అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3

అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -3

‘’ఈతడు రామానుజుడు ఇహ పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో అన్నమయ్య వైష్ణవ దీక్ష పొందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తాడనే ధైర్యం నమ్మకం ఏర్పడింది .మనసంతా శ్రీనివాసుడే పరచుకొన్నాడు .ఆ హరి ధ్యానాన్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేక పోతున్నాడు .శ్రీ హరి కీర్తనతో తనువు మనసు ధన్యంచేసుకొంటున్నాడు .’’హరిని  కాదన్నవారు అసురులె .పరమాత్ముడు ఈయన ప్రాణమే .వేదరక్షకుడైన విష్ణువే .ఇహపరాలనిచ్చేది ఈదేవుడే .పార్వతికూడా ఈతనినినే ‘’సుత్తి ‘’చేస్తుంది అని పాడాడు .

మళ్ళీ తన ఊరికి వచ్చాడు .ఇతని హరి స్తుతి విని పిచ్చిపత్తింది అను కొన్నారు ఊరూ వాడా .శృంగారపదాల వెర్రి పోవాలంటే పెళ్లి చేయాల్సిందే అనుకొన్నారు ఇంట్లో వారు .’’పలుకు దేనెల తల్లి పవళించెను –కలికి తనముల విభుని గలసినదిగాన –అంగజ గురినితో అలసినది –తిరు వెంకటాచలాదిపుని కౌగిట గలసి –అరవిరై ,నును జెమట నంటినది గానా ‘’అని గదిలోని దంపతుల శృంగారాన్ని బయటినుంచి దొంగ చూపుల్తో చూసిన వాడిలా వర్ణించాడు .మొవ్వ కవి క్షేత్రయ్య గారికీ శృంగారం అంగాంగం అంటిన వాడే .కనుక ఈ పదం పిచ్చ పిచ్చగా నచ్చి తనపదాల్లో ఇదే చాయలో ‘’మగువ తన కేళికా మందిరము వెడలెన్ ‘’అనే జావళీ రాసి చిర యశస్సు సాధించాడు .కంచిలో అమ్మవారు క్షేత్రయ్య గారికి అలానే దర్శనం ఇచ్చిందని పెద్దలు చెప్పారని పుట్టపర్తి వారు సెలవిచ్చారు .

ఇక అన్నమయ్య పదకవితల్లో విజ్రుమ్భించాడు .స్వామి  వైభోగాలు ,మేలు కొలుపులు ,నలుగులు ,గొబ్బిపదాలు ,దంపుడుపదాలు ,కూగూలు ,వెన్నెల పదాలు ,తుమ్మెదపదాలతో విజ్రుమ్భించేశాడు .

శృంగారం కొంత మోతాదు  హెచ్చిందేమో మళ్ళీ ఒక సారి వెనక్కి తిరిగి చూసుకొన్నాడు తనలో వచ్చిన మార్పు శ్రీనివాసుడిలో కూడా రావాలని హెచ్చరిస్తున్నాడు. తుమ్మెదను అడ్డం పెట్టుకొని ..’’ఒల్లను కామమ్ము ఒ తుమ్మెదా –తోలి ప్రాయపు మిండ తుమ్మెదా –‘’అని అన్నాడు ‘’కన్నె కన్నుల కలికి మాయ ‘’అని హితవు చెప్పి శంఖినీ ,చిత్తినీ ,హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు స్వభావాలు వర్ణించి ‘’బి కేర్ ఫుల్ ‘’అని వార్నింగ్ జారీ చేశాడు కూడా .ఇందులో చమత్కారాన్ని దట్టం గా గుప్పించేశాడు .ఇద్దరు భార్యలతోను , ఒకోసారి ఒంటరిగా తీర్ధ యాత్రలు చేసి అక్కడి దైవాలపై పదాలు పాడి రంజింప జేశాడు .గండవరం ,నెల్లూరు ,ఘటికా చలం ,మండెం ,హంపి ,అహోబిలం వంటివి ఆయన  దర్శించిన వాటిలో కొన్ని మాత్రమె .లాలిపాటలు ,జోల పాటలు రాసి ప్రజల నాలుకలపై  వాటికి  నర్తింప జేశాడు   .

శుద్ధ రామ క్రియ రాగం లో ‘’కాంత’’ లో అన్ని రాశులు కొలువై ఉన్నాయని పరమ భావుకతో ఇది వరకేవ్వరూ స్పృశించని అంశాన్ని గొప్పగా రాశాడు .శృతి లయలు సినిమాలో దీనికి ప్రత్యేకత ఉంది. విశ్వనాద్ కమనీయం గా చిత్రీకరించాడు ఈ పదాన్ని

‘’ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి –‘’అని మొదలు పెట్టి కాంత కనుబొమలు ధనూరాశి అని ,మీనాల్లాంటి కళ్ళు మీన రాశి అని ,కుచకుమ్భాలు కుంభ రాసి ,సన్నని హరి మధ్య నడుము సింహ రాశి ,మకరాన్కపు పయ్యెద మకర రాసి ,కన్నేప్రాయం కన్యా రాశి ,బంగారం కాంతితో తులతూగే అందం తులా రాశి, పొడవైన చేతిగోళ్ళు వృశ్చిక రాశి ,పిరుదులు వృషభ రాశి ,కాముడి గుట్టుమట్టుల సఖి కర్కాటక రాశి ,కోమల మైన చిగురు మోవి మేష రాశి అని అన్ని రాసులు స్త్రీలో చూపించి మహా చమత్కారం చేశాడు .’’ఎట్టు భరించే నిం కాను ,పట్టు బరువీ ప్రాయము నాకు ‘’అని ఒక నాయిక చేత పచ్చి శృంగారం గా అనిపించాడు .పదాల్లో ఎత్తుగడలూ ముగిమ్పులూ చిత్రాతి చిత్రం గా చేశాడు ‘’వింత వింత వింతలూ –నీచింతలే పో చిగురింతలూ –పో పో పో పో విడవోయీ నీ-చూపు మాపై జాడించక –రేపెపో రేసులేల్ల నీతీపెపో తీదీపులు ‘’అని రెచ్చిపోయి రాశాడు అన్నమయ్య .

ఆ కాలం లో సాల్వ నరస రాజు ప్రసిద్ధుడైన దండ నాధుడు .అన్నమయ్య వయసువాడే .టంగుటూరు లో ఉండేవాడు .విజయనగర రాజులలో సంగమ వంశ రాజులు బలహీనులైపోయారు .విరూపాక్ష రాయలు విషయాసక్తిలో కూరుకు పోయాడు .ఆయనను ఆయన పెద్దకొడుకు రాజశేఖర రాయలు చంపించాడు .రాజశేఖరుడిని అతని తమ్ముడు రెండవ విరూపాక్ష రాయలు చంపించి బదులుకు బదులు తీర్చుకొన్నాడు .అన్నను చంపిన వాడు రాజరికానికి పనికిరాడని ప్రజలు అస  హ్యించు కొన్నారు .రాజ్యం అల్లకల్లోలం గా ఉంది .ఇవన్నీ అన్నమయ్య విన్నాడు .స్పందించి ‘’దేహమిచ్చిన వాని  దివిరి చంపెడువాడు –ద్రోహి గాక –నేడు దొరయైనాడే –తొడ బుట్టిన వాని దొడరి చంపెడువాడు –చూడ దుష్టుడు గాక –సుకృతి యైనాడే –కొడుకు నున్నతమతిం గోరి చంపెడువాడు –కడు పాతకుడు గాక ఘనుడైనాడే –తల్లి జంపిన వాడు తలప దుస్టూడుగాక –ఏళ్ళ వారాలకు నేక్కువాడే –ఈ యన్యాయము నాకు  చెల్ల బొ –నేనేమి సేయుదు  నయ్యా ‘’అని  వాపోయాడు . కళ్ళ ముందు జరిగీ ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు .ప్రపంచం అంటే ఇంతే .అధికారానికి అక్రమ మార్గాలే .సత్ప్రవర్తనకు విలువేలీదీ ప్రాపంచం లో అని ఒక భావం ఏర్పడింది మనసులో .

ప్రపంచం పై రోత కలిగి వైరాగ్య రేఖ ఉదయించింది .అనుకోకుండా ఒక రోజు సాల్వుడు అన్నమయ్యను దర్శించాడు .’’నీవు చక్ర వర్తి వగుదువు ‘’అని దీవించాడు అన్నమయ్య .గురు కటాక్షం లభించిన్దికనుక ఇక రాజ్యానికి రావాలని ప్రయత్నాలు ముమ్మరం గా మొదలెట్టాడు .ఈ మధ్య లో గజపతులు రెండు సార్లు దండెత్తి వచ్చారు .మళ్ళీ దేశం లో కల్లోలం రేగింది .అన్నమయ్య ‘’ఒడ్డెర భాష ‘’(ఒరియా )నేర్చాడట .తురుష్కులు దౌర్జన్యం చేస్తూ భయ  భ్రాం తుల్ని  చేస్తున్నారు .’’అయ్యొయ్యో కలికాలము ‘’అని వాపోయాడు ఆ వాగ్గేయ కారుడు .నిరపరాదుల్ని చంపేస్తున్నారు ,మానభంగాలు ఎక్కువైపోయాయి .సందట్లో సడేమియా అని అన్నమయ్య పూజా  విగ్రహాలను ఎవరో దొంగిలించేశారు .చేసేది లేక ‘’ఒ అంజనీ తనయా !ఒ ఖగ రాజ గరుడా !ఒ ప్రహ్లాదా !పోటు  బంతువైన అర్జునుడా !శ్రీ వెంకటాద్రి వైన శేష మూర్తీ!ఒ కార్త వీర్యార్జునుడా !నా విగ్రహాలు వెతికి తెచ్చిపెట్టండి ‘’అని అందర్నీ దీనం గా ప్రార్ధించాడు .ఎవరూ మొరాలకించ లేదు .ఇక వాళ్ళ వల్ల కాదని తానె స్వయం గా వెతక టానికి బయల్దేరాడు అన్నమయ్య .

తిరుపతికి వెళ్లి శ్రీనివాసుడితో మొర పెట్టుకొన్నట్లు లేదు. దానికి సాక్ష్యం గా ఏ పదమూ మనకు దొరకలేదుఅన్నారు ఆచార్యుల వారు . అప్పుడు ‘’రామాయణ కీర్తనలు ‘’రాయటం ప్రారంభించాడు . ఇంక శృంగార పదాలను  అంగారాలను కున్నాడు .చమత్కారమూ డోసు తగ్గించేశాడు .అమ్మ వారిని ’’అహి పతి శయనం అతి తాపమమై విభుడు వేదన పడ్డాడట సీనయ్య .వేదాంత రచన వినమని కోరాడు .నిమిషం ఒక యుగం గా గడుస్తోందని పరి వేదన చెందాడు . సహజ సుందరం గా ఆర్భాటాలు లేకుండా నిండారు భక్తితో ,పవిత్ర హృదయం తో రాశాడు .కొత్త కొత్త అలంకారాలు పదాలకు తొడిగి మెరిసేట్లు చేయాలనే ఆలోచన బాగా మద గించిపోయింది .

ఇంతలో శఠ కోప యతీంద్రుల వారి గురుత్వం తో తో సాన్నిహిత్యమేర్పడింది .వేదాంత విద్యాభ్యాసం చేశాడు గురువుగారి దగ్గార .వైష్ణవుల బాహ్యాచారాలన్నీ ఒంట బట్టాయి .వీటిపై కీర్తనలు రాసి పాడుకొన్నాడు.శిష్యుడు సాల్వ నరసింహ రాయలు గురువు గారి ఆశీర్వాద బలం తో సింహాసనం దక్కించుకొని రాజయ్యాడు .గురువుగారిని పెనుగొండకు పిలి పించుకొన్నాడు .అక్కడ సాహిత్య సంగీత గోస్టూల్లో బాగా  మునిగి తేలుతున్నాడు . రాయల కొలువులో ఈ పరమ వైష్ణవుడు అలంకారం గా ఉన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.