అల్లు యమ సీరియస్!

అల్లు.. ఈ పేరు వినగానే పెదాల మీద చిరునవ్వు దానంతట అదే వచ్చేస్తుంది. కళ్ల ముందు రకరకాల పాత్రలు కదలాడతాయి. తెలుగు సినిమా చరిత్రలో హాస్య నటులకు ఒక అధ్యాయం ఉంటే.. దానిలో మొదటి పంక్తిలో అల్లు ఉంటారు. తన తర్వాతి తరాల నటులను ఎంతో ప్రభావితం చేసిన అల్లు గురించి ఆయన వర్థంతి సందర్భంగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం జ్ఞాపకాలు..
‘‘దాదాపు 35 ఏళ్ల క్రితం.. నేను వీరవాసరంలో కాలేజీలో చదివే రోజుల్లో- ఒక కార్యక్రమంలో అల్లురామలింగయ్య చీఫ్ గెస్ట్. ఆ కార్యక్రమంలో నేను మిమిక్రి చేశా. వెండి తెర మీద కాకుండా ఒక పెద్ద నటుణ్ణి నిజ జీవితంలో కలవటం నాకదే మొదటి సారి. నా మిమిక్రీని ఆయన చాలా మెచ్చుకున్నారు. ఒక పేరుమోసిన హాస్యనటుడు మామూలు కాలేజీ స్టూడెంట్ భుజం మీద చేయి వేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నేను ఏనుగెక్కినంత ఆనందపడ్డా. ఆ తర్వాత నేను ఉద్యోగంలో చేరాను. కట్ చేస్తే.. ఆ తర్వాత నేను అవకాశాలు వెతుక్కుంటూ మద్రాసు వెళ్లాను. అప్పుడు సినీఫీల్డ్ అంతా మద్రాసులోనే ఉండేది. షూటింగ్‌లు కూడా ఎక్కువగా అక్కడే జరిగేవి. ఒక రోజు చంటబ్బాయ్ షూటింగ్ జరుగుతుంటే చూడటానికి వెళ్లా. ఆ సినిమాలో అల్లు డ్రిల్ మాస్టర్ వేషం వేశారు. నేను షూటింగ్‌కి వెళ్లే సరికి స్కూలు సీను తీస్తున్నారు. అందులో ఆలీ స్కూలు విద్యార్థి. అల్లు కెమెరా ముందు నటించటం మొదటిసారి చూశాను. ఆయన నటన చాలా సహజంగా అనిపించింది. ఒక స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఇలాగే ఉంటాడా అనిపించింది.
ఈ సహజత్వమే అల్లు గొప్పతనం. రేలంగి.. రాజబాబు..పద్మనాభం..రమణారెడ్డి.. ఇలా అనేక మంది హస్యనటులు మన సినిమాలలో నవ్వులు పండించారు. ఒక్కోక్కరిది ఒక్కో స్టైల్. వీరందరూ సహజనటులే. వీరికి అల్లుకి ఉన్న తేడా ఏమిటంటే- అల్లు వీరందరితో కలిసి నటించారు. తర్వాతి తరంలో నాగభూషణం, సత్యన్నారాయణ, రావుగోపాలరావు వంటి కాకలు తీరిన విలన్స్‌తో కూడా నటించారు. మెయిన్ విలన్ పక్కన ఉండి హాస్యం పండిస్తూ, స్ర్కీన్ ప్రిజన్స్ పోకుండా చూసుకోవటమనేది సామాన్యమైన విషయం కాదు. కానీ సహజనటులకు ఇది చాలా సులభంగా అబ్బేస్తుంది. ఇలా నటించాలంటే మన చుట్టూ ఉన్న సమాజంలోని రకరకాల వ్యక్తులను గమనిస్తూ ఉండాలి. వారికి సహజంగా ఉన్న లక్షణాలు, వృతిరీత్యా అబ్బిన మేనరిజాలను పరిశీలించాలి. ఉదాహరణకు డాక్టర్లనే తీసుకుందాం. అలోపతి డాక్టర్ల మాటతీరు, బాడీ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది. ఆయిర్వేదం డాక్టర్ల మాటతీరు, బాడీలాంగ్వేజీ మరో విధంగా ఉంటుంది. సహజనటుడు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా పట్టుకుంటాడు. దానిని అనుకరించ గలుగుతాడు. ఈ విషయంలో అల్లుకు ఎవరూ సాటిరారు. అందుకే ఆయన రకరకాల పాత్రలు చేసి మెప్పించగలిగాడు. ముఖ్యంగా పురోహితుడి పాత్ర వేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన పూర్వాశ్రమంలో పురోహితుడా అనే విధంగా ఉండేవి. అల్లు నటనలో ఉన్న మరో ముఖ్యమైన అంశం- పాజ్. హావభావాలు, డైలాగ్ మీద పూర్తి పట్టు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. పిడుగు ముందు మెరుపు వచ్చినట్లు- హావభావాలు ముందు వస్తాయి. ఆ తర్వాత ఒక పాజ్‌తో డైలాగ్ వస్తుంది. ఇది కూడా చాలా సహజంగా ఉంటుంది. నేను ఆయనతో పది సినిమాలు నటించాను. ప్రతి క్యారెక్టర్‌లోను ఆయన ఒదిగిపోయేవారు. ఆ పాత్ర నిజజీవితంలో అలాగే ఉంటుందా అనిపించేది..
ఒక సారి అల్లు కాలి బొటన వేలికి గాయం తగిలింది. దానికి కట్టు కట్టుకున్నాడు. ఇంతలో ఒకాయన వచ్చాడు. ’’సార్.. ఏమైంది సార్.. కాలికి దెబ్బతగిలినట్లుంది.. పెద్ద దెబ్బే తగిలినట్లుంది.. ఏమైంది సార్..’’ అని వెయ్యి మెలికలు తిరిగి ఓవరేక్షన్ చేయటం మొదలుపెట్టాడు. అల్లు ఒక క్షణం ఏం మాట్లాడకుండా ఊరుకొని- ’ఏనుగు తొక్కింది’ అని సమాధానం చెప్పారు.
మద్రాసులో ఆయన తరచూ నిర్మాత జయకృష్ణ ఇంటికి వస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నన్ను కూడా కాలక్షేపానికి పిలిచేవారు. అప్పుడు ఆయనను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. చాలా మందికి అల్లు అంటే సినిమాల్లో ఆయన నటించిన రకరకాల పాత్రలు గుర్తుకొస్తాయి. కానీ నిజజీవితంలో ఆయన పూర్తిగా భిన్నంగా ఉండేవారు. స్వభావరీత్యా ఆయన కమ్యూనిస్టు. ఆ భావజాలాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. మార్క్స్, లెనిన్ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఉండేవారు. అల్లు నిజజీవితంలో చాలా సీరియస్ మనిషి. తాను కచ్చితంగా ఉండేవాడు. ఇతరులు కూడా అలాగే ఉండాలనుకొనేవారు. అల్లు హోమియో డాక్టర్ కావటంతో ఆయన దగ్గరకు రకరకాల సమస్యలతో రోగులు వస్తూ ఉండేవారు. వారికి మందులు కూడా ఇచ్చేవారు. కొందరు హోమియో మందులతో పాటు- అలోపతి మందు కూడా వేసుకొనేవారు. ఆ మర్నాడు వచ్చి- ’’మీరిచ్చిన మందు వేసుకున్నామండి. నెప్పి తగ్గిపోయింది. అయితే మీ మందుతో పాటు మెడికల్ షాపులో కొన్న బిళ్ల కూడా వేసుకున్నామండి..’’ అనేవారు. అలాంటి మాటలు వింటే ఆయనకు కోపం వచ్చేది.
‘‘తను బతకాలి.. ఇతరులను బతకనివ్వాలి’’ అనేది అల్లు సూత్రం. ఆయన పక్కవాడిని పల్లెత్తు మాట అనే వారు కాదు. ఎవరైనా వచ్చి అతిగా పొగిడినా, ఆయన మెప్పు పొందాలని చూసినా వారిని ఆటపట్టించేవాడు. ఈ సందర్భంలో ఒక సంఘటన చెప్పుకోవాలి. ఒక సారి అల్లు కాలి బొటన వేలికి గాయం తగిలింది. దానికి కట్టు కట్టుకున్నాడు. ఇంతలో ఒకాయన వచ్చాడు. ’’సార్.. ఏమైంది సార్.. కాలికి దెబ్బతగిలినట్లుంది.. పెద్ద దెబ్బే తగిలినట్లుంది.. ఏమైంది సార్..’’ అని వెయ్యి మెలికలు తిరిగి ఓవరేక్షన్ చేయటం మొదలుపెట్టాడు. అల్లు ఒక క్షణం ఏం మాట్లాడకుండా ఊరుకొని- ’ఏనుగు తొక్కింది’ అని సమాధానం చెప్పారు. అప్పుడు అవతల వ్యక్తి మోహంలో ఫీలింగ్స్ చూడాల్సిందే తప్ప చెప్పటం వీలు కాదు.. అంతే కాదు. ఆయనకు తన చిన్ననాటి సంగతులన్నీ జ్ఞాపకముండేవి. వాటికి హాస్యం జోడించి అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అయితే దీనికి కూడా సరిహద్దు రేఖ ఉండేది. కొద్దిగా అతిశయోక్తి జోడించి చెప్పటమే తప్ప- ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడేవారు కాదు. అల్లు, ఆయన కుమారుడు అరవింద్ సంభాషణలు కూడా చాలా బావుండేవి. కొన్ని సార్లు అది హాస్య సమ్మేళనమా అనిపించేది. కానీ అరవింద్‌కు తన తండ్రి మీద ఉన్న అభిమానం, గౌరవం ఆ మాటల్లో వ్యక్తమవుతూ ఉండేది. ఒక సారి ఒకరు- ’ మీరు ఇన్ని పాత్రలు చేశారు కదా.. వీటిలో మీకు నచ్చిన పాత్ర ఏదీ?’ అని అల్లును అడిగారు. ’’నేను ఎన్ని పాత్రలు చేశాను. వెయ్యి చేసుంటా.. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక పాత్ర, దానికో స్ర్కీన్‌ప్లే ఉంటుంది. ఆ సంఖ్యతో పోల్చుకుంటే నేను చేసిన పాత్రలేమూలకొస్తాయి..’’ అని సమాధానమిచ్చారు. ఈ సమాధానం చాలు.. ఆయనకు జీవితం పట్ల ఉన్న ధృక్పథాన్ని తెలియజేయటానికి..
. నవ్య డెస్క్

