సంగీతమంటే సృజన.. ఆధ్యాత్మిక భావన

సంగీత దర్శకుడు జె.బి. అనగానే ‘ఈరోజుల్లో’, ‘బస్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘చంద్రలేఖ’, ‘కొత్తజంట’.. సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘లవర్స్’, ‘కాయ్ రాజా కాయ్’, ‘మా లైఫ్ సినిమా’, ‘మిర్చి లాంటి కుర్రాడు’.. చిత్రాలకు స్వరాలను సమకూర్చింది కూడా అతనే. ఇన్ని సినిమాల సంగీత బాధ్యత భుజాలమీద ఉన్నా తన గురువు కీరవాణి దగ్గర కీబోర్డు ప్లే చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుందంటారు జె.బి. ప్రముఖ స్వరకర్త కీరవాణి దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారాయన. శుక్రవారం కీరవాణి పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి గురించి జె.బి. చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ‘చిత్రజ్యోతి’కి ప్రత్యేకం.. జూ ‘ఛత్రపతి’ నుంచి నేను కీరవాణిగారి దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా చేస్తున్నాను. ఇప్పుడు సొంతంగా మ్యూజిక్ చేస్తున్నా. కీరవాణిగారి సినిమాలకు పనిచేయడంలో తృప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఆయన దగ్గర కొత్తగా నేర్చుకునే విషయాలు ఉంటూనే ఉంటాయి. జూ నేనే కాదు. సంగీతకళాకారులు అందరూ కీరవాణిగారి దగ్గర పనిచేయడానికి మొగ్గుచూపుతారు. గురువుగారి నుంచి పిలుపు అందగానే ఎంత దూరాన ఉన్నా వచ్చి వాలిపోతారు. కళాకారుల పనికి ఆయన ఇచ్చినంత ఎక్కువ పారితోషికం మిగిలిన వారు ఇవ్వరు. జూ వరల్డ్ మ్యూజిక్‌కి సంబంధించి ఆయన దగ్గరున్నంత కలెక్షన్ ఇంకెవరి దగ్గరా ఉండదు. అంత గొప్ప కలెక్షన్ ఆయన సెల్‌లోనూ, ల్యాప్‌టాప్‌లోనూ ఉంటుంది. ఆయన సెల్‌నూ, ల్యాప్‌టాప్‌ను వినియోగించినంత విరివిగా ఇంకెవరూ ఉపయోగించడం నేను చూడలేదు. జూ ఏ సంగీతాన్నైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఆయనకు నచ్చదు. ప్రతిదీ డబ్బిచ్చే కొనుగోలు చేస్తారు. ఎప్పుడూ సంగీతాన్ని వింటూ ఉంటారు. ఆయన ప్రపంచమే సంగీత ప్రపంచం. సంగీతంలో నిత్యం అప్‌డేట్ అవుతుంటారు. జూ సంగీతమంటే సృజన. ఆధ్యాత్మిక భావన. ఆయనతో సంగీత చర్చల్లో పాల్గొంటే ఆ భావం మనకు కూడా తెలియకుండానే మదిలో తిష్టవేసుకుంటుంది. చుట్టూ ఉన్న వారిని పనిలో నిమగ్నం చేయడంలో ఆయన చాలా గొప్పగా ప్రవర్తిస్తారు. ఎంతో గొప్పగా మోటివేట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ చెబుతూ మనలో ఉన్న ప్రతిభను మనకు కూడా తెలియకుండా రాబట్టగలరు. జూ ఆయన స్వతహాగా చమత్కారి. కళాకారులు ఎక్కడా అలసిపోకుండా చూసుకుంటారు. మధ్యమధ్యలో జోకులు చెబుతూ నవ్విస్తుంటారు. ఆయన ఎంత సరదాగా ఉన్నా, పని సక్రమంగా జరగాలనే టెన్షన్ మాలో ఉంటూనే ఉంటుంది. ఆయన కాంపౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఇదే భావన కలుగుతుంది. జూ ట్యూన్లు కంపోజ్ చేసేటప్పుడు ప్రతి నోట్‌నూ ఆయనే రాసిస్తారు. ఆయనతో పాటు జెమినిగారు, నేను ఉంటాం. జూ నేను సంగీత దర్శకత్వం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కీరవాణిగారు మాత్రం ‘నువ్వు సంగీతం చేయి జీవన్. నేను కూడా రిటైర్‌మెంట్ ఎప్పుడో అప్పుడు తీసుకుంటాను’ అని అన్నారు. జూ కీరవాణిగారికి ఉన్నంత జ్ఞాపకశక్తిని నేను ఇంకెవరి దగ్గరా చూడలేదు. నేను పరిచయమైన రోజు ఆయనతో ఏం మాట్లాడానో కూడా ఇప్పుడు చెప్పేయగలరు. విషయాల్ని అంత గొప్పగా గుర్తుంచుకుంటారు.

