నా దారి తీరు -131 ధ్వజస్తంభ ప్రతిష్ట

నా దారి తీరు -131

           ధ్వజస్తంభ ప్రతిష్ట

వసూలు చేసిన డబ్బు అంతా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం నిర్మాణం వసతులకల్పనకే ఖర్చై పోవటంతో ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టలేకపోయాం .కొంతకాలం ఊపిరి పీల్చుకొని ప్రయత్నిద్దాం అని నిర్ణయించాం. దేనికైనా మళ్ళీ మేము ముగ్గురమే .ధ్వజ స్తంభం కర్ర కొనాలి దానికి ఇత్తడి తొడుగు చేయి౦చాలి దానికీ జాలాది దాన్యాదివాసాలు ,ప్రతిష్ట ,హోమాలు అన్నీ ఆగమోక్తంగా జరగాలి . దైనందిన  దైవ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏటికేడాది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది .ధ్వజ ప్రతిష్ట ఎప్పుడుఅని అడుగుతూనే ఉన్నారు .సమయం రావాలి అని చెప్పేవాళ్ళం . ధనుర్మాస  ఉత్సవాలు కూడా చేబట్టాం .దీనితో భక్తులలో ఔత్సుక్యం మరింత పెరిగింది .ఆలయానికి ఏ రూపంగా నైనా సహాయం చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు .మార్గశిర శుద్ధ   త్రయోదశి నాడు శ్రీ హనుమద్ వ్రతాన్ని మూడు రోజుల కార్యక్రమ౦గా చేస్తున్నాము .

 ఈనోటా ,ఆనోటా చినవోగిరాల వాస్తవ్యులు వదాన్యులు సంపన్నులు శ్రీ పాలడుగు నాగేశ్వర దాసు గారు చాలా దేవాలయాలకు ధ్వజ స్తంభాన్ని కొని అందజేసినట్లు విన్నాం. వారే ఉయ్యూరు రోటరీ క్లబ్ వారు కాటూరు రోడ్డు లో నిర్మించిన రోటరీ కంటి ఆసుపత్రికి ,జనరల్ హాస్పిటల్ కు తమ పొలాలను ఉచితంగా అందజేసిన పూజ్యులు .ఆయన ఇంటి క్షురకుడు నాదస్వర బృందం నాయకుడు మాకు పరిచయమై మమ్మల్ని ఒక సారి దాసుగారిని కలవమని ఈలోపు ఆయన చెవిలో విషయం వేసి ఉంచుతానని చెప్పాడు .అలాగే ఒకరోజు మేము ముగ్గురం ఆయనవద్దకు చినవోగిరాల వెళ్లాం .ఆయన, భార్యగారూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఆలయ విశేషాలు అడిగి తెలుసుకొన్నారు .అప్పుడు మేము వారి దృష్టికి ధ్వజస్తంభం విషయం తీసుకోచ్చాము .రెండోమాట లేకుండా ‘’నేనే మీ గుడికి ధ్వజం కర్ర కొని ఇస్తాను .ప్రతిష్ట ఏర్పాట్లు మీరు చేసుకోండి ‘’అన్నారు .ధన్యవాదాలు చెప్పి తిరుగివచ్చాం .

   ఒక రోజు దాసుగారి నుంచి ఫోన్ వచ్చింది .మర్నాడే తెనాలి వెళ్లి ‘’అడితీ’’లో ధ్వజస్తంభం టేకు కర్ర కొని ఇప్పిస్తాను తనకారులో వెడదామని చెప్పారు .అలాగే వారికారులోనే మర్నాడు ఉదయమే  అందరం కలిసి తెనాలి వెళ్లాం .కాలువ వొడ్డున అన్నీ అడితీలే .ఆయన ఎప్పుడూ కొనే అడితీలో నాణ్యమైన టేకు దూలం ,మా ఆలయానికి కావలసిన ఎత్తు ఉన్న సాఫీగా ఉన్న కర్ర సెలెక్ట్ చేశాం .ఆయనే డబ్బు చెల్లించి రసీదు తీసుకొని ,అడితీ వారికే ఉయ్యూరు చేర్చే బాధ్యత అప్పగించారు .దాన్ని దీవాలయం దగ్గర బయట పడేస్తే చెదలు పట్టి ఒకవేళ ప్రతిష్ట ఆలస్యం అయితే వానకు తడిసి ఎండకు ఎండి దెబ్బ తింటుందని ముందుగానే భావించి పెద్ద వంతెన దగ్గరున్న రామకోటయ్యగారి అడితీ ప్రక్కనున్న మరో అడితీలో వారిని సంప్రదించి అక్కడ ఉంచుతామని చెప్పగా ఆయన గొప్పభక్తుడు , దాసుగారికి మంచి మిత్రుడు అవటం తో ఒప్పుకోగా అక్కడికే డైరేక్ట్ గా తోలించి చేర్చమని చెప్పగా అలాగే చేశారు .దాసుగారి దాతృత్వానికి జోహార్లు .

  ధ్వజస్తంభం కర్ర వచ్చింది .అది పాడుకాకుండా వరిగడ్డి వెంట్లు చుట్టించి భద్రం చేశాము .ఇక ఇత్తడి తొడుగు తయారు చేయించటం ,ప్రతిష్ట జరగాలి .మళ్ళీ మేమే పీటలమీద కూర్చోకుండా వేరెవరికైనా ఆసక్తి ఉన్నవారికి అప్పచెబుదాం అని నా ఆలోచన . మా నాయనమ్మ గారి తండ్రిగారుకూడా ఆలయ ప్రతిష్ట ఆయన చేసి ధ్వజప్రతిస్ట ,ఆయన చిన్నకుమార్తే కుమార్తె శ్రీమతి  సూరి సౌభాగ్యమ్మ దంపతులతో చేయించారని మా అమ్మగారు చెప్పేవారు .మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం . సహాయం కోసం కరపత్రాలు వేసి  పంపిణీ చేశాం .ఏమీ జరగకుండానే నాలుగేళ్ళు యిట్టె గడిచిపోయాయి .ఐదో ఏడు ప్రవేశించింది .ఏమైనా సరే ప్రతిష్ట జరపాలి అని పూర్తి నిర్ణయానికి వచ్చాం . శైవులైన వడ్లమాని సిద్దా౦తిగారు సంజీవరావు గారికి బంధువులు .బాగా పరిచయం ఉన్నవారు .ఆయనా విశ్వ ప్రయత్నం చేశారు. సిద్ధాంతిగారిని ఒకసారి ఆలయానికి పిలిచి మాట్లాడాం .త్వరలోనే ప్రతిష్ట జరుగుతుంది అని అభయం ఇచ్చారు .వారితోనే ముహూర్తం పెట్టిద్దామనుకొన్నాం .మరి ప్రతిష్ట చేసేదేవరో తెలియాలి .వారి పేరు నక్షత్రాలకు కుదరాలి .అప్పుడు అందరూ ‘’రత్తయ్య ‘’అని పిలిచే ,శ్రీ దొడ్డా వెంకటరత్నం మాతో తమదంపతులు కూర్చుని ప్రతిష్ట చేస్తామని ముందుకు వచ్చారు .హమ్మయ్య అనుకొని సిద్ధాంతి గారి చేత ముహూర్తం పెట్టి౦చాము  .ఒకసారి ధ్వజాన్ని పాతిపెడితే మళ్ళీ తీయటం కుదరదుకనుక కష్టమో నిస్టూరమో దానికి ఇత్తడి తొడుగు కూడా చేయించి ప్రతిష్ట చేయాలని నిర్ణయించాం .ఇందులో నాకుకాని వీరభద్రరావు కుకాని అనుభవం లేదు .సంజీవరావు గారికే బాధ్యతా అప్పగించాం .ఆయన అన్ని చోట్లా విచారించిగుంటూరుజిల్లా  ఫిరంగిపురం లేక పిడుగురాళ్ళ సాయిబులు బాగా చేస్తారని తెలుసుకొని ,మా ద్వారా ఆ మేస్త్రీకి డబ్బు అడ్వాన్స్ ఇప్పించారు .

   ఫిరంగిపురం బాచ్ వచ్చింది .వాళ్లకు విష్ణ్వాలయం లో ఉండటానికి వసతి ఏర్పాటు చేయించాం .రోజూ వాళ్లకు రెండుపూటలా కాఫీ టిఫిన్లు ,భోజనాలు అన్నీ ఏర్పాటు చేశాం .కావలసిన నాణ్యమైన ఇత్తడిని బెజవాడ వన్ టౌన్ ఇత్తడి కొట్లో కొని అందించాం .కొలిమి ఏర్పాటుకు, బొగ్గులకు  వెలిగారం వగైరా లకు సహకరించాం  ..ధ్వజస్తంభం కర్రను ఉయ్యూరు అడితీ నుంచి తీసుకువచ్చి గుడిదగ్గర పెట్టించాం. .చాలా కస్టపడి ఇత్తడి కుందులు ధ్వజస్తంభం సైజును బట్టి తయారు చేశారు.స్వామి విగ్రహానికి ఎదురుగా వచ్చేకుందిపై ఒంటె బొమ్మ నగిషీ ,ప్రక్కల స్వస్తిక్ మార్కు చెక్కిన్చాం .ఇదంతా సంజీవరాయ మహిమే .మాకేమీ ఇందులో ఓనమాలు తెలియవు . జరుగుతున్న పనిని చూసి అందరూ  సంతోషించారు .ధ్వజం ప్రతిస్టించ టానికి లోతుగా గొయ్యి తీయి౦చా౦.ధ్వజాన్ని అందులో కూర్చోపెట్ట టానికి   క్రేన్ కావాలని ,పంపమని  కెసీపి కి వెళ్లి ప్లాంట్ మేనేజర్ బసవయ్యగారికి కోరాం  .ఆయన సరే అని ముహూర్తం సమయానికి ఒకగంట ముందు క్రేన్ ,ఆపరేటర్ వస్తారని చెప్పారు.

 స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్సర జ్యేష్ట బహుళ నవమి 13-6-1993  ఆదివారం ఉదయం 7-29గం.లకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున లగ్న పుష్కరాంశ యందు ఇత్తడి తొడుగుతో సహా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా  అశేష జన సందోహం జయజయ ద్వానాలమధ్య కన్నులపండుగాలాగా జరిగింది . స్వర్గీయ  శ్రీ దొడ్డా వెంకటరత్నం దంపతులు ,శ్రీ పరాశరం రామకృష్ణమాచార్యులవారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట చేశారు . స్వర్గీయ మండా వీరభద్రరావు ,స్వర్గీయ లంకా సంజీవరావు గారల అవిశ్రాంత కృషి ,అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలంగా నిలిచాయి .స్వామివారి కరుణాకటాక్షం చెప్పనలవికానిది . ఈ పవిత్ర కార్యానికీ చందాలు వరదలా పారాయి .అంతా సద్వినియోగపరచాము .ఇత్తడి తొడుగు చేసినవారికి నూతన వస్త్రాలు ,మిగిలిన డబ్బు ఇచ్చి సంతృప్తి పరచాం .ఈ సారి నేనే ఎప్పటికప్పుడు జమాఖర్చులు రాసి ,వారిద్దరికీ  చూపించి లిస్టు తయారు చేసి ముగ్గురం సంతకాలు పెట్టి జమాఖర్చులు తెలియ జేసే తేదీ ప్రతిష్ట జరిగిన మూడు రోజులకే ప్రకటించి వచ్చినవారికి చదివి వినిపించి బోర్డ్ మీద అంటించి బాధ్యత తీర్చుకొన్నాం . ఒకమహత్తర యజ్నంలాగా విగ్రహ ప్రతిష్ట ,ధ్వజ  ప్రతిష్ట జరిగి మాకు  అత్యంత  ఆనందాన్ని కలిగించాయి .జీవితం లో ఈ రెండూ మరచిపోలేని మరువరాని పవిత్ర ఘట్టాలై మమ్మల్ని మా కుటుంబాన్నీ  తరి౦పజేశాయి .

  ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణం

అప్పటినుంచి వందలాది భక్తులు నిత్యం శ్రీ సువర్చలాన్జనేయ స్వామిని దర్శించి సేవించి తరిస్తున్నారు .ప్రతి మంగళ, శనివారాలలో నాగవల్లి అంటే తమలపాకు పూజ ,విశేషంగా జరుగుతుంది .ధనుర్మాసం లో వేలాదిభక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి ,తమ మనో భీస్టాన్ని స్వామిని నివేదించి ,అభీష్ట సిద్ధి పొందుతున్నారు .ప్రాతః కాలపూజ ,గోదాదేవి తిరుప్పావై , కుల శేఖర ఆళ్వార్ ముకుందమాల ,సుందరకాండ స్తోత్ర పారాయణలతో ఆలయం మరింత పవిత్రత చేకూర్చు కొంటున్నది .స్వామి భక్తులపాలిటి కొంగుబంగారం .

  భోగినాడు శాకంబరిపూజ ,శ్రీ సువర్చలాన్జనేయ శ్రీ గోదా రంగనాధ స్వాముల శాంతి కల్యాణం నిర్వహించి ఒంటె వాహనం పై గ్రామోత్సవం చేస్తాం .ప్రతి ఏడాది జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరం నాడు ఉదయాన్నే స్వాములకు లడ్డూలతో ప్రత్యెక పూజ చేసి ప్రసాదంగా అందజేస్తాము .జనవరి 10న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి జన్మ దినోత్సవ సందర్భంగా అరిసెలతో ప్రత్యెక పూజ చేసి ప్రసాదంగా పెడతాము .స్వామికి గారెలదండ అంటే వడమాల మామూలే .భక్తులు ఎప్పుడూ చేయించి వేయిస్తూనే ఉంటారు .ప్రతిమంగళవారం స్వామికి అత్య౦త ప్రీతికరమైన అప్పాలు చేయించి నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదంగా ఇస్తాం .తులసిమాలలు నిమ్మకాయమాలలు ,జిల్లేడు వ్రేళ్ళతో జిల్లెడుపూలతో ,పుష్పహారాలతో స్వామి దివ్య సు౦దర౦ గా , దేదీప్యమానంగా శోభిస్తాడు ,భాసిస్తాడు .భజనలు, కోలాటాలు హనుమాన్ చాలీసా,లలితా, విష్ణు సహస్ర  పారాయణాలు సామూహిక కుంకుమ, గంధ సిందూరం పూజలు మా ఆలయం ప్రత్యేకత .

   స్వామి నక్షత్రం పూర్వా భాద్రనాడు మన్యు సూక్తం తో ప్రత్యేక అభిషేకం జరుపుతాం .వైశాఖ బహుళ దశమి  శ్రీ హనుమ పుట్టినరోజు నాడు శ్రీ హనుమజ్జయంతి ని మూడురోజుల కార్యక్రమంగా త్రయాహ్నికంగా నిర్వహిస్తాము .మొదటి రోజు స్వామివారికి   అష్ట కలశ  స్నపన ,  మన్యు సూక్తం తో అభిషేకం నూతన వస్త్ర ధారణా అన౦తరం గంధ సిందూరం మల్లెపూలతో ,  ,రెండవరోజు రసం మామిడి పండ్లతో ,మూడవరోజు శ్రీ హనుమత్ జయంతినాడు తమలపాకులతో విశేష పూజ జరుపుతాము .తరువాత  స్వామివార్ల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాం .సాయంకాలం చాలీసా పారాయణ ,స్వామికి వడమాల ఉంటాయి .

ప్రతి శ్రీరామనవమికి శ్రీ సీతారామ కల్యాణం ,శ్రీ  కృష్ణాష్టమి కి బాలబాలికల వేషధారణ వేడుకలు  ,శంకరజయంతి  త్యాగరాజారాధనోత్సవ౦  జరుపుతాం ,కార్తీకమాసం ప్రతిమంగళవారం దీపాలంకరణ  ,పౌర్ణమినాడు లక్ష దీపాలంకారం ఉంటాయి .మాఘమాసం లోఒక ఆదివారం నాడు  ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తాం .దసరా నవరాత్రులలో అమ్మవారిని ఏర్పాటు చేసి రోజుకొక  అలంకరణ చేసి సాయం వేళ సహస్రనామ అష్టోత్తరపూజ అమ్మవారికీ సువర్చలాన్జనేయస్వాములకు చేస్తాం.విజయదశమినాటి రాత్రి శమీ పూజ ఉంటుంది . ముక్కోటి   ఏకాదశినాడు తెల్లవారుఝామున  స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకంగాజరుగుతుంది .వందలాది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసి పులకించి పోతారు .  మార్గ శిరశుద్ధ  త్రయోదశినాడు శ్రీ హనుమద్ వ్రతం అత్యంత వైభవంగా మూడురోజులు నిర్వహిస్తాం . ఇలా ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా అభివృద్ధి చెందుతోంది . ధనుర్మాసంలో అపర వైకుంఠంలాగా ,నవరాత్రులలలో సకల శక్తి  వంతుడు అభయప్రదాత స్వామి శ్రీ లలితా పరమేశ్వరి కొలువైఉన్న అపర శక్తి క్షేత్రంగా ,కార్తీకమాసం అపర కైలాసంగా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం శోభిల్లుతుంది. స్వామి శివ విష్ణు శక్తి అంశ సంభూతుడుగా దర్శనమిస్తాడు ,ఉగాది ఉదయం పంచాంగ శ్రవణం ప్రత్యేకత .సంక్రాంతి ఉదయం సంక్రాంతి పురుష స్వరూపస్వభావాల వివరణ జరుగుతాయి .

   పత్యేక కార్యక్రమ నిర్వహణ

ఆలయ నిర్మాణం జరిగి 20ఏళ్ళు దాటిన సందర్భంగా 11రోజల ప్రత్యేకకార్యక్రమం జరిపిచాం .ప్రతి రోజు ఉదయం మన్యుసూక్తంతో స్వామివారలకు అభిషేకం   హోమ౦ , సహస్రనామార్చన ,సాయంత్రం మళ్ళీ హామ౦ ,స్వామి వారలకు శాంతి కల్యాణం జరిపాం .భక్తుల స్పందన అపూర్వం .గీతామందిరం అర్చకస్వాములు శ్రీ స్వర్ణ నాగేశ్వరరావు గారిఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏలూరుకు చెందిన వేదపండితులు అత్యంత శ్రద్ధాసక్తులతో పరమ నైస్టికంగా మహా వైభవంగా  మా దంపతులతో నిర్వహింప జేశారు .మా  దంపతులతోపాటు  సాయంత్రం శాంతికల్యాణానికి 11రోజులు ఒకరిద్దరు దంపతులు పాల్గొని మహద్భాగ్యం పొందారు

  2015లో 5 రోజులపాటు శ్రీ హనుమజ్జయన్తిని ఉదయ౦ హోమం,పుష్పయాగం ,మామిడి పళ్ళపూజ  ,సాయంత్రం కల్యాణం తో నిర్వహించాం .జయంతి రోజున నేను రాసిన సరసభారతిప్రచురించిన  201దర్శనీయ ఆంజనేయ దేవాలయ పుస్తకం ఆవిష్కరింప జేశాం .2016లో శ్రీ హనుమజ్జయంతిని ,నిత్య సాయం కల్యాణం తో 3 రోజులు జరిపాం .సరసభారతి కార్యక్రమాలు ఎక్కువభాగం ఆలయం లోనే జరుపుతాం  .ఆలయం లో ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తులు  ఆసక్తిగా ముందుకు వచ్చి అన్నివిధాలా సహకరి౦చి జయప్రదం చేస్తున్నారు .అర్చకస్వామి ఛి వేదాంతం మురళీ కృష్ణ నా శిష్యుడు .బాధ్యతగా అన్నీ నిర్వహిస్తూ భక్తులకు సంతృప్తి కలిగిస్తున్నాడు .2017ధనుర్మాసం లో ప్రభాత సీవ లో వెన్నపూస తో మూల విరాట్ కు అభిషేకం జరిపించి తర్వాత ప్రసాదంగా పంచి పెట్టి ,ప్రతియేడూ అలానే చేస్తున్నాం .

  శ్రీ సువర్చలాంజ నేయ స్వామిపై శతకం రాయి౦చాలన్న కోరిక నాకు ఉండేది .స్వామి అనుగ్రహం తో శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యులు చేత ‘’శ్రీ సువర్చలా సుందర వాయు నందన శతకం ‘’,మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారిచే ‘’శ్రీ సువర్చలా వల్లభ శతకం ‘’శ్రీ మంకు శ్రీనుగారిచే ‘’శ్రీ సువర్చలేశ్వర శతకం ‘’రాయించి, సరసభారతి తరఫున ముద్రించి  2017 ఫిబ్రవరి 5వ తేదీ మాఘశుద్ధ నవమి  ఆదివారం   ఉదయం ఆలయం లో సామూహిక పాలు పొంగింపుకార్యక్రమం చేసి , 9 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపి ఉదయం 11-30గంటలకు పై శతక త్రయాన్ని స్వామి సమక్షం లో శాసనమండలి సభ్యుడు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరిమ్పజేసి,కవులకు తలొక 10వేలరూపాయలు ,పట్టుబట్టలు శాలువాలతో   సత్కరించి    కృతజ్ఞత తెలుపుకున్నాం  .మొదటిశతకం  లో  నూటపదహారు రూపాయలు ఆపైన ఇచ్చిన దాతల పేర్లు గోత్రనామాలతో ప్రచురించాం. రెండవ శతకం శ్రీ గోవిందరాజు శ్రీనివాస్ శ్రీ వేణుమాధవ్ సోదరులు తమ తండ్రిగారు స్వర్గీయ  గోవిందరాజు  పరబ్రహ్మానంద శర్మ గారి జ్ఞాపకార్ధం స్పాన్సర్లు గా ఉండటానికి ముందుకు వచ్చారు .మూడవదానిని మా దేవాలయమే ముద్రించింది .శతక త్రయాన్ని శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారలకే అ౦కితమిచ్చాం .అందరికి కమ్మని విందు భోజనం ఏర్పాటు చేసి సంతృప్తి చెందాం .భక్తుల తోడ్పాటు తో ఇన్ని కార్యక్రమాలు  ఆలయం లో నిర్వహిస్తున్నాము .వీటన్నిటికి శ్రీ సువర్చలాన్జనేయస్వాముల సంపూర్ణ కరుణా కటాక్షాలే మాకు రక్ష .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.