ఆంగ్ల మూలం: మెల్విన్ బి. నథాన్సన్:
ఇ మొ గెల్ఫాండ్‌కి అంకితం – (ఆయన శతజయంతికి)
సోవియట్ రష్యా గతించి చాలా కాలమయింది. సోవియట్ యూనియన్ బతికున్న రోజుల్లో అక్కడ ఒక నియంతృత్వం స్వైరవిహారం చేసింది. సోవియట్ యూనియన్ లోనూ తూర్పు ఐరోపాలోని సోవియట్ కబంధ హస్తాల్లో ఇరుక్కున్న కమ్యూనిస్ట్ దేశాల్లోనూ ఆ రోజుల్లో ఏమి జరుగుతోంది అన్నది బయట ప్రపంచానికి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు తెలియనిచ్చేవారు కారు. అప్పటి ఆ పరిస్ఠితిని (మొదటగా చర్చిల్) ‘ఇనుపతెర’గా అభివర్ణించేవారు.
ఇతర శాస్త్రాల విషయం ఎట్లా ఉన్నా గణిత శాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గణితశాస్త్ర అధ్యయనం ఒక ఊహాలోక విహరణం. ఈ కారణంగా సాధారణంగా గణిత శాస్త్రజ్ఞులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. అలాగే బాహ్య ప్రపంచం గూడా వీళ్ళను దూరంగా ఉంచుతుంది. అంటే రాజకీయ ఒత్తిళ్ళు గణితశాస్త్ర పరిశోధనల మీద ఉండే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ ఆనాటి సోవియట్ గణిత శాస్త్ర వేత్తల మీద కూడా రాజకీయం తన భయానక ఆధిపత్యాన్ని చెలాయించింది. వాళ్లు నియంతృత్వ పిశాచపు కోరల్లోనే తమ ఊపిరులు పీల్చుకున్నారు.
వాసుదేవ రావు ఎరికలపూడి
*******************
ఒక అమెరికన్ మాథమాటిషియన్ (లేదా)
ఆయనతో నా పరిచయం పరోక్షంగా జరిగింది. 1970 లెంట్, ఈస్టర్ సెమెస్టర్‌లలో నేను కేంబ్రిడ్జ్ యునివర్సిటీ ప్యూర్ మాథమాటిక్స్ అండ్ మాథమాటికల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్‌లో సందర్శక పరిశోధనా విద్యార్థిగా ఉన్నాను. ఆ రోజుల్లో బేల బల్లొబాస్ నా స్నేహితులలో ఒకడు. బేల హంగేరియన్. ఆక్స్ ఫర్డ్ నుంచి పిహెచ్. డి తెచ్చుకున్న బేల ఇంగ్లండ్ లోనే ఉండి పోవాలని నిశ్చయించుకున్నాడు. మరిక హంగరీకి తిరిగి వెళ్ళకూడదని గూడా నిర్ణయిం చుకున్నాడు. కోల్డ్ వార్ పరిభాషలో బేల హుంగరీని విడిచి పలాయనం చిత్తగించి ప్రతిపక్షులు, పెట్టుబడి దారుల పంచనజేరాడు. పాశ్చాత్య దేశాలలో చదువుకోటానికి వెళ్ళే ముందు ప్రాచ్య దేశం, అంటే యుయస్‌యస్ఆర్‌లో చదవాలని హంగరీ వాళ్ళు బేలకి షరతు పెట్టారు. దాంతో బేల ఒక సంవత్సరం మాస్కో స్టేట్ యునివర్సిటీలో గడిపాడు. అక్కడ బేల గెల్ఫాండ్ దగ్గర చదువు కున్నాడు. వ్యక్తిగతం గానూ, గణితశాస్త్ర వేత్త గానూ ప్రొఫెసర్ గెల్ఫాండ్ బేలను గాఢంగా ప్రభావితం చేశాడు. గెల్ఫాండ్ ఎలా అసాధారణమైన వాడో – ఆయన వైశిష్ట్యం గురించి – బేల నాకు తరచూ చెపుతుండేవాడు.
కేంబ్రిడ్జ్‌లో నా చదువు ముగిసిన 1970 వేసవిలో నేను సోవియట్ యూనియన్‌కి చిన్న ట్రిప్‌గా వెళ్లాను. జీవశాస్త్రంలో డాక్టరేట్ తర్వాతి పరిశోధనకి మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి వచ్చి కేంబ్రిడ్జ్‌లో ఒక సంవత్సరం గడిపిన మరొక అమెరికన్ బులెటిన్ బోర్డ్ మీద తను యుఎస్‌ఎస్ఆర్‌లో డ్రైవింగ్ చేస్తూ తిరగాలను కుంటున్నాననీ తోడుగా ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నాననీ ఒక నోట్ పెట్టాడు. హెల్సింకి నుంచి ట్రైన్‌లో ప్రయాణం చేసి సోవియట్ యునియన్ లోకి లెనిన్ గ్రాడ్‌లో అడుగుపెట్టి, కారు అద్దెకు తీసుకుని దక్షిణంగా మాస్కో మీదుగా కాకేషస్ దాకా డ్రైవ్ చేసుకుంటూ పోవటం అతని ప్రణాళిక.
సోవియట్ అకాడమీ అఫ్ సైన్సెస్ నుంచి ఈ అమెరికన్ జీవశాస్త్రజ్ఞుడికి అతిథిగా ఉపన్యసించ వలసిందని ఆహ్వానం వచ్చింది. అక్కడ ఇతనికి ఆతిధ్యమిచ్చే సాధికార బాధ్యత బయో కెమిస్ట్రీలో ఎన్నదగిన సోవియట్ విజ్ఞానవేత్త డేవిడ్ గోల్డ్ ఫార్బ్ ది. నేను కూడా గోల్డ్ ఫార్బ్‌ని కలుసుకున్నాను. ఆయనతో నాకు గెల్ఫాండ్‌ని కలుసుకోవాల నున్నదని చెప్పాను. గోల్డ్ ఫార్బ్, గెల్ఫాండ్‌ని కాంటాక్ట్ చేశాడు. గెల్ఫాండ్ బాగా బిజీగా నైనా ఉండి ఉండాలి లేదా పూర్వ పరిచయం లేని ఒక అమెరికన్‌తో సమావేశమవటం విజ్ఞత కాదనైనా అనుకుని ఉండాలి. నాకు నంబర్ థియరీలో ఆసక్తి ఉందని గోల్డ్ ఫార్బ్ గెల్ఫాండ్‌తో చెప్పినప్పుడు గెల్ఫాండ్ తను యమ్.జె. గ్రెవ్, ఐ. ఐ. ప్యాటెట్స్కీ- షపీరోలతో కలిసి – జెనరలైజ్డ్ ఫంక్షన్ల మీద రాసిన పుస్తకాల్లో ఆరో భాగం ‘రిప్రసెన్టేషన్ థియరీ అండ్ ఆటోమార్ఫిక్ ఫంక్షన్స్’ అన్న పుస్తకాన్ని నాకిమ్మని చెప్పిగోల్డ్ ఫార్బ్‌కి ఇచ్చాడు.
క్గోల్డ్ ఫార్బ్‌కి ఒక కాలు లేదు. అతను ఆ కాలిని రెండవ ప్రపంచ యుద్ధ భూమిలో పోగొట్టుకున్నాడు. గోల్డ్ ఫార్బ్ హిస్టారియన్ అవుదామనుకున్నాడు. కానీ నియంతృత్వ పాలనలో వృత్తిగా చరిత్ర చాలా ప్రమాదకరమైనది. స్టాలిన్ రష్యాలో చరిత్ర ప్రత్యేకంగా ప్రాణాంతకమైనది. ఆ కారణంగా గోల్డ్ ఫార్బ్ మెడికల్ స్కూల్‌లో చేరి మాలిక్యులార్ జెనెటిక్స్‌లో రీసెర్చ్ చేశాడు. ‘పొట్ట ఎప్పుడూ పొట్టే’ అన్నాడతను నాతో.
నా తోటి పర్యాటకుడైన జీవశాస్త్రవేత్త ప్రబల వామపక్షవాది. [అమెరికన్] విద్యా సంస్థలలో ఉన్న చాలామంది లాగానే నేనూ వియత్నాం యుద్ధ వ్యతిరేకినే. ఐనప్పటికీ అతను నాకు ఎంత ఎడమగా ఉంటాడంటే అతని పక్కన నేను రైటిస్ట్ లాగా కనిపించాను. పైకి ప్రజల దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు విధేయులుగా కనపడుతూ లోలోపల నియంతృత్వానికి తీవ్ర వ్యతిరేకతతో వియత్నాంలో అమెరికా సైన్యాల ప్రవేశాన్ని -ఎంతోమంది అమెరికన్ సైంటిస్టులు నిరసిస్తున్నప్పుడు- సమర్ధిస్తున్న సోవియట్ సైంటిస్టులకు నేను ఇలా రైటిస్ట్‌గా కనపడటం నన్ను వాళ్ళకు తృటిలో దగ్గరి వాణ్ణి చేసింది. కమ్యూనిస్టులను అంతం చేయటమన్న దాంట్లోవాళ్ళకు నమ్మకం ఉంది. ఇది మాస్కోలో నేను ఈ (ప్రచ్చన్న) వైరుధ్యంలో నేర్చుకున్న మొదటి పాఠం.
కమ్యూనిస్ట్ పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళల్లో చాలామంది వాళ్ల పిల్లలకు సైన్స్‌కి సంబంధించిన ఉద్యోగాల కోసం పరిచయాలను వాడుకునేవారు. వాళ్లు – నియంతృత్వం లో- తాము సమసిపోకుండా ఉండటానికి చేయవలసినదంతా చేసినవాళ్ళు, రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకున్నవాళ్లు. వాళ్ళపిల్లలు – నిర్భయంగా- భద్రత తో బతకాలని కోరుకుంటున్నవాళ్లు.
సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో గానీ, యూనివర్సిటీలలో గానీ, డిగ్రీ చదువుల్లో ఉన్న పిల్లల్లోనూ, పరిశోధనల స్థాయిలో ఉన్న విద్యార్థుల్లోనూ చాలామంది పార్టీకార్యకలాపాల నిర్వహణలో పై స్థాయిలో ఉన్నవాళ్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళే. సైంటిస్టులకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండటమనేది ఎప్పుడూ అది తెచ్చిపెట్టే లాభాలను తెచ్చిపెడుతునే ఉండేది. పార్టీతో సంబంధాలు లేని పెద్ద సైంటిస్టులు వాళ్ళకూ, వాళ్ళ విద్యార్థులకూ నిలవ నీడ కోసం పార్టీతో గట్టి సంబంధాలున్న చాలా చిన్న స్థాయి సైంటిస్టులతో కలిసి పనిచేసేవారు. ‘కలిసి పనిచేయడం’ అంటే పార్టీ సభ్యులుగా ఉన్న అంతంత మాత్రం సైంటిస్టు గాళ్ళకు పరిశోధనల ప్రచురణలలో సహ రచయితల హోదా ఇవ్వటం. ఇటువంటి వైజ్ఞానిక రాజకీయం నియంతృత్వ పాలన లేని చోట్ల కూడా కనపడే విషయమే అనుకోండి.
నాకు గెల్ఫాండ్ దగ్గర ఒక సంవత్సరం పాటు గణిత శాస్త్ర విషయాలు నేర్చుకుంటూ గడపగలిగే అవకాశం కోసం ప్రయత్నించాలని అనిపించటానికి బేల బొల్లబాసే కారణం. ఇది సాధ్యపడేటట్టు చేయటం అంత తేలికైన విషయం కాదు. కోల్డ్ వార్ రోజుల్లో ఒక అమెరికన్ మాస్కోలో ఏ అధ్యయనమైనా, పరిశోధనైనా చేయటమన్నది దాదాపు అసాధ్యమైన విషయమే. పారిస్‌లోనో, కేంబ్రిడ్జ్ లోనో అయితే చిటికిన వేలిగోటితో ఏర్పాటు చేసుకోగలం. విమానం ఎక్కటం ఫ్రాన్స్‌కో ఇంగ్లాండ్‌కో వెళ్ళటం, అంతే. కానీ ఒక సామాన్య అమెరికన్ సోవియట్ యూనియన్‌లోకి ప్రవేశించాలంటే కొద్దికాలానికి మాత్రమే అనుమతితో ఎంతో డబ్బు కర్చయ్యే పర్యాటకం గానే సాధ్యం.
అయినప్పటికీ ప్రభుత్వ స్థాయిలో రెండు దేశాల మధ్యా రెండు రకాల ఒప్పందాలున్నాయి. ఇక్కడినుంచి అక్కడకు ఒకళ్ళు వెళ్తే అక్కడనుంచి ఇక్కడకు ఒకళ్ళు వచ్చే ధోరణి లో. వీటిలో ఒకటి వాషింగ్టన్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కీ, సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కీ మధ్య కుదిరిన ఒప్పందం. కానీ ఇది కుర్ర సైంటిస్టులకు కాదు. సీనియర్లకు, కొద్ది కాలానికి.
రెండవది ఈ రెండు దేశాల మధ్యా కొంత విశాలమైన సాంస్కృతిక సంబంధాల విషయంలో ఉన్నపరస్పర అంగీకారం. మేము ‘న్యూయార్క్ ఫిల్హార్మానిక్’ను మాస్కోకి పంపుతామనుకుంటే వాళ్ళూ ‘బొల్ష్ వా బాలే’ని న్యూయార్క్‌కి పంపే పధ్ధతిలో. ఈ ఒప్పందంలో ఉన్న మరో చిన్న అంశంగా యూనివర్సిటీ స్థాయిలో డాక్టరేట్ కోసం కృషి చేస్తున్న విద్యార్థులకూ, డాక్టరేట్ వచ్చింతర్వాత పరిశోధనలను విస్తృత పరచుకునే పోస్ట్ డాక్టొరల్ విద్యార్థులకూ ‘పరస్పర’ రీతిలో సందర్శనకు అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం అమెరికనులు నలభైమంది అమెరికన్ యువ పండితులను ఎంపిక చేస్తే సోవియట్లు నలభైమంది సోవియట్ యువ పండితులను ఎంపిక చేస్తారు. ఒక దేశం ఎంపిక చేసిన పండితులను అతిథులుగా రానివ్వటానికి రెండవ దేశం అంగీకరించాలి. అమెరికన్ వైపునుండి ఈ కార్యకలాపాలు న్యూయార్క్ లోని వివిధ అమెరికన్ విద్యావేత్తల సంఘాల సమాహార సంస్థకు అనుబంధంగా ఉన్న ఐరెక్స్ (ఇంటర్నేషనల్ రిసెర్చ్ అండ్ ఎక్స్ ఛెంజెస్ బోర్డ్) నిర్వహించేది.
ఈ పరస్పర సందర్శనలో పండితుల ఎంపిక ఒక పధ్ధతిలో జరిగేది. రష్యనులు నలభై మంది ఇంజనీర్లను, కంప్యుటర్ సైంటిస్టులను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ కి పంపిస్తే అమెరికన్లు నలభై మంది విద్యార్థులను మాస్కోకి డాస్ టొవిస్కీనీ , రాస్పుటిన్‌నీ అధ్యయనం చేయటానికి పంపేవాళ్ళు. ఐరెక్స్ ఎప్పుడూ అతి తక్కువ మంది సైంటిస్టులను యుఎస్ఎస్ఆర్‌కి పంపేది. దీనికి కారణం రష్యాలో సైన్స్‌లో రిసెర్చ్‌కి చాలా తక్కువ అవకాశాలుండటంతో అక్కడ తప్ప వేరెక్కడా వీలు కాని రీసెర్చ్ విషయం అయితేనే ఆ శాస్త్రవిభాగంలో పరిశోధకులను రష్యాకు ఎంపిక చేయటం జరిగేది. సైన్స్ ప్రతిచోటా ఉంది. సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఏదైనా సమస్యని యుఎస్‌ఎస్ఆర్‌లో మాత్రమే పరిష్కరించగలమని అనటం అంత తేలిక కాదు. నువ్వు చేసే పరిశోధనాంశ విశేషాలు రష్యన్ భాషలో ఉన్నా, నీ పరిశోధన రష్యన్ సాహిత్యం లోనో, లేదా రష్యన్ చరిత్ర లోనో అయి దానికి సంబంధించిన వెనకటి కథలన్నీ సోవియట్ యూనియన్‌లో మాత్రమే దొరికే పక్షాన నువ్వు నీ పరిశోధన కోసం మాస్కో వెళ్ళాల్సి ఉంటుందని నీ ప్రణాళికలో పేర్కొనటం సమంజసంగా ఉంటుంది.
ఐరెక్స్ ప్రోగ్రాంలో పాలుపంచుకున్న మొట్టమొదటి గణిత శాస్త్ర పరిశోధకుణ్ణి అయ్యాను నేను, 1972-73లో. ఐరెక్స్‌కి నేను పెట్టుకున్న దరఖాస్తులో ప్రపంచంలో ఉన్నఅత్యున్నత స్థాయికి చెందిన గణిత శాస్త్రవేత్తలలో పెక్కుమంది సోవియట్ యూనియన్లో ఉన్నారనీ, వాళ్ళందరూ మాస్కోలో కేంద్రీకృతమైయున్నారనీ వాళ్ళు దేశం విడిచి బయటకెక్కడికీ ప్రయాణం చేయటానికి వీలులేదనీ వాళ్ళతో కలిసి పనిచేయటం ఎంతో విలువైన అనుభవమనీ రాసాను. ఇవి బలమైన కారణాలు. ఐరెక్స్ఆమోదం లభించింది. ఐరెక్స్‌కి నెను గెల్ఫాండ్‌తో కలిసి పనిచేయటమే నా ప్రణాళికగా దరఖాస్తు చేసుకున్నాను. దీనికి, నా అధ్యయనానికి పర్యవేక్షకునిగా ఉండటానికి గెల్ఫాండ్ అంగీకరించాలి. ఆయన ఒప్పుకున్నాడు. నాకు వీసా వచ్చింది. నేను మాస్కో వెళ్ళాను.
ఒక విడతలో ఐరెక్స్ పథకంలో యుఎస్ఎస్ఆర్ వెళ్ళే అమెరికన్లందరూ ఆగస్ట్ నెలలో పారిస్‌లో కలుసుకోవాలి. పారిస్‌లో కలుసుకుని అక్కణ్ణుంచి విమానంలో మాస్కో వెళ్ళాలి. నేను కొద్ది రోజులు ముందుగానే పెట్టె నిండా లెక్కల పుస్తకాలూ, ఒక ‘ఒలివెత్తి‘ టైపు రైటర్‌తో పారిస్ చేరుకుని, పారిస్‌లో బడి వీథిలో ఒక చౌకరకం హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో ఉండి పాల్ ఎర్డొష్‌తో నా మొట్టమొదటి రీసెర్చ్ పేపర్‌గా తయారయిన విషయం మీద విపరీతంగా కష్టపడి పనిచేశాను. ఆ పని పూర్తయి పేపర్ రాయటం అయింతర్వాత వ్రాత ప్రతిని ఫ్రాన్స్ నుంచి పోస్ట్ చేయటానికి సమయం చాలకపోయింది. కానీ ఐరెక్స్ విద్యార్థులకు మాస్కోలోని అమెరికన్ దౌత్య కార్యాలయం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కలగ జేసింది. అన్నిటికన్నాఎక్కువ ఉపయోగపడే సౌకర్యాలలో ఒకటుంది. అది యూఎస్ఎస్ఆర్ బయటికి దౌత్య తపాలా సంచిలో ఉత్తరాలు పంపించుకునే వీలు. సైంటిఫిక్ వ్రాత ప్రతులను అమెరికాకు పంపించటంలో యుఎస్ఎస్ఆర్ తపాలా -మృదువుగా చెప్పాలంటే- అంత నమ్మదగింది కాదు. నేను నా పేపర్‌ని వియన్నాకు వెళ్తున్న ఒక నావికుడు చేత్తో పట్టుకుపోతున్న తపాలా సంచిలో పడేసి ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది అమెరికన్ మాథమాటికల్ సొసైటీ’ కి పంపగలిగాను.
గెల్ఫాండ్‌తో నా మొట్టమొదటి సమావేశం మాస్కో స్టేట్ యూనివర్సిటీలో నలుగురూ కూచుని కబుర్లు చెప్పుకునే చోట జరిగింది. అప్పుడు ఆయన నాకు చెప్పిన రెండు విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. మొదటిది ఆయన మంత్రంగా ప్రసిద్ధిచెందినది. “ఉన్నది ఒకే గణిత శాస్త్రం”. తర్వాత ఆయన సోవియట్ యూనియన్‌లో ఉన్న యువ గణిత వేత్తలలో కల్లా మరీ ప్రతిభావంతుల పేర్లు – ఒక చిన్న చిట్టా – అప్పజెప్పినట్టుగా చెప్పి, “నాకన్నా వాళ్ళకు గణిత శాస్త్రం చాలా ఎక్కువ తెలుసు, కానీ నా కున్న ఊహాశక్తి మెరుగైనది.” అన్నాడు. ప్యాతెత్ స్కీ-షపిరో, మనిన్‌లు చెపుతున్న పాఠాలకు హాజరవమని గెల్ఫాండ్ నాకు సూచించాడు గానీ, అన్నింటికన్నా నా మాస్కో గణిత శాస్త్రాభ్యాసంలో విలువైనదని నేననుకునేది ఎంతో ప్రఖ్యాతి పొందిన ‘గెల్ఫాండ్ సోమవారం రాత్రుల సెమినార్లలో పాలు పంచుకోవటం . ఆ సెమినార్లు ‘ఇన్నింటికి మొదలు పెట్టాలి’ అని అధికారికంగా ఏమన్నా ఉండేదేమో నాకు గుర్తుకు రావటం లేదు. అందరూ చాలా ముందుగానే వచ్చి ఆ హాల్లో జేరుకుని లెక్కలే మాట్లాడుకోవటం మొదలుపెట్టే వారు. అసలు సెమినారు -ముందుగా నిర్ణయించుకున్న శాస్త్ర విషయ చర్చ – మెల్లిగా మొదలయ్యేది. ఒకళ్ళతర్వాత ఒకళ్ళు మాట్లాడుతునే ఉండే వారు. సెమినారు ముగియాలనుకున్న టైమ్ ఏదైనా ఉంటే అది దాటి చాలా కాలం అయిపోయేది. చివరికి ఆ హాలు తుడిచి శుభ్రం చేసే ఆవిడ వచ్చి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేదాకా.
ఎవరైనా మాట్లాడుతుండగా గెల్ఫాండ్ వాళ్ళను ఆపి వింటున్నవాళ్ళలో ఎవరినైనా ఉద్దేశించి అప్పుడు నడుస్తున్న విషయాన్ని వివరించమని అడగటం సర్వసాధారణంగా జరిగేది. నేను మొదటి సారి ఈ సెమినార్లకి హాజరయింది ఒక ఉపన్యాసం కొనసాగుతూఉంటే మధ్యలో వెళ్లినప్పుడు. గెల్ఫాండ్ “మెల్విన్ నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. “కావట్లేదు”. ” ఏం, ఎందుకని?” “వాళ్ళు రష్యన్‌లో మాట్లాడుకుంటున్నందువల్ల”. ఆయన వెంటనే డిమా ఫుక్స్‌ని నా పక్కన కూచుని నాకు వాళ్ళ రష్యన్‌ని ఇంగ్లిష్‌లోకి అనువదించి చెప్పమని పురమాయించాడు. కొద్దికాలానికే నా రష్యన్ భాషా పరిచయం మెరుగై ఇంక భాష మీద నెపం వేసే అవకాశం పోయింది.
ఎవరు ఏం నేర్చుకోవాలో గెల్ఫాండే నిర్ణయించేవాడు, సెమినార్‌లో చెప్పేవాడూ. ఒకసారి గెల్ఫాండ్ ఆర్నాల్డ్‌ను ‘పి -యాడిక్ సంఖ్యల’ గురించి కొన్ని వరస ఉపన్యాసాలు ఇమ్మన్నాడు. ఆర్నాల్డ్‌కి ఈ పని కష్టంగా తోచింది. ఆర్నాల్డ్ ‘రియల్ సంఖ్యల’ పరిధిలోనూ, ‘కాంప్లెక్స్ సంఖ్యల’ పరిధి లోనూ ఉద్దండుడు, కానీ పి -యాడిక్ సంఖ్యలకు సంబంధించిన గణితంలోవచ్చే కొన్ని ముఖ్యమైన విలువలను అవగాహన చేసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. ఈ విలువల గురించి సంఖ్యాశాస్త్రంలో కృషి చేస్తున్న ప్రతి యువ గణిత విద్యార్థికీ తెలుసు. ఆర్నాల్డ్ వంటి గొప్ప గణితజ్ఞుడు ఇలా కొంతమందికి చాలా సులువుగా తెలిసిన శాస్త్ర విషయాలను అర్థం చేసుకోవటానికి తన్నుకోవటం ఒక పాఠం నేర్పింది. అంతమందికీ మంచినీళ్ళ ప్రాయంగా అనిపించిన విషయమే అయినా అది నీకు కష్టంగా అనిపిస్తే నిన్ను నువ్వు దద్దమ్మగా పరిగణించుకోనవసరం లేదని.
నడవటం రష్యన్ సంప్రదాయం. చలికాలం నిజంగానే చల్లగా ఉంటుంది. అయినా గాలి తక్కువగా ఉండటం వల్ల అంత చలిని భరించగలం. సెమినారు ముగిసిన తర్వాత తరచుగా కొంతమంది ఒక జట్టుగా గెల్ఫాండ్‌తో బయలుదేరేవారు. వాళ్ళు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ రాత్రి బాగా పొద్దుపోయేదాకా దట్టంగా మంచు పడ్డ రోడ్ల పక్కల మీద లెక్కలు చేసుకుంటూ. రాసుకుంటూ ఆయనతో వెళ్ళేవారు. బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా మాట్లాడు కోవచ్చు. గదుల్లో అయితే గోడలకు చెవులుంటాయి. చాలామంది గణిత శాస్త్రజ్ఞులు నన్ను “నడుద్దాం రమ్మ”నే వారు. రోడ్ల మీది వేరెవరి జోక్యమూ లేని ‘ఏకాంత స్వేచ్చ’లో నన్ను “అమెరికాలో ఎలా ఉంటుంది?”, అమెరికా లో యూదులంటే ద్వేషం ఎంత ఎక్కువగాఉంది?”, “అమెరికన్ యూనివర్సిటీలలో ఉద్యోగం రావటం ఎంత కష్టం?” అని అడిగేవారు. ఆనతి కాలంలో వలస విధానం సులభమవటంతో వాళ్ళందరూ వలస వెళ్లి పోయారు.
1989లో గెల్ఫాండ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలస వెళ్ళాడు. తొలుత హార్వర్డ్ విశ్వవిద్యాలయం లోనూ, మసచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోనూసందర్శకాచార్యునిగా ఉండి, రట్జర్స్ యూనివర్సిటీలో విశిష్టాచార్యునిగా ఉన్నాడు. జీవశాస్త్రవేత్త గోల్డ్ ఫార్బ్ కూడా రష్యాను వదిలి న్యూయార్క్ వెళ్లి పోయాడు.
ఇరెక్స్‌లో మాస్కో వచ్చిన అమెరికన్ విద్యార్థులందరూ శయనా గారాలవంటి గదుల్లో ఉండేవారు. సంవత్సరం తర్వాత సంవత్సరం వచ్చే అమెరికన్ విద్యార్థులు మారొచ్చు గానీ అమెరికన్లకు ఇచ్చే గదులు మాత్రం మారేవి కావని నాకు విశదమైంది. ఆ గదులు అన్నీ ఒకే అంతస్తులో కాక వేరు వేరు అంతస్తులలో, ఒక దాని మీద ఒకటి, సరిగ్గా మీదగా, అమెరికన్లను వీళ్ళ ఆవాసంలో గూఢంగా కనిపెట్టి ఉండటానికి భవనానికి నిలువుగా కేబుళ్లను అమర్చుకోవటానికి సులువుగా ఉండేటట్లు ఏర్పాటు చేసేవారు. “నీ గదిలో నీకు ఏమైనా ప్రత్యేకంగా కావలసినది అమర్చాలని నువ్వు అధికారులకు చెప్పాలనుకుంటే అదుగో ఆ బల్బుకు చెప్పు’ అన్నది అక్కడ సుపరిచితమైన నవ్వూసు.
యూనివర్సిటీలో ఉన్న’కమసోల్’లో చురుకుగా ఉన్న వాళ్ళలో నాకు చాలా మంది మిత్రులు. కమసోల్ కమ్యూనిస్ట్ పార్టీ యువజన శాఖ. అందులో ఉన్న వాళ్ళకు అమెరికన్లతో స్నేహం వాళ్ళు విధిగా చేయవలసిన పార్టీ కార్యక్రమంగా అప్పజెప్పబడిందని అనుకోవచ్చు. “మీ గదుల్లో టేపు చేసిన మాటల్లో ప్రతి గొంతూ వాళ్లు గుర్తుపట్టలేర”ని నాతో కొమోజోలు వ్యక్తి ఒకరన్నారు.
యూనివర్సిటీ బయటి జీవితానికి కొమోసోల్ అద్దం పట్టేది. బయటి జీవితంలో సామాన్య ప్రజానీకానికి లేని కొన్ని ప్రత్యేక ప్రతిపత్తులూ, సదుపాయాలూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులకు ఉన్నాయి. ఉదాహరణకు, యూనివర్సిటీలో పై తరకల కొమోసోల్ వ్యక్తులకు వాళ్ళల్లో వాళ్లు మాత్రమే జరుపుకునే పార్టీలు ఉండేవి. అటువంటి పార్టీ కొకదానికి నేను వెళ్ళాను. ఆ పార్టీలో ఎస్టోనియా నుంచి తెప్పించుకున్న బృందం రాక్ సంగీతం ఉండింది. ఇతర మామూలు విద్యార్థులు ఆ పార్టీలోకి జొరబడటానికి ప్రయత్నించినప్పుడు కొమొసోల్ పోలీసులను పిలిచారు.
మధ్యలో వచ్చిన క్రిస్మస్ సలవులకు నేను అస్వస్థతో ఉన్న నా తల్లిని చూడటానికి వెనక్కు -ఫిలడెల్ఫియాకి- వచ్చాను. శలవల తర్వాత తిరిగి మాస్కో వెళ్ళినప్పుడుగెల్ఫాండ్, “సోవియట్ యూనియన్‌లో కొన్నాళ్ళుండి, అమెరికా వెళ్లి మళ్ళీ సోవియట్‌కి రావటం నీకెలా అనిపించింది?”అని అడిగాడు. “బాగానే ఉంది గానీ, ఇంటిదగ్గర మొదటి వారమంతా ఫోన్ మాట్లాడాలంటే జంకుపుట్టేది” అన్నాను.
రష్యన్ సాహిత్యం, ప్రత్యేకించి పుష్కిన్ రచనలను, చదవమని గెల్ఫాండ్ నన్ను ఉద్బోధించేవాడు. పుష్కిన్ కవిత ‘మొట్జార్ట్ అండ్ సాలియెరి’ రికార్డునూ, ఇల్యా -పెత్రోఫ్‌లు కలిసి రాసిన నవలలనూ నాకు ఇచ్చాడు. నాకు ఆయన మిన్లోసూ, షపిరోలతో కలిసి తను రాసిన ‘రిప్రజంటేషన్ ఆఫ్ ది రొటేషన్ గ్రూప్ అండ్ లారెంజ్ గ్రూప్’ అన్న పుస్తకమూ, ఇంగ్లిష్‌లో ఉన్న(ఆంద్రే) వెయిల్ రాసిన ‘బేసిక్ నంబర్ థియరీ’ అన్న పుస్తకమూ వాటితో పాటు వివిధ గణితశాస్త్ర విభాగాలలో పుస్తకాలు కూడా ఇచ్చాడు. స్నేహాలు చేసుకోవటంలో గెల్ఫాండ్‌కి ఉన్న ఆసక్తి, నేర్పూ అపారమైనవి. ఆంద్రే వెయిల్ గెల్ఫాండ్‌ను చూడటానికి మాస్కో వచ్చాడు. వాళ్ళిద్దరూ దగ్గరి స్నేహితులయ్యారు. నేను వెనక్కి వచ్చింతర్వాత ఒక సంవత్సరం పాటు తనకు సహాయకునిగా ఉండటానికి వెయిల్ నన్నుప్రిన్స్‌టన్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకి ఆహ్వానించాడు. నాకైతే నిజం తెలీదు గానీ నన్ను గెల్ఫాండ్ వెయిల్‌కి సిఫార్స్ చేసి ఉంటాడనీ వెయిల్ స్నేహితుని మాటను గౌరవించాడనీ అనే నేననుకుంటూ ఉంటాను.
మాస్కోలో నువ్వు నీ సోవియట్ స్నేహితులను ఒకరి కొకరు కలుసుకోలేని చట్రాలలో ఉంచటం నేర్చుకుంటావు. అమెరికన్‌తో పరిచయం ఉండటం ప్రమాదకరమైనది. ఎక్కడబడితే అక్కడ సమాచారం చేరవేసేవాళ్ళు. నీ పరిచయస్తులే, ఒక అమెరికన్ కలుసుకుంటున్న ప్రతి వ్యక్తి గురించీ తెలుసుకునే పార్టీలో సాధికారిక పై విభాగాలకి నిస్సందేహంగా ఉప్పు అందిస్తారు.
నాకు మాత్రం భయభ్రాంతుణ్ణై పోవలసిన అవసరం కనిపించలేదు. జాగ్రత్తగా మసలుకోవాలని మాత్రం తెలుసును. నాకు ఏ ప్రమాదమూ లేదని నేనెరుగుదును. ఈ నిర్భీకతకు కారణం నాకు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉండటమే. రష్యన్లు అంతర్జాతీయ వ్యవహారాలతో గొడవలు కోరుకోరు. నన్ను అరెస్ట్ చేస్తే చేయవచ్చు, జడిపించవచ్చు. నేను ఉద్రేకపడకుండా ప్రశాంతంగా ఉన్న పక్షాన నన్ను ఇంటికి తరలించేస్తారు. అది పెద్ద విషయమేమీ కాదు. సోవియట్ పౌరుల పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. వాళ్ళ పరిస్థితి ప్రమాదాలలోకి నెట్టే పరిస్థితే. వాళ్ళను యూనివర్సిటీ నుంచి పంపించేయటం మొదలుకొని, ఉద్యోగాలలోంచి తొలగించటం దాకా, వాళ్ళ జీవితాలను బుగ్గిచేయటం దాకా ఏదైనా సంభవమే. అమెరికా సంయుక్త రాష్ట్రాలు వియత్నాంలో ఘోర యుద్ధం చేస్తున్నప్పటికీ, హనోయి మీద బాంబులు వేస్తున్నప్పటికీ, ఒక వంక ఆగ్నేయాసియాలో కర్ర చూపిస్తూ, మరొక వంక – అమెరికన్లతో వ్యాపారాన్ని పెంచుతున్నట్టుగా రాయితీలూ, రష్యాకు ఎగుమతులూ ఎరగా – యూఎస్ఎస్ఆర్‌కి కారట్లూ చూపిస్తూ, కిసింజర్ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న జోడు గుర్రాల సవారీ సూత్రం కారణంగా రెందు దేశాల మధ్యనా ఏర్పరుచుకున్న విద్యా విషయకమైన పరస్పర ఒడంబడికతో, మాస్కోలో, ఎటువంటి గూఢచారి చర్యలతోనూ సంబంధం లేకుండా కేవలం ‘అమెరికన్ లాగా వ్యవహరిస్తున్నాడన్న ‘నేరం’ మాత్రం మోపబడ్డ అమెరికన్ పౌరుడి భద్రతకు ఏమీ ముప్పు లేదు.
సోవియట్ యూనివర్శిటీలన్నిటిలో లాగే, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో కూడా ‘మొదటి విభాగం ‘ -రష్యన్‌లో పెర్వియ్ ఒట్ డెల్ – ఉండేది. ఇది KGB అనే సంక్షిప్త నామం తో ప్రసిద్ధమైన సోవియట్ భద్రతా – గూఢచర్యా సంస్థ యూనివర్సిటీలలో ఎర్పాటు చేసుకున్న కార్యాలయం పేరు. గెల్ఫాండ్ అమెరికాకు వచ్చేసి రట్జర్స్‌లో ఆచార్యుడుగా ఉన్న రోజుల్లో నా ఎదుట నెమరు వేసుకున్న కథ. “నేనిది నువ్వు మాస్కోలో ఉన్న రోజుల్లో చెప్పలేకపోయాను. నీవక్కడ ఉన్నప్పుడు నన్ను చూడటానికి పెర్వియ్ ఒట్ డెల్ మనిషి ఒకరొచ్చారు. ‘మీదగ్గర నథాన్సన్ అనే ఒక అమెరికన్ విద్యార్థి ఉన్నాడు. అమెరికన్లు వాళ్ళకిష్ట మొచ్చినట్టుగా ఉంటారని నాకు తెలుసు. అయినా నథాన్సన్ అమెరికన్లతో పోల్చినా మరీ విచ్చలవిడిగా ఉన్నాడు. అతన్ని మేము దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది ‘, ఇవి ఆ KGB అధికారి అన్న మాటలు.”
రాజకీయ చతురత పుష్కలంగా ఉన్న గెల్ఫాండ్ , “దానికేం, మీరు అతన్ని పంపించేయటం మీకు తప్పని సరి అయితే పంపించేస్తారు. కానీ నాకు తెలిసినంత వరకూ నథాన్సన్‌కి అమెరికాలో చాలా మంది స్నేహితులున్నారు. అతన్ని మీరు వెనక్కి పంపించేస్తే అంతర్జాతీయంగా పెద్ద లొల్లి అవుతుంది. అతన్ని ఇప్పుడు పంపించేయటం కన్నా అతను తన ఈ సంవత్సరం గడువు పూర్తి చేసుకుని వెళ్లి పోయింతర్వాత మళ్ళీ రానీయకుండా చేయడం మేలుగా ఉంటుంది.” అన్నాడు. అలాగే జరిగింది.
నేను మరొక సంవత్సరం పాటు మాస్కోలో అతనితో గడపటం నా గణిత శాస్త్ర విద్యాభివృద్ధికి మేలని గెల్ఫాండ్ భావించాడు. కానీ నేను మాస్కో స్టేట్ యునివర్సిటీకి మళ్లీ వెళ్ళటమన్నది జరగని పని అని తేటతెల్లంగా తెలుస్తూనే ఉంది. సంయుక్త రాష్ట్రాలకీ సోవియట్‌కీ మధ్య పరస్పరం సైంటిస్టులను అతిథులుగా పంపే రెండో ఒడంబడిక అటువైపు సోవియట్ అకాడమీ అఫ్ సైన్సెస్ పరిథిలో ఉంది. గెల్ఫాండ్ నన్ను సోవియట్ అకాడమీకి దరఖాస్తు చేసుకోమన్నాడు. అలా చెబుతూనే ఈ సారి నేను రష్యాలో వేరొక విద్యాసంస్థకే రాగలను కాబట్టి, నేను జేరబోయేచోటు ‘స్తెఖ్లొఫ్ ఇన్‌స్టిట్యూట్’ మాత్రం కాకుండా చూసుకోమని హెచ్చరించాడు, ఆ గణితశాస్త్రాధ్యయన సంస్థ సోవియట్ కెల్లా యూదు ద్వేషానికి పరాకాష్ఠ అన్నాడు. సోవియట్‌లో ఉన్న ప్రథమశ్రేణి గణిత శాస్త్రవేత్తలైన పలువురు యూదు పండితులకు ఆశ్రయమై. సమాచారాన్ని చేరవేయటంలో వచ్చే సమస్యలను గణిత శాస్త్ర సమస్యలుగా అధ్యయనం చేసే ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రాబ్లమ్స్ ఇన్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ ని నాకు రికమండ్ చేస్తూ నన్ను ఆ సంస్థకు అర్జీ పెట్టుకోమన్నాడు. 1977లో నేను అలాగే దరఖాస్తు చేసాను వాళ్లు అంగీకరించటం గూడా జరిగింది.
అయితే చివరి క్షణాలలో సోవియట్ విదేశ వ్యవహారాల మంత్రాలయం నాకు వీసా ఇవ్వటానికి నిరాకరించింది. నేను వెళ్ళలేక పోయాను. నాకు సోవియట్ వీసా ఇవ్వకపోవడం – గెల్ఫాండ్ అప్పుడేదో మాటవరసకు అంటే – నిజంగా అంతర్జాతీయ వ్యవహారంగా తయారై, ‘న్యూయార్క్ టైమ్స్’లో పడి వార్తా మాధ్యమాలు సోవియట్ చర్యని అంతర్జాతీయంగా సైంటిస్ట్‌లను ఆదరించటంలో హెల్సింకి ఒప్పందాలను సోవియట్ అతిక్రమించినట్లుగా చిత్రించాయి.
కమ్యూనిజంలో ఉన్నప్పుడు అది సోవియట్ యూనియన్ కావచ్చు, తూర్పు ఐరోపా కూటమిలో ఉన్న దేశం కావచ్చు అక్కడి మనుషుల అంతరంగాన్నీ బాహ్య జీవితాన్నీ ఒక వింత ఒత్తిడి విడతీసి, వేరుచేసేస్తుంది. రష్యనులు ‘స్లోజ్ను’ అని పిలుచుకునే ఈస్థితి, ఈ విడతీత ‘క్లిష్టమైనది’. మాస్కోలో చదువుతో ముడిబడ్డ ఉద్యోగాలు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలుండి పార్టీ అంగీకరించిన వారికే దక్కేవి.
గణితశాస్త్రం చదువుకునేవాళ్ళకు – ఆమాటకొస్తే గణితశాస్త్రమే జీవితంగా గడిపేవాళ్ళకు – పెద్దగా ఆదాయం గానీ పోషణ గానీ ఉండేవి కావు. వాళ్ళు కేవలం గణిత శాస్త్రం మీద ప్రేమతో, గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే బుద్ధివికాసం కోసం, ఆత్మానందం కోసం, తప్ప పశ్చిమ దేశాలలో లాగా వృత్తిగా తీసుకుని అందులో పైపైకి పోదామని ఈ విద్యాభ్యాసానికి వచ్చిన వారు కారు. ఐతే సోవియట్ వ్యవస్థ సమసి పోయిన తర్వాత రష్యన్ గణిత శాస్త్ర అధ్యయనం ఈ అమాయకత్వాన్నీ, స్వచ్చతనీ కొంత వరకూ కోల్పోయి అమెరికా, ఇరోపాలోల్లాగా వృత్తి లక్షణాలను సంతరించుకుంది. అంతే కాదు, ఇప్పుడు ఇర్కుట్‌స్క్‌లో “మాంసం” కొనుక్కోవచ్చు. ఏనాడూ సోవియట్ అనుభవించిన స్థాయిలో లేమిని మనం అనుభవించలేదు. ఇప్పటి రష్యన్ గణిత శాస్త్ర వాతావరణాన్ని మనం నిందించకూడదు. కోల్డ్ వార్ రొజుల్లో మాస్కోలో ఉన్న (ఒక) అమెరికన్‌కి అప్పటి రష్యన్ గణిత శాస్త్ర జీవితంలో కనపడిన బుద్ధి తీక్ష్ణతా నాణ్యత పరమాద్భుతమైనది.
నాతొ పరిచయమయేదాకా, భయమన్నది తెలీకుండా, జీవితాన్నొక హాయిగా తీసుకునే ధోరణి గల మనుషులుంటారని తను అనుకోలేదన్నాడు ఖజ్దన్ ఒకసారి నాతో. రష్యా లో ప్రతివాళ్ళూ సర్వకాల సర్వావస్థల లోనూ ఒక ప్రమాదం పొంచిఉన్నదనీ దానినుంచి తమను కాపాడుకోటానికి చేసే ప్రయత్నమే జీవించటంగా బతికుతూ ఉండేవాళ్ళు.
ఏమి మాట్లాడినా, కావాలని కాకపోయినా, లేదూ కావాలని అపకారం చేసే ఉద్దేశ్యంతో తాము అన్నదానికి వ్యాఖ్యానాలు జోడించి ‘పై వాళ్ళకు’ అందజేసే వాళ్ళున్నారనీ , పర్యవసానంగా తాము బడినుంచి వెళ్ళగొట్టబడవచ్చు, దేశ బహిష్కారం కాబడవచ్చు, జైల్లో వేయబడవచ్చు, చంపబడవచ్చునన్న నిత్య భయంతో వేయికళ్లతోతమను తము చూసుకుంటూ గడిపేవాళ్ళు. బతుకన్న తర్వాత ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఎవర్ని నమ్మాలి? ఈ మనిషిని ఎంతవరకు నమ్మొచ్చు? ఎంత వరకూ మనసు విప్పి చెప్పుకోవచ్చు? ఈ వ్యక్తీ నామీద KGBకి ఫిర్యాదు చేయవచ్చా? నా గురించి తన స్వప్రయోజనాలకోసం అబద్ధాలు చెప్పొచ్చేమో ?అమెరికన్లకు ఇటువంటి ఒత్తిడి తెలీదు. ‘పెర్సెక్యూషన్’ – పుట్టుకను బట్టీ, మతవిశ్వాసాలను బట్టీ, ఆలోచనా సరళిని బట్టీ శిక్షించటం, హింసించటం, అంతంచేయటం – అన్నది ఒకటున్నదని తెలియకుండా, అటువంటి భయాలు లేకుండా పెరిగాం. మనదేశం భాగ్యవంతమైనది, మనం కాకపోయినా. ఇక్కడ వివక్షత లేని న్యాయ చింతన ఉన్నది. పాత రోజుల్లో, బాణామతి వంటి క్షుద్రారాధకుల్ని తరిమి కొట్టినట్టుగా కమ్యూనిస్ట్‌ల వెంటబడి వేటాడటమన్న మెకార్తీఇజం – చెడ్డదే కానీ, అది సాగినది చాలా స్వల్పకాలంపాటు.. – చెలరేగినప్పుడు కూడా ఆ పాత తరం వాళ్ళు సోవియట్ ప్రజలు భయపడినంతగా భయపడింది లేదు.
గతించిన యూఎస్ఎస్ఆర్ గాంభీర్యం యెంత పెళుసుగా ఉండేదంటే ఆ పెళుసు దనాన్ని గురించి ఏమి చెప్పినా అతిశయోక్తి అవదు. ఒక అమెరికన్, మాస్కోకి వెళ్లి – తన చదువు కోసం ఉన్న కొద్దికాలంలోనే – అక్కడ అమెరికన్ లాగా సంచరిస్తూ, ఎవరికీ భయపడకుండా, లైబ్రరీలనుంచీ, శాస్త్ర ప్రాచీనతనీ, పాతరోజుల పరిశోధకుల కృషి ఫలితాలనీ పదిలపరిచి ఉంచి అధ్యయనానికి తోడ్పడే చోట్లు యేవైతే ఉంటాయో వాటన్నిటి నుంచీ బయటికి తోసేస్తామనే బెదిరింపులకు వణికిపోకుండా, ఒంటిచేత్తో సోవియట్ రాజకీయ వ్యవస్థని ధ్వంసం చేయగలిగేవాడని చెప్పినా కూడా అత్యుక్తి కాదు. సోవియట్లు ఒక స్వతంత్ర దేశంలో స్వేచ్ఛా వాతావరణంలో బతుకుతున్న వాళ్ళ మనస్థితికీ, నియంతృత్వ పాలన ఉన్న దేశంలో బతుకుతున్న ప్రజల మానసిక స్థితి గతులకూ మధ్య ఉన్న తేడాని గ్రహించగలిగారు. సోవియట్ అధికారులు తమ సామాన్య ప్రజాజీవనం నుంచి అమెరికన్లని దూరంగా ఉంచాలనుకోవటం సరియైన ఆలోచనే. మనం వాళ్ళ రాజ్య వ్యవస్థకు ముప్పు, సోవియట్లకు మనం ఒక ప్రమాదం.
వాసుదేవరావు ఎరికలపూడి

