దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3
1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -3(1759-1847)
అ౦దరి వాడైన త్యాగయ్య
త్యాగరాజస్వామి ఉదార హృదయ౦ తెల్సి ఎందరెందరో శిష్యులయ్యారు .ఆయనకు శివ కేశవ భేదం లేకపోవటం తో సంసారులు విరాగులు భక్తులు అన్ని వర్ణాలవారు త్యాగరాజ స్వామిని సేవించారు .పండిత పామర భేదం మిత్రత్వ శత్రుత్వాలు లేకపోవటం తో ఆయన కీర్తనలు సర్వజన అంగీకారం పొందాయి .విమర్శించాలని వచ్చే వారి ఆయన శాంత హృదయం చూసి నోరు మెదపక వెళ్ళిపోయేవారు .పరిశుద్ధత ,ఆత్మ స్వాతంత్ర్యం ,మనో నిశ్చయం ఆయనకు సహజాలంకారాలు .దేశమంతా త్యాగబ్రహ్మ కీర్తనలకు బ్రహ్మ రధం పట్టింది .కాశీ నుంచి గోపీనాథ భట్టాచార్యవచ్చి దర్శించి తరించాడు . షట్కాలగోవి౦ద మరార్ స్వామిని దర్శించి పునీతుడై మెప్పు గౌరవం పొందాడు .అరవలు అపరానారదునిగా భావించి త్యాగయ్యగారి కృతులను నేర్చుకొని పాడారు .వాటిలోని అర్ధ గా౦భీర్యం ,భాషా పా౦డిదత్యం, కవితా మాధుర్యం అర్ధం కాకపోయినా తమిళులకు త్యాగారాజస్వామి ఆరాధనీయుడయ్యారు.తెలుగుభాషా మాధుర్యం కవితా పాటవం రుచి చూసిన మహా వైద్యనాధయ్యర్ ,పట్నం సుబ్రహ్మణ్యం ,పూచయ్య౦ గార్, శ్యామ శాస్త్రి తెలుగు కీర్తనలు రాసి పేరుపొందారు .ఎందరో త్యాగయ్య కీర్తనలుపాడి ,ఆయనపై ప్రశంసాపద్యాలు రాశారు .కొందరైతే పిల్లలకు త్యాగయ్యగారి పేరు పెట్టుకొన్నారు .శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మచలువ ,పూనిక తో ప్రారంభమైన త్యాగరాజ ఆరాధన నేడు దేశం లోని ప్రముఖగాయకులు త్యాగయ్య వర్ధంతి పుష్యబహుళ పంచమినాడు తిరువయ్యార్ లో పాల్గొని భక్తీ తాత్పర్యాలతో త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలాపనచేసిస్మరించి , కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
శిష్య పరంపర
1-వీణ కుప్పయ్య –సామవేద బ్రాహ్మణుడు భారద్వాజ గోత్రీకుడు .’’నారాయణ గౌళ’’ రాగ ప్రవీణుడవటం వలన ‘’నారాయణ గౌళ కుప్పయ్య ‘’గా ప్రసిద్ధుడు .కోవూరి సుందరేశ మొదలి ఆస్థానగాయకుడు .వినాయకచవితి ,చిత్ర పౌర్ణమిలను ఘనంగా నిర్వహించి ఘనవిద్వామ్సులచేత కచేరీలు చేయించి సన్మాని౦చేవాడు .రాదారుక్మిణీ సమేత శ్రీ వేణు గోపాలస్వామి పూజాదికాలు మహా భక్తితో చేసేవాడు .త్యాగయ్యగారిని కోవూరు పిలిపించి త్రిపురసుందరీ సుందరేశ్వరులపై కృతులు రచి౦పజేశాడు .మద్రాస్ లో మరణించాడు .ఇతనికోడుకులు కృష్ణస్వామి ,రామస్వజ్మి ,త్యాగయ్య ,శిష్యులు కొత్తవాసాల్ వెంకటరామయ్య ,ఫిడేలు పొన్ను స్వామి గానప్రవీణులే .చివరికొడుకు త్యాగయ్య ‘’పల్లవి స్వరకల్పవల్లి ‘’,సంకీర్తన రత్నావళి ‘’లను ముద్రించాడు .కుప్పయ్య తండ్రి సాంబయ్య గొప్ప వైణికుడు’’’ఎ సాంబడు వాయించాలి .ఆ సాంబడు (శివుడు )విని ఆనదించాలి అనే సామెత ప్రచారం లో ఉంది .వీణ కుప్పయ్య వల్లనే మద్రాస్ కు ‘’సంగీత నిలయం ‘’అనే పేరొచ్చింది .
2-వాలాజి పేట వెంకట రమణయ్య
మధురవాసి ,సౌరాష్ట్ర బ్రాహ్మణుడు వాలాజిపేట వెంకటరమణయ్య .త్యాగారాజస్వామిపై ధ్యానశ్లోక ,మంగళాస్టకాలు రాశాడు .గురుపుత్రి సీతమ్మ వివాహ సందర్భంలో శ్రీ కోదండరామ స్వామి తైల చిత్రపటాన్ని రచించి కానుకగా ఇచ్చాడు .అప్పుడు భావోద్రేకానికి లోనైనా త్యాగరాజు ‘’నను పాలి౦ప ‘’అను కీర్తన ఆశువుగా చెప్పారు .ఇప్పటికీ ఈచిత్రం త్యాగయ్య గారి వంశీకుల వద్ద భద్రం గా ఉండటం విశేషం
ఈయనకొడుకు మైసూర్ సదాశివరావు .శిష్యుడు కృష్ణ భాగవతార్ .రమణయ్య భావ సంవత్సర మార్గశిర శుద్ధ సప్తమినాడు మరణించాడు .
3-తిరువాడి సుబ్రామయ్య
ఇతడుత్యాగరాజ కృతులకు మొదటి స్వర రచయిత.త్యాగరాజ కృతి గాన పద్ధతిని కొడుకుకు నేర్పాడు
4-నేమం సుబ్రహ్మణ్యం
పల్లవి ప్రవీణుడు నేమం సుబ్రహ్మణ్యం క్రుతులగానం లో మహా నేర్పరి .కొడుకు నటేశయ్య కూడా గాయకుడే .
5-ఉమయాల్పురం సోదరులు
కృష్ణ భాగవతార్ ,సుందరభాగావతార్ లను ఉమయాల్పురం సోదరులుఅంటారు .త్యాగయ్యగారి ఆదేశం తో ఆదుత్తురై నివాసి జగద్రక్ష భాగవతార్ వద్ద గాన విద్య ప్రారంభించి రాటు దేలాక త్యాగయ్యగారి వద్ద చేరి ‘’జానకీ మనోహరం ‘’కృతి ప్రారంభించారు
6-టి.శివరామయ్య
సుబ్రామభాగవతార్ కొడుకు .మానంబు చావడి వెంకటసుబ్బయ్యవద్ద త్యాగరాజ కృతులు నేర్చి ఫిడేలుపై వాయించాడు .పంచాప కేశవ భాగవతార్ తో కలిసి మైసూర్ బరోడా కాశీలకు వెళ్లి కచేరీలు చేశాడు. దేశీయ రాగ తాళాలతో ‘’చతు ష్షష్టి మాలిక ,నవరత్నరాగామాలిక రచించాడు
7-మువ్వనల్లూరు గోవిందన్ సభాపతి సోదరులు
శాలీయ మంగళం నివాసులు .తండ్రి మధ్యార్జనం దొరస్వామి .పదకర్తలు సంస్కృత కృతులు రాశారు .
8-మానంబు చావడి వెంకటసుబ్బయ్య
త్యాగయ్యగారి బందువు .ములికినాటి బ్రాహ్మణుడు .ఫిడేలు వాద్యగాడు.వేంకటేశ ముద్రతో చాలా కృతులు రాశాడు .దేవా గాంధారి రాగం లో ‘’స్వామికి సరియెవరు’’కృతి రాసి గురుభక్తి చాటుకొన్నాడు .
ఈయన శిష్యులు –మహా వైద్యనాధయ్యర్ ,పట్నం సుబ్రహ్మణ్యం ,శరభ శాస్త్రి ఫిడేలు వెంకోబారావు పంచాపకేషన్ ,శివరామయ్య ,సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి (బందరు )
9-తంజావూరు రామారావు
1757లో పుట్టిన రామారావు త్యాగయ్యగారి శిష్యుడు , కార్యదర్శి .గురువుగారితో దక్షిణ యాత్ర చేశాడు .’’చిన్న త్యాగయ్య ‘’అనిఅందరూ అనేవారు .పెద్దపెద్ద పనులకు త్యాగయ్యగారు ఈయనను నియమించేవారు .’’అయ్యర్ వాళ్’’అని త్యాగయ్యగారు రామారావు ను పిలిచేవారు
10-సుబ్రాయ శాస్త్రి (1803-62)
శ్యామాశాస్త్రి రెండవకొడుకు .గానవిద్య తండ్రివద్ద ప్రారంభించి త్యాగయ్యగారి వద్ద పూర్తీ చేశాడు .తెలుగు సంస్కృతం ద్రావిడ భాషాలలో కోవిదుడు ‘’కుమారా ముద్ర ‘’తో కృతులు స్వరజతులు రాశాడు .మధ్యమకాల స్వర సాహిత్య చిట్ట స్వరాలతో ఉండే ఇతని కృతులను త్యాగయ్యగారు విని మెచ్చేవారు .ఫిడేలు వాదనలో మహా ఘటికుడు .ఉదయార్పాలెం రాజు ఇతని కోరిక ఏమిటి అని అడిగితె ‘’నాపై అంబ కటాక్షం ఉంది అంతే చాలు ‘’అన్నాడు.1862చైత్ర కృష్ణ దశమి ఉదయం సంధ్యవార్చి ‘’దత్తం ‘’అంటూ నీళ్ళు వదలి తనకు ఇంకా రెండు గంటలు మాత్రమె ఆయుః పరిమాణం అని చెప్పి అలాగే చనిపోయాడు .ఇతని శిష్యులు అన్నాస్వామి ,తాళపారంగత కంచి కాశీ శాస్త్రి ,ఫిడేలు చంద్రగిరి రంగా చార్యులు,గీతాల శోభనాద్రి ,పొన్నుస్వామి బాలు ,తిరుజ్ఞానముదలి , చిన్మఠం రాఘవులు చెట్టి .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,
సశేషం
మీ–గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-19-ఉయ్యూరు
‘’
—