ఆవంత్స @90 ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ

 

చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.రాయాలనుకొని రాయలేకపోయిన రచనలు ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను.ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, రెండు కవిత్వ శుద్ధి.

‘ఒక వీరుడు మరణిస్తే
వేలకొలది ప్రభవింతురు!
ఒక నెత్తుటి బొట్టులోనె
ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు!’
అని నినదించిన ‘వజ్రాయుధ’ కవి,
‘తెలంగాణ! తెలంగాణ!!
ధీరులకు మొగసాల;
తెలంగాణ! తెలంగాణ!!
విప్లవోజ్వల గాథ’

అంటూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రించిన కవి డా.ఆవంత్స సోమసుందర్ సుమారు ఏడు దశాబ్దుల నుంచి కవిగా, కథకునిగా, విమర్శకునిగా, అనువాదకునిగా నిరవధిక సాహిత్య సృజన అనన్య సాధ్యమైనది. ఇవాళ 90వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఆయనతో ముఖాముఖి…

మీరు రచయితగా మారడానికి నేపథ్యం?
– నా కన్న తల్లికి చెల్లెలు (పినతల్లి కూతురు) నన్ను పెంచుకుంది. ఆమె పోతన భాగవతం బాగా చదువుకుంది. ఆమెకు కృష్ణ శతకం కంఠస్థం. ఆమె నన్ను నా నాల్గవ ఏట మా అమ్మ నుంచి తెచ్చుకుని పెంచుకుంది. నా నాల్గవ ఏట నుంచీ ఆ పద్యాలు చెప్పి కంఠతా పట్టించేది. తెలుగు కవిత్వంతో నా మొదటి పరిచయం అదే. బహుశా ఆ తొలి పరిచయమే నన్ను కవిత్వంలో నిమగ్నం చేసింది. తర్వాత పోతన భాగవతం, శ్రీకృష్ణ లీలలు, రుక్మిణీ కళ్యాణం, గజేంద్రమోక్షం వంటి ఘట్టాలను క్షుణ్ణంగా నా చేత చదివించేది. ఇదే నా కవిత్వ రచనకు బలవర్థకమయినది. నా పదమూడో ఏటి నుంచీ కవిత్వ రచన చేస్తూ వచ్చాను. 1942లో గాంధీజీ వగైరాల అరెస్టుతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ దారిలో పయనిస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ యాక్టివిస్టునై కమ్యూనిస్టు పార్టీలో చేరాను. 1942 నుంచే నా కవిత్వ వైఖరిని మార్చుకొని అభ్యుదయ కవిత్వం రాయడం మొదలెట్టాను. నా తొలి కవితలు గ్రంథస్థం చెయ్యలేదు. తొలి కవితలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ కవితలలో ‘కాశ్మీరం మేల్కొంది’, ‘తారతమ్యం’ వగైరా ముఖ్యమైనవి.

కమ్యూనిస్టు భావజాల పూర్వాపరాలు?
– 1942 నుంచీ సిద్ధాంతమూ, ఆచరణా నాలో జంటగా సాగాయి. ఈ సాధన 1942 నుంచి 1954 వరకూ పార్టీ కార్యకర్తగా ఉన్న పదేళ్లూ పెంపొందింది. తర్వాత కేవలం సాహిత్య కృషికి ఎక్కువ మగ్నమై పార్టీ కార్యకర్తగా ఉండడం విరమించాను. ఈ మార్పు నాలో సమస్త సాహిత్యాభివృద్ధికీ దోహదం చేసింది.

మీ తొలి రచన- నాటి విమర్శకుల ప్రతిస్పందనలు?
– ప్రచురితమైన నా తొలి రచన ‘వజ్రాయుధమే’. 1950 వరకూ దానిపై సమీక్షలు, చర్చలూ కొనసాగాయి. వాద ప్రతివాదాల మీదికి ఇప్పుడు దృష్టి మరల్చలేం. కాని వజ్రాయుధానికి 62వ వార్షికోత్సవంగా ఆరవ ముద్రణ పాకెట్ సైజ్‌లో ముద్రించాం. అందులో ఈ వాద ప్రతివాదాలపై సమీక్ష ఉంది. 1950 ఫిబ్రవరి 6న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ‘వజ్రాయుధా’న్ని నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. నవ్యకావ్యాల్లో విశ్వనాథ ‘ఆంధ్రదర్శనం’, గరిమెళ్ల వారి పాటలు అప్పుడు నిషేధానికి గురయ్యాయి.
తెలంగాణ సాయుధ పోరాటం గూర్చి అప్పుడు మీకున్న సమాచారం?
– కమ్యూనిస్టు కార్యకర్తగా కార్యాచరణతోపాటు అధ్యయనం విధిగా జరుపుతున్న 1945-47 మధ్యకాలంలో తెలంగాణ సాయుధ పోరాట ప్రతి సన్నివేశమూ నా సమాచారంలో ఉండేది. అదే నన్ను ఉత్సాహపరిచి కవిత్వం రాయించింది. 1946 అక్టోబర్ 26న విస్నూరు దేశ్‌ముఖ్ తల్లి జానమ్మ తన మనుషుల చేత ఊరేగింపు సాగిస్తున్న రైతులపై తుపాకులు కాల్పించింది. దొడ్డి కొమురయ్య అనే యువవీరుడు హతుడయ్యాడు. ఆ వీరుని మరణం నన్ను చాలా కలచివేసింది. ఆ రాత్రే ‘ఖబడ్దార్’ గీతం రాశాను. ప్రస్తుతం మలేషియా, సింగపూర్‌లను ‘మలయా’ అని పిలిచేవారు. అక్కడి ప్రజల్లో భారతీయులు దాదాపు చెరిసగం ఉండేవారు. అక్కడ మెక్‌డొనాల్డ్ అనే పరిపాలకుడు జనాన్ని హత్య చేస్తుంటే అక్కడ కమ్యూనిస్టులు కూడా తిరగబడ్డారు. తదుపరి ఆ దేశపు రూపురేఖలు మారి మలేషియాగా రూపొందింది. అప్పుడు రాసిందే ‘ప్రళయ ప్రభంజనం’ కవిత.

‘కళాకేళి’ నడపడానికి కారణాలు – కష్టనష్టాలు?
– రాచమల్లు రామచంద్రారెడ్డి కడప నుంచి ‘సంవేదన’ పత్రిక పెట్టిన తర్వాత ఆధునిక సాహిత్యం గురించి చర్చ, జిజ్ఞాస బయల్దేరాయి. వరవరరావు ‘సృజన’ పెట్టడానికి నిశ్చయించుకున్నారు. నేనూ, మా మిత్రులు ‘కళాకేళి’ పెట్టడానికి నిశ్చయించుకున్నాం. 1968 నుంచి 1975 దాకా నడిపి వచ్చిన నష్టంతో సరిపెట్టుకుంటూ విరమించాం. అది కలిగించిన సాహిత్య సంచలనం మాత్రం అమేయం.

ఆంగ్ల కవిత్వం మీద, సాహిత్య విమర్శ మీద పట్టు ఎలా సాధించగలిగారు?
– దాదాపు అదే రోజుల నుంచి రోజుకు కనీసం రెండు గంటలు ఆంగ్ల విమర్శ గ్రంథాలూ, కవిత్వమూ చదివేవాణ్ణి. ఈ విధంగా చాలాకాలం జరిగింది. ‘శేషేంద్రజాలం’తో నా అభివ్యక్తి ప్రారంభమైంది.
మీపైన కృష్ణశాస్త్రి ప్రభావమెలాంటిది?
– నా మీద కృష్ణశాస్త్రి ప్రభావమే ఉంది. ఆ ప్రభావాన్ని అణచుకుందుకే నా ప్రయత్నమంతా!

వ్యక్తిగత జీవితంలో కమ్యూనిస్టుగా జీవించగలిగారా?
– కమ్యూనిస్టు పార్టీలో నా పద్దెనిమిదవ యేట చేరాను. 1945 ప్రాంతం నుంచి సార్వకాలిక కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేశాను. 1947 నుంచి తుని సబ్ జైలులో వివిధ కేసులలో ముద్దాయిగా ఐదున్నర నెలలు జైలు జీవితం గడిపాను. కేసులన్నీ పోయిన తర్వాత హౌస్ అరెస్టులో ఆరునెలలున్నాను. బయట కమ్యూనిస్టులు భయంకరమైన హింసలకు గురయ్యారు. చాలా సంఘర్షణలు ఎదుర్కోవలసివచ్చింది.
విశ్వనాథతో మీ సాహిత్య సంబంధాలు ఎలా ఉండేవి?
– విశ్వనాథకు నా అభిప్రాయాల గురించి తెలుసు. నా ‘వజ్రాయుధం’ చదివారు. ఆయన ఎప్పుడూ కోప్పడలేదు. పైగా ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ నాటకంలో హరిగిరి సంభాషణలో నన్ను మెచ్చుకున్నారు కూడా.
శ్రీశ్రీ, నారాయణబాబుల కవిత్వాలలో ఎవరిది విశిష్టమైనదని భావిస్తారు?
– శ్రీశ్రీ కవిత్వం స్పష్టంగా విప్పి చెబుతుంది. నారాయణబాబు కవిత్వం కొంత కప్పి చెబుతుంది.

శేషేంద్రతో కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు కదా! ఆ తర్వాత దూరమైనట్టున్నారు!
– శేషేంద్ర కవిత్వం రాయకముందు, రాశాక కూడా ఆయనతో సన్నిహితంగానే ఉండేవాణ్ణి. అయితే వారి ప్యాలెస్‌కు వెళ్లడం మానేశాను.
శేషేంద్రది విప్లవ కవిత్వమే నంటారా?
– మండే సూర్యుడు, నా దేశం నా ప్రజలు, గొరిల్లా ఈ మూడు కావ్యాలూ విప్లవాత్మకమైనవే, సందేహం లేదు. తర్వాత కొంత కంగాళీ ఉంది.
ఇస్మాయిల్‌ని గూర్చి….
– ఎవళ్లేనా, ఏ వస్తువు మీదనైనా ఎలాగైనా కవి త్వం రాయవచ్చు. కానీ, ఇదే కవిత్వం అన్యం కాదని చెప్పే ధోరణికి దిగాడు. అతడు విద్యార్థి దశ నుంచీ (1944) నాకు సన్నిహిత మిత్రుడు. అతని ‘చెట్టు నా ఆదర్శం’ అనే కవితా సంపుటికి 27 పేజీల ముందుమాట రాశాను. తర్వాత అతని ధోరణులు మితిమీరి, నా ముందుమాట తీసేసి ప్రచురించాడు. నేనూ కలగజేసుకోలేదు.

పోస్ట్ మోడర్నిజమ్ గురించి…?
– పోస్ట్ మోడర్నిజమ్ అనేది శుద్ధ పొరపాటు వాదమని యూరప్ అమెరికాలలోని వేత్తలంటున్నారు. వారి వాదనలపై ‘ఆంధ్రజ్యోతి’లో పాపినేని శివశంకర్ ఇటీవల ఒక వ్యాసం రాశాడు. చదువదగినది. నా మటుకు నేను ‘శతాబ్దం మారినా ఆధునికత్వమే కొనసాగుతోంది’ అంటాను.
శ్రీశ్రీ ‘అనంతం’ గూర్చి….
– శ్రీశ్రీ గొప్ప కవి. కానీ జేమ్స్ జాయిస్ మొదలైనవారి విపరీత ప్రభావం, ఆయన కృషిని సందేహాస్పదం చేసింది. దానివల్లనే ‘అనంతం’ పెడమార్గం తొక్కింది.

స్త్రీ, దళిత, మైనారిటీ వాదాల మీద మీ అభిప్రాయం?
– ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, రెండు కవిత్వ శుద్ధి.
మీ సమకాలికులలో మీకు అత్యంత ఆత్మీయులు ఎవరు? ఎందుకు?
– నాకు ఆత్మీయులు ఎందరో ఉన్నారు. అందరూ ఒకే కారణం వల్ల కాదు. అందరూ తలో కారణం వల్ల. శివారెడ్డి అంటే నాకు ప్రేమ. తన చిత్తశుద్ధిని మెచ్చుకుంటాను. అయితే ‘అ’ నుంచి ‘క్ష’ వరకూ అతన్ని బలపరుస్తానని కాదు. వరవర అంటే నాకు ఇష్టం. అయితే ఆయన రాజకీయ సిద్ధాంతాలతో నేను ఏకీభవించను. సాహిత్య రంగంలో మరీ కొత్త రచయితలు తప్ప, నా కందరూ ఆత్మీయులే. సమకాలికులు అన్నప్పుడు, సమవయస్కులని మాత్రమే అర్థం కాదు కదా!
కవిగా, విమర్శకునిగా మీకు రావలసినంత గుర్తింపు వచ్చిందనుకుంటున్నారా?

– రావలసిన గుర్తింపు కొలమానాలుండవు. నన్నందరూ గుర్తించారు. కొందరు గుర్తించకపోయినా నాకు ప్రమేయం లేదు. చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.
ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్యాలలో మీకు తిరిగి తిరిగి చదవాలనిపించేవి ఏవి?
– ప్రాచీన కావ్యాల్లో భారత భాగవతాల్లో కొన్ని ఘట్టాలైనా ప్రతివాడూ చదవాలి! అలాగే శ్రీనాధుడిని చదవడం తప్పనిసరి. నాచన సోముడిని కూడా చదవవచ్చు. పెద్దన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణులు ముగ్గురూ చాలా కవిత్వాన్ని నిక్షిప్తం చేసుకున్నారు. ఏనుగు లక్ష్మణ కవిని విస్మరించకూడదు. సంస్కృత కావ్యాలలో నేను పెద్ద కృషి చెయ్యలేదు. చాలా కావ్యాలు కొద్దికొద్దిగా చదివాను. ఒక్క కాళిదాసు ‘మేఘసందేశం’ మాత్రం ఆద్యంతం చదివాను. ‘మృచ్ఛకటికం’ గురించి పెద్దలు చాలా చెబుతుంటారు. నాకంత గొప్పతనం కనబడలేదు అందులో.

‘కలలు – కన్నీళ్ళు’ అనే ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తే బాగుండేదని నాకనిపించింది. మీరేమంటారు?
– మీరనుకోవడం న్యాయమే. మరికొందరు విజ్ఞులు కూడా ఇలాగే అనుకున్నారు. కొందరు ఉత్తరాలు కూడా రాశారు. అంతే, అకాడమీ వారి నుంచి మాత్రం ఏమీ వినలేదు. ఒకసారి- నా రచనలు రెండు పుస్తకాలు ఆరేసి కాపీలు పంపమన్నారు. పంపాను. డబ్బులు పంపారు. దానితో కథ కంచికి.
కొత్త తరం కవులు మంచి కవిత్వం రాయడానికి చదువవలసిన గ్రంథాలు?
– సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఎంతో కొంత భారతాన్ని చదవాలి. తిక్కననీ, శ్రీనాథుణ్ణీ, పెద్దనను చదవాలి. ఆముక్త మాల్యదను చాలా జాగ్రత్తగా సన్నిహితంగా చదివాను. కానీ అందరూ చదువలేరు. ఏ పనీ లేనివాణ్ణి కనుక ఆ కావ్యంతో దినాలు గడిపాను. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.
మీ వచన రచనలలో భావ కవిత్వ భాష ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంటుందని కొందరి అభిప్రాయం…

– నేనేమీ అనను. నా భాష నాది. నా శైలి నా రక్త నిష్ఠం.
మీరు రాయాలనుకొని రాయలేకపోయిన రచనలేమైనా ఉన్నాయా?
– ఉంటాయి, తప్పకుండా ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను. సాఫీగా నడవడం మానేసి కాలం అప్పుడప్పుడు దుముకుతూంటుంది.
చూపు ఆనని, స్వంతంగా రాయలేని స్థితిలో కూడా ఎడతెగకుండా రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి?
– నా స్ఫూర్తి పై నుంచి వచ్చినది కాదు. అది నా వ్యక్తిత్వంలోంచి బయటపడ్డది. ఏదో ఆశించి చేస్తున్నదీ కాదు. నేను రాస్తున్న క్షణాలు నేను బతుకుతున్న క్షణాలనిపిస్తుంది. ఒక రచన చేస్తే ఎంత హాయిగా ఉంటానో మా వాళ్లందరికీ తెలుసు. ఆ హాయి గురించే రాస్తున్నానేమో. చదవడంలో, రాయడంలో నాకు సహకరిస్తున్న అమ్మాయి చిరంజీవిని యర్రమిల్లి ఉషాకుమారి.
ఆంగ్ల మాధ్యమం వల్ల తెలుగు చదవడం, రాయడం రాని తరాలు వస్తున్న క్రమంలో తెలుగు సాహిత్యం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటారు?

– ఆంగ్ల భాష మనకు ఒక పారిశుధ్యం కలిగించింది. మనసులను సివిలైజ్ చేసింది. చైనా, వగైరా దేశాలు ఆంగ్ల భాషను పూర్తిగా విసర్జించాయి. అవేమీ వెనుకబడిపోలేదు. కనుక నా మటుకు నేను ఇలా ఏమీ ఆలోచించలేకపోతున్నాను.
‘తెలంగాణ’ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తున్నది. మీ ప్రతిస్పందన?
– తెలంగాణ ఉద్యమం ఆ రోజులలోనే ఆరంభమైంది. ‘కళాకేళి’ ఉగాది సంచిక 1969 మార్చిలో సంపాదకీయం రాస్తూ-  ‘Who first seduced them to that foul revolt’అనే మిల్టన్ కవి మాటలతో ప్రారంభించి, ‘తెలంగాణ ప్రజలు కోరుతున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం బేషరతుగా ఇవ్వవలసిందే!’ అని రాశాం. మా అ.ర.సం. నాయకుడు తుమ్మల వెంకట్రామయ్య దానిని ‘విశాలాంధ్ర’లో చెడామడా ఖండించాడు. అయినా నా అభిప్రాయం మార్చుకోలేదు.
కొత్త తరం కవులు నిశితంగా ఆలోచిస్తున్నారు. అనేక ప్రక్రియలలో రచనలు చేస్తున్నారు. అందరి అభివృద్ధి కోరుతూ శుభాకాంక్ష లందజేస్తున్నాను.
ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ
94404 37200

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.