32వేల మంది గణపతులను పోషిస్తున్న శంకర్

ఇంటినిండా గణపయ్యలే..!
మనకు వినాయక చవితి ఏడాదికి ఒకసారే వస్తుంది. కాని సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి పి.శంకర్‌కు రోజూ చవితి పండగే! ఆయన ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతూనే లంబోదరుని లక్ష రూపాలు కనువిందు చేస్తాయి. ఒక ప్రాంతమా? ఒక రాష్ట్రమా? దేశ విదేశాల్లోని గణనాథులంతా అక్కడ కొలువుదీరడం అద్భుతం. ఏళ్లతరబడి శ్రమించి 32 వేల విగ్రహాలను సేకరించడమంటే మాటలు కాదు… చవితి ఉత్సవాల్లో తరిస్తున్న శంకర్‌ ‘నవ్య’తో ముచ్చటించారిలా..
‘‘అది 1973 నాటి మాట. అమ్మానాన్నలతో కలిసి షిరిడీకి తీర్థయాత్ర వెళ్లాను. అక్కడ ఓ బుల్లి గణపయ్య కనిపిస్తే.. నాన్న దగ్గర యాభై పైసలు తీసుకుని కొనుక్కున్నాను. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహం అది. ఆ రోజే ఎందుకో వినాయక విగ్రహాలు సేకరిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన కలిగింది. అక్కడి నుంచే నా ప్రస్తానం మొదలైంది. మా కుటుంబ సంగతికొస్తే – అమ్మానాన్నలు మహరాషీ్ట్రయులు. నాన్న బ్యాంకులో పనిచేసి రిటైరు అయ్యారు. మేము హైదరాబాద్‌లో స్థిరపడటం వల్ల చదువంతా ఇక్కడే సాగింది. ప్రస్తుతం నేను కూడా బ్యాంకులోనే పనిచేస్తున్నాను. పదిహేనువందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్నాను. ప్రస్తుతం ఈ ఇంట్లో సగభాగం బొజ్జ గణపయ్యదే! హాలు, రెండు బెడ్‌రూములు ఆయన విగ్రహాలతోనే నిండిపోయాయి. భవిష్యత్తులో ఇదే ఇంటిమీద రెండో ఫ్లోరు కట్టించి.. ఆ ఫ్లోరును మ్యూజియంగా మార్చే ఆలోచన ఉంది. అందులో ఈ విగ్రహాలన్నింటినీ కొలువుతీర్చి.. సందర్శకుల కోసం స్వల్పమొత్తంలో టికెట్‌ పెట్టాలనుంది. ఆ వచ్చిన మొత్తాన్ని వ్యక్తిగతమైన అవసరాలకు వాడుకోకుండా.. అనాధాశ్రమానికి ఇద్దామన్న ఆలోచన చేస్తున్నాను.
విదేశాల నుంచి… 
నేను సేకరించిన 32 వేల విగ్రహాలలో యాభై పైసల నుంచి యాభైవేల రూపాయల వరకు విలువగలవి ఉన్నాయి. ఇన్ని విగ్రహాలను కొనడానికి ఎంత ఖర్చు అయ్యుంటుంది అని వచ్చిపోయేవాళ్లు అడుగుతుంటారు. అలాంటి లెక్కలన్నీ నేను వేసుకుంటూ కూర్చుంటే ఇంతమంది గణపయ్యలు నా ఇంటికి వచ్చేవారా.. మీరే చెప్పండి? అందుకే నేను ఏ నాడు ఇంత మొత్తం అయ్యిందని లెక్కపెట్టలేదు. నా సంపాదనలో కొంత భాగాన్ని విగ్రహాల కోసం వెచ్చించేవాణ్ణి. అంతే! ఇదిగో మొన్ననే నేపాల్‌ నుంచి తొమ్మిది వినాయక విగ్రహాలను తెప్పించాను. మరొక విలువైన విగ్రహం తమిళనాడులోని కుంభకోణం నుంచి వచ్చింది. ఇది చాలా విభిన్నమైన విగ్రహం. పాతిక కిలోల బరువుంది. ధర ముప్పయివేలు. విగ్రహాలన్నీ కేవలం ఇండియాలో తయారైనవే కాదు. అమెరికా, జపాన్‌, చైనా, సింగపూర్‌, ఇండోనేషియా, మలేసియా.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ నుంచి.. తెప్పించాను. ఒక్కోసారి జేబులో డబ్బులేకపోయినా.. సరే ఇబ్బందులను పక్కనపెట్టి సేకరించిన సందర్భాలు ఉన్నాయి. విగ్రహాలలో ఆకారంలోను, వాడిన మెటీరియల్‌లోను, రంగులోను భిన్నమైనవి. అన్నీ ఒకే ఎత్తు లేవు. అర అంగుళం నుంచి 4.5 అంగుళాల మధ్య ఉంటాయివి. విగ్రహాల తయారీకి వాడిన లోహాలు పలు రకాలు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, మట్టి, బంగారు, వెండి, గాజు, పాలరాతితో తయారైనవి ఎక్కువ. నేను కేవలం విగ్రహాల సేకరణకే పరిమితం కాలేదు. వినాయకుని రూపంలో వచ్చిన పోస్టర్లు, పుస్తకాలు, కీచెయిన్‌లు, ఆడియో- వీడియో క్యాసెట్లు, భజనపాటలు ఇలా ప్రతిదాన్నీ దాచిపెడుతున్నాను.
విశ్వవినాయక గ్రంథం .. 
వీటన్నిటికంటే గొప్ప కార్యం మరొకటుంది. దేశవ్యాప్తంగా వినాయకునికి ఉన్నన్ని దేవాలయాలు మరొక దేవునికి లేవు. ఒక్కో ఆలయానిది ఒక్కో చరిత్ర. అవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క బెంగళూరులోనే పదిహేనువందల గణపతి ఆలయాలు వెలశాయి. మహారాష్ట్రలో అయితే లెక్కపెట్టడం కష్టం. విదేశాలలోను అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. ఇలా ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలన్నింటి సమాచారం సేకరిస్తున్నాను. వీటన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా వేద్దామన్నది ఆలోచన. అయితే పరిశోధనలోకి అడుగుపెట్టగానే ఒక పుస్తకం సరిపోదు అనిపించింది. అందుకే మెల్లగా అయినా సరే.. సమాచారమంతా చేతికొచ్చాక.. వాల్యూమ్స్‌ రూపంలో తీసుకొద్దామని కృషి చేస్తున్నాను. ఈ విధంగా నా జీవితం మొత్తం గణపయ్యకే అంకితం చేశాను. నా కొడుకుకు కూడా గణేష్‌ అని పేరు పెట్టాను. కూతురు సంజన, భార్య అనురాధ కూడా ఇంట్లోని విగ్రహాలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నా అభిరుచిని మెచ్చి ఇప్పటికే లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ దగ్గర నుంచి పలు విలువైన గుర్తింపులన్నీ వచ్చాయి. మన దేశంలో నాకు తెలిసినంత వరకు నా దగ్గరున్నన్ని గణపతి విగ్రహాలు మరొకరి దగ్గర లేవు. ఇదంతా నేను చేసిన ఘనకార్యం కాదు. పైనున్న ఆ విజ్ఞేశ్వరుడే చేయించాడు..’’
– నవ్య డెస్క్‌
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.