గీర్వాణ కవుల కవితా గీర్వాణం -7
సుభాషిత శతక కర్త – భర్త్రుహరి మహారాజు
మధ్య భారతం లో ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజు భర్త్రు హరి .గొప్ప పాలనా దక్షుదుగా ప్రేమ శృంగారాల పెన్నిధిగా గుర్తింప బడ్డాడు .వంద మంది భార్యలతో శృంగార సామ్రాజ్యాన్నీఏలాడని కధలు గాధలు తెలియ జేస్తున్నాయి .ఈ విలాసాలతో గడిపే ఆయనకు రాజ్య పాలన చేసే తీరిక ఉండేదికాదు .కనుక ఆయన చిన్నతమ్ముడు విక్రమాదిత్యుడే రాజ్య భారాన్ని సజావుగా నిర్వహిస్తూ అన్నగారి కీర్తికి లోపం లేకుండా కాపాడుతున్నాడు .తన అపూర్వ శృంగార అనుభవాలను అన్నిటిని రంగరించి భర్త్రు హరి ‘’శృంగార శతకం ‘’సంస్కృతం లో రాసి కొత్త ఒరవడి తెచ్చాడు .ఈ శృంగారం ఇలా విజ్రుమ్భిస్తూండగా ,ఆయన చిన్న భార్య పింగళ (అనంగ సేన)రధ చోదకుడి తో సరస సల్లాపాలు సాగించింది .ఈ విషయం గమనించిన తమ్ముడు విక్రమాదిత్యుడు ఆమెను దేశ బహిష్కరణ చేసి రాజ్యం పరువుకాపడమని కోరాడు .అన్నగారు తమ్ముడి మాటను నమ్మలేదు.పెడ చెవిని పెట్టాడు .ఇదే అదనుగా విషయం తీసుకొని ఆమె విక్రమాదిత్యుడినే భర్త్రు హరి చేత దేశ బహిష్కారం చేయించి అడ్డుతోలగించుకోన్నది .
ఒక రోజు ఒక యోగి రాజాస్థానానికి వచ్చి దైవ ఫలాన్ని మహారాజుకు ఇచ్చి ప్రియమైన భార్యకు అంద జేయమని ,ఆ ఫలం సామాన్యమైనదికాదని కోరిన కోరికలను నెరవేర్చే కల్ప వృక్షమని ,నిత్య యవ్వనాన్ని ,దీర్ఘాయుస్సు ను ఇస్తుందని చెప్పాడు .రాజు తన ముద్దుల చిన్న భార్య పింగళకు ఆ పండునిచ్చాడు .ఆమె తినకుండా తన ప్రియుడు రధ సారధికి ఇచ్చింది .వాడు ఎప్పుడూ యవ్వనం తో బలం గా ఉండాలని కోరుకొన్నది .ఆ దివ్య ఫలాన్ని రధం తోలేవాడు వాడి ప్రియురాలు వేశ్యకు ప్రేమగా సమర్పించాడు .ఆమె చాలా ఉదారురాలే కాక దేశ హితం కోరే వ్యక్తీ .సుస్తిర రాజ్య పాలన ప్రజా భవిష్యత్తు మహా రాజు చేతిలో ఉంటుందికనుక భక్తిగా ఆఫలాన్ని రాజుకు సమర్పించింది .యోగి తనకు ఇచ్చిన పండు ఈ వేశ్యకెలా లభ్యమైనదో అడిగి తే ఆమె అసలు విషయం అంతా బయట పెట్టింది .ఈ సంఘటన మహారాజు భర్తృహరి లో గొప్ప మార్పు తెచ్చింది .తన శృంగారం యెంత చేటు తెచ్చిందో గ్రహించాడు వెంటనే ఒక నీతి శ్లోకం ఈ ఘటనను ఆధారం గా చేసుకొని ఆశువుగా చెప్పాడు .’’ రత్నైర్మహర్షి స్తుతు ర్న దేవా న భోజిరే భీమ విషేణ భీతిం –సుధాం వినాన పరయుర్విరామం న నిశ్చితార్ధ ధవిర్మంతి ధీరాః’’ వైరాగ్యభావం కట్టలు తెంచుకొని ప్రవహించింది .దీనితో నీతి శతకం, తర్వాత వైరాగ్య శతకం రాశాడు .
భర్త్రు హరి కాలం ఇదమిద్ధం గా తెలియటం లేదు .విక్రమాదిత్య మహారాజు అన్నగారు కనుక క్రీ పూ 56 కాలం వాడు కావచ్చు .రాజు కేశవ శర్మ నాలుగు వర్ణాల స్త్రీలను వివాహమాడాడు .వారికి వరరుచి ,విక్రమార్క ,భట్టి ,భర్త్రు హరి జన్మించారని కధనం .భర్తృహరి అద్భుత రచన ‘’సుభాషిత త్రిశతి ‘’అంటే శృంగార నీతి ,వైరాగ్య శతకాలు .వీటితో బాటు ‘’వాక్య ప్రదీపం ‘’’’రాహత కావ్యం ‘’,పతంజలి వ్యాకరణానికి ‘’కారిక ‘’కూడా రాశాడు .శాలివాహన శకానికి పూర్వమే135 ఏళ్ళు సుస్తిర రాజ్య పాలన చేశాడు . 1691లో ఇండియాలో పర్యటించిన చైనా యాత్రికుడు ఈత్సింగ్ అప్పటికి నలభై ఏళ్ళ క్రితం భర్తృహరి జీవించి ఉన్నాడని రాశాడు .ఏడు సార్లు సన్యాసిగా మారి మళ్ళీ సంసార జీవనం లోకి వచ్చాడని చెప్పాడు .కనుక కాలం క్రీ శ 650అని తేల్చారు .
కవితా గీర్వాణం
భర్తృహరి శ్లోకాలు రాని వారెవరూ ఉండేవారు కారు. ముఖ్యం గా నీతిశతక పద్యాలు బోధనా అంశాలు గా ఉండేవి .సరళం గా ,గంభీరం గా భావ సంపదతో రాణిస్తాయి శ్లోకాలు .సంక్షిప్తత ఆయన ముఖ్య లక్షణం సూటిగా హృదయానికి తాకుతాయి .సహజ సుందరమైన అలంకారాలతో శతకాలకు దివ్యా లంకారా లను అమర్చాడు .ఈ శతకాలు డచ్ భాష తో సహా అన్ని భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రసిద్ధిని పొందాయి .నీతి శతకం లో నూట తొమ్మిది శృంగార ,వైరాగ్య శతకాలలో వందేసి శ్లోకాలున్నాయి .నీతి శతకం లో లోక పరిశీలన బాగా కనిపిస్తుంది పండితుల ప్రశంసలన్డుకొన్నాడు .సేవాధర్మం ,పరోపకారం ,డబ్బు చేసే మార్పులు అన్నీ ఉన్నాయి .శృంగార శతకం లో స్త్రీ సౌందర్యం సంయోగ శృంగారం వేశ్యానింద,ఋతువులలో మనిషికి ఉండే కామ కాంక్ష మొదలునవి వర్ణించాడు .వైరాగ్య శతకం లో మానవుడి అజ్ఞానం, కోరిక చాపల్యం, లౌల్యం ,విషయ సుఖ త్యాగం,ఆత్మ గౌరావం పరబ్రహ్మ తత్త్వం కాల మహిమ ,కాశీ నివాస ప్రయోజనాదులను వర్ణించాడు .
భర్త్రు హరి సుభాషిత త్రిశతి ని తెలుగులో’’సుభాషిత రత్నావళి ‘’పేరిట ఏనుగు లక్ష్మణ కవి ,పుష్పగిరి తిమ్మన ,ఎల కూచి బాల సరస్వతి చక్కని అనువాదం చేశారు .ఇవి సెకండరీ స్థాయిలో బోధక అంశాలుగా ఆనాటి నుండి నేటి వరకూ ఉంటూనే ఉన్నాయి .వీటిని కంఠస్త పద్యాల జాబితాలో చేర్చారు .మనోహర సందర్భోచిత శైలితో మనసుకు ఆహ్లాదం కల్గిస్తాయి ధారణకు మహా సులువుగా ఉంటాయి .
’’ఆకాశమున నుండి శంభుని శిరంబండుంది శీతాద్రి సు-శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి య –స్తోకాం బోధి ,పయోధి నుండి ,పవ నాంధో లోకమున్ చేరే గం –గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ‘’
ఈ పద్యం రాని తెలుగు వారు ఉదహరించని సందర్భం లేనే లేదు .అలాగే ‘’ఆరంభింపరు నీచ మానవులు ‘’,గ్రాసము లేక స్రుక్కిన ‘’,తివిరి ఇసుమున తైలంబు ‘’,క్షమ కవచంబు ‘’మొదలైన పద్యాల తో భర్తృహరి తెలుగు వారింట చిరంజీవి అయ్యాడు .
మరోకవితో మళ్ళీ కలుద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-14-ఉయ్యూరు


chala bagundi sir
LikeLike