ఆధునిక వాక్య వేత్త -చే రా. -ఐనవోలు ఉషా దేవి

ఆధునిక వాక్యవేత్త -అయినవోలు ఉషాదేవి

Published at: 27-07-2014 07:13 AM

ఆచార్య చేకూరి రామారావు మరణం తెలుగు సాహితీ ప్రపంచాన్ని విషాద ంలో ముంచేసింది. ఎంతోమంది ప్రముఖులు, సాహితీ విమర్శకు ఆయన కంట్రిబ్యూషన్‌ గురించి ఎక్కువగా ఫోకస్‌ చేశారు. దీనికి ప్రధాన కారణం సుమారు ఎనిమిది సంవత్సరాలపాటు ఆయన చేరాతల కాలమ్‌ ద్వారా ఆంధ్రజ్యోతిలో నిరాఘాటంగా చేసిన సాహితీ విశ్లేషణలే. చేరాతల కాలమ్‌ తర్వాత భాషాశాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు మసకబారినట్లయిది. అందుకే ఆయనవద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డి చేసిన పరిశోధక విద్యార్థిగా భాషా శాసా్త్రనికి ఆయన సేవలు తెలియజేయడం నా కర్తవ్యంగా భావించి ఈ వ్యాసం రాస్తున్నాను.
చేరాగారు తెలుగు సాహిత్య విద్యార్థిగా ఉంటూనే ‘భాష’ గురిచిన వివేచన చేస్తుండేవారు. చాలామంది తెలుగు శాఖలలోని హేమాహేమీ పండితులంతా ఉస్మానియాలో భాషా శాస్త్ర శాఖ ప్రారంభమైన కొత్తలో ‘ఇదేదో అమెరికా దిగుమతి సరుకు’ అనుకుంటూ, ఆ శాసా్త్రన్ని దూరంగా నెట్టేశారు. దానికి మరో కారణం కూడా ఉంది. ఎల్లి మొదలుకొని, భద్రిరాజు కృష్ణమూర్తిగారి వరకు అందరూ తెలుగును సంస్కృతజన్యం కాదనీ, ద్రవిడ భాష అనీ శాస్ర్తీయ ఉపపత్తులతో విశ్లేషించడమే. భద్రిరాజు కృష్ణమూర్తి వద్ద చదువుకుని, ఆయన వృత్తిపదకోశ ప్రాజెక్టులో విషయ సేకరణతో భాషా వివేచన ప్రారంభించిన చేరా, చిన్నయ్యసూరి బాల వ్యాకరణానికి వీరాభిమాని అని చాలా మందికి తెలియదు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళి జెరాల్డ్‌ కెలి పర్యవేక్షణలో తెలుగు నామ్నీకరణం (నామినలైజేషన్‌) పై పీహెచ్‌డీ చేశారు. వాళ్లిద్దరూ తెలుగు గురించి లోతైన చర్చలు చేసుకునేవారు. తెలుగు ధ్వనులపై వారిద్దరి పరిశీలనల గురించి మాకు క్లాసులో ఉదాహరణలతో వివరించి, చిన్న చిన్న ధ్వని భేదాలను ఎలా గుర్తించాలో వివరిస్తే, మేం ఆశ్చర్యంగా విని, ఆ భేదాలను ఆకళింపు చేసుకునేవాళ్లం. ఆయన పీహెచ్‌డీ చేస్తున్న కాలంలో నోమ్‌ఛామ్‌స్కీ రాసిన రెండు గ్రంథాలు ‘సింటాక్టిక్‌ స్ట్రక్చర్స్‌ (1957); ఆస్పెక్ట్స్‌ ఆఫ్‌ సింటాక్టిక్‌ థియరీ (1965) భాషా శాస్త్రంలో ‘విప్లవాత్మక’మైన మార్పులకు దోహదం చేశాయి. వామపక్ష భావజాలం కూడా ఉన్న ఛామ్‌స్కీ విశ్లేషణలు చేరాని ఆకర్షించాయి. ఎంఏ రెండో సంవత్సరంలో ఆయన మాకు ‘వ్యాకరణ సిద్ధాంతాలు’ (గ్రామటికల్‌ థియరీస్‌) అనే పేపర్‌ బోధిస్తూ వివిధ రకాల సిద్ధాంతాలలో ఛామ్‌స్కీది ఎలా మెరుగైనదో విశ్లేషించేవారు; దాని నుంచి ఆవిర్భవించిందే ఆయన తెలుగు వాక్యం. ఇది నా ఎంఏ పరీక్షలు ముగిసే నాటికి పూర్తయింది. మొదటి తెలుగు ప్రపంచ మహాసభలో 1975లో ఆవిష్కృతమైన అనేక గ్రంథాలలో ఇది ముఖ్యమైనది. ఈ పుస్తకాన్ని శుద్ధ ప్రతి (ఫెయిర్‌ కాపీ) చేసి ఇచ్చినందుకుగాను ఆ పుస్తకంలో ఆయన ఆ విషయాన్ని నిక్షిప్తం చేయటం నా జీవితంలో మరచిపోలేని అంశం. దాన్ని బైండ్‌ చేయించి, స్వయంగా మా ఇంటికి వచ్చి నాకు ఒక కాపీ ఇవ్వడం అపురూపమైన ఘట్టం, ఇది ఆయన మౌలిక సైద్ధాంతిక రచన.
ఛామ్స్కీ ప్రతిపాదించిన అంశమూ చేరా తెలుగుకు అన్వయించిందీ ఏంటంటే, భాషా విశ్లేషణకు వాక్యం పునాది అని అప్పటివరకు ప్రపంచంలోని ఏ లిఖిత భాషల్లోని వ్యాకరణాలైనా ప్రధానంగా అక్షరాలు, సంధులు, సమాసాలు, నామ నిష్పన్నాలు, క్రియా నిష్పన్నాలు వివరించేవిగా ఉండేవి. ఇంగ్లీషు వ్యాకరణాలలో సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలను గురించి చేసిన విశ్లేషణే చామ్స్కీ సిద్ధాంతానికి పునాది. పైకి భిన్నాభిన్నాలుగా వ్యక్తమయ్యే అన్ని రకాల వాక్యాలనూ ఒకే ఒక అంతర్నిర్మాణ వాక్య రూపం నుంచి వివిధ పరివర్తన సూత్రాల ద్వారా నిష్పన్నం చేయవచ్చునన్నదే ఆ సిద్ధాంతంలోని ప్రధానాంశం. ఉదాహరణకు కర్త ప్రధానమైన ‘రాముడు రావణుని చంపాడు’ నుంచి కర్మ ప్రధానమైన రావణుడు రాముడి చేత చంపబడ్డాడు అన్నది (ఇదొక్కటే ఉదాహరణగా ఇలాంటివన్నీ) పరివర్తన సూత్రం ద్వారా నిష్పన్నం చేయవచ్చు. అయితే ఇవన్నీ ‘రూపానికి’ సంబంధించిన మార్పులు. అలాగే అనుకృతి వాక్యాల్లో (డైరెక్ట్‌-ఇండైరె క్ట్‌) ప్రత్యక్షం నుంచి పరోక్షంగా వాక్యాన్ని మార్చినా ఉత్తమ పురుష ప్రత్యయం ‘ను’ మారకపోవడాన్ని ఆయన గుర్తించి, దీనిపై (అతను తాను వస్తానన్నాడు). మరింత పరిశోధన జరగాలని చెప్పాడు. సమకాలీన జీవితం నుంచి, సాహిత్యం నుంచి ఉదాహరణలతో ఆయన తన ‘తెలుగు వాక్యం’ రచనను పరిపుష్టం చేశారు. భద్రిరాజు కృష్ణమూర్తి గారి ‘వ్యవసాయ వృత్తి పదకోశం’లోని అనుభవంతో ఆయన నిఘంటు నిర్మాణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక శాఖ ఏర్పాటుకు కృషి చేసారు. పత్రికా భాషపై ఆయనకున్న అభిమానంతో పత్రికాభాషా నిఘంటువుకు, ఆ తర్వాత ప్రెస్‌ అకాడెమీ నిఘంటువుకు బాధ్యత నిర్వహించారు. అనువాద రంగమన్నా కూడా ఆయనకు విశేషమైన అభిమానం. ఆయన కొన్ని కవితలను అనువాదం చేయటమే కాక, అనువాద శాస్త్రంపై తన అభిప్రాయాలను వివిధ వ్యాసాల్లో వ్యక్తీకరించారు. సాహిత్యాభిరుచి వల్ల ఆయనకు అటు భారతీయ సాహిత్య విమర్శ (ఛందో-అలంకార శాసా్త్రల విషయంలో), పాశ్చాత్య సాహిత్య విమర్శలతో పాటు భాషాశాస్త్ర దృక్పథంలో ప్రారంభమైన శైలి శాస్త్రం – ఈ మూడింటినీ జోడించి సాహిత్య విమర్శ ప్రారంభించారు. అంతకు పూర్వం కోవెల సంపత్కుమారతో ముత్యాలసరాల గురించిన విశ్లేషణ ఉన్నా, దానికి 1980ల తర్వాతే ప్రాధాన్యం ఏర్పడింది. సావిత్రి ‘బందిపోట్ల’ కవితతో ప్రారంభమైన ఆ విశ్లేషణ ఆయన జీవితాన్ని మలుపు తిప్పి, భాషా శాస్త్రం నుంచి ఆయన్ను కొంత దూరం చేసింది. అదే సమయంలో ప్రారంభమైన ‘చేరాతలు’తో ఆయన చుట్టూ తెలుగు కవిత్వ, సాహిత్య లోకం ఆవరించి పోయింది. అదే సందర్భంలో ఆయనలో ఉన్న పద్య కవిత్వ ప్రేమ వెలికి వచ్చి, పద్య ప్రేమికులను ఆయనకు సన్నిహితం చేసింది. భాషా శాస్త్ర విద్యార్థులమంతా ఆయన్నుండి దూరమై, కనుమరుగై పోయాం.
‘తెలుగు వాక్యం’ గురించి ఆయనే ఒక మాట అంటుండేవారు. భాషా శాస్త్రం ఇంగ్లీషులో చదువుకునే వారికి తెలుగు వ్యాకరణం, పరిభాషా తెలియవు కాబట్టి, అందులోని శాస్త్ర పరిభాష అర్థం కాదు, తెలుగు వ్యాకరణాలు చదువుకున్నవారికి పరిభాష అర్థం అయినా, భాషా శాస్త్ర దృక్పథం ఏమిటో అర్థం కాదు అంటే నా పుస్తకం ఎవరికీ అర్థం కాకుండా పోతోంది అని. అయినా తెలుగు వాక్యానికి పునర్ముద్రణలు వచ్చాయంటే దాన్ని చదివి అర్థం చేసుకునేవారి సంఖ్య పెరుగుతోందని అర ్థం చేసుకోవచ్చు. తెలుగు వ్యాకరణాలను సీరియస్‌గా చ దవాలనే దృష్టి నాకు ఆయన బాల వ్యాకరణంపై ఇంగ్లీషులో రాసిన వ్యాసాలే ప్రేరణ. అందువల్ల నేను కేతన రాసిన ఆంధ్రభాషా భూషణాన్ని ఇంగ్లీషులోకి భాషా శాస్త్ర విశ్లేషణతో అనువాదం చేసి చేరాకి అంకితమిచ్చినప్పుడు దానికాయన ఎంతో సంతోషించారు. సమయం మించిపోకుండా సరియైున సమయంలో, సరియైున విధంగా ఆయనకు ఆ పుస్తకాన్ని అంకితమివ్వగలగటం నా అదృ ష్టంగా భావిస్తున్నాను. ఆయన వ్యాసాన్ని మహతిలో చదివి ఆయన వద్ద భాషా శాస్త్రంలో పరిశోధన చేయాలన్న కోరికతో, వరంగల్‌ నుంచి హైద్రాబాద్‌ వచ్చి చదువుకున్న నేను కొద్దిగానైనా దాన్ని సార్థకం చేసుకోగలిగానన్న సంతృప్తే ఆయనకు నేనివ్వగలిగిన నివాళి.
-అయినవోలు ఉషాదేవి
విశ్రాంతాచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.