గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

గద్య మహా కావ్య రచయిత-సుబందు

గుప్త చక్ర వర్తుల కాలానికి సంబంధించిన కల్పిత  ఆఖ్యాయికను అంటే కదను సుందర సురుచిర శైలిలో వచనం గా రాసిన కవి ‘’సుబందు ‘’.414-454 కాలపు రాజు కుమార గుప్తుడు 455-467కు చెందిన అతనికొడుకు స్కంద గుప్తుల ఆస్థానం లో సుబందు ఉండేవాడు .పాండిత్య గర్వ స్పర్శ ప్రతి అంగుళం  లో కనిపించేట్లు రాసిన కవి సుబందు .తరువాత కాలపు వచన రచయితలను ఎందరినో ప్రభావితం చేశాడు .అతని రచనా పటిమకు అద్దం’’వాసవ దత్త ‘’.దీనిపై పద్దెనిమిదో శతాబ్దం లో రెండు వ్యాఖ్యానాలు వెలశాయి .శివరామ త్రిపాఠి రాసిన ‘’కాంచన దర్పణం ‘’,జగద్దారుడు రచించిన ‘’తత్వ దీపిని ‘’సుబందును అజరామరం చేశాయి .లూయిస్ హెర్బర్ట్ గ్రే వాసవదత్త ను ఆంగ్లం లోకి అనువాదం చేస్తే 1913 లో కొలంబియా యూని వర్సిటి ప్రెస్ ప్రచురించింది .విలియమ్స్ జాక్స్సన్ సంపాదకత్వం లో కొలంబియా యూని వర్సిటి –ఇండో ఇరానియన్ సిరీస్ లో పదమూడు భాగాలుగా వెలువరించింది .

ప్రాకృత వ్యాకరణం రాసిన వర రుచి కి సుబందు మేనల్లుడు అంటారు .విక్రమాదిత్య చక్రవర్తి చనిపోయిన తర్వాత సుబందు వాసవ దత్తను రాశాడని నరసింహ వైద్య అన్నాడు .కాని బహుజనాభిప్రాయం ప్రకారం  గుణాధ్యుడి తరువాత వాడు .1859లో వాసవ దత్తను పరిష్కరించి ఫిద్జ్ ఎడ్వర్డ్ హాల్ సంస్కృత ప్రతిని ముద్రించాడు .వచన రచనలో మేటి అయిన బాణుడి ప్రశంసలుపొండాడు సుబందు .’’అలబ్ద వైదగ్ధ్య విలాస ముగ్ధయా దియా నిబద్ద్దే య మతిద్వయా కదా ‘’అని బాణుడు మెచ్చాడు అంటే సుబందు రచనా ప్రౌఢిమ యెంత గొప్పదో తెలుస్తోంది .వాసవ దత్త చారిత్రిక కద కాదు .కవికల్పితమే .భాస ,కాళిదాసాదుల సరసన చేరిన కవి సుబందు .వక్రోక్తి కవిగా సుబందును పన్నెండవ శతాబ్దం వాడైన ‘’కవిరాజు ‘’పేర్కొన్నాడు .మంఖ అనేకవి భారవి బాణ కవుల తో చేర్చి శ్లాఘించాడు .పది హేనవ శతాబ్దికి చెందిన వామన భట్ట బాణుడు మయూరుడు మొదలగు కవులతో పోల్చాడు  ‘’ప్రతి కవి భేద బాణః కవితా త్రుగహన విహరణ మయూరః -సహృదయ లోక సుబందుర్జయతి శ్రీ భట్ట బాణ కవి రాజః ‘’అని కీర్తించాడు .

వాసవ దత్త కద

కందర్ప కేతు అనే రాజకుమారుడు కలలో అందమైన కన్యను చూసి మనసుపారేసుకొని స్నేహితుడు మకరాండుడి తో వెతుకుతూ ఉంటాడు .అడవిలో ఒక చెట్టుకింద పడుకొని ఉంటె చెట్టుపైఉన్న చిలుకా గోరింకల సంభాషణలో వాసవదత్త కలలో కనిపించిన రాకుమారుడికోసం అన్వేషణకు బయల్దేరినట్లు వింటాడు .పక్షుల సాయం తో వాసవ దత్తను కలుస్తాడు .ఇద్దరూ ప్రేమించుకొంటారు .ఆమె తండ్రి ఒక గాంధర్వ రాజుతో కూతురు పెళ్లి చేయాలనుకొంటాడు .ఇది తెలిసి వీళ్ళిద్దరూ జంప్ జిలానీ .అడవిలోకి చేరి పడుకొంటారు .వాసవ దత్తకు నిద్రరాక ఒంటరిగా అడవిలోకి వెడుతుంది .ఇంతలో రెండు కిరాత దళాలు వచ్చి ఆమె కోసం తగాదా పడతాయి .ఇదే అదను అనుకోనితప్పించుకొని ఒక ఆశ్రమలో చేరుతుంది .ముని శాపం తో రాయిగా మారిపోతుంది .కందర్పుడు వెతుక్కుంటూ వచ్చి కనపడక ఆత్మ హత్యకు పూనుకొంటాడు .ఆకాశ వాణివిషయం తెలియ జేస్తే ఆ రాయిని కౌగలించుకోగానే వాసవ దత్త గా మారిపోతుంది .ఇద్దరూ రాజనగరానికి వెళ్లి పెళ్లి చేసుకొనిహాయిగా ఉంటారు .

సుబందు కవితా గీర్వాణం

శ్లేష కవిత్వానికి సుబందు పెట్టింది పేరు ‘’సరస్వతీదత్త వర ప్రసాదా చ్చక్రే సుబన్ధుః –సుజనైక బన్ధుఃప్రత్యక్షర శ్లేష మయ ప్రపంచ విన్యాస వైదగ్ధ్య నిధిం ప్రబంధం ‘’అని చెప్పుకొన్నాడు .ఈ శైలి బాణుడికి ఆధారం అయింది . కదా ,కధనం శైలీ పరిపక్వం గా ఉండి చదివే వారిని ఊపిరి సలపనివ్వడు .చాలా ఆహ్లాదం కలిగించటం అతని లక్షణం .గ్రీకు రోమాన్స్ ఇక్కడికి చేరి ఉండవచ్చునని భావన .వక్రోక్తి ,విరోదా భాస లకూ సముచిత న్యాయం చేశాడు .మీలిత ,రత్నావళి,సమ ,సంభావన ,కారణ మాల మొదలైన అరుదైన  అలంకారాలను మిగిలిన అలంకారాలతో పాటు వాడి కావ్యానికి సౌన్దర్యంతెచ్చాడు .ఋతు ,సూర్య చంద్రో దయ  అస్తమయాలను  హ్రుదయాహ్లాదకం గా వర్ణించాడు .మార్గ దర్శిగా మారాడు .ఇందులో పక్షులు మాట్లాడి జానపదం అని పిస్తుంది .మాయా గుర్రం ఉంది. కదా కదన కల్పనా శైలిలలో సుబందు తరువాతి వారికి స్పూర్తిగా నిలిచాడు .

Inline image 1

మరోకవితో మళ్ళీ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.