కోవిదుల నిలయం కోరాడ వంశం
జగమెరిగిన భాషా శాస్త్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు ,తెలుగుభాషను తమిళకన్నడాది దక్షిణభాషలతో తులనాత్మకం గా పరిశీలించిన మార్గదర్శి శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .వీరి తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు ‘’ఉపమావళీ’’లఘు సంస్కృతకావ్యం ,’’ఉన్మత్త రాఘవం ‘’సంస్కృత నాటకం రచించిన కవి శ్రేస్టులు..శాస్త్రి గారు తమ కోరాడ వంశాన్ని గురించి ‘’కేశవనిధ్యాన విశుద్ధాంతరతా ప్రవృత్తి తో విశదః –కోరాడ ఇతి చ సంతతి రభవత్తస్యా మాభూ న్మహాదేవః ‘’అని చెప్పుకొన్నారు .అంటే కోరాడ వంశం కేశవధ్యాన విశుద్ధమైన మనః ప్రవృత్తికలది .ఆ వంశంలో మహాదేవ శాస్త్రి జన్మించారు అని భావం .మహాదేవ శాస్త్రిగారు శ్రీ విద్యోపాసకులు ,,శ్రీదేవతా పాదపద్మ భ్రమరాయ మాణుడు,తనవంశం లో పుట్టేవారెవరూ విద్యా విహీనులు కారాదని ,విద్యాజ్ఞానవంతులు కావాలని భావించి శ్రీశైలం లో భ్రమరాంబికా దేవి సన్నిధిలో ఎండు మారేడు దళాలను మాత్రమె భుజిస్తూ 27రోజులు అద్భుత తపస్సు చేశారనీ ,అమ్మవారు ప్రత్యక్షమై ‘’ఏమి నీ కోరిక “”?అని అడిగితె ‘’విద్యాం విధేహి దయయా మృత సారవత్యాం-హ్యాసప్తమా న్మమకులోద్భవ పూరుషాణా౦’’అని అర్ధించారు .’’భాగీరధుని వెన్నంటి వచ్చిన గంగానదీ సహచరియిన,అమృత సారవతి ఐన విద్యను తమవంశం లో ఏడుతరాలవరకు అనుగ్రహించు అని భావం .అమ్మవారు అలానే అనుగ్రహించింది కనుక కోరాడవారి వశం అంతా పండిత శిఖామణులతో కోవిదులతో విరాజిల్లింది .
మహాదేవ శాస్త్రిగారి తర్వాత ‘’అపరిగ్రహ దీక్షితుడు అల్లాడ’శాస్త్రి ’సకల శాస్త్ర పారంగతులైనా ,ఎవరినీ చేయి చాచి యాచి౦చ కుండా పేదరికం లోనే జీవించాడు .ఆయనకు 60ఏళ్ళు వచ్చి షష్టిపూర్తి చేసుకోవాలనే కోరికకలిగితే, గ్రామస్తులు గ్రహించి ఆయనతో ‘’శతఘంటా శతావధానం ‘’చేయించి ‘’శతఘంటా చూడామణి ‘’బిరుదునిచ్చి ,పుట్టెడు ధాన్యం పండే భూమిని ఆయన ఎంతవద్దని చెప్పినా వినిపించుకోక ఇచ్చి తమవదాన్యత చాటారు గ్రామ ప్రజలు .అల్లాడ శాస్త్రిగారి కుమారుడు జగన్నాథ శాస్త్రి ‘’నిజాన్తర్వాణిత్వ ప్రథిమ విధూతా శేష విభవా విరాజంతే కీర్తి స్థగిత సకలాశాంత వివరాః’’అంటే దిగంతపరివ్యాప్త కీర్తి శేముషులుకలవాడుగా ప్రసిద్ధి చెందాడు .ఈయన పెద్దకొడుకు సూరి శాస్త్రి కాశీకి వెళ్లి ‘’గౌతమ తర్కం ‘’లో అఖండ పాండిత్యం సంపాదించాడు .పిల్లలు లేరు .చిన్నకొడుకు అ౦బాశాస్త్రికి సూరి శాస్త్రి, లక్ష్మణశాస్త్రి సంతానం .సూరి శాస్త్రి వేదాధ్యయనం చేద్దామనుకోన్నాడుకాని తండ్రి గతించటం తో చేయలేక ,కరువుకాటకాలతో అల్లాడి తిండీతిప్పలు లేకపోవటంతో తల్లి గతిలేనివారికి రాజే దిక్కు అనుకోని కొడుకు లిద్దర్నీ తీసుకొని కాటిరేవు కోనరాజు వద్దకు బయల్దేరగా దారిలో దొంగలు తల్లినీ, సూరి శాస్త్రినీ చంపగా, లక్ష్మణశాస్త్రి ఎలాగో తప్పించుకొని రాజును చేరి ,కొలువులో ఉద్యోగం పొందాడు .రాజు నాలుగు వేలరూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు .కాని రాజుకూ సోదరులకు వచ్చిన తగాదాలలో ఇవ్వలేకపోతే ,శాస్త్రి అక్కడ ఉండటానికి మనసొప్పక ఆడబ్బును అడగకుండానే , దేశాటనం చేస్తూ ఒక యోగి వద్ద రామ తారకమంత్రం ఉపదేశం పొంది ,జపించి పెళ్లి చేసుకొని అత్తారింట్లో ఉండిపోయాడు .ఈయన పెద్దకొడుకు రామచంద్ర శాస్త్రి ,రెండవవాడు రామకృష్ణ శాస్త్రి ,మూడవవాడు సుబ్బరాయుడు .
రామకృష్ణ శాస్త్రికి చదువు అబ్బకపోతే అన్న రామ చంద్ర శాస్త్రి చెంపలు వాయించేవాడు .రోషం వచ్చి ఇల్లువదిలి దేశాలు తిరిగి కాశీ వెళ్లి శాస్త్రాధ్యయనం చేసి ఒక్క ఏడాదిలోనే వ్యాకరణశాస్త్ర ప్రవీణుడయ్యాడు.మరో ఏడాదిలో న్యాయం మొదలైన శాస్త్రాలు నేర్చి కాశీ రాజుకొలువులో పండితులతో శాస్త్ర చర్చలు చేసి, గెలిచి ,ఎప్పటికప్పుడు ఉత్తరాలద్వారా ఇంటికి విశేషాలు తెలియ జేసేవాడు .తమ్ముడు ప్రయోజకుడైనందుకు శాస్త్రి సంతోషించి పెళ్లి ప్రయత్నాలు చేశారు .మరికొంతకాలానికి ఇండోర్ మాహారాజు ఆహ్వానించి , ఆస్థాన పండితుని చేశాడని ,ఆతర్వాత హఠాత్తుగా మరణించాడని తెలిసింది .తమ్ముడి చావు శాస్త్రిని పిచ్చివాడిని చేయగా దుఖావేశంలో వీధుల్లో దుమ్మూ ధూళిలో లో పొర్లుతూ ,మైమరచి తిరిగే వాడట ‘
కోరాడ రామ చంద్రశాస్త్రి
కోరాడ వంశ ఉజ్వలమణిపూస రామ చంద్ర శాస్త్రి 1816లో ఆశ్వయుజ శుద్ధ దశమి గోదావరిజిల్లా అమలాపురం తాలూకా కేశనకుర్రు గ్రామం లో జన్మించారు .12వ ఏట తండ్రివద్ద శ్రీరామమంత్రం ఉపదేశం పొంది ,జపించి మాతామహుని వద్ద రఘువంశం చదివి ,తర్వాత తండ్రిగారి స్వగ్రామమం నడవపల్లి చేరి సోమయాజుల సూరన్నగారి వద్ద కావ్య వ్యాకరణాలు అభ్యసిస్తూ శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద అలంకార శాస్త్రం చదువుతూ కవిత్వం చెప్పటం నేర్చారు .సూరన్న శాస్త్రిగారితో పొలం వెళ్లి కావ్య పాఠం నేర్చుకొంటూనే ,తిరిగి వచ్చేటప్పుడు కొన్ని శ్లోకాలురాసి సూరన్నగారికి చూపించగా కవిత్వం గంగా సదృశ ప్రవాహంగా ఉందని అందులో దోషాలు వెతకటం తనకు కానిపని చెప్పి ఆయనే ఈయన శిష్యుడైపోయాడు .సూరన్న శాస్త్రిగారి గురించి ‘’శ్రీ శిష్టు వంశాబ్ధి శశికరుడు ,సకలవిద్యా అనమ సద్మాయ మాన జిహ్వా౦చలుడు ,అమిత కావ్యాళికర్త శ్రీ కృష్ణమూర్తి పదాబ్జ సేవనాత్త సద్గ్రంథ కల్పనాయత్త సుమతి విరచిత శ్రవ్త్య దృశ్యాత్మ వివిధ కావ్యుడు ‘’అని తనను గురించికూడా చెప్పుకొన్నారు రాచంద్ర శాస్త్రి .
‘’ నీ తండ్రి బీదవాడు .నీకు పెళ్లి చేయలేడు.నువ్వు సాహిత్య ,కవిత్వ నిదివి వాగ్మివి,చెన్నపట్నం వెడితే ,ఆంగ్లేయులు నీ విద్వత్తుకు డబ్బు ఇస్తారు .దానితో అనుకూలవతిని పెళ్లి చేసుకో ‘’అని స్నేహితులు సలహా ఇస్తే , సరేనని బయల్దేరగా సూరన్న శాస్త్రిగారికి తెలిసి రామచంద్రాపురం రాజుకు సిఫార్సు చీటీరాసి ఒక బంట్రోతు ద్వారా రామ చంద్ర శాస్త్రిగారికి పంపారు .దాన్నితీసుకొని రాజు దగ్గరకు వెడితే అక్కడ క్షామం ఉండటంవల్ల రాజు ఆస్థానం లో రెండు నెలలు ఉండమని కోరితే ,మనసొప్పక చెన్నపట్నం లో మునసబు గిరీ ఇస్తారనే ఆశతో మళ్ళీ మద్రాస్ బయల్దేరి దారిలో మచిలీపట్నం వచ్చి ,తెచ్చుకున్నడబ్బంతా ఖర్చుకాగా తిండికూడా లేక ,ఎవరినీ యాచించలేక సాయంకాలం గొడుగుపేట మల్లేశ్వరస్వామి దేవాలయం చేరి శివునిపై శ్లోకాలు అనర్గళంగా ఉచ్చైస్వరంతో చదువుతుంటే , ప్రభల అప్పన్న శాస్త్రి అనే ఆయన వచ్చి ‘’మీరెవ్వరు “’?అని అడిగితె ‘’నేనెవరైతే మీకేం “’అని ఎదురు ప్రశ్న వేయగా ,ఆయన బుజ్జగించి విషయం తెలుసుకొని ‘’ఒక్కపూట భోజనానికే ఇతరులను అడగలేని నువ్వు ,మద్రాస్ వెళ్లి మున్సఫీ సంపాదిస్తావా “’అని ఛలోక్తి విసిరి ,ఇంటికి తీసుకువెళ్ళి పుత్రవాత్సల్యం తో ఆదరించాడు అప్పన్న శాస్త్రి
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-19-ఉయ్యూరు
— కోరాడ రామకృష్ణయ్యగారు
కోరాడ రామ చంద్ర శాస్త్రిగారు

