ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు!

మహిళలపై లైంగిక వేధింపులు ఈ నాటివి కావు. ఆ బాధలను బయటికి చెప్పుకోలేక మనసులోనే ఆవేదన చెందే అభాగినులు ఎందరో! కానీ తరం మారింది, బాధిత మహిళలందరూ కలిసి అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొంగు బిగించారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అందుకు నిదర్శనం సికింద్రాబాద్ రైల్వేవర్క్‌షాప్ మహిళా సంఘం…
తీవ్ర అనారోగ్యంతోపాటు ప్రమాదాల్లో అర్ధాంతరంగా భర్తలు మరణిస్తే, దిక్కుతోచని పరిస్థితుల్లో పిల్లల ఆలనా పాలన కోసం ఇంటికే పరిమితమైన వారి భార్యలు కారుణ్య నియామకం కింద వర్క్‌షాప్‌లో వచ్చిన ఉద్యోగాల్లో చేరారు. ఒంటరిగా జీవన సమరం సాగిస్తున్న ఆ మహిళా ఉద్యోగినులకు కొందరు అధికారులు, ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఆరంభమయ్యాయి.
రైల్వే ఉద్యోగి అయిన భర్త కేన్సర్‌తో మరణించాడు. దీంతో అత్తింటివారు కోడలితోపాటు ముగ్గురు పిల్లల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. పిల్లల్ని తీసుకొని కారుణ్య నియామకం కింద రైల్వేవర్క్‌షాప్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగం పొందిన ఆ మహిళ మొదటిసారి వంటింటి నుంచి బయటకు వచ్చింది. ఆ ఒంటరి మహిళకు ఆఫీసులో వేధింపులు ఎదురయ్యాయి. ఆమె గురించి కొందరు మగవాళ్లు అవాకులు చవాకులు పేల్చేవారు. అంతటితో ఆగకుండా ఓ పురుష ఉద్యోగి మరో అడుగు ముందుకేసి ఓ రోజు బలవంతపెట్టే మాటొకటి అన్నారు. అంతే! కన్నీటిపర్యంతమైన ఆ మహిళ ధైర్యం తెచ్చుకొని రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వేధించిన ఉద్యోగిపై బదిలీవేటు పడింది. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో ఉద్యోగంలో చేరిన మరో మహిళకు అడుగడుగునా ఇవే సమస్యలు. ఇలాంటి వారంతా కలిసి ఒక్కటవ్వాలని నడుం బిగించారు. వర్క్‌షాప్ మహిళలను సంఘటితం చేసి ఈ ఏడాది ఆరంభంలో మొదట స్ర్తీశక్తి సమ్మేళనాన్ని నిర్వహించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశమయ్యారు. ఇలా ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇకపై పురుషులకు చెప్పుకోలేని సమస్యలను మనకు మనమే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ మహిళలు. దీని కోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు.
అందరి భద్రత కోసం..
రైల్వే వర్క్‌షాప్‌లో మహిళా శక్తిని బలోపేతం చేస్తూ ‘వర్క్‌షాప్ మహిళ’కు ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీకారం చుట్టారు. ముందుగా మహిళా ఉద్యోగినుల్లో చైతన్యం నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. వర్క్‌షాప్ మహిళ ఆవిష్కరణానంతరం మొదటిసారి మహిళా ఉద్యోగినులను బస్సుల్లో అనంతగిరిహిల్స్‌లో విహారయాత్రకు తీసుకువెళ్లారు. మరోసారి జహీరాబాద్‌లోని వ్యవసాయక్షేత్రంలో పర్యావరణ విహారయాత్రలోనూ పలువురు మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. ఇలా విహారయాత్రల్లో అందరినీ మాట్లాడించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకోవడం కార్యక్రమ ఉద్దేశం. పురుషులు వేధిస్తే తామే తప్పు చేస్తున్నామన్న భావన వీడి ధైర్యంగా ముందుకొస్తే చర్య తీసుకుంటామంటోంది సంఘం కార్యదర్శి విష్ణువందన.
కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు..
వర్క్‌షాప్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినికి ఓ అధికారి ఏడాది కాలంగా ద్వందార్ధపు మాటలతోపాటు… తీక్షణపు చూపులు, వెకిలిచేష్టలతో వేధిస్తుండే వాడు. పదిరోజుల క్రితం సదరు అధికారి ఓ రోజు రాత్రి ఆ మహిళ ఇంటికే ఏకంగా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ సంఘటనతో ఆ మహిళా ఉద్యోగిని కుటుంబంలోనూ చిచ్చు రేగింది. దీంతో బాధితురాలు చేసిన ఫిర్యాదుతో వర్క్‌షాప్ మహిళలు మూకుమ్మడిగా కలిసి సదరు ఇంజనీరు కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కాలరు పట్టుకొని బయటకు రప్పించి నిలదీశారు. ‘‘నీ భార్యకు ఎవరైనా ఇలా ఫోన్ చేస్తే నీకెలా ఉంటుంది’’ అని ప్రశ్నించారు. ఇంట్లో జరుగుబాటు లేక ఉద్యోగానికి వచ్చిన మహిళలను ఇలా వేధిస్తావా? అంటూ ఘెరావ్ చేసి చీఫ్ వర్క్‌షాప్ మేనేజరుకు ఫిర్యాదు చేశారు వాళ్లు. మహిళలంతా కదిలివచ్చి నిలదీయటంతో భయపడిన అధికారి క్షమాపణలు చెప్పారు. మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన ఇంజనీర్‌పై ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. మరో మహిళా ఉద్యోగినిని వేధించిన మరో ఉద్యోగిని కూడా మహిళలు నిలదీసి, ఆయనతో క్షమాపణలు చెప్పించారు. సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న అయిదునెలల గర్భిణి బరువులు మోయడం వల్ల కడుపులో నొప్పి వస్తోందంటే, ఓ అధికారి వెటకారంగా మాట్లాడారు. దీంతో ఆ అధికారి వద్దకు మహిళలు వెళ్లి నిలదీశారు. రైల్వే ఉన ్నతాధికారులతో మాట్లాడి గర్భిణికి మెటిర్నిటీ లీవు ఇప్పించామంటున్నారు సంఘం నాయకురాలు సావిత్రి.
‘‘మా నాన్న హార్ట్‌ఎటాక్‌తో మరణిస్తే చదువుకుంటున్న నాకు కారుణ్య నియామకం కింద వర్క్‌షాప్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ ఆలోచించి వేధింపులను ధైర్యం తెచ్చుకొని ఎదుర్కొన్నాను.. ’’ అన్నారు మరో ఉద్యోగిని చంద్రకళ.
కీచకుల భరతం పడతాం
సికింద్రాబాద్‌లోని అన్ని రైల్వే వర్క్‌షాప్‌లలో మా మహిళా సంఘం ప్రతినిధులు తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించాం. మహిళల సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్ చేపడుతున్నాం. పనిచేస్తున్న మహిళలను లైంగికంగా వేధిస్తే సహించేది లేదు. కీచక అధికారుల భరతం పడతాం. చట్టప్రకారం వారిపై జీఎంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
– విజయ జగదీశన్, ఛైర్‌పర్సన్, వర్క్‌షాప్ మహిళ, సికింద్రాబాద్
. నవ్య డెస్క్

