బ్రాహ్మణాల కదా కమా మీషు-12

బ్రాహ్మణాల కదా కమా మీషు-12

తలవకార బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు

వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని శిష్యుడే తలవ కారుడు .జైమిని చేత రచించ బడి తలవకారుని చేత ప్రచారం పొందింది తలవకార బ్రాహ్మణం .రచయితకంటే ప్రచారకునికే అధిక ప్రాధాన్యం కలగటం విశేషం .కొందరు జైమినీయ  బ్రాహ్మణం అనీ పిలవటం కద్దు .సామ వేదానికికున్న అనేక శాఖలలో ఇదొకటి .ఇందులో అయిదు కాండలుంటాయి అవే ఆగ్నేయ ,ఐంద్ర  పవమాన అరుణ ,శుక్రియలు .నాల్గవ దాన్ని ఉపనిషద్ బ్రాహ్మణం  అనీ పిలుస్తారు .చివరి దానికి ఆర్షేయ బ్రాహ్మణం అనే పేరు కూడా ఉంది .సింధు నదీ తీర ప్రాంతం లో ఇది పుట్టిందని భావిస్తారు .సాయనుడు దీనికి భాష్యం రాయ లేదు .భావత్రాతుడు రాసినట్లు తెలుస్తోంది .  సామగాచార్యులలో జైమిని ప్రసిద్ధుడు .కర్నాటక దేశం వాడని ‘’కర్నాటకే జైమినిహ్ ప్రసిద్ధః ‘’అని ‘’చరణ వ్యూహం’’ బట్టి తెలుస్తోంది .యజ్న యాగాదుల విషయాలే ఎక్కువ .జ్యోతి స్తోమం చేస్తే స్వర్గం వస్తుందని చెప్పింది  స్వర్గం  అంటే  సుఖం అనే అర్ధం కూడా ఉంది .

ఇందులో ఋత్విక్కుల విధుల గురించి పూర్తీ సమాచారం ఉంది .యాగం మొదట్లో అధ్వర్యుడు ‘’దీక్షణీయ ‘’అనే ఇష్టి జరిపి యజమానికి అతని భార్యకు దీక్ష నిస్తాడు .దీక్షా కాలం లో యాజమాన దంపతులు వంటికి వెన్న రాసుకొని ,కంటికి కాటుక పెట్టుకొని ఉండాలి .గోళ్ళతో గోక్కో రాదు .జింక కొమ్ముతో గోక్కోవాలి .పాలు ,అత్తిపండ్లు ,పెరుగు ,పేలాలు మాత్రమె ఆహారం గా గ్రహించాలి .కడుపు నిండక పోతే వట్టి అన్నం తినచ్చు .అపశబ్దాలు ,అసత్యాలు పలకరాడు .పళ్ళు కనబడేట్లు నవ్వ రాదు .స్త్రీముఖం చూడరాదు .యజ్న శాల విడిచి వెళ్ళరాదు  .ఋత్విక్కులకు దక్షిణ ఇచ్చేవరకూ తన చేతి తో ఎవరికీ ఏమీ ఇవ్వరాదు .యాగా ద్రవ్య సేకరణకు నాలుగు దిక్కులకు యాచకులను పంపాలి .యాచకులు అంటే అడుక్కొనే వాళ్ళు కాదు హోమ ద్రవ్యాలను  సేకరించేవారు .యెంత ధన వంతుడైనా ఇది తప్పని సరి విధి .దీనితో మొదటి రోజు కార్య క్రమం పూర్తవుతుంది .

రెండవ రోజు ‘’ప్రాయణీయ ‘’ఇష్టి జరిపి వస్త్రాన్నిచ్చి సోమలతను కొనుక్కోవాలి .ఇప్పుడు సోమలత దొరకటం లేదుకనుక ‘’పూతిక ‘’ను ప్రత్యామ్నాయం గా వాడుతున్నారు .ఈ సోమాని కి ‘’రాజు ‘’అని వేదం పేరు పెట్టింది .

రాజు మన ఇంటికి వస్తే ఎలా ఆతిధ్యమిస్తామో సోమానికీ అలానే ఇవ్వాలి .దీన్ని ‘’అతిధ్యేష్టి’’అంటారు .దీని తర్వాత యజమాని ,ఋత్విక్కులు పరస్పరం స్నేహం తో ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి .తర్వాత ‘’ప్రవర్గ్య కర్మ ‘’ప్రారంభిస్తారు .మనశరీరం లో శిరస్సుకు యెంత ప్రాధాన్యం ఉందో దీనికీ అంటే ప్రాముఖ్యం ఉంది .దీనికో కద కూడా ఉంది .పూర్వం విష్ణు మూర్తి ధనుర్యుద్ధం లో దేవతలను ఓడించి ,ధనుస్సును గడ్డం కింద పెట్టుకొని విలాసం గా నిల బడి ఉంటె ,ప్రతీకారేచ్చ తో ఇంద్రుడు చెద పురుగులను పంపి అల్లే త్రాటిని కోరికిస్తాడు .బంధం ఊడిపోయి ధనుస్సుకర్ర అతి వేగం తో పైకెగిరి విష్ణువు శిరస్సును శరీరం నుండి వేరు చేస్తుంది .ప్రతిక్రియ జరిగింది కనుక యజ్ఞం విచ్చిన్నమైంది .అశ్వినీ దేవతలు వచ్చి శిరస్సును అతికించిన తర్వాత దేవతలు యజ్ఞాన్ని పూర్తీ చేశారు .దీన్ని అనుకరిస్తూ ‘’మహా వీర’’అనే శిరస్సు లాంటి  కుండ ఒకదాన్ని మంత్రం పూతం గా తయారు చేసి  అందులో  ఆవుపాలను మేక పాలను నేతినీ పోస్తారు .వీటితో హోమం చేస్తారు ఇదే ప్రవర్గ్యం .ఉపసత్ అనే ఇష్టిని చేసి రెండో రోజు పని పూర్తీ చేస్తారు .మూడవ రోజు ‘’సుత్య’’అనే అయిదవ రోజుకుసోమయాగానికి  కావాల్సిన వేదికను తయారు చేస్తారు .నాల్గవ నాడు ‘’అగ్నిస్తోమీయం ‘’అనే పశు యాగం చేస్తారు అ రోజే సోమలతను రాతి మీద ఉంచి ,రాతి తో దంచి రసం తీసి దాన్ని కొయ్య తో తయారైన ‘’గ్రహం ‘’అనే చిన్న పాత్రలో పోసి ఇంద్రాది దేవతల నుద్దేశించి హోమం చేస్తారు .హోమం చేయగా మిగిలిన రసాన్ని యజమానులు తాగుతారు .సోమ లత అనే ఓషధిని రాతి తో కొట్టి రసం తీయటం పీడనమే కనుక పరిహారం కోసం ‘’వసతీరా ‘’అనే పుణ్య జలాన్ని స్పర్శించి దోషాన్ని పోగొట్టుకొంటారు .

ఇందులో ఒక ఉపాఖ్యానం సరదాగా ఉంటుంది .జంటగా ఉండే కొండ గుహల్లాంటి చీకట్లో నివశించే బలుడు అనే రాక్షసుడు దేవతలను విపరీతం గా పీడించేవాడు .వాళ్ళు బృహ స్పతి  తో మొరపెట్టుకొంటే ఆయన ‘’బల  భిత్ ‘’అనే యాగాన్ని చేసి వాడిని  చీక ట్లోంచి వెలుగు లోకి రప్పించి ఆయుధాలతో చీల్చి చంపాడు .అంటే ఈ యాగం శత్రునాశన కారి అని తెలుస్తోంది .అన్న  సమృద్ధి ద్ధికోసం విరాట అనే యాగాన్ని ,స్వారాట్ వల్ల  స్వారాజ్యాన్ని అంటే తనకు తాను ప్రకాశించేలోకంపొందాలి  ,వృషభ యాగం చేసి దేవ శ్రేస్టూడైనాడు ఇంద్రుడు  వృషభం శ్రేస్టత్వానికి సూచిక .పదమూడు నుండి వెయ్యేళ్ళ వరకు చేసే యాగాన్ని సత్రం అంటారు .’’గవా మయనం’’అనేది అయన క్రతువులకు వికృతి .ఏడాదిపాటు చేస్తారు .ఇది చేస్తే స్వర్గం శత్రు విజయం ,వాక్పటుత్వం మొదలైనవి .పరమాత్మ సమర్పణ బుద్ధితో చేస్తే మోక్షం లభిస్తుందని ఈ బ్రాహ్మణం తెలియ జేస్తోంది .

ఇతర సామ వేద బ్రాహ్మణాల కంటే  తలవికారం అతి పెద్దది .కాని ఇది సస్వరం గా లభించలేదు .దీని వ్యాఖ్యానం ,ప్రయోగ పధ్ధతి ,శ్రౌత సూత్రం కాని దొరక్క పోవటం దురదృష్టం .ఉపాఖ్యానాలలో ప్రసిద్ధ రాజుల ,ఆచార్యుల పేర్లు కని పిస్తాయి .జనకుని సమకాలిక రాజు లెందరినో ఇది ప్రస్తావించింది .వీరిలో చితుడు ,దాల్భ్య వంశ మూల పురుషుడు దర్భ్యుడు ,కేశి దార్భ్యుడు ,సుత్వా యాజన సేనుడు ,లుషాకపి ,ఖార్గాలి ,సుదక్షిణ క్లైమి,బ్రహ్మ దత్త ప్రసేన జిత్తులున్నారు .చెట్లు ,చేమలు లేక పొతే ప్రాణి మనుగడ అసాధ్యం అని ఈ బ్రాహ్మణం చెప్పింది .ఓషధులు వనస్పతులు లేక పోతే భూమి ప్రాణ నివాసా యోగ్యం కాదని గరుడుడు స్వర్గం నుంచి సోమలతను తెచ్చి భూమిపై పిండాడు .ఆ రస బిందువులు పడిన చోట్లలో తాబేలు వీపులాగా కఠినం గా ఉన్న బోడి గా ఉన్న భూమి మీద ఓషధ వనస్పతులు పుట్టాయట .వీటివల్లనే భూమి నివాస యోగ్యమైంది .

వాయువు అంతరిక్షం లో ప్రకాశిస్తుందని ,శక్తి వంతమైన అణువులతో నిండిన అయస్కాంత క్షేత్రం చేత ఆకర్షింప బడి అడ్డం గా వీస్తుందని ,ఉత్తరాభిముఖం గానే ఈ వాయువు వీస్తుందని ,తెల్లగా ప్రకాశించే రూపం తో ఉంటుందని ,ఈ వాయువే అంత రిక్షాదిపతి అని ఈ  బ్రాహ్మణం  చెప్పింది . అంతరిక్షం లో శక్తి పూరిత అణువులుంటాయి  ప్రాణం నుంచి జలం నుంచి ,అగ్ని నుంచి ఇవి పుట్టి ప్రకాశిస్తాయని చెప్పింది ఇవే .ఈ బ్రాహ్మణం లో  ‘’పశు ‘’శబ్దం చేత పేర్కొన బడ్డాయి .వర్షం కోసం దుందుభి అనే వాయిద్యాలను  మోగించాలని చెప్పింది. యాజ్ఞిక ,చారిత్రిక ,భాషా ప్రయోగ దృష్టిలో తలవికార బ్రాహ్మణం ఎన్నో విశిష్టతలను ప్రదర్శించింది

‘’ఏష వై శశః య ఏషో న్తశ్చంద్రమసి ‘’అని చెప్పింది అంటే చంద్రునిలో కన బడే మచ్చ కుందేలే అని కవితా పరం గా చెప్పింది .వీణకు ఒకప్పుడు నూరు తీగాలుండేవని  ‘’వాణంశత తంత్రి మాహరాంతి ‘’అనే వాక్యం వలన తెలుస్తోంది ..గర్భస్థ శిశువుకు అడ లేక మగ లక్షణాలు అయిదవ మాసంలో ఏర్పడతాయని ‘’తస్మాత్ పంచమే మాసి గర్భా విక్రియన్తే ‘’అన్నదాని ద్వారా తెలుస్తోంది .

దేవతలకు రాక్షసులకు తాగాదాలు మామూలే కాని ఇందులో దేవతలకు ఋషులకు తగాదాలున్నట్లు చెప్ప బడింది .మనువుపుత్రుడు శార్యావతుడు అనే రుషి యజ్ఞం చేశాడు .భ్రుగు వంశానికి చెందిన చ్యవన మహర్షి సోమ పాత్రను అశ్వినీ దేవతల కోసం హోమం చేయటానికి చేతిలోకి తీసుకొన్నాడు .ఇంద్రుడు మహర్షికి తెలియకుండా ఆ పాత్రను దొంగిలించుకు పారిపోయాడు .ఈ పని చేసింది ఇంద్రుడే అని తెలిసి చ్యవనుడు ఇంద్రుడిని కొట్టాడు .దేవతలకు కోపమొచ్చింది . రుషులకూశువాళ్ళ పై  కోపం ఏర్పడింది .దేవతల యజ్ఞాలను ఋషులు ఋషుల యజ్ఞాలను దేవతలు పాడు చేయటానికి సిద్ధ పడ్డారు .ఋషులు దేవతలను ఎదుర్కొని ఓడించటానికి ‘’మదం ‘’అనే పేరుగల రాక్షసుడిని పుట్టించారని ఈ  బ్రాహ్మణం కొత్త విషయం తెలియ జేసింది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.