డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-14
మొసలి చావుకు ముసలమ్మ చిట్కా
ఆనేగొందిలోని తుంగభద్రా నదిలో మొసళ్ళు ఎక్కువ కాని జన సంచారం ఉన్న చోట కనిపించవు .కాని ఒకసారి సుమారు ఏడు అడుగుల ఒకపెద్దమొసలి ఎక్కడి నుంచో అక్కడికి వచ్చింది .ఆనే గొంది తుంగభద్రలో దిగువ మైలు లోపు వ్యాసరాయల మఠం.పీఠాధిపతులైన సన్యాసుల తొమ్మిది సమాధుల గుంపు. అది దాన్ని ‘’నవ బృందావనం’’ లేక ‘’నవ రిందావనం ‘’అంటారు .అక్కడే ఒకమొసలి మనిషిని చంపింది .అప్పుడు ఊళ్లోవారికి కాక కలిగి రాణీకుప్పమ్మారాణీ సాహెబా వారికి ఫిర్యాదు చేశారు .దాన్ని ఎలాగైనాపట్టి ప్రజలబాధలు తీర్చమని అధికారులను ఆదేశించారామె .
రాజవంశానికి చెందిన వీరులు తుపాకులు బరిసెలు ,బల్లాలతో బయల్దేరారు .చాలాచోట్ల మాటు వేసి అది నదిలోని బండ రాళ్ళపై పడుకొన్నప్పుడు కాల్పులు జరిపారు .ఆ గుళ్ళు దాని అతిగట్టి శరీరం లో ఇరుక్కు పోయాయే కాని ఏమీ చేయలేకపోయాయి .అది కళ్ళు మూసి తెరుస్తూంటే కంటి వెంట నీరు ధారగా కారుతుంది .దాన్ని చూసి అది ఏడుస్తోందని భ్రమపడతారు .కనకనే’’మొసలికన్నీరు’’ అనే పేరు లోకం లో వాడుకగా వచ్చింది. క్రమంగా ఆవుదూడలను లాక్కు వెళ్లిందని ఆవుల్ని తినేసిందని వార్తలు పెరిగాయి .మిట్టమధ్యాహ్నం నదిలో అది ఈదటం చాలా మంది చూశారుకూడా .పుట్టిలో కూచుని తుంగభద్ర దాటటానికి జనం భయపడి పోతు౦టే,వాటిని రద్దు చేశారు .
ఈ హడావిడి అంతా ఒక 90ఏళ్ళ ముసలమ్మ విని ఒక నవ్వు నవ్వింది ‘’ఇదేమిటి ?మొసలిని చంపటానికి ఇంతమందా ?ఇన్ని ఆయుదాలా ?’’అని విస్తుపోయి,భుజాలేగారేసింది .ఆమాటలు విన్నవారికి విపరీతంగా కోపం వచ్చి ‘’రాచనగరు వాళ్ళంతా దాన్ని చంపటానికి ఇంతగా శ్రమ పడుతుంటే నవ్వుతావా యెగతాళి చేస్తావా ముసల్దానా ?”’అన్నారు .కొందరు ‘’నువ్వు చంపు చూద్దాం .మంచం నుంచి లేవలేవు మాటలు కోటలు దాటుతున్నాయే ?’’అన్నారు .విరగబడి నవ్వుతూ అవ్వ ‘’దేనికైనా ఉపాయం కావాల్రా కొడుకుల్లారా. ఉపాయం లేని వాణ్ని ఊరినుంచి పంపెయ్యమని పెద్దలు చెప్పారు తెలీదా ‘’అన్నది ‘’ఆ ఉపాయం ఏమిటో చెప్పు “”?అన్నాడు ‘’మీకెందుకు చేబుతాన్రా భడవల్లారా !ఆ చంపే రాజుగారి సిపాయిలోస్తే చెబుతా ‘’అని నవ్వుతూనే .
ఈమాట క్రమంగా రాణీ గారికి చేరింది .ఆమె దూతలు ముసలమ్మ దగ్గరు వచ్చారు మర్యాద చేసింది .’’మామ్మా !నీదగ్గర మొసల్ని చంపే ఉపాయం ఉందట రాణీ గారు తెలుసుకోమని మమ్మల్ని పంపారు .నిజంగా ఉపయోగం ఉంటె నీకు రాణీ గారు గొప్ప బహుమతి ఇస్తారు లేకపోతె —‘’అని నీళ్ళు నమిలారు .ఆమె మధ్యలోనే అందుకొని ‘’ప్రయోజనం లేకపోతె ఈ ఎల్లమ్మ చెప్పదు .చెబితే జరిగి తీరాల్సిందే ‘’అంది ఖచ్చితంగా .అయితే చెప్పండి అని అడిగారు .’’ఏం లేదు నాయనా !ఒక మేకపిల్లను చంపి ,లోపలి భాగాలు తీసేసి ,పచ్చి తోలు మాత్రం ఉంచి లోపల అంతా గవ్వసున్నం కూరి, కుట్టేసి ,లోపల్నిచి తీసిన దాన్ని పై చర్మంపై బాగా దట్టంగా పూసి ,మొసలి ఎక్కువగా ఏప్రాంతంలో తిరుగుతుందో అక్కడ నీటికి దగ్గరగా తాడుతో కట్టేయండి.పచ్చిమాంసం వాసన లేకపోతె మొసలి దగ్గరకు కూడా రాదు అని గుర్తుంచుకోండి ‘’అని చిట్కా చెప్పింది .
చూద్దాం అనుకోని ఆమె చెప్పినట్లే తూచా పాటించి చంపిన మేకపిల్లను నీటి దగ్గరలో సాయం కాలం కట్టేసి భటులు పొదల్లో దాక్కుని ఏం జరుగుతుందో చూస్తున్నారు .అర్ధరాత్రి మొసలివచ్చి గుల్లసున్నం కుక్కిన మేకపిల్లను ఈడ్చుకుపోయింది .మర్నాడుమధ్యాహ్నం నదిలో ఏదో జంతువు పొర్లాడుతూ కనిపించింది .అది శరవేగం గా నీటిలో అటూ ఇటూ తిరుగుతోంది పిచ్చి ఎక్కిన దానిలాగా .సాయంకాలానికి ఊరంతా అల్లకల్లోల౦ గా వచ్చి చూశారు .చిన్న తిమింగిలం పిల్ల నదిలోకి వచ్చిందా అని విస్తుపోయి చూస్తున్నారు .చీకటి పడబోతుండగా నదిలో తెల్లని చారలు కనిపించాయి .అది మొసలి పుట్టి నడిపే ఘాట్ ఎక్కి ఇసుక మీదకుచేరి ,తోక ఇసుకదిబ్బలకు కొడుతూ తెల్లటి నురుగులుకక్కుతూ వెల్లకిలా పడిపోయి,కొట్టుకొంటూ ప్రాణాలు వదిలింది .మొసలికడుపు ఉబ్బి పరమభయంకరంగా కనిపించింది ‘
ఇంతకీ ఏమైంది ?మొసలి కడుపులోకి పోయిన సున్నం కరిగి ,దానికడుపులో మంటలు మొదలయ్యాయి .వాటిని భరించలేక నదిలో అయిదారు మైళ్ళు అటూ ఇటూ తిరిగి ,చివరికి పేగులు తెగి ,చచ్చిపోయింది .రాణీగారు ముసలమ్మకు ఘన సన్మానం చేశారు .ముసలమ్మ చిన్న చిట్కా మొసలి ప్రాణాలను సులభంగా తీసి, జనాలకు మేలు కలిగింది .
‘’అహో విచిత్రం !యద్గ్రాహః –జలస్దాః కర్షతి ద్విపం – స ఏవ తీర స్థలేనః-శునకేన నిహన్యతే ‘’
భావం –ఎంత ఆశ్చర్యం !నీటిలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును కూడా లాక్కు పోతుంది .అదే మొసలి గట్టు మీదుంటే ,దాన్ని కుక్కకూడా కరిచి చంపుతుంది .దీనినే ‘’స్థానబలిమికాని తనబలిమి కాదయా ‘’అన్నాడు వేమన .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-20-ఉయ్యూరు
—