పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ – వారి స్వగ్రామం కాటూరులో- సరసభారతి-

పెండ్యాల వారి 30వ వర్ధంతి సభ

సుస్వర సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30వర్ధంతి సభను వారి స్వగ్రామం కాటూరు లోని లైబ్రరీలో 31-8-14ఆదివారం సాయంత్రం సరసభారతి నిర్వహించింది . సభకు గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతవహించి పెండ్యాల వారికుటుంబం తో తమకున్న సాన్నిహిత్యాన్ని వారి నటన సంగీత ప్రతిభను తెలియ జేశారు సుమారు నూరు చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసి అన్నిటిని సంగీత పరంగా విజయ వంతం చేశారని చెప్పారు .గాయని సుశీలను సినిమాకు పరిచయం చేసినది పెండ్యాల వారేనని ,మొదటి సినిమా ద్రోహి కి  . కే ఎస్ ప్రకాశ రావు దర్శకత్వం అప్పగించారని వారి తండ్రిగారు సీతారామయ్యగారు సంగీత గురువు అని మిక్కిలినేని ,జొన్న విత్తుల తో కలిసి నాటకాలు ఆడారని ,చెప్పారు  .శ్రీమతి ఋష్యేంద్రమని  ,లక్ష్మీ రాజ్యం లు పెండ్యాల వారి నటన  శ్లాఘిం చారని అన్నారు .కడారు నాగ భూషణం వీరి ప్రతిభను గుర్తించి ‘’తాల్లిప్రేమ ‘’సినిమాకు ఆర్కేస్త్ర్రా వాయించటానికి 1941లో వీరిని తీసుకొన్నారు .మద్రాస్ వెళ్లి రాజ రాజేశ్వరి ఫిలిమ్స్ లో చేరి దినకర రావు ,వెంకత్రావులకు అసిస్టంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు .ఎక్సేల్సియర్ క్లబ్ సభ్యుడై దుక్కిపాటి వారితో కలిసి పని చేశారు .గృహ ప్రవేశం సినిమాకు శ్రీ బాలాంత్రపు రాజనీ కాంత రావు గారికి న్యూజిక్ అసిస్టంట్ గా ఉన్నారు .

రెండవ ప్రపంచ యుద్ధకాలం లో పెండ్యాల వారు మద్రాస్  నుండి స్వగ్రామం కాటూరు  వచ్చేశారు ,గూడవల్లి రామ బ్రహ్మం గారు ‘’మాయాలోకం ‘’సినిమాకు సంగీతం లో అసిస్టంట్ డైరెక్టర్ ను చేశారు .కే యస్ ప్రకాశ రావు ‘’ద్రోహి ‘’సినిమాకు సంగీత దర్శకుని చేశారు ,ఇక అప్పటినుంచి మడమ తిప్పలేదు పెండ్యాల .కన్నడం సినిమాలతో సహా వంద చిత్రాలకు నలభై ఏళ్ళలో సంగీత దర్శకత్వం వహించి అన్నిటినీ సంగీత రసమయం చేసి పాప్యులర్ చేసిన ఘనత  వారిది . 1953 లో సుశీలను గాయనిగా ‘’కన్న తల్లి చిత్రం లో పరిచయం చేశారు .1955లో వచ్చిన అన్నపూర్ణా వారి దొంగరాముడు లో మధురమైన బాణీలు కూర్చి దర్శకుడు కే వి రెడ్డి ప్రశంసలు పొందారు .1956అనుపమ ఫిలిమ్స్ ముద్దు బిడ్డ కే బి తిలక్ దర్శకత్వం లో సంగీతం కూర్చి సంగీత రసధ్వనులను చిలికించారు ‘’చూడాలని ఉంది అమ్మా నిన్ను చూడాలని ఉంది ‘’అన్న పాట జనరంకమై ఇంటింటా మారు మోగింది .తర్వాతి ఏడాది వారిదే ‘’ఏం ఎల్.ఏ .కు సంగీతం కూర్చారు .అందులో ‘’నీ ఆశా అడియాస చేయి జారే మని పూసా ‘’వంటి ఎన్నో పాప్యులర్ ట్యూన్స్ ఉన్నాయి .

1959లో పి పుల్లయ్య దర్శకత్వం లో వచ్చిన ‘’జయభేరి ‘’పెండ్యాల స్వర రాగ భేరినే మోగించి రసజ్నులను ఉయ్యాల లూపింది .తన్మ యత్వం తో   సినిమాను చూశారు ప్రేక్షకులు .శాస్త్రీయ ,జానపద లలితాసంగీతానికి ఆ సినిమాలో  పెద్దపీటవేశారు పెండ్యాల .సూపర్ డూపర్ హిట్ .1960భట్టి విక్రమార్క ,మహాకవికాళి దాసు ,వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం ఒక దానికి మించి ఒకటి సంగీత స్వర్గారోహణ చేశాయి .మహాత్మ్యం సిల్వర్ జూబిలీ చేసుకొన్నది .1961లో వచ్చిన జగ దేక వీరుని కద సంగీత సామ్రాజ్యాన్నే సృష్టించింది .కే వి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు పెండ్యాల వారి రాగమాలికలకు ఘంట సాల వారి గానానికి  పింగళి వారి  సాహిత్యానికి  అదొక సువర్ణ అధ్యాయమే అయింది .ఇందులో  హాస్యపు పాటలూ బాగా ఆకర్షించాయి . అదే ఏడాది ఆత్రేయ గారి సినిమా వాగ్దానం పెద్ద మ్యూజికల్ హిట్ అందులో రేలంగి చెప్పిన హరికధ సూపర్ హిట్ .మరుసటి ఏడాది కమలాకర వారి దర్శకత్వం లో వచ్చిన మహా మంత్రి తిమ్మరుసు ,తర్వాత ఏడు వచ్చిన శ్రీ కృష్ణార్జున  యుద్ధం ల సుస్వర సంగీతం ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉంది .రామానాయుడుకు హైప్ ఇచ్చిన రాముడు భీముడు సినిమా సంగీతం తో రస డోలికల నూపింది . 1965లో వచ్చిన వెలుగు నీడలు ఆ పాత్రలకు వెలుగు నీడలేమోకాని ప్రేక్షకులకు సంగీత వెన్నెల జాడలె అయ్యాయి .’’పాడ వోయి భారతీయుడా ‘’పాడని పాఠ శాల లేదు అప్పటినుంచి ఇప్పటిదాకా .1966లో వచ్చిన  తులాభారం తో సంగీతం లో తులాభారంలో సరిపోయిన  చిత్రం లేదనిపించింది .పాటలు ,పద్యాలు స్వర విహారం చేశాయి .అదే ఏడాది విడుదలైన ‘’ఆంధ్ర మహా విష్ణువు కద ‘’సినిమా పోయినా సంగీతం చిరస్తాయిగా మిగిలింది .1971లో కెవి  రెడ్డి డైరెక్షన్ లో  లో శ్రీ కృష్ణ సత్య సినిమా ఫట్ కాని మ్యూజిక్ పెద్ద హిట్ .1973 లో బి వి నరసింగ రావు తీసిన ‘’భూమికోసం ‘’లో తెలంగాణా నేపధ్యాన్ని సంగీతం లో సాధ్యం చేసి ‘’ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ‘’పాటకు అద్భుత బాణీ కూర్చి అందరి నాలుకలపైనా నర్తిన్చేట్లు చేశారు .మరుసటి ఏడాది ఆత్రేయ సినిమా శోభన్ బాబు నటించిన కోడెనాగు ను ప్రేక్షకులు కాటు వేసినా ,సంగీతం తో తలలూపారు .76లో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ బాపు దర్శకత్వం లో వచ్చింది .సినిమా ఫైల్యూర్ కాని మ్యూజిక్ మ్యాజిక్ చేసి ‘’రాకోయి అనుకోని అతిధి ‘’పాటను అజరామరం చేసింది .77రామారావు దా.వీ.శు .కర్ణ కు సుస్వర సంగీతం చేసి దుర్యోధనుడికి  భార్యకు ద్యుయేట్ సెట్ చేసి హిట్ చేశారు పెండ్యాల .’’చిత్రం భళారే విచిత్రం ‘’అనే గీతం నిజం గానే చిత్ర  విచిత్రమైంది .అప్పుడే చాణక్య చంద్ర గుప్తకూ చేసి తానూ మాత్రం విజయం పొందారు సినిమా ఫ్లాప్ .తర్వాత శ్రీ రామ పట్టాభిషేకం ,ప్రియబాంధవి భాగ్య రేఖ ,కుల గోత్రాలు లకుసంగీత బాధ్యత తీసుకొన్నారు ఇందులో కుల గోత్రాలలో మళ్ళీ మళ్ళీ వినాలని పించే ఎన్నో పాటలకు ప్రాణం పోశారు రాగ సౌరభం తో .సుమధుర ,మంజుల ,మనోజ్ఞా,మనోహర సంగీతం అందించి అజరామరులైనారు పెండ్యాల . .

కర్నాటక సంగీత త్రయం త్యాగయ్య ,శ్యామశాస్త్రి ,దీక్షితులు అయితే ,ఆ నాటి సినీ సంగీతానికి పెండ్యాల ,రాజేశ్వర రావు ,ఘంట సాలలు సంగీత త్రిమూర్తులు .మెలోడి కి పెట్టింది పేరు పెండ్యాల .వెలుగు నీడలు వెంకటేశ్వర మహాత్మ్యాలలో ఆయన్ను చూడవచ్చు .జయభేరిలో ఘంటసాలతో పాటు శ్రీనివాస్ రఘునాధ పాణిగ్రాహిలను ‘’మది శారదా దేవి మందిరమే ‘’పాటలో పాడించి వారినీ చూపించారు చిత్రం లో . జానపదం శాస్త్రీయం లలిత సంగీతం అన్నిటిలోనూ ఆయన అసామాన్య ప్రజ్న కన పరచారు . .ఘంటసాల మేస్టారి గాత్రం లో ఉన్న మాధుర్యాన్ని వెలికి తీసి ,అద్భుత స్వరాలు కూర్చి పాడించి ,వారిని చిరస్మరనీయుల్ని చేశారు ఒక రాకంగా ఘంటసాల వారి సంగీత మాధుర్యాన్ని  పిండి ,రసజ్ఞులకు అందించారు పెండ్యాల .కాటూరులోనే కాటూరు వెంకటేశ్వరావు గారు జన్మించి నివాసం ఉన్నారని ,పింగళి వారితో జంట కవులై అవధానాలు చేశారని సౌందరనందం అనే అద్భుత కావ్యాన్ని ఇద్దరూ కలిసి రాశారని అంటే సంగీతానికి, సాహిత్యానికి కాటూరు పట్టుకొమ్మ గా ఉండేదని అలాంటి  మహాను భావులను స్మరించి వారికి సముచిత గౌరవం కలిగించటానికి గ్రామస్తులు ముందుకు రావాలని కోరారు సరసభారతి ప్రచురణలను లైబ్రరీకి శ్యామలా దేవి గారి చేతుల మీదుగా లైబ్రెఇయన్ కు అంద జేశారు .

సరసభారతి గౌరవ అధ్యక్షులు శ్యామలా దేవి కొన్ని గీతాలు పాడి అలరించారు .పమిడిముక్కల హైస్కూల్ తెలుగు పండిట్ శ్రీ బి ఉమా మహేశ్వరరావు పెండ్యాల స్వరపరచిన పాటలను రసిక జన మనోరంజకం గా ఆలపించారు .గ్రామ పెద్దలు శ్రీ వేమూరి కోటేశ్వర రావు ,శ్రీ బాబ్జి ,శ్రీ జో గీష్  లెక్చరర్ శ్రీ సాంబ శివ రావు శ్రీ ,ఊర వెంకయ్య ,మొదలైన పెద్దలు గ్రామస్తులు పాల్గొని పెండ్యాల వారితో తమ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు .ఇలాంటి సభ కాటూరు లో నిర్వహించినందుకు వారందరూ సరసభారతిని అభినందించి ,తప్పక పెండ్యాల, కాటూరివారి సభలు గ్రామలో నిర్వహించుకొంటామని హామీ ఇచ్చారు   ఈ తరానికి పెండ్యాల వారిని పరిచయం చేయాలి అనుకొన్న సరసభారతి ఆశయం యాభై మందికి పైగా సంగీత సాహిత్య ప్రియులు పాల్గొని దిగ్విజయం చేశారు ‘

సభ ముగింపు దశలో ఉండగా ప్రఖ్యాత సినీ దర్శకులు ,ప్రముఖ చిత్రకారులు ,వ్యంగ్య చిత్రాల సృష్టికర్త అయిన బాపు గారి మరణ వార్త  తెలిసింది .సభా సదులందరూ నిలబడి బాపు గారి ఆత్మ శాంతికి మౌనం పాటించి నివాళులర్పించారు .

సరస భారతి కార్యదర్శి శ్రీమతి శివ లక్ష్మి,సభకు స్వాగతం పలికి ,పర్యవేక్షించి వందన సమర్పణ చేశారు .కార్య వర్గ సభ్యులు శ్రీ   గంగాధరావు,కోశాధికారి శ్రీ  గబ్బిట వెంకట రమణ  సభ నిర్వహణకు ఇతోధిక సహాయం చేశారు  .ఏడాదికాలం గా సరసభారతి కలలు కంటున్న ఈ కార్య క్రమం ఘన విజయాన్ని సాధించి అందరి మెప్పునూ పొందింది .

గబ్బిట వెంకట రమణ –కోశాధికారి –సరసభారతి -31-8-14-ఉయ్యూరుPendyal 140831 Pendyal 140831 Pendyala Nageswara Rao director Pendyala Nageswara Rao director2 Pendyala Nageswara Rao

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.