|
– బహుముఖ ప్రజ్ఞాశాలికి కన్నీటి వీడ్కోలు
– అంతిమయాత్రలో భుజం పట్టిన ఎస్పీ బాలు
– అధికార లాంఛనాల మాట మరచిన
ఏపీ సర్కారు.. పుష్పగుచ్ఛంతో సరి
చెన్నై, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్ను మూసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు (80) భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు ముగిశాయి. పలువురు చిత్ర ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోళ్ల నడుమ.. స్థానిక బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన భౌతికకాయానికి దహనక్రియలు నిర్వహించారు. తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య, సినీ నటులు మోహన్‌బాబు, రావి కొండలరావు, నాగినీడు, సంగీత, కాదంబరి కిరణ్, బోనీకపూర్, అనిల్‌కపూర్, గుండు సుదర్శనం, నేపథ్యగాయకులు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం, నాగూర్‌బాబు, రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల, సినీ దర్శకుడు వంశీ, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తదితరులు మంగళవారం బాపు భౌతికకాయానికి నివాళులర్పించారు. బాపు ఇద్దరు కుమారులతో పాటు.. ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అంతిమయాత్రలో భుజం పట్టి ఆయన భౌతికకాయాన్ని వైకుంఠవాహనం వరకూ మోశారు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో లవ, కుశ, బాలహనుమాన్ పాత్రధారులైన గౌరవ్, ధనుష్, పవన్‌శ్రీరాం బాపు పార్థివదేహానికి అంజలి ఘటించడాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.
ది గ్రేట్ కపూర్ బ్రదర్స్
బాపు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్.. ఆయన సోదరుడు బోనీ కపూర్ ఆ దిగ్దర్శకుడికి ఘనంగా నివాళులర్పించారు. తెలుగులో బాపు రూపొందించిన ‘వంశవృక్షం’ సినిమా ద్వారా అనిల్‌కపూర్ చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత హిందీలోనూ బాపు దర్శకత్వంలోనే అనిల్ కపూర్ తెరంగేట్రం చేశారు. ఈ కృతజ్ఞతతోనే అనిల్‌కపూర్ మంగళవారం ముంబై నుంచి చెన్నైకి వచ్చారు. అంతకు ముందే ఆయన సోదరుడు బోనీకపూర్ బాపు నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. బాపు అంతిమయాత్రలో సోదరులిద్దరూ పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సైతం ఆఖరి నిముషంలో ఉరుకులు పరుగులతో శ్మశానానికి వచ్చి బాపు భౌతికకాయానికి అంజలి ఘటించారు.
ఇదా అధికార లాంఛనం..?
ఆంధ్రప్రదేశ్ సర్కారు బాపు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ, మంగళవారం అలాంటి దాఖలాలేవీ కనిపించలేదు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంగళవారం ఉదయం వచ్చి బాపు భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అంత్యక్రియలు ప్రారంభమయ్యేవరకూ ఉన్నారు. అంతకు ముందు.. ‘అధికార లాంఛనాలంటే ఏమేం చేస్తున్నార’ని విలేఖరులు ప్రశ్నించగా.. ‘అందరికీ ఎలా చేస్తున్నామో బాపూకు అదే స్థాయిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేస్తాం’ అని మంత్రి సమాధానమిచ్చారు. అధికారిక లాంఛనాలంటే ప్రభుత్వం తరఫున భౌతిక కాయంపై జాతీయ పతాకం కప్పి, పుష్పగుచ్ఛం ఉంచుతారు. పోలీసులు తుపాకులతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. కానీ, బాపు అంత్యక్రియల్లో ఇవేవీ కనిపించలేదు. |