50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో!

వంద చిత్రాలు పూర్తి చేసిన అనంతరం ఎన్టీఆర్ తొలిసారిగా ‘రాముడు-భీముడు’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇది సాంఘిక చిత్రమైతే ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం ‘అగ్గిపిడుగు’. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘సత్యనారాయణ మహాత్మ్యం’ సినిమాలో కూడా రెండు పాత్రలు పోషించారు. అంటే ఒకే ఏడాది వరుసగా మూడు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. తన నటనతో తెలుగునాటే కాదు యావత్ దక్షిణాదిన డ్యూయెల్ రోల్స్‌కి ఒక క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత కూడా ఆయనదే. జానపదబ్రహ్మగా కీర్తి గడించిన దర్శకుడు బి.విఠలాచార్య ‘విఠల్ ప్రొడక్షన్స్’ పతాకంపై ‘అగ్గిపిడుగు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్రవిశేషాలను ఒకసారి పరిశీలిద్దాం..
ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టిన చిత్రం ‘బందిపోటు’. జానపద చిత్రాల్లో ఒక ప్రత్యేక ఒరవడిని ఆ చిత్రం ఏర్పరచింది. వీరిద్దరి కలయికలో రూపొందిన రెండో చిత్రం ‘అగ్గిపిడుగు’. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాతోనే రాజన్-నాగేంద్ర సంగీత దర్శకులుగా తెలుగునాట వారి బాణీ తొలిసారి పలికించడం. ఈ జంట సంగీత దర్శకులు స్వరపరిచిన ‘ఏమో ఏమో ఇది.. నాకేమో ఏము అయినది’, ‘ఎవరనుకున్నావే.. ఏమనుకున్నావే’ పాటలు పాపులర్ అయ్యాయి.
అలెగ్జాండర్ డ్యూమస్ రాసిన ‘ది కార్సికన్ బ్రదర్స్’ నవల ఆధారంగా ‘అగ్గిపిడుగు’ చిత్రం రూపొందింది. ఈ కథతోనే 1941లో జూనియర్ డగ్లాస్ పెయిర్ బాంక్స్ ద్విపాత్రాభినయంతో ‘ ది కార్సికన్ బ్రదర్స్’ ఆంగ్ల చిత్రం రూపుదిద్దుకొని, ఘన విజయం సాధించింది. కథానుసారం ఇందులో ఒక దేశపు రాజకు కవలపిల్లలు అతుక్కొని పుడతారు. వారిని ఓ డాక్టర్ అతి కష్టం మీద వేరు చేస్తాడు. అయితే అన్న పొందే అనుభూతి తమ్మునికీ కలుగుతుంటుంది. అన్నకు దెబ్బ తగిలితే తమ్మునికీ తగలడం, అన్న ప్రేమించిన అమ్మాయిపైనే తమ్ముడూ అనురాగం పెంచుకోవడం ఈ కథలోని ప్రత్యేకతలు. ఆంగ్ల చిత్రంలో కథ చివరిలో తమ్ముడు చనిపోతాడు. తెలుగు వాతావరణానికి అనువుగా ఈ కథను మలచి సుఖాంతం చేశారు. తెలుగు చిత్రంలో అన్నదమ్ములు తమ తల్లిదండ్రులను చంపిన పినతండ్రిని అంతమొందించి, తమ రాజ్యాన్ని సంపాదించుకోవడం కథకు ముగింపు.
మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే తెలుగులోనే కాకుండా భారతదేశంలోనే అవిభక్త కవల పిల్లల ఇతివృత్తంతో రూపుదిద్దుకొన్న తొలి సినిమా ‘అగ్గిపిడుగు’. ఈ సినిమా ప్రేరణతోనే ‘హలో బ్రదర్’ చిత్రం రూపుదిద్దుకొందని చెప్పవచ్చు. ఆ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. అలాగే హీరో కృష్ణ నటించిన ‘దొంగలు బాబోయ్ దొంగలు’ చిత్రానికీ ‘అగ్గిపిడుగు’ చిత్రమే ప్రేరణ.
‘అగ్గిపిడుగు’ చిత్రంలో ఎన్టీఆర్ మాధవసేనుడు, రాజసేనుడు పాత్రలు పోషించారు. రాజసేనుడికి జోడీగా రాజశ్రీ, మాధవసేనుడికి జంటగా కృష్ణకుమారి నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు డూప్‌గా సత్యనారాయణ నటించడమే కాకుండా చిత్రంలో ప్రతినాయకుడు రాజనాలకు అనుచరునిగా కూడా నటించడం మరో విశేషం. కవల పిల్లలను విడదీసే డాక్టర్‌గా ముక్కామల నటించారు. రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రాహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘అగ్గిపిడుగు’ చిత్రానికి రూ. ఐదు లక్షలు ఖర్చయితే, విడుదలైన మొదటి వారంలోనే ఆ మొత్తం వసూలు చేయడం విశేషం. అంతకుముందు వంద రోజులు పూర్తయిన తరువాతే సినిమాల వసూళ్ల వివరాలు ప్రకటించేవారు. అయితే మొదటి వారం కలెక్షన్లను తెలుగునాట ప్రకటించిన తొలి సినిమాగా ‘అగ్గిపిడుగు’ చిత్రం చరిత్ర సృష్టించింది. ఒక సినిమా మొదటి ఏడు రోజుల్లో ఐదు లక్షల రూపాయల వసూలు చేయడం అప్పట్లో ఒక రికార్డ్ . ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో వందరోజులు పూర్తి చేసుకొంది.

