కిరాతార్జునీయం-7
ద్వితీయ సర్గ
ద్రౌపది ధర్మారాజుతో చెప్పినమాటలలో సారం ఉన్నదని గ్రహించి భీముడు అన్నగారితో ‘’ప్రభూ !క్షత్రియ సంజాత ద్రౌపది మనపై ఉన్న అభిమానంతో బాగా ఆలోచించి మన అభి వృద్ధి కోరి బృహస్పతి అయినా ఇలా పలకగలడా అన్నట్లు యుక్తి యుక్తంగా ,సశాస్త్రీయంగా చెప్పింది.అవి ఆశ్చర్యజనకాలు కనుక ఆమె మాటలు గ్రాహ్యాలు .అగాధమైన దిగటానికి వీలున్న తీర్ధము లున్నా దాని సంగతి దిగేదాకా తెలియదు .దానిలో దిగి స్నానాదులు చేసుకోవచ్చు అని తెలిసినవారు చెప్పాక కష్టం ఉండదు.అలాగే రాజనీతి కూడా గాంభీర్యం తో ప్రకాశిస్తు౦ది కనుక దాని విశేషాలు తెలుసుకోవటం కష్టం గానే ఉంటుంది .విషయాన్ని స్పష్టంగా చెప్పే సమర్ధులైన గురువులద్వారా తెలుసుకొంటే తేలికగా ఉంటుంది .కాని అలాంటి గురువు దొరకటం కష్టం .ఆమె దేశకాలాలకు అవిరుద్ధంగా మాట్లాడినట్లనిపించినా అలాపలకటం ఆశ్చర్యమే .మొదట్లో కష్టంగా ఉన్నా,విన్నకొద్దీ ఫలం ఖాయం అనిపిస్తుంది .తేజశ్శాలురకు ఉత్సాహజనకంగా మాట్లాడింది ద్రౌపది .క్షీణ శక్తులకు బాధా కరంగా ఉన్నా ,ఆలోచిస్తే గుణ గరిష్ట వాక్యాలుగా ఉన్నాయి .కించిత్ దోషం కూడా ఆమె పలుకులలో లేదు కనుక ఆమె మాటలనే అనుసరించటం మంచిదని నా అభిప్రాయం .స్త్రీ బాల వృద్ధులలో ఎవరు చెప్పినా అందులో మంచి ఉంటె గ్రహించాలి లేకపోతె వదిలేయాలని పండితవాక్యం .నువ్వు గుణగ్రాహివైన పండితుడవు కనుక వింటే మంచిది ..నువ్వు సదసద్వివేకివి .అన్వీక్షికి ,త్రయి ,,వార్త,దండనీతి అనే నాలుగిటిలో గొప్ప పాండిత్యమున్నవాడివి .అలాంటి నువ్వు అవివేకివై బురదలో పడి,బయటికి రాలేని ఆడ ఏనుగు లాగా వ్యర్ధంగా పాడై పోతున్నావు .ఇది తగదు నీ పాండిత్యం వివేకం వ్యర్ధమైనాయా .వివేకం తో శత్రు సంహారాన్ని ఆలోచించు . సహాయ సంపత్తి ,బల పౌరుషాలు లేనివారికి రావాల్సిన దురవస్థ ,ముల్లోకాలను జయించే మహాపరాక్రమవంతులు ,శత్రుసంహారంచేసే బంధుగణం ఉన్న నీకు నికృష్ట శత్రువులమూలం గా కలిగింది .అలాంటి శత్రువులను ఉపేక్షించి ,పౌరుషం చూపాల్సిన సమయంలో శాంతి ప్రవచనాలు పలుకుతూ చేతులు ముడిచి కూర్చోటం దేవతలు కూడా సహించరు.ఇప్పటికైనా మాంద్యం వదిలి పౌరుషంతో శత్రు సంహార క్రియ ప్రారంభించి మమ్మల్ని ఉద్ధరించు .
బుద్ధిమంతుడు ముందుగా శత్రువు పెరుగుతున్నాడా తరుగు తున్నాడా అని ఆలోచిస్తాడు .పెరుగుతుంటే తగిన ప్రతిక్రియతో విరగదీస్తాడు .క్షీణిస్తుంటే ఏప్రయత్నమూ చేయక తటస్థం గా ఉంటాడు .క్షయం నుంచి వృద్ధిలో ఉంటె ,ప్రతిక్రియతో శత్రుసంహారం చేయాలి .క్షయం ఇంకా పెరుగుతుంటే ఉదాశీనుడై ఉండాలి .అంతేకాని అభివృద్ధి చెండుతున్నాడని ప్రతిక్రియ చేయటం క్షీణిస్తున్నాడని చేయకపోవటం బుద్ధిమంతుల లక్షణం కాదు .ఇప్పుడు మన శత్రువు వృద్ధిలో ఉన్నాడుకనుక తక్షణం ప్రతిక్రియ చేసి సంహారం చేయాలి .ఒకవేళ తానూ, శత్రువు క్షయం లో ఉంటె ,విజిగీషువు దాన్ని బేరీజు వేసి ప్రయత్నం చేయాలి .తనపని వెంటనే తగ్గుతూ అవతలివాడి పని ఆలస్యంగా వృద్ధికి అనుకూ లంగా అవుతుంటే వెంటనే ప్రతిక్రియ చేయాలి .ప్రస్తుతం మనం క్షీణదశలో శత్రువు వృద్ధిదశలో ఉన్నాం .ఇలాంటి స్థితిలో ఏమీ తెలియని బాలుడుకూడా ప్రతిక్రియ ఆలోచిస్తాడు .మనం ఇది సమయం కాదని కూర్చుంటే మూర్ఖులు అంటారు కనుక త్వరగా నిర్ణయం తీసుకో .
‘’అనుపాల యతా ముదేష్యతీం-ప్రభు శక్తిం ద్విషతా మనీహయా
అపయా౦త్య చిరా న్మహీభుజాం –జన నిర్వాదభయాదివశ్రియః ‘’
శత్రువు పెరుగుతున్నా ఉపేక్షిస్తూ ఉంటె వాడి సంపదలు ,లక్ష్మి వాడిని వదిలి ఉత్తముని చేరుతాయి .కనుక బుద్ధిమంతుడు శత్రు వృద్ధి సాగనీయక ఔరుషంతో నిర్మూలి౦చాల్సిందే కాని ఉపేక్షించి ఊరుకోరాదు .ప్రస్తుతం క్షీణ దశలో ఉన్నా ,సర్వలోక కల్యాణదాయకమైన శత్రు సంహారం క్రమ అభి వృద్ధికోసం చేసే రాజు ను పాడ్యమినాటి చంద్రునిలాగా ప్రజలు నమస్కరిస్తారు .క్షీణం లో ఉన్నాం కదా ఎలా చేస్తాం అని ఆలోచి౦చ రాదు .క్షాత్రము,ఉత్సాహ శక్తి ఉంటె ,పౌరుషం పొంగి శత్రువులు మనవైపు చూడటానికి కూడా భయపడుతారు .అంగబలం ,అర్ధబలం ,సంపద ,దేశకాల విభాగం,వినిపాత ప్రతీకారం, కార్య సిద్ధి అనే అయిదు అంగాలను బాగా ఆలోచించి మంత్రాంగం నడిపితే విజయ సిద్ధి తప్పదు .దీనికి దైవ శక్తి తోడవుతుంది .పౌరుషం తో ఉత్సాహ శక్తి తో ముందుకు నడిస్తే విజయలక్ష్మి తానె వరించి వస్తుంది .కనుక మహారాజా నిరుత్సాహం వదిలి ఉత్సాహం తో పౌరుషాన్ని రగుల్కొలిపి కార్యోన్ముఖుడవు కావలసినదని మనవి ‘’అని ఇంకా చెప్పబోతున్నాడు భీముడు .
సశేషం
రేపు 1-2-20 శనివారం మాఘ శుద్ధ సప్తమి –రథ సప్తమి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-20-ఉయ్యూరు