|
కేసీఆర్ చెప్పడం వల్లే ఎంఎస్‌వోలు ఇలా చేశారు
ఈ మేరకు నాకు సమాచారం ఉంది
సీఎం అయితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా?
టీవీ 9 క్షమాపణలు చెప్పినా ఇలా చేయడమేంటి?
తక్షణం రెండు చానళ్ల ప్రసారాలనూ పునరుద్ధరించాలి
మూడు రోజుల్లో చేయకుంటే బృందాన్ని పంపుతాం
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ కట్జు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా?’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ధ్వజమెత్తారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’, టీవీ 9 చానళ్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీవీ 9 తప్పు చేసినప్పటికీ క్షమాపణలు తెలిపిందని, ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ అయితే ఏ తప్పూ చేయలేదని, మరి వాటి ప్రసారాలను ఎందుకు నిలిపివేశారని అడిగారు. తక్షణం చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఎంఎస్‌వోలకు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికలను విమర్శిస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తనకు ఫిర్యాదులు చేశాయని ఆయన తెలిపారు. మూడురోజుల్లోగా రెండు చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించకుంటే పీసీఐ నుంచి ఒక బృందాన్ని పంపుతానన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
మీడియాను 10 కిలోమీటర్ల లోతున పాతేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మీరెలా స్పందిస్తారు?
తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రమాదకరమైనవి, తగనివి, ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి. నాకు తెలిసిందేమిటంటే.. టీవీ 9 అనే ఒక చానల్ తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అమర్యాదకరమైన వ్యాఖ్యలను ప్రసారం చేసింది. టీవీ 9 చానల్‌కు ఇది తగదు. దీన్ని వారు ప్రసారం చేయకుండా ఉండాల్సింది. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా వారు చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా, టీవీ 9 చానల్ ఇందుకుగాను ఎంఎస్‌వోలకు, ఎమ్మెల్యేలకు, స్పీకర్‌కు పలుమార్లు క్షమాపణలు చెప్పినట్లు నాకు తెలిసింది. అయినప్పటికీ.. ‘‘తెలంగాణకు వ్యతిరేకంగా ఏమైనా అంటే మీడియా మెడలు విరిచేస్తాను, 10 కిలోమీటర్ల లోతున భూమిలో పాతిపెట్టేస్తాను’’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇదేం భాష? ఒక ముఖ్యమంత్రి ఉపయోగించాల్సిన భాషేనా ఇది? రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది? నాగరిక భాషలో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఇది ఎంతమాత్రం తగదు. తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఎంఎస్‌వోలు రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేసినట్లు నాకు తెలిసింది. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఎలాంటి అమర్యాదకరమైన వ్యాఖ్యలను, ఏ ఎమ్మెల్యేను ఉద్దేశించీ చేయలేదని నాకు తెలిసింది. కాబట్టి, తక్షణం చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని కేసీఆర్, ఎంఎస్‌వోలకు నేను సూచిస్తున్నాను. మీడియా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. దానిని ఈ రీతిలో అణచివేయటం తగదు. భవిష్యత్తులో ఎలాంటి భాషను ఉపయోగించాలో సీఎం తెలుసుకోవాలి.
తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు మీరేం చేస్తారు?
మేం తగిన చర్యలు తీసుకుంటాం. వాస్తవానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం మా పరిధి పత్రికల వరకే ఉంటుంది. చానళ్లకు సంబంధించి కాదు. (సీఎం కేసీఆర్ పత్రికల్ని కూడా బెదిరిస్తున్నారని చెప్పగా..) మేం దీనిని సహించబోం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమాత్రం సహించబోదు. అలా బెదిరించాలని చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన మీడియా స్వేచ్ఛను అణగదొక్కాలని చూస్తే.. ఇదే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తారా?
ఇప్పుడు కాదు! ప్రస్తుతం నేను ఒక పత్రికా ప్రకటన జారీ చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరి ఏమాత్రం సహించరానిది, తీవ్రంగా అభ్యంతరకరమైనది. మీడియా స్వేచ్ఛను కాపాడటమే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పని.
గతంలో మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు కదా! చానళ్లను ప్రసారం చేసేందుకు ఉన్నన్యాయపరమైన మార్గా లేంటో చెప్పగలరా?
మీరిప్పుడు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ 1(ఎ) ప్రకారం మీడియాకు స్వేచ్ఛ ఉంది. అది ప్రాథమిక హక్కు. దీన్ని న్యాయ సమస్యగా మార్చాల్సిన పనిలేదు. టీవీ చానళ్ల ప్రసారాల నిషేధాన్ని ఎత్తివేయాలని నేను (తెలంగాణ) ముఖ్యమంత్రి, ఎంఎస్‌వోలకు సూచిస్తాను.
ఎంఎస్ఓలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, చానళ్ల ప్రసారాలు రద్దు చేయటాన్ని ఎలా చూస్తారు?
వారు తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి మేరకే అలా చేశారు. వారు స్వతంత్రులే అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ, ప్రధానంగా ముఖ్యమంత్రి ఒత్తిడికి వారు తలొగ్గారు. ఇలాంటి వాటిని సహించరాదు. 1967లో ప్రెస్ కౌన్సిల్ చట్టం చేశారు. అప్పట్లో ఎలకా్ట్రనిక్ మీడియా లేదు. ఆ తర్వాత ఎలకా్ట్రనిక్ మీడియా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని సవరించి, మీడియా కౌన్సిల్‌గా మార్చాలని సూచించాను. ఎలకా్ట్రనిక్ మీడియాను కూడా కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పాను. కానీ, అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. |