‘నా అంతటి వాడు నేనే ”అని ధీమాగా చెప్పిన బాపు

‘నా గాడ్‌ఫాదర్‌ గురించి కాస్త… నా బొమ్మల కథ మరి కాస్త…’’ అంటూ బాపు తన స్వహస్తాలతో ‘ఆంధ్రజ్యోతి’ కోసం కొన్ని అక్షర ముత్యాల్ని కానుకగా ఇచ్చారు. అవి 27, ఏప్రిల్‌ 2003న ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఆ అక్షర ముత్యాల నుంచి కొన్ని….
నేను బొమ్మల వృత్తిలో కాస్త నిలదొక్కుకునే టైముకి ముఖచిత్రానికి వంద, కథల బొమ్మకి పాతికా ముప్ఫయ్యి ఇచ్చేవారు. మరో పబ్లిషరు ఆ పాతిక కూడా ఇచ్చేవాడు కాదు. కానీ చాలా మంచి పుస్తకాలు వేశాడు. వాటికి ఆయా రచయితల పేరు కాకుండా యూనిఫారంగా తన పేరే వేసుకునేవాడు. అందువల్ల బెజవాడలో ఫలానా పబ్లిషరు బాధితుల సంఘం అని పేరు పెట్టుకున్నాం. ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశానికెళ్లి – తలొకరూ – ఈ కిటికీ నాది – ఈ తలుపు నాది – ఈ ద్వారబంధం నా డబ్బుల్తో – అని చెప్పుకుని తృప్తిపడ్డాం.
ఇంకో పత్రికాయన రాత్రి పదింటికి లేపేవాడు. డబ్బులు తెచ్చాడేమో అని గబగబా వస్తే – ఇవాళ మీ బర్త్‌డే కదండీ – అంటూ ఒక యాపిల్‌ పండు చేతిలో పెట్టి వెళ్లిపోయేవాడు. ఇంకో ఆయన నా చొక్కా కాలరు గుండీలు సరిచేస్తూ చిన్న చిన్న దారమ్ముక్కలు బయటకొస్తే అవి తుంపి పారేస్తూ నించునే ఆ కబురూ ఈ కబురూ చెప్పి – పండు ఫలము కూడా ఇవ్వకుండా వెళ్లేవాడు. ఇంకో ఆయన నాకు లంకచుట్టలు ఇష్టమని తెలిసి వాళ్ళూర్నించి ఓ గ్లాక్సో డబ్బాడు తెప్పించి ఇచ్చేవాడు. ఇతను ఎలాగూ డబ్బులివ్వడు బొక్కిందే దక్కుడని తీసుకునేవాణ్ణి. ఇంకొకరు బొమ్మకోసం వచ్చేవారు. దమ్మిడీ ఇవ్వడని తెలుసు. చాలా కష్టమండి – ఏ మాత్రం వీలుపడదు అంటూ అరగంట చెప్పి లోపలికెళ్లబోతుంటే ‘అయితే రేప్పొద్దున్నొచ్చి బొమ్మ కలెక్ట్‌ చేసుకుంటాను’ అని వెళ్లిపోయేవాడు. తమాషా ఏమిటంటే నేను బొమ్మ అర్థరాత్రివేసి, రెడీగా ఉంచేవాణ్ణి- ఆయన దమ్మిడీ విదల్చకుండా పొద్దున్నే వచ్చి కలెక్టు చేసుకుని వెళ్లిపోయేవాడు. అందువల్లే ఆయనకీమధ్య నేషనల్‌ అవార్డిచ్చారు.
నాకిచ్చే ఆ కాస్త డబ్బూ బొమ్మ వెయ్యడానిక్కాదు. బొమ్మ వెయ్యాల్సిన ఆ కథో, పుస్తకమో చదివినందుకు కూలి అనుకుంటాను అంటే ఈసెన్‌బర్గ్‌ గారు పకపకా నవ్వి ఓ సంగజ్జెప్పారు.
ఊ ఊ ఊ
మా అమ్మగారు రమణగారితో – ఏమోయ్‌ – వాడేదేనా గవర్నమెంటు ఉద్యోగంలో ఉంటే పింఛనేనా వస్తుంది. నాలుగు కరుకులు కనబడతాయి. మీవాడేం చేస్తున్నాడమ్మా అనెవరైనా అడిగితే బొమ్మలేస్తాడు అంటే ఏదోలా ఉంటుందోయ్‌ అనేవారు. రమణగారు – ‘ఏం ఫరవాలేదమ్మా – ఉద్యోగం కన్నా రెండింతలు, బొమ్మలు సంపాయించి పెడుతున్నాయి’ అనేవారు.
ఊ ఊ ఊ
కొందరు చెప్పలేనంత ప్రేమతో – ‘‘నువ్వే కనక ఏ బెంగాల్‌లోనో అమెరికాలోనో పుట్టివుంటే’’ అంటూ విచారించేవారు. కానీ తెలుగుదేశంలో పుట్టడమే నా అదృష్టం. నా పూర్వజన్మ సుకృతశుభంవలన మూడు దశాబ్దాలుగా మరో ఆర్టిస్టు లేనందువలన గంజాయివనం బాపతుగా పేరొచ్చేసింది.
డెరెక్‌ మాల్కం అనే ఇంగ్లీషు దొర, గార్డియన్‌ అనే లండన్‌ పేపరు యొక్క ఫిలింక్రిటిక్‌. మా సీతాకళ్యాణం చూసి లండన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి తీసికెళ్లిన దగ్గరినించీ బాగా స్నేహితుడై బాగా చనువు ఏర్పడింది. ఆయన్నో మారు అడిగాను- నేను మీ దేశంలో పుడితే ఆర్టిస్టుగా నా (హోదా) స్థానం ఎక్కడుండేది అని. ఆయన ‘్గౌఠ ఠీౌఠజూఛీ ఛ్ఛ ట్చ్ట్ఛఛీ ్చట ్చ జజీజ్టజి జట్చఛ్ఛీ ్చట్టజీట్ట’’ అన్నారు. నేను అనుకున్న దానికన్నా రెండు మెట్లు ఎక్కువ మెట్లే చెప్పారు. అయినా – బుడుగు అన్నట్టు నా అంతటి వాడు నేనే! నాకు నచ్చిన బొమ్మ ఇతరులు బాలేదన్నా బెంగ లేదు. నచ్చనిది ఇతరులు పొగిడినా తేడా ఉండదు. రాముడి దయవల్ల అప్పుడప్పుడు కొన్ని బొమ్మలు బాగా కుదురుతూ ఉంటాయి. అవి రమణ గారికి చూపిస్తాను. ఆ తరవాత వాటి సంగతి మర్చిపోతాను. అంత బాగా రానివి చూపించను. అంతే సంగతులు. బాగా కుదిరిన బొమ్మలు కొన్నాళ్లయిన తరువాత చూసుకుంటే – అయ్య బాబోయ్‌ ఇపుడిలా మళ్లీ కుదరడం ఇంపాజిబుల్‌ అనిపిస్తుంది.

బాపు బొమ్మ ఏడుస్తోంది bapu bomma 001 bapubomma 2 001

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

1 Response to ‘నా అంతటి వాడు నేనే ”అని ధీమాగా చెప్పిన బాపు

  1. TVS SASTRY's avatar TVS SASTRY says:

    చాలా బాగుంది,ధన్యవాదాలు! దీన్ని మిత్రులతో షేర్ చేసుకుంటాను, మీ సౌజన్యంతో …..

    టీవీయస్.శాస్త్రి

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.