కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 13 కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1
ఆంద్ర సాహిత్య మహాపురుషులలో అగ్రస్థానం అలంకరించినవారు శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు .వారి ఆంధ్రభారత కవితా విమర్శన గ్రంథం కవిత్రయ దర్శనానికి కరదీపిక అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ .ఆయన ప్రాముఖ్యం స్పష్టం కావటానికి ఆంద్ర సాహిత్య ఆధునిక యుగ ప్రారంభ చరిత్ర సంక్షిప్తంగా ముందుగా తెలుసుకొందాం .
సోమకాసురుడు వేదాలను దొంగిలించి సముద్రం లో దాక్కొంటే ,విష్ణువు మత్శ్యావతారం ధరించి ,వాడిని వధించి వేదాలను లోకాలకు అందించాడు . మానవుడి జ్ఞానార్జన లో ఉన్న కస్ట నష్టాలను పురాణాలు ప్రతీకాత్మకంగా చెప్పిన కథ అది .వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం కాలక్రమంలో కొట్టుకుపోగా సుమారు 150ఏళ్ళ క్రితం వరకు ఆంధ్రులకు తమసాహిత్య స్వరూపం ఏమిటో తెలీదు .మనుచరిత్రాది కావ్యాలే ఎరుగరు .ఒకవేళ తెలిసినవారికి కూడా భారతం మీద ఉన్న గౌరవం వీటి పై ఉండేదికాదు .అంటే 11వ శతాబ్దపు నన్నయ్య నుంచి నేటి తిరుపతికవులవరకు వచ్చిన కావ్యాలు వ్యాకరణ అలంకార శాస్త్ర గ్రంథాలు ఏవీ చదువబడేవికావు .ఇప్పుడున్న విద్యావిధానం విద్యా శాఖలు అప్పుడు లేవు అంటే అది మరొక సొమకాసురుడి కథ అన్నమాట అంటాడుషేశేంద్ర .
ఇంగ్లీష్ వాళ్ళ కాలం లో వాళ్ళు తెచ్చిన’’ లాంతరు ‘’వెలుగులో ఈ దేశపు చీకటిలో ఉన్న వస్తువుల్ని వెదికి పోగు చేయటం మొదలైంది .ఆంద్ర సాహిత్య పునర్నిర్మాణం అనే మహత్తర ఉదయం కూడా అప్పుడే మొదలైంది .దీనికి పూనుకున్నవాళ్ళు తమకు తెలిసినంతవరకూ పూర్వ కవుల ను వారి కావ్యాలను ,జీవన విశేషాల్ని కథలు గాథలుగా రాయటం తో ఆంద్ర సాహిత్య స్వరూప అన్వేషణలో మొదటి దశ ప్రారంభమైంది .ఇందులో మొదటివాడు కావలి వెంకటరామ స్వామి అనే పండితుడు ఇంగ్లీష్ లో ‘’Biogrphical Sketches of Deccan Poets ‘’లో తెలుగు కన్నడ సంస్కృత ,మరాఠీ,గుజరాతీ కవుల జీవితాల్ని సంక్షిప్తంగా రాశాడు .తర్వాత తెలుగులో చాలామంది రాశారు .కందుకూరి వేరేశలింగం పంతులుగారు 1886లో ‘’ ఆంధ్ర కవుల చరిత్ర ‘’రాశారు .ఎన్నో భ్రమ ప్రమాదాలతో ఉన్న దాన్ని ఉద్దండులైన మానవల్లి ,వేటూరి, కొమర్రాజు ,వంగూరి లాంటివారు చేసిన గొప్ప పరిశోధన కృషి వలన గ్రంథాలు వస్తూ ఉంటె పంతులుగారు తనపుస్తకం లోని ‘’హౌలర్స్ ‘’ను దిద్దుకొంటూ 6సార్లు,పునర్ముద్రణం చేశారు .దీనిలోకూడా కవుల బయోడేటా ఉందికాని కావ్య విమర్శ కనిపించలేదు .
ఇలా కొంత ముదురుపాకాన పడ్డాక కవి ,కావ్యనిర్ణయం మొదలైనవి అవసరమై శాసనాలు, వాటికాలం, వాటిలోని భాష పరిశీలించాల్సి వచ్చి,శాసనాల వేట మొదలైంది .జయంతి రామయ్య ,కొమర్రాజు ,మల్లంపల్లి ,హెచ్ కృష్ణమూర్తి హుర్జ్ ,ఎ.బట్టర్ వర్త్,వేణుగోపాల చెట్టి ,చిలుకూరి నారాయణరావు ,వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లవంటి ప్రకాండ పండితులు 200శాసనాలు సేకరించారు .అప్పటికే దాక్షిణాత్య భాషల పరస్పర సంబంధాల అధ్యయన౦ ప్రారంభమై ఒక దశకు చేరింది .లిపి శాస్త్రం ,శాసన భాషాధ్యయన సూత్రాలు స్పష్ట రూపం లో ఏర్పడ్డాయి .ఈ హడావిడిలో కవుల చరిత్ర రచన వెనకబడి పోయి ,తెలుగు భాష ఉద్గమం.పరిణామం, వికాసం ,తెలుగు వ్యాకరణ చరిత్ర మొదలైన పరిశోధనలు ప్రాధాన్యం వహించాయి ..ఆంద్ర శబ్ద చింతామణి రాసింది నన్నయకాదు అనే సిద్ధాంతాన్ని వీరేశలింగం గారే లేవదీశారు .దీన్ని వఝల చిన సీతారామ శాస్త్రిగారు సోపపత్తికంగా ఖండించారు .అనేకపండితులు నన్నయే కర్త అని తేల్చారు .బాలవ్యాకరణ ,ప్రౌఢ వ్యాకరణ కర్తలు ,ఎలకూచి బాలసరస్వతి ,ఆహోబిలపండితుడు, అప్పకవి వాసుదేవ వృత్తి,కవి జనంజనం ,ఆంద్ర కౌముది ఇత్యాదులు నన్నయ భట్టే ఆంద్ర శబ్ద చింతామణి కర్త అని చెప్పబడింది .దీనితర్వాత నన్నయ మొదటి వ్యాకరణ కర్త కాదు అనే మరో వాదం లేచింది .మండ లక్ష్మీ నరసింహాచార్యులు చూపించిన ‘’బార్హస్పత్యం ,రావణీయం , కాణ్వ మాధర్వణ౦,విదన్ కరోమి సారస్వత త్రిలింగ శబ్దానుశాసనం ‘’అనే శ్లోకం ప్రకారం బృహస్పతి మొదటి వ్యాకరణ కర్త అని ,కాదు,కణ్వుడని ఇలా కవి రాక్షస ,పుష్పదంత ,కవి భల్లాట ,హేమచంద్రాదులు మొదలైనవారి పేర్లు చర్చించబడినాయి .’’హేమ చంద్రాది మునిభిః కథితం చాంధ్ర లక్షణం ‘’వగైరాలు అతడు జైనుడని చెప్పటం తో ఇదంతా ఒక గొప్ప’’ ఆంద్ర వ్యాకరణ చరిత్ర జ్ఞాన కోశం ‘’గా రూపొందింది కాని వఝలవారురౌద్రి జ్యేస్టాషాఢ సాహిత్య పరిషత్ పత్రికలో రాసిన ‘’ఆంద్ర ఛందస్సు ‘’వ్యాసం లో పైవాదాలనన్నిటినీ ఖండించారు .ఇంతలో మరోవాదం చింతామణి కర్త నన్నయ వేరు భారత ఆంధ్రీకరణకర్త నన్నయ వేరు అనీ ,వీరికాలం 15 శతాబ్ది ,11వ శతాబ్దం అనీ మరో పిడివాదం బయల్దేరింది .అంటే ఆంద్ర సాహిత్య స్వరూప పునర్నిర్మాణ ఉద్యమం చివరికి భాషా వ్యాకరణాల అరణ్యం లో చిక్కుకు పోయింది అంటాడు శేషేంద్ర శర్మ .కాని తెలుగు ,కన్నడ లిపులకు క్రీ.పూ. 3శతాబ్దం లో ఉన్న బ్రాహ్మీ లిపి మూలం అని తేల్చారు .దీనినే ద్రావిడి లేక డామిలి అనే వారట .మూల ద్రావిడం అనే ఒక భాషను ఊహించి దానినుంచే దక్షిణాదిభాషలేర్పడ్డాయ్యని ఒక మతం ప్రచారం చేశారు . మూల ద్రావిడం అంటే ఏమిటి ?
సుమేరియన్ నాగరకత గూర్చి చర్చించిన ఆధునిక పరిశోధన గ్రంథాలలోసుమేరియన్ భాషలోనూ ,సుమేరియన్ ఇతిహాసం గిల్గమిష్ లోనూ అనేక కన్నడ ,తెలుగుపదాలున్నాయి .గిల్గమిష్ లో నింగిరసు(సూర్యుడు),ఎంకిడు(గిల్గమిష్ కథానాయకుడి మిత్రుడు )ఉరు(ఊరు )మొదలైన ఉదాహరణలు ఇచ్చారు .ఐతే సుమేరియాలజిస్ట్ లప్రకారం ఈ పద జాలం భారత దేశమంతటా ఉంది .ఉదాహరణలు -సంగ్రూర్ (పంజాబు )బేలూరు (బెంగాలు )బిజ్ఞౌర్ (హిమాచలప్రదేశ్ )చిత్తోడ్ చిత్తూర్ (రాజస్థాన్ ).అన్యభాషావాదుల ప్రకారం మధ్యధరా సముద్ర తూర్పు ప్రాంతం నుంచి భారత దేశానికి వలసవచ్చిన ,ప్రోటో ఆస్ట్రోలా ప్రాంతం నుండి ఇండియా వచ్చిన ప్రోటూఆస్ట్రోలాయిడ్ జాతుల భాష యేఇది .నిశితంగా పరిశీలిస్తే ఈ రెండువాదాలలో వైరుధ్యం కనిపించదు అంటాడు శేషేన్.కారణం యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల ప్రాంతాలే ఇరాక్ ,మధ్యధరా సముద్ర తూర్పు ప్రాంతం కావటం వలన .కనుక మూల ద్రావిడం సుమేరియన్ భాష కావచ్చు .ఇది ఇండియా అంతా వ్యాపించి ,ఉత్తరభారతం పై అనేక శతాబ్దాలుగా జరుగుతున్న దాడులవలన అక్కడి భారతీయ భాషల పైపొరలు ఎగిరిపోయి ,బయటిభాషలు ఆ స్థానం లో ప్రవేశించి ,కిందిపొరల్లో పాత భాషల తాలూకు పొరలు అలాగే ఉండి పోయినట్లు భాషా పరిశోధకులు భావిస్తున్నారు .బీహార్ లో అనేక ఆదిమవాసుల భాషలలో తెలుగు ,కన్నడ పదాలను పోలిన పదాలు కనిపిస్తాయి .సింహళభాష లో తమిళ కన్నడ తెలుగు ఒరియా బర్మీస్ ,ధాయ్ లాండ్ కంబోడియన్,లావోస్ ,మలయా ,జావా మొదలైన ఆసియా తూర్పు సముద్ర తీర (చైనా, జపాన్, కొరియాలు తప్ప ) దేశపు లిపులన్నీ ఒకే లాగా ఉంటాయి .ఇది యాదృచ్చికం కాదు పరిశీలనార్హం అంటాడు శేషేంద్ర .కామరాజ యూనివర్సిటి ప్రొఫెసర్ ఒకాయన మన దేశపు కన్యాకుమారి నుంచి జపాన్ ,కోరియాలవరకు’’ ఒకే సాంస్కృతిక పరగణా’’ అని ఒక సిద్ధాంతం చేసినట్లు తనకు జ్ఞాపకం ఉందని గుంటూరు శేషేంద్ర శర్మ అన్నాడు .
సశేషం
ఆధారం –కోరాడ రామకృష్ణయ్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-8-19-ఉయ్యూరు

