
ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారికి భాషా వికాస పరిధిలో తగిన ప్రోత్సాహం అందించడానికి, భాషను వ్యాప్తి చేయడానికి అధికార భాషా సంఘం పెద్దయెత్తున కృషి ప్రారంభించింది.
దిగంతాలకు విస్తరించిన తెలుగుదనంలో అచ్చమైన తేటతెలుగు మాటలు తరిగిపోతున్నాయి. పలచబారిపోతున్న మన రాతకోతల తెలుగుపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన పలుకుబడి, నుడికారం ఎల్లెడలా పరివ్యాప్తి చెందేలా సరికొత్త ప్రయత్నాలు చురుగ్గా చేపట్టారు. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత స్వరాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలలోని తెలుగువారు కూడా సరైన తెలుగును తెలుసుకుని, దాని అభివృద్ధి కోసం పాటు పడే విధంగా ఆయన కృషి ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశాలోని బరంపురం, కర్నాటకలోని బళ్ళారి, మహారాష్ట్రలోని ముంబాయి వంటి ప్రధాన కేంద్రాలు, ఆయా రాష్ట్రాల పట్టణాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల్లో కొత్తతరంలో తెలుగు వాడకం తగ్గిపోతుంటే, ఆందోళన తప్ప శిక్షణ, వినిమయంపై తగిన శ్రద్ధ, ఫలితాలు ఉండటం లేదని ఆయన గుర్తించారు.
భాషా సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతోపాటు 2013ను తెలుగు భాష, సాంస్కృతిక సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా చేపట్టిన విధివిధానాలను సమర్థంగా అమలు చేయడానికి పెద్దయెత్తున కృషి ప్రారంభించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమ భాషా సంఘం వారి అధ్యయనంతో పాటు, భవిష్యత్ కార్యాచరణకు అనువైన విధి విధానాన్ని సూచించే నివేదికను ఆయన సమర్పించారు. నలభై ఏడేళ్ళ క్రితం ఏర్పాటైన మన రాష్ట్ర అధికార భాషా సంఘంలో పనితీరులో ఫలితాలకన్నా చేయాల్సినవి చాలా ఉన్నాయని పేరుకుపోతున్న అలసత్వం వల్ల ప్రమాదకరమైన స్థాయిలో తెలుగు నుడి దెబ్బతింటోందని ఆయన భావిస్తున్నారు.
తాజాగా గత వారంలో దీపావళి పండుగ తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రత్యేకంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా అధికారికంగా కలసి ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన అంశాలతో పాటు, తమ పూర్వీకుల తెలుగు జాడలు, వారి వారసత్వం అందుకోవడంలో వెనుకబడిపోయామన్న ఆవేదన అక్కడి వారిలో వ్యక్తమైంది. తమ మాటపై పట్టు పెంచుకోవాలన్న ఆకాంక్ష ఉన్న ఆ తెలుగువారు తమను పట్టించుకోని ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా స్పందించారు. ఆ పర్యటనలోని విశేషాలను, తాము చేపడుతున్న చర్యలను మండలి బుద్ధప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
ప్రవాసుల సమస్యలు
“ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తెలుగువారిని కలిశాం. అక్కడ నివసిస్తున్న వారిలో అడుగడుగునా తెలుగుదనంపై అపారమైన ఆపేక్ష, అభిమానం, భావోద్వేగ అభిమానం కనిపించింది. సుమారు 800 ఏళ్ళ క్రితం తమిళనాడు ప్రాంతాల్లోకి వలస వెళ్ళినవారి కుటుంబాలకు చెందినవారి ఈ తరం ప్రతినిధులను కలుసుకున్నప్పుడు, తెలుగు మాట, అక్షరాలు నేర్చుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోనే అంతంతమాత్రంగా ఉన్న తెలుగునుడి, వాడుకపై సమగ్ర విధానం లేని మనకు ఇతర ప్రాంతాల తెలుగువారి తపన కొత్త పాఠాలు నేర్పింది. నాలుగు రోజులపాటు నాతో పాటుగా మరి కొందరు భాషాభిమానులు చెన్నై ప్రాంతంలోని తెలుగు ప్రచార, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు కలసి తెలుగువారి సాంస్కృతిక రాజధాని తంజావూరు ప్రాంతంలో పర్యటించడం జరిగింది. చెన్నై, పుదుచ్చేరిలలో తెలుగువారి సంగతులు గమనించిన మాకు ఇంకా ఇంకా కొత్త అనుభవాలు, అనుభూతులు కలిగాయి.
నాతో పాటు రాష్ట్ర ప్రాచ్యలిఖిత భాండాగారం సంచాలకుడు ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం, రెండుమార్లు తెలుగు రచయితల మహాసభలు నిర్వహించిన అనుభవం గల రచయిత డాక్టర్ జీవీ పూర్ణచంద్, తమిళనాడులోని తెలుగువారు, కళలపై లోతైన అధ్యయనం చేస్తున్న డాక్టర్ సగిలి సుధారాణి, అమెరికాలోని సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, చెన్నై ఆకాశవాణి కేంద్రం నుంచి రచయిత నాగసూరి వేణుగోపాల్, మరికొందరు పాత్రికేయులు మా బృందంలో ఉన్నారు.
మా బృందం పర్యటన ప్రతిపాదన తెలియంగానే తమిళనాడు గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య మమ్మల్ని ప్రోత్సహించి, అభినందించారు. మన తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పటానికి నాలుగేళ్ళ ముందే అప్పటి తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ చొరవతో ఆరంభించిన తమిళ విశ్వవిద్యాలయంలో రెండు రోజులు గడిపాం. తమిళ భాష వికాసం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భాషకు అన్వయిస్తున్న తమిళ యూనివర్సిటీలోని నిర్వహణ బా«ధ్యతల్లో తెలుగువారు చురుగ్గా ఉండటం మాకు ఆనందం, ఆశ్చర్యం కలిగించాయి. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎం. తిరుమలై, రిజిష్ట్రార్ డాక్టర్ ఎన్.ఎస్. గణేశన్ ఇద్దరూ తెలుగువారే!
ఆ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకురాలు డాక్టర్ సిహెచ్. సావిత్రి సమన్వయకర్తగా పుస్తకాల అనువాదాలతో పాటు, ఆ రాష్ట్రంలోని తెలుగువారి జీవనంపై సమగ్ర అధ్యయనం కోసం చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలను మన ప్రభుత్వానికి సమర్పించబోతున్నాం. తమిళ తల్లి విగ్రహంతో సహా అక్కడి భాషాభిమానులు చేసిన సృజన, పెంచుకుంటున్న పదజాలంతోపాటు ప్రపంచ తమిళ మహాసభలతో సహా పలు విషయాల్లో తమిళులు మనకన్నా ఎంతో ముందున్నారు. తమ రాష్ట్రం వదిలి ఇతర ప్రాంతాల్లో ఉన్న తమవారితో కొనసాగిస్తున్న సంబంధాలు, అందిస్తున్న ప్రోత్సాహం కూడా మనం అందుకుని పాటించతగినవి వున్నాయి. మన దేశంలో హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాషగా తెలుగు ఉందని గర్వంగా చెప్పుకునే మనం ఆ తరువాత మోగుతున్న ప్రమాద ఘంటికలను మాత్రం పట్టించుకోవడం లేదు.
‘పరాయివారుగా చూడం’
మారుతున్న తరాల వల్ల ఇతర ప్రాంతాలలోని తెలుగువారు పరాయివారుగా మారిపోతున్నారు. తమిళనాడులో ఈ పరిస్థితి బాగా పెరిగిపోయింది. ఆ రాష్ట్రంలోని విద్యావిధానంలో ద్వితీయ స్థానంలో తెలుగు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించనట్టు ప్రవర్తిస్తున్నారు. మన రాష్ట్రంలో అధికార భాషగా రెండవ స్థానంలో ఉర్దూను గుర్తించి, ఆదరించి ప్రోత్సహిస్తున్న తీరులోనే తమిళనాడులో తెలుగు ఉండాలని మనం అంటున్నాం. కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రం ప్రకారం కూడా తెలుగును కోరుకున్నవారికి బోధించాల్సిన వసతులు కల్పించటం ఆ రాష్ట్ర బాధ్యత. ఈ అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య తమిళనాడు ప్రభుత్వానికి గతంలో లేఖ కూడా రాశారు. తెలుగువారితో సన్నిహిత సంబం«ధం గల గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు తమిళ నాడులో ఉన్న ప్రస్తుత సందర్భంలో తమిళనాడులోని తెలుగువారు ఆశావహంగా నూతన విద్యావిధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ విధానాన్ని చురుగ్గా అమలు చేసేలా చేయాలని మా ప్రతినిధి వర్గం మరోసారి కోరుతోంది.
సరస్వతీ మహల్
తమిళ నాడులోని తంజావూరులో తెలుగువారి సారసత్వానికి మహత్తరమైన పెన్నిధి వంటి తాళపత్ర గ్రంథాలను పరిరక్షిస్తున్న సరస్వతీ మహల్‌లో తెలుగు పుస్తకాల ప్రచురణ కూడా మందకొడిగా సాగుతోంది. 1855 దాకా పరిపాలించిన మరాఠీ రాజులు, అంతకు ముందటి నాయక రాజులు పెంచి పోషించిన తెలుగుదనం, మనకు అందించిన అక్షర సంపద ఇంకా విస్తృతంగా వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. తెలుగు పుస్తకాల ప్రచురణలో తరతరాల తాటి ఆకుల రచనల్నే భావితరాలకు అందించే పుస్తకాల ప్రచురణ చురుగ్గా సాగాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’ రాత ప్రతి వంటి కావ్యాలు అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి. ఆ గ్రంథాలయాన్ని నిర్వహించాల్సిన సిబ్బంది విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని గమనించాం. సరస్వతీ మహల్ వంటి గ్రంథాలయాన్ని నిర్వహించడంలో ఏళ్ళ తరబడి ఇన్‌ఛార్జ్‌లు మాత్రమే తమ పరిధిలో బాధ్యతలు నిర్వహించడం లోపభూయిష్టంగా ఉంది.
సాంస్కృతిక మండలి
దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, సమన్వయ బాధ్యతలు, పరస్పర మార్పిడి కార్యక్రమాలు నిర్వహించాల్సిన దక్షిణ భారత సాంస్కృతిక మండలిలో చురుకుదనం లోపించింది. మన రాష్ట్ర వాటాగా కోటి రూపాయలు మించిన మదుపు ఉన్నా అందుకు తగిన రీతిలో కార్యక్రమాలు జరగటం లేదనిపిస్తోంది. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడానికి ఆ మండలి అధ్యక్షుడిగా వ్యవహరించే తమిళనాడు గవర్నర్ రోశయ్య గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేయబోతున్నాం. మన రాష్ట్ర కళారంగం నుంచి ఆ మండలి పాలకవర్గంలో సభ్యులుగా ఉన్నా, వారికి తగిన సమాచారం, బాధ్యతలు వహించే అవకాశం కూడా లేకపోవడంతో అసలు ఆశయం కుంటుపడుతోంది.
పల్లెలో తెలుగుదనం
వ్యవసాయ కుటుంబాల్లో చెక్కుచెదరని తెలుగు ఆపేక్ష, కొద్దిగానైనా మాటల సంపద పెంచుకుందామనే తాపత్రయం కనిపించే పల్లె మమ్మల్నందరినీ కదిలించింది. ‘పిళ్ళైపట్టి’ పేరుతో తంజావూరుకు సమీపంగా జీన్న గ్రామంలో ఒక సాయంత్రం అనుభూతి మా మీద చెరగని ముద్ర వేసింది. సుమారు 55 ఏళ్ళుగా ఆ పల్లెకు సర్పంచిగా ఉన్న పెద్దాయన తమ ఊరిలోవారి కోరికలను తెలియజెబుతూ తమ ఇంట్లో కొన్ని మాటలకు పరిమితమైపోయిన తెలుగును చదవటం, రాయటం వచ్చేలా చేయాలని తాను ఎంతగా ప్రయత్నించినా ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంప్రదాయమైన పూజలు, పండుగల సమయాల్లో కనీసం ఒక్క పాట, ప్రార్థనలను అయినా నోరారా తెలుగులో ఆలపిద్దామన్నా నేర్పించేవారు లేరని అక్కడ ఒకామే బాధపడింది. మన సాంస్కృతిక శాఖ వారికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు చేస్తున్నాం.
తిరువయ్యూర్ త్యాగరాజు
కర్నాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజు సమాధి ఉన్న తిరువయ్యూరులో ఏడాదికోసారి చెన్నై నుంచి నిర్వాహకులు వచ్చి చేసే ఆరాధనోత్సవాలు తప్ప మన తెలుగువారికి సంబంధించి ఏ కార్యక్రమమూ జరగటం లేదు. ఆ ప్రాంతాన్ని నిత్యం సందర్శించి పూజలు చేసేవారికి ఏడాది పొడవునా అక్కడ సంగీత స్రవంతి పొంగి పొరలేలా తగిన ప్రాంగణం ఉండాలని భావించాం. అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
శ్రీరంగంలో నాదస్వరం
ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచి అక్కడి కావేరీ తీరంలో వైష్ణవనిలయమైన శ్రీరంగంలో నాదస్వర విద్వాంసులుగా స్థిరపడిన తెలుగు కుటుంబాలవారిని మనం ఆదరించడం మరచిపోయాం, పద్మశ్రీ, కలైమామణి వంటి బిరుదులతో తమిళనాడు ప్రభుత్వం వారిని ఆదరిస్తుంటే, వారిని గుర్తించి సత్కరించడం కూడా విస్మరించిన మన ప్రభుత్వం తీరుపై మనస్తాపం చెందుతున్న ఆ కుటుంబాల వారిని సన్నిహితంగా గమనించాం. ఆ కళను ప్రోత్సహంచేలా తగిన చర్యలు చేపట్టే విధివిధానాలను సూచించనున్నాం. మన పొరుగున ఉన్న తెలుగువారికి సంతృప్తికరమైన ప్రోత్సాహకాలు అందించడానికి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో అవసరమైన చురుకుదనం పెంచడానికి మనం ఎంతో శ్రద్ధ పెట్టాలన్న నిశ్చయంతో మా వంతుగా తగిన ప్రయత్నాలు మొదలుపెట్టనున్నాం” అని మండలి వివరించారు.
-జి.ఎల్.ఎన్. మూర్తి
