ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం

                       గబ్బిట దుర్గాప్రసాద్ – ఉయ్యూరు –

                  1-అజ్ఞానం నశిస్తే అంతా అమృత మయమే

మనలో ఉన్న చెడు భావాలు ,హింసా ప్రవృత్తి మొదలైనవి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి .వాటిని తొలగించుకొంటే ,చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గ దర్శనం చేస్తాయి . అందరూ కలిసి ఆలోచిస్తే ,కలిసి పని చేస్తే అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమౌతుంది .కలసి ఉంటె కలదు సుఖం అన్నారు .మనం ఉన్న సమాజానికి మేలు చేసే ఆలోచన ఎప్పుడూ ఉండాలి .మనసు మాలిన్య రహితంగా ఉంచుకొంటేనే ,ఇహపరాలకు మార్గం సుగమం అవుతుంది .నిర్మలమైన మనసులో  నిశ్చయ జ్ఞానం కలిగి, దివ్యజ్యోతి వెలుగుతుంది .మానవ జీవిత గమ్యం  ఆ దివ్య జ్యోతి సందర్శనమే .చిత్త శుద్ధి లేకపోతే, శివుని అనుగ్రహం కలుగదు .అజ్ఞానపు పొరలు తొలగితే జ్ఞాన ప్రకాశం కలిగి దివ్యానుభూతి లభిస్తుంది .ఇదే చిరంతనమైనది ,శాశ్వతమైనది .దీనికి మించింది లేదు .ఈ విషయాన్ని గుర్తింఛి  మనం రుజుమార్గం లో ప్రయాణించి మానవ జన్మ సార్ధకతను రుజువు చేసుకోవాలి .కఠిన మనస్కులతోనూ కలివిడిగా ఉంటే, మనలోని మృదుత్వానికి  పరిపూర్ణత సిద్ధిస్తుంది .మంటలమాటున మంచు ఉంటుందని ,కఠిన శిలల్లోనూ నీరు ఉంటుందని తెలుసుకోవటమే వివేకం .వివేకం వికశిస్తే మానవత కు సార్ధక్యం .దీన్ని తెలియ జెప్పే చిన్న కథ తెలుసుకొందాం .

 ఒక ఊళ్ళో ఊరికి అంతటికీ పనికొచ్చే ఒకే ఒక మంచి నీటి బావి ఉంది .దాని నీరు అమృత తుల్యం .అందుకని గ్రామప్రజలు ఇక్కడికే వచ్చి నీళ్ళు తోడుకొని ఇళ్ళకు తీసుకు వెడతారు .అందరూ దాని లోని నీటిని వాడుకోవటమే కాని ,దాని చుట్టూ గోడకాని, గిలక కాని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోలేదు .  ముసలి, ముతక ,పిల్లా జెల్లా అందరూ  ఆ బావి ఒడ్డున ఒంగి బిందెలతో, కడవలతో  నీళ్ళు  చేదుకోనేవారు .

  ఒక రోజు అర్ధ రాత్రి ఒక కుక్క అక్కడ  తిరుగుతూ నేలబారుగా ఉన్న ఆ బావి లో పడి,,బయటకు వచ్చే ప్రయత్నాలన్నీ చేసి ,విఫలమై ఆ నీటిలో మునిగి చనిపోయింది  .ఈ విషయం గ్రామం లోని వారికి తెలియదు .మర్నాడు ఉదయం గ్రామస్తులు యదా ప్రకారం నీటికోసం బావి దగ్గరకు వచ్చారు  .నీళ్ళు తోడుతుంటే విపరీతమైన దుర్వాసన వచ్చింది .ఆ నీటిని తాగితే జబ్బులు వచ్చి ప్రాణహాని జరుగుతుందని ఆలోచించి ,ఇంటికి ఒకరు వంతున, బావి నీరు తోడే కార్యక్రమం మొదలు పెట్టారు .ఎన్ని నీళ్ళు తోడినా, దుర్వాసన పెరిగిందే కాని తగ్గలేదు .

  బావిలో చచ్చిన కుక్క ఉన్నదన్న సంగతి తెలియదుకనుక ,నిరంతరం నీరు తోడుతూనే ఉన్నారు .కిం కర్తవ్యమ్ అని ఆలోచించారు .బావిలోపల ఏదో జంతువు చచ్చి పడి ఉంటుందని గ్రహించి ,నూతి పూడిక తీసేవాడిని పిలిపించి బావిలోకి దింపారు .వాడు బాగామునిగి తేలుతూ ,కుక్క శరీరాన్ని గుర్తించి ,అందరి సాయంతో బయట  లాగి పడేశాడు .అందరూ కలిసి బావికి చాలాదూరం లో దాన్ని పాతిపెట్టారు .మళ్ళీ నీళ్ళు తోడి పారబొయ్యటం  ప్రారంభించారు .కొంత సేపటికి అతి స్వచ్చమైన, దుర్వాసన లేని మంచి నీరు వచ్చింది. హమ్మయ్య అనుకొన్నారు .తమ తప్పు తెలుసుకొని బావి చుట్టూ ,పిట్టగోడ కట్టి, గిలకలు ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యత కూడా చేబట్టారు .

  బావిలో చచ్చిన కుక్క కళేబరం ఉన్న౦తదాకా, నీరు ఎంతతోడినా వాసన పోనట్లే ,మనలోని అజ్ఞానం అనే వాసన పోయే వరకు మనసు నిర్మలం కాదు ,జ్ఞాన జ్యోతి వెలగదు అని మనం గ్రహించాలి .  తన గురించి తనకే తెలియకపోవటం అజ్ఞానం .అది తెలుసుకొంటే జ్ఞానం .జ్ఞానాన్ని అన్వయి౦చు కోవటం విజ్ఞానం .అనుభవానికి కారణమైన దాన్ని తెలుసుకోవటం సుజ్ఞానం .

జ్ఞానులు  నిరంతరం నిర్మలమైన మనసుతో ఉంటూ, ఆనందాన్ని ఆనందలహరిని అనుభవిస్తారు .  .అందరూ కలిస్తే ఎంతపనైనా సులువుగా చేయవచ్చు .పుట్టలోని చీమలన్నీ కలిసి పుట్టలో ప్రవేశించే పామును చంపుతాయి .గడ్డిపరకలు విడిగా ఉంటే ,ఏమీ చేయలేవు .వాటిని వెంటిగా పేనితే , దానితో మదించిన ఏనుగును కూడా బంధించవచ్చు .ఐకమత్యమే అనంత బలం సంఘానికీ దేశానికీ కూడా .

  .                2-ఉదార గుణమే ఉన్నతాశయం

‘.శ్రేయో భూయాత్ సకల జనానాం

అయం నిజః, పరో వేది ,గణనా లఘు చేతసాం

ఉదార చరితానాం తు పురుషాణా౦

వసుధైక కుటుంబకం ‘’అని సూక్తి ఉంది .

వీళ్ళు నావాళ్ళు , వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావాన్ని సంకుచిత మనస్కులు కలిగి ఉంటారు .ఉదార స్వభావులకు ఈ జగమంతా ఒకే కుటుంబంగా గోచరిస్తుంది అని తాత్పర్యం .కర్తవ్య దృష్టి ఉంటేనే ఇహపర సాధనం .

బాగా డబ్బున్న లోభికంటే ,ఉదార గుణం ఉన్న పేదవాడు గొప్ప అన్నాడు 17-18 శతాబ్దాలకు చెందిన  గువ్వల చెన్న శతకకర్త –

‘’కలిమి గల లోభికన్నను –విలసితముగ పేద మేలు వితరిణి యైనన్

చలి చెలమ  మేలు గాదా  –కుల నిధి యంబోధి కన్న ,గువ్వల చెన్నా ‘’

  సముద్రం లో ఎంతనీరున్నా ,దాహమైతే గుక్కెడు నీళ్ళు కూడా తాగటానికి  పనికి  రాదు. .అందులో నిధి నిక్షేపాలు ఎన్నో ఉన్నా, తాగటానికి పనికి రాని ఉప్పునీరే ఉంటుంది .చలి చలమలో నీళ్ళు తక్కువగా ఉన్నా ,ఆ నీటిని తాగితే , చల్లగా ,మధురంగాఉండి  దాహ శా౦తినిచ్చి ,ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త నీరు ఊరుతూ, ఎందరెందరికో ఉపయోగపడుతుంది .కనుక కలిమి ఉన్న లోభి కంటే, ఉదారగుణం ఉన్న పేద వాడు శ్రేష్టుడు అని కవి వివరించాడు .. ..  నిత్యజీవితం లో డబ్బు అవసరమే, కాని ధనమే జీవితం కాకూడదు .డబ్బు సంపాదన పై శ్రద్ధ ఉండాలి కాని ,ఆర్జనే అర్ధానికి మూలం కారాదు .సంపాదించిన డబ్బు ఖర్చు చేసేటప్పుడు మనిషి విజ్ఞత చూపాలి .ఆర్జన ,వినియోగం మనిషి స్వభావానికి ,ఔన్నత్యానికి ,సార్ధక్యానికి అద్దం పడతాయి .వ్యక్తికి  ఈ రెండిటిపై గొప్ప అవగాహన ఉండాలి .

  ధనాన్ని సక్రమ మార్గం లోనే సంపాదించాలి .అప్పుడే  మనశ్శాంతి , సౌఖ్యం ,పేరు ప్రతిష్టలు కలుగుతాయి .లేకపోతే ఆ ధనమే శీలహానికి, అపకీర్తికి, పాపానికి, మానసిక క్షోభకు  కారణమౌతుంది .ఆర్జనతోపాటు అనుభవ యోగమూ ఉంటేనే పరమార్ధం .అంటే తనకు, తన కుటుంబానికి ఖర్చుచేస్తే చాలదు .తోటివారికి, బాధలలో ఉన్నవారికీ  సాయపడి  వాళ్ళ ముఖాలలో చిరునవ్వులు పూయించాలి .అప్పుడే  ఆ ధనం సార్ధకమై  ,మానసిక ఆనందాన్నిస్తుంది .

అంతమాత్రం చేత,  ఎవడికి పడితే వాడికి డబ్బు ఇచ్చి, అపాత్ర  దానం చేసి ,అనర్ధాన్ని తెచ్చుకోకూడదు .దానం వెనుక ఉన్న మనసు చాలా ముఖ్యం .దానం లో గర్వం ఉంటే ,పతన హేతు వౌతుంది . .వ్యక్తికి సాయం చేసే అదృష్టం కలిగింది అని భావిస్తే ,ఆ దానం పవిత్రమై ఆనందాన్నిస్తుంది .ఆత్మీయత ,అనురాగం, మనసు పంచుకోవటం వలన ఐహిక ఆనందం కలుగుతుంది .ఇదే లేకపోతే ,జీవితం రసహీనమై  నిరర్ధకమని పిస్తుంది .కర్మ, జ్ఞాన, భక్తులు ఆముష్మికానికి యెంత అవసరమో ,ఆర్జన, అనుభవం ,ఆనందం, ఐహికానికి అంత ముఖ్యం. రైల్వే లో పనిచేసే పాముల నరసయ్యగారు ఒక్క గారుడీ మంత్రం తో  ,ఒకే ఒక్క ఫోన్ కాల్ తో , పాముకాటుకు గురైన వేలాది మంది జనాలకు  ప్రాణదానం చేసి, ప్రాణదాత అయ్యారు .దీనికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు .నిస్వార్ధ సేవ చేసి చరితార్దులై ఉదాత్త పురుషులయ్యారు ..’’మనం ఇతరులకు మన స్పూర్తిగా సాయం చేయాలనుకొన్నప్పుడు ,సహాయం చేస్తున్నప్పుడు మన మనస్సు ,బుద్ధీ పరిశుద్ధమౌతాయి .ఈ ప్రతిఫల౦ ఒక్కటే చాలు చేసే సాయానికి ‘’అంటారు కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు . ‘’ఎప్పుడూ నీటిలోనే ఉండే చేప దుర్గంధంతో నిండిన నీచును దూరం చేసుకోలేనట్లే మనిషి, సుగంధాలు పులుముకొని రోజూ రెండు, మూడుసార్లు స్నానం చేసినా ,మనసులోని మాలిన్యాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడని  భక్త కబీరు చెప్పాడు. కబీర్ సూక్తులే  తనకు ఆదర్శం అన్నాడు మహాత్మాగాంధీ .

  మనం వీటిని అన్నిటిని  సమన్వయ పరచుకొంటూ ,ఉన్నంతలో ఒక చలి చలమ లాగా  ఆర్తులకు ఉపయోగ పడుతూ  జీవితం గడిపితేనే ,జీవితానికి నిండుదనం, శోభ ,సార్ధకత  కలుగుతాయి  అని గువ్వల చెన్న ‘’  చెన్నా’’ అంటే బాగా  చెప్పాడు .,అంతే కాదు తెలుగు పద్యం శాశ్వతత్వాన్ని కూడా ఇలా చెప్పాడు .

గుడి కూలును, నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును,, వనమును ఖిలమౌ
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న, గువ్వల చెన్నా!

                       3-గురువు గరిస్టత

‘’గురు రాది రనాదిశ్చ గురుః పరమ దైవతం –గురోః పరతరం నాస్తి –తస్మైశ్రీ గురవేనమః ‘’అని ‘’విశ్వ సార తంత్ర ‘’చెప్పింది .సృష్టికి ఆది, అనాది ,పరమోత్తమ దైవం గురువు .గురువుకు మించింది లేదు ‘’అని భావం .గురువు అంటే నాలుగు ముఖాలు లేని బ్రహ్మ అంటే జ్ఞాన ,చైతన్య ప్రదాత .నాలుగు భుజాలు లేని విష్ణువు .అంటే రక్షకుడు, అపమార్గం నుంచి తప్పింఛి సరైనదారిలో పెట్టే మార్గ దర్శి .మూడు నేత్రాలు లేని  శివుడు కూడా .అనగా అజ్ఞానాన్ని లయం చేసేవాడు  .కనుక గురువు త్రిమూర్తి అవతారం .ప్రత్యక్ష దైవం కనుక  ఆచార్య దేవుడు అంటారు . .గురు దీవన బలమైనది .వ్యక్తి ఉన్నతికి సోపానం కూడా. గురువుకు ఏమైనా కొమ్ములున్నాయా అంతగా ఆరాధిస్తారు .అనే ప్రశ్న రావచ్చు.

 అవును నిజంగానే  ఈ ప్రశ్న వచ్చింది భేతాళుడికి.ఒక సారి విక్రమార్క మహారాజు రాజభవనం నుంచి సరాసరి, ఒక కుటీరం లో చిన్న అంగవస్త్రం తో కూర్చుని ధ్యానం చేసుకొంటున్నఒక మహర్షిని  సందర్శించి, కుశల ప్రశ్నలు  వేసి, తనసాయం ఏమన్నా కావాలా అని అడగటం, ఆయనేమీ మాట్లాడక ,ఆశీర్వదించటం  భేతాళుడు గమనించాడు .అప్పుడు విక్రమార్కుని తో ‘’ఎప్పుడో చిన్నప్పుడు ఆయన వద్ద చదువుకొని ఉంటావు .ఇప్పుడు నువ్వు చక్రవర్తివి .ఆయనపాదాలపై పడాలా ?నీ కంటే ఆ బికారి గొప్పవాడా ?ఆయనకు ఏమన్నా కొమ్ములున్నాయా ?’’అని నిలదీశాడు .

  చిరునవ్వు నవ్వుతూ గురువును స్మరించి ‘’అవును  భేతాళా.! గురువుకు కొమ్ములే ఉంటాయి .గురువు అనే మాటలో ఉన్న’’ అన్ని అక్షరాలకు కొమ్ములున్నాయి’’ కదా’’ అని సరదాగా అంటూ  ‘’గురువు అనే స్థానానికి అంతకు మించిన  విశేషాలున్నాయి .ఆయనకు ఉన్న మొదటి కొమ్ము’’ జ్ఞానం’’ .లోకం లో జ్ఞానానికి మించిన సంపద లేదని నీకు తెలియదనుకొంటా . .అంటే ఆయన సర్వ సంపన్నుడు .నా సామ్రాజ్యం, వైభవం శాశ్వతం కాదు .ఎవరైనా ఎప్పుడైనా కొల్ల గొట్టవచ్చు .కాని ఆయన ప్రసాదించిన జ్ఞానాన్ని ఎవ్వరూ ఎప్పటికీ అపహరించలేరు. అది పంచిన కొద్దీ పెరిగేదేకాని ,తరిగేదికాదు ‘’అన్నాడు .

    ఆశ్చర్య పోతున్న భేతాళుడితో మళ్ళీ ‘’ఆచార్యుని రెండవ కొమ్ము ‘’అనుభవం’’ .ఇదే జ్ఞానాన్ని విజ్ఞానంగా మారుస్తుంది .కొన్ని సార్లు గురువును మించిన జ్ఞానం శిష్యులకు  లభించి , గురువును మించిన శిష్యులని పించుకోవచ్చు .కాని అనుభవం మాత్రం గురువుకు స్వంతం .ఇది వయసు ,విజ్ఞతలను బట్టి వస్తుంది .ఎంత జ్ఞాని అయినా, అనుభవమున్న గురువు ముందు ‘’ లఘువే’’ ఔతాడు ‘’.అన్నాడు విక్రమార్క మహారాజు .

 మరింత ఆశ్చర్యపడిన భేతాళునితో విక్రమార్కుడు ‘’గురువుకున్న మూడవ కొమ్ము ‘’త్యాగం ‘’.తనను నమ్మి వచ్చిన శిష్యులకు తాను పొందిన జ్ఞాన ,విజ్ఞానాలను ధారపోసి ,వారి అజ్ఞాన, అహంకారాలను  సహించి,క్షమించి ,ఔదార్యం తో  మార్గ దర్శనం చేస్తాడు .వారి ఉన్నతికి సోపానమే అవుతాడు . శిష్యుడు  తనకు మించి ఎదిగితే , సంతోషించి  ,అతని చేతిలో ఓటమికి  కూడా మనస్పూర్తిగా ఆన౦దిస్తాడు .ఎంత ఆధునికత పెరిగినా ,గురువైన ఆచార్యుడి స్థానం ఆయనదే .  గురువును నొప్పించినా ,మనసును గాయపరచినా, భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు.అయినా నువ్వు ఏ గురువు వద్దా చదువుకోక పోవటం వలన,భయంకరమైన  ఈ భేతాలుడిగా చెట్టుకు వ్రేలాడుతూ ఉండిపోయావు .గురువును వేళాకోళం చేయక ,వినయంగా ప్రవర్తించు .’’చండాలోస్తు ,సతు ద్విజోస్తు,గురు రిత్యేషా, మనీషా మమ’’అన్నారు శ౦కరాచార్య  .అంటే జ్ఞానం కలవాడు ఎవరైనా, ఏ కులం వాడైనా నాకు గురువే ‘’అని అర్ధం .   ఎంతమంచి రూపం ,యవ్వనం,సంపదా ఉన్నా, విద్యలేకపోతే సువాసనలేని మోదుగ  పువ్వులాగా శోభించలేదు .విద్యలేనివాడు వింతపశువు ‘’’అని హితబోధ చేశాడు శక పురుషుడు విక్రమార్క చక్రవర్తి ..

  శీ కృష్ణుడు తనగురువు సాందీపని మహర్షిని ,శ్రీరాముడు వశిష్ట మహర్షిని ,విశ్వ విజేత అలెగ్జాండర్ తనగురువు అరిస్టాటిల్ ను ,స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంసను ,భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రామేశ్వరం లోని తనగురువును ఎన్నడూ మర్చిపోలేదు . ఆ గురు గౌరవమే  వారి ఔన్నత్యానికి శోభనిచ్చింది .

      4- త్రికాలజ్ఞానం  సుఖం కలిగిస్తుందా ?

   కలిగించదు అని తెలియ జేసే కథ తెలుసుకొందాం . ద్వాపర కాలం లో భార్గవుడు అనే ముని కుమారుడికి ఇల్లూ ,వాకిలీ,  ఆశ్రమం  వంటివి ఏవీ లేవు .లోకం తో పనిలేకుండా  తన వీణను మీటుకొంటూ ప్రదేశాలన్నీ తిరుగుతూ నిత్య బాల్యం తో , ప్రకృతితో పరవశమై , అన్నికాలాల్లోనూ  వీణా వాదనతో లోకాన్ని సమ్మోహ పరచేవాడు .మహర్షులు, పురజనులు ,అధికారులు అతని గీతారాగ బ్రహ్మానందం అను భవించి పరవశులయ్యేవారు .కాని ఎవరూ అతడిని పలకరించే వారు కాదు .  అతడు జ్ఞానియో ,ఆజ్ఞానియో కూడా తెలియదు .అద్భుత అనుభూతి అతని రాగం లో ప్రవహించేది .

  కొంతకాలానికి సృష్టి అద్భుతం అతనికి దుస్సహంగా మారి , త్రికాల జ్ఞానం సాధించాలనుకొన్నాడు .వెంటనే స్వరం గద్గదమై ,వీణ తీగలు సడలి స్వరహీన మయ్యాయి . వేద వ్యాస మహర్షిని సందర్శించి ‘’త్రికాలజ్ఞత ‘’ప్రసాదించమని వేడుకొన్నాడు.మహర్షి ఆ కోరిక అనర్ధాలకు దారి తీస్తుందని యెంత నచ్చ చెప్పినా , వినక పోవటం చేత ,ముందుగా’’ భూత కాలజ్ఞత’’ ప్రసాదించాడు .ఇప్పటిదాకా బాలుడుగా ఉన్న భార్గవుడు , కౌమార దశ పొందగా అంతా ఆశ్చర్యపోయారు .అతని వీణాగానం లో మాధుర్యం తగ్గింది .మహావిష్ణు ,సదాశివుల లీలా విశేషాలు, పురాణాలను అంటే గతవైభవాలను  మాత్రమే  గానం చేశాడు .జనం గుంపులుగా అతని వెంటపడి ఆనందించారు .భూతకాలం లోని విశేషాలన్నీ పాడాక, వాటిపై కూడా  మోహం తగ్గి ,అతని వీణ పలకటం మానేసింది .మళ్ళీ వ్యాసుని దర్శిం చాడు  . తన దగ్గరకు ఇక రావద్దని కఠినంగా  చెప్పినా, వినక బ్రతిమాలి  ‘’వర్తమాన కాలజ్ఞానం ‘’పొందాడు .

  ఇప్పుడు యవ్వనావస్థ లో ఉన్న భార్గవుడు వర్తమానమంతా కళ్ళకు కడుతున్నందున వాటినే  పాడాడు .అతని గీతాలు,రాగాలు  లయను అతిక్రమించాయి .కాని  అతని ఆనందం సంతోషంగా మారింది .  సరైన దారిలో పడ్డాడు అని జనం మెచ్చారు .నిరంతర గీత ,వచన, రచన తో,వీణా గానం చేశాడు .ఈ  తృప్తికూడా ఎక్కువకాలం నిలవలేదు .బడలిక పెరిగి ,కంపనం వచ్చి, వీణస్వరం ఆగి పోయింది . అతనికి తెలియకుండానే అతని కాళ్ళు వ్యాసుని చెంతకు తీసుకు వెళ్ళాయి .ఏడుస్తూ పాదాలపై పడ్డాడు .అతని దీనావస్థ,  మనసులోని కోరిక గ్రహించి, వాత్సల్యం తో ‘’నువ్వు కోరే భవిష్యత్ జ్ఞానం నీ వినాశ కారణం అవుతుంది ‘’అన్నాడు .అయినా అనుగ్రహించమని కోరాడు భార్గవుడు ‘’నీఖర్మ అనుభవించు ‘’అని అనుగ్రహించ గానే అతడు కఠోర స్వరం తో కెవ్వున కేక వేశాడు  ,అతని దివ్యవీణ నేలమీద పడి బ్రద్దలై, తీగెలు తెగిపోయాయి .ముసలితనం వచ్చి ,జుట్టుతెల్లబడి, పళ్ళు ఊడిపోయి త్రికాలజ్ఞుడయ్యాడు  .లోకం లో తెలియనిది ,అద్భుతమైనది కనిపించక ,,సృజన తగ్గిపోవటం తో  అతని హృదయం శూన్యమైపోయింది .కాలక్రమం లో అతన్ని అందరూ మర్చే పోయారు .

    మనిషికి కావాల్సింది తృప్తి .ఆశకు విరుగుడే తృప్తి .తృప్తిలో ఉన్న ఆనందమే మోక్షానికి రాజమార్గం .దేన్ని కోరుతున్నామో దానిపై విచక్షణ తో ఆలోచిస్తే ,ఆ కోరిక బలహీనమై ,క్రమంగా నశిస్తుంది .మనసును స్థిరంగా ఉంచుకొంటే, ప్రశాంతత లభించి ,హృదయం విశాలమై, మనిషి ‘’మనీషి ‘’అవుతాడు .మనసు కోరికల పుట్ట ,చంచలమైనది .అభ్యాసం ,వైరాగ్యం వలన మనసు స్వాధీనం లోకి వస్తుందని గీతలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశించాడు .కోరికలకు మూలం అయిన మనసును బుద్ధి అనే ఆయుధంతో నియంత్రించాలి .తనపై తనకు అదుపు ఉన్నవాడు వెయ్యి ఏనుగుల బలవంతుడు అన్నారు పెద్దలు.మనసు నియంత్రణలో ఉంటె నిర్మలత్వం తప్పక  సిద్ధిస్తుంది ..

’’మన లోపాలను మనం సంస్కరించు కోకపోతే ,లోక క్షేమం కోసం ప్రయత్నించే అధికారం మనకు ఉండదు ‘’అన్నారు నడిచే దైవం  కంచికామకోటి జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి .  బుద్ధి కూడా నిజం తెలిసేదాకా అటూ ఇటూ ఊగుతుంది .నిజం తెలిశాక శాంతిస్తుంది .

   నిరంతర కాంక్ష ,తృష్ణ ల వలన మనసుకు  సంతృప్తి ,విశ్రాంతి ,శాంతి లభించదు . లోకం లో అజ్ఞాతమై, అద్భుతం కలిగించే విశేషాలు ఉంటేనే కవికి ,గాయకునికి జీవితం ఆనందమయం అవుతుంది అని తెలియ జేసే ఈకథను తెలుగు తొలి.చారిత్రక నవలా రచయిత బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు రాశారు .

  గబ్బిట దుర్గా ప్రసాద్

  సరసభారతి అధ్యక్షులు

 2-405 శివాలయం వీధి

 ఉయ్యూరు -521165

సెల్ -9989066375

20-7-19

— 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రేడియో లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.