పదాలకు భావాల తళుకులు..
- -మల్లాది కృష్ణానంద్

నీటిరంగుల ఛిత్రం
-వాడ్రేవు చినవీరభద్రుడు
వెల: రూ.150
e-book కోసం www.kinige.com
వాఢ్రేవు చిన వీరభద్రుడు వెలువరించిన కవితా సంపుటి ‘నీటి రంగుల చిత్రం’. ఈ సంపుటిలో జీవితానందం సిద్ధించే మెలకువ కోసం కవి నిరంతరంగా అనే్వషించడం కనిపిస్తుంది. వాడ్రేవుగారి నిర్వికల్ప సంగీతం (1986), ఒంటరి చేల మధ్య ఒక్కత్తే అమ్మ (1995), పుర్యానం (2004), కోకిల ప్రవేశించే కాలం (2009) తర్వాత వచ్చిన కవితా సంపుటి ‘నీటి రంగుల చిత్రం’. తన కవిత్వం గురించి, తన మీద ప్రభావం చూపించిన కవుల గురించీ చినవీరభద్రుడు, మరో సాహిత్యాభిమాని ఆదిత్య కొర్రపాటితో చేసిన సంభాషణ ఈ సంపుటిలో ప్రచురించారు. ఇది ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ అనొచ్చు.
కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ, అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగి తీగ లోపలనుంచి కాకుండా రాగి తీగ వెంబడి ప్రసరించినట్లే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటల చుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడగునా కనిపిస్తుందని వాడ్రేవు అంటారు. నా కవితలో రాగాత్మక ఉంది. పొందిక కూడా ఉంది. ఒక స్వర్ణకారుడు బంగారు నగకి నగిషీ పెట్టడంలో ఉండే పనివాడితనమంతా నా కవితలో ఉంటుందంటాడు వాడ్రేవు.
కవి కేవలం తన భావాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం తొలిరోజుల్లో జరిగే పని. కవి పరిణతి చెందే కొద్దీ శిల్పం మీద దృష్టిపెట్టక తప్పదు.
మనకి ‘ద్రష్ట’, ‘స్రష్ట’ అనే రెండు పదాలున్నాయి.
శ్రీశ్రీ ‘మహాప్రస్థాన‘ గీతాలనాడు ద్రష్ట, ‘మరో ప్రస్థానం’ నాటికి శ్రీశ్రీ స్రష్టగా మారాడంటారు వాడ్రేవు. కవిత అంటే కేవలం వర్ణన లేదా అభిప్రాయ ప్రకటన కాదు.చిన్ని చిన్ని వివరాల వల్ల కవిత తన అనుభూతిని తన శ్రోత హృదయంలో ఎంతో విశ్వసనీయంగా ముద్రిస్తాడని కూడా మనం గమనించాలంటాడు. ఎంత మేరకు వదిలిపెట్టాలన్నదే కవి శిల్ప పరిణతికి గీటురాయి అంటాడాయన. నా దృష్టిలో కవిత్వం దానికదే అత్యంత శక్తివంతమైన భావ ప్రసార సాధనమంటాడు వాడ్రేవు. నా కవిత్వంలో సాధారణ పత్రికా భాషనీ, సామాజిక రాజకీయ భాషనీ వీలైనంతగా పరిహరించడానికే ప్రయత్నించానంటాడు వాడ్రేవు.
ఈ కవితా సంపుటిలో వాడ్రేవు 182 కవితలు 208 పేజీలలో ప్రచురించాడు.
ముందుగా కాపాడుకోవల్సిన పద్యం అంటూ…
‘‘ఇంధనం అగ్నిగా మారినట్లు, ప్రతిరోజూ ఒక పద్యంగా మారాలని ప్రార్థిస్తున్నానంటాడు‘‘ కవి.
పాలుగారే ప్రపంచంతో-అనే కవితతో ప్రారంభించిన వాడ్రేవు నా ఆరాటమిదే అనే శీర్షికతో బహు చతురతతో ముగించాడు.
ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో ప్రముఖ కవి, శిల్పి మైకెలాంజిలోని స్థానికులు అడిగారట.
ఏమని?
మేం రోజూ చూసే శిలనే ప్రవక్తగా నువ్వెట్లా మలిచావని?
ఏది డేవిడ్ కాదో దాన్ని చెక్కేసానని మైకెలాంజి జవాబిచ్చాడు.
చమత్కారుడైన వాడ్రేవు కూడా..
‘‘నాలో ఏది చిన వీరభద్రుడు కాదో దాన్ని తొలగించాలని, నా ఆరాటమిదేనని, కడు రమ్యంగా కవితా సంపుటిని ముగించారు.
ఆ తర్వాత ఓ 10 పేజీలలో యువకవి ఆదిత్యతో కొర్రపాటితో అభయ వచనాలు శీర్షికతో ప్రశ్న-జవాబులో వాడ్రేవు తన మనస్సును పాఠకుల మందుంచాడు.
చక్కని మధుర లలిత పదాలతో పాఠకుల్నీ భావకవులుగా తీర్చేలాగ సాగే ఈ కవితా సంపుటిని ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాలి. తెలుగు కవిత్వాన్ని అభిమానించే ప్రతి వారింటా తప్పక ఉండవల్సిన పుస్తకం.
నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్ తదితర అన్ని పుస్తకాల షాపుల్లో లభిస్తుంది.


మేము కాశీ, ప్రయాగ వెళ్ళి వచ్చామండి. కొంతకాలం క్రిందట, మీ
సరసభారతి ఉయ్యూరు బ్లాగ్ ద్వారా కాశీ గురించి ఎన్నో విశేషాలను తెలుసుకున్నాను.
మీ బ్లాగులో చదివిన తరువాత కౌడీఅమ్మవారి గుడి గురించి తెలిసింది. కౌడీఅమ్మవారి దేవాలయాన్ని కూడా దర్శించుకున్నాము.
మీకు కృతజ్ఞతలండి.
LikeLike