులుగా 1 ఏడాది ,ఉద్యోగించి ,బందరు హిందూ కళాశాలలో 1935నుంచి 47వరకు 12ఏళ్ళు ,విజయనగరం మహారాజా కాలేజిలో 1947నుంచి 51 వరకు 4ఏళ్ళు,మచిలీ పట్నం ఆంద్ర జాతీయ కళాశాలలో 1951నుంచి 70వరకు 19ఏళ్ళు  ఆంధ్రోపన్యాసకులుగా ,మొత్తం 42సంవత్సరాలసుదీర్ఘకాలం తెలుగు భాషా బోధనచేసిన ఘనచరిత్ర వారిది .సాహితీ క్షేత్రం లో తనకై ఒక విశిష్ట స్థానం సంపాదించుకొని 75 ఏళ్ళు సార్ధక జీవితం గడిపి 24-5-1981న ‘’దివిజ కవివరుల గుండియల్ దిగ్గురనగ దివిసీమలో జన్మించిన  ‘’కవిపాదుషా  పువ్వాడ శేషగిరిరావుగారు  దివిని చేరారు.

 ఆంద్ర ప్రదేశ్ మాజీ విద్యామంత్రి శ్రీ మండలి వెంకటకృష్ణారావు పువ్వాడవారికి బందరులో శిష్యులు. పువ్వాడ వారిలాంటి గురు ప్రముఖులను స్మరించటానికి 1973-74లోనే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురుపూజోత్సవంగా ప్రకటించారు మండలి .నాటిముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి సమక్షం లో తమ గురుదేవులైన పువ్వాడ వారిని అత్య౦త భక్తి శ్రద్ధలతో గౌరవంగా సత్కరించి గురూణ౦  తీర్చుకొన్నారు .

  భ.రా.గో పువ్వాడవారికి’’ విజీనగరం’’ లో శిష్యుడు.1950డిసెంబర్ లో హాఫ్ యియర్లి తెలుగుపేపర్లు దిద్ది ,కట్ట తీసుకొచ్చి క్లాస్ రూమ్ లో టేబుల్ మీదపెట్టి, పువ్వడమాస్టారు నిలబడే ఉన్నారు. ఆయన కూచు౦టేనే అందరూ సిట్ డౌన్.గురూజీ కూర్చోలేదు. శిష్యులూ అంతే.ఉన్నట్లుండి పువ్వాడవారు ‘’నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను ‘’అన్నారు  . అవాక్కయింది విద్యార్ధి బృందం  .వారిలో ముదురు వయసు వాసుదేవరావు ‘’బందర్లో బాగాలేదని ఇక్కడికొచ్చారు .మీ పిల్లలు చిన్నవాళ్ళు .మీరు రాజీనామా చేస్తే —?’’అని అర్దోక్తిగా అన్నాడు .అప్పటికీ మాస్టారి గుండె కరగలేదు .నిలబడే ఉండి,కట్టలోంచి ఒక ఆన్సర్ పేపర్ తీసి ‘’రామగోపాలానికి నూటికి 9మార్కులొచ్చాయి .ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేయన్రా “?అన్నారు .అందరూ భ.రా.గో.ను హీనంగా చూసి ఏవగించుకొన్నారు . గోపాలం రెక్కట్టుకొని వాసు స్టేజి పైకి తీసుకెళ్ళి మాస్టారిని కుర్చీలో కూర్చోపెట్టి ,పిల్లల్ని కూచోమని సంజ్ఞ చేయగా, వాళ్ళూ కూర్చున్నారు .తనకు తక్కువ మార్కులు రావటానికి సంజాయిషీ చెప్పాడు గోపాలం .డిసెంబర్ 15లోపు బి.ఏ .పరీక్ష ఫీజు 60 రూపాయలు ఫైన్ లేకుండా కట్టాలని యూని వర్సిటి హుకుం .ఎలాగో అలా తంటాలుపడి  రెండు  నెలల ముందునుంచి కస్టపడి 55 రూపాయలు కూడబెట్టాడు .ఇంకొక్క అయిదు రూపాయలు కావాలి .14సాయంత్రం ‘’గండ కత్తెర వ్యాపారస్తుడు’’గా పేరుపొందిన బత్తుల వజ్రం గారిని కలిసి గోడు చెప్పుకున్నాడు .తానూ 5 రూపాయలు ఇస్తానని , ఆ రోజు దీపాలు పెట్టేశారుకనుక మర్నాడు పొద్దున్న 9 గంటలకు వస్తే ఇస్తా అన్నాడు  షావుకారు .ఉదయం 8 కే తెలుగు క్వశ్సిన్ పేపర్ ఇస్తారుకనుక ,అరగంట దాటితే కాని ,బయటకు పంపరు కనుక  ఎనిమిదిన్నర వరకు రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాసి  ఆన్సర్ పేపర్ ఇచ్చేసి, షావుకారు దగ్గరకెళ్ళి వాగ్దానం చేసిన 5రూపాయలు తెచ్చుకున్నానని సవివరంగా చెప్పాడు కుర్ర భరాగో .ద్రవించిన పువ్వాడ తెలుగుమాస్టారు’’అలా చెప్పు .లేకపోతె నీకు 70 మార్కులు రావాలి .అవునూ ఆ ఐదు రూపాయలు నన్నెందుకు అడగలేదు “’అన్నారు అని భరాగో ‘’  మా తెలుగు మాస్టారు ‘’వ్యాసం లో రాశారు .ఇందులో తాను బోధించిన సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చినదుకు బాధ ,అవమానం ,బాధ్యతా ,అంకితభావంతో పాటు ,  ఆడబ్బు తానె ఇచ్చేవాడిని అనే కారుణ్యం  స్పష్టంగా కనిపిస్తాయి  .సమర్ధుడైన ,తర్వాతకాలం లో కరుణా విలసితుడైన ,హాస్య రచనలో సమర్ధుడైన మంచి శిష్యుడు భరాగో ను  తయారు చేసిన పువ్వాడ మాస్టారు  అభిన౦దనీయులు .

   చివరగా ఆచార్య ఎస్వి ఉటంకించిన మధురకవి మూలా పేరన్న శాస్త్రి గారి

‘’ధారా శుద్ధి ,రస ప్రవృద్ధి ,పదసంధాన క్రియా చాతురీ –పారీణత్వవిశుద్ధి ,భక్తిగుణ సంపన్మాధురీ వృద్ధి ,సం

స్కారోదార కవిత్వ సంభ్రుత కళాసంబద్ధ చిత్రోక్త్యలం—కారాత్యంత సమృద్ధి,తత్కవితలో గర్భించు సంశుద్ధిగా ‘’

పద్యంతో పువ్వాడ వారికి నీరాజనం పలుకుతున్నాను –

 తొలి శ్రావణ శుక్రవార శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.