గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9 జైన కవి – జట సింహ నంది -9

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -9

జైన కవి –  జట సింహ నంది -9

కర్నాటక దేశానికి చెందిన జట సింహ నంది జైన కవి .ఆరు నుంచి తొమ్మిదో శతాబ్దం లోపు ఇతనికాలం గా భావిస్తారు .అనేక కావ్యాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’వరంగ చరిత్ర ‘’బాగా ప్రసిద్ధి చెందింది .బుద్ధ చరిత్ర రాసిన అశ్వ ఘోషుని ప్రభావం జట సింహ నంది పై ఉన్నది .ఈయనకు ‘’జటిల ముని ‘’ అనే పేరుకూడా ఉంది .

వరంగ చరిత్ర వరంగా మహారాజు జీవిత చరిత్రను తెలిపే నవల . .ఇందులో జైన ధర్మాలు న్యాయాలు అన్నీ పూర్తిగా వివరింప బడినాయి .ముప్ఫై ఒక్క అధ్యాయాలున్నాయి .చివరి భాగం లో వేదమతం పై తీవ్ర దూశానలున్నాయి జైన విధానం లో మోక్ష సాధనకు మార్గాలను వివరించాడు జట సింహుడు .

 

చిత్ర గర్భ కవితా సంపన్నుడు –మాఘుడు -10-

మాఘ కవి ఏడవ శతాబ్దానికి చెందిన కవి .అ నాటి సంయుక్త గుజరాత్ –రాజస్థాన్ రాజ్యం శ్రీమాల రాజధానిలో వర్మలత రాజు ఆస్థానం లో ఉండేవాడు .శ్రీమాలి బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .శ్రీమాలి నగరం ఆటను పుట్టిన ఊరు అది ఇప్పుడు రాజస్థాన్ లోని భిల్నార్  జిల్లాలో భిమాన్ గా ప్రసిద్ధిలో ఉంది .సంపన్న కుటుంబం లో జన్మించి ,విలాస జీవితం గడిపి చివరికి దరిద్రం తో చనిపోయినట్లు తెలుస్తోంది .తండ్రి  దట్టక సర్వా చార్య .తాత సుప్రభ దేవుడు .మాఘకవి ‘’శిశుపాల వధ ‘’అనే మహా కావ్యం రాశాడు .ఇది ఇరవై సర్గల కావ్యం .నూరు తప్పులు చేసిన శిసుపాలుడిని శ్రీ కృష్ణుడు చక్రం తో చంపటం కదా వృత్తాంతం .మాఘుడి పై  భారవి ప్రభావం బాగా ఎక్కువ .వల్లభ దేవుడు ,క్షేమేంద్రుడు ఉదహరించిన శ్లోకాలు ఇందులో కనిపించవు .ఇంకా కావ్యాలు రాశాడంటారుకాని అవి అలభ్యం .ఇతర కవుల్లాగా కాకుండా తన చరిత్ర  ,సంఘ జీవితాన్ని  చివరి శ్లోకాలలో చెప్పుకొన్నాడు .వీటిని నిజ వంశ వర్ణన లేక కవి వంశ వర్ణన అన్నారు .తండ్రి దత్తకుడు అని తాత సుప్రభ దేవుడని తెలియ జేశాడు .వర్మలత ,ధర్మ నాద మొదలైన రాజుల ఆస్తానాలో వారు ఉండేవారని అన్నాడు . ఆనంద  వర్ధనుడు  ,భోజుడు మాఘ కావ్య విషయాలను ఉదాహరించారు .చైనా యాత్రికుడు ఇత్సింగ్ మాఘుడు ఎనిమిదవ శతాబ్దం వాడని రాశాడు .హెర్మన్ జాకోబి ఆరవ శతాబ్ది వాడు అన్నాడు .మాఘుడు వైశ్యుడు అని కొందరి అభిప్రాయం .దానశీలి .విపరీతం గా దాన ధర్మాలు చేసి చివరికి చితికి పోయాడు .

‘’ఉపమా కాళిదాసస్య భారవే రర్ధ గౌరవం –దండి నా పదలాలిత్యం మాఘే సంతి త్రయీ గుణం  ‘’ అని సాహితీ లోకం లో  వ్యాప్తి చెందింది ఒక శ్లోకం . కాళిదాస  భవభూతి ,భారవుల మూర్తిత్రయమే మాఘ మహాకవి  .అంతటి గొప్ప వాడు .భారవిని అన్నిటా మించిపోయాడు మాఘుడు .పేరులోను విచిత్రాన్ని సాధించాడు .ఇంకొక సామెత శ్లోకం లోకం లో వాడుకలో ఉంది .’’తావత్ భా భార వేః భాతి యావత్ మాఘస్య నోదయః’’సూర్య  కాంతి లేక వెలుగు లేక దీప్తి (భారవి)మాఘం (మాఘుడు) ప్రవేశించే వరకే .అంటే మాఘుడి రాకతో భారవి కవితా ప్రకాశం తగ్గిపోయిందని భావం .భారవి అర్ధ గౌరవాన్ని సాధించాడు .భారవిని అనుసరించిన మాఘుడు అంతటి ప్రతిభను చూప లేక పోయాడని విమర్శకాభిప్రాయం .మాఘుని కావ్యం కంటే అతని జీవిత చరిత్ర కు ప్రాధాన్యత లభించింది .రత్నావళి రాసిన హార విజయం అనే యాభై సర్గల కావ్యం పై మాఘ ప్రభావం ఎక్కువ గా కని  పిస్తుంది .హరిశ్చంద్రుడు  పదిహేనవ జైన తీర్ధంకరుడు అయిన ధర్మ నాధుని పై   ‘’ధర్మాశ్రమాభ్యుదయం ‘’అనే కావ్యాన్ని ఇరవై  ఒక్క సర్గ లతో మాఘుడు రాసిన ‘’శిశుపాల వధ ‘’మార్గం లో నే రాశాడు .అంటే మాఘుడు హరిశ్చంద్రుని పై ప్రభావం చూపాడన్న మాట .

శిశుపాల వధ-కద

మహా భారత ,భాగవతాలలో ఉన్న కదనే శిశుపాల వధ కావ్యం గా మాఘ కవి రాశాడు .ధర్మ  రాజు చేసిన రాజ సూయ యాగం లో శిశుపాలుడు వచ్చి ,ఆహ్వానిత రాజ మహారాజుల ముందు భగవానుడైన శ్రీ కృష్ణుడిని అనేక మార్లు నిందించాడు .అగ్ర తాంబూలం కృష్ణుడికే ఇవ్వమని భీష్ముడు ధర్మ రాజుకు హితవు చెప్పాడు .ఆ ప్రకారమే ఆయన సిద్ధ పడ్డాడు .కృష్ణుడికి ఆ అర్హత లేదని నింద మీద నింద మోపుతూ చాలా నీచం గా నిండు కొలువులో ప్రవర్తించాడు .అందరికి అసహ్యం వేసింది. శ్రీ కృష్ణుడు చాలా ఓపిక పట్టాడు మేనత్త కిచ్చిన మాట కోసం .చివరికి అలసత్వం పనికి రాదనీ నిర్ణయించి ,చక్రాన్ని చేబట్టి శిశు ప్రవర్తకుడైన శిశు పాలుడి శిరస్సు ఖండించాడు .రాజ సూయ యాగం లో రక్త తర్పణం తప్ప లేదు .దాదాపు భారవి కిరాతార్జునీయాన్ని అనుసరించే రాశాడు .వర్ణాల అనుసరణ లతో సహా అన్నీ డిట్టో కు డిట్టో .ఒక్కో సారి భారవిని మించిపోవాలనే తపన తో పప్పులో కాలూ వేశాడు .ఒక శతాబ్ద భేదం తో భారవి మాఘుడు మసిలారు .భారవిపై మనసు పొరల్లో మాఘునికి కవితా స్పర్ధ ఉండి ఉంటుంది .

కవితా గీర్వాణం .

భారవితో ప్రారంభమైన ఆలంకారిక శైలి మాఘునిలో పరిపక్వం పొందింది .భారవి వంశస్త వృత్తానికి పట్టం కడితే ,మాఘుడు మాలినీ వృత్తానికి పట్టాభిషేకం చేశాడు .దీర్ఘ సమాసాల్ని మాఘుడు రాశాడు .మాఘునిలో శబ్ద మాధుర్యం  భారవి కంటే ఎక్కువ .సజీవ వర్ణనలు మాఘుని ప్రత్యేకత .రమ్యమైన అలంకారాలను ప్రయోగించి కావ్యాన్ని తీర్చి దిద్దాడు .వ్యంగ్య వైభవ మూ చూపాడు .మాఘుడి కవిత్వాన్ని ‘’నవ సర్గ గతేమాఘే నవ శబ్దో న విద్యతే ‘’అంటే మాఘ కావ్యం లోని తొమ్మిది సర్గలు చదివిన తర్వాత సంస్కృతం లో కొత్త శబ్దం ఏదీ  ఉండదు ‘’అని అర్ధం .అంతటి శబ్ద జ్ఞానం ఉన్నవాడు .కాళిదాస , భారవులు ఉపయోగించిన శబ్దాలను అదే అర్ధం లో కాక గౌణార్ధం లో ప్రయోగించాడు .చెట్టు అనే అర్ధం ఇచ్చే భూరుహం అనే శబ్దాన్ని ‘’ప్రాణులు ‘’అనే అర్ధం తో ప్రయోగించాడు .నరేంద్ర శబ్దాన్ని విష వైద్యుడనే అర్ధం లో వాడాడు .ఇలా కొత్త అర్ధాలతో శబ్ద ప్రయోగాలు చేశాడు .పాము కు ద్విజిహ్వ అనే పేరుంది దాన్ని నిందకుడు అనే అర్ధం లో వాడాడు .

మాఘుని పదలాలిత్యమూ తక్కువదేమీ కాదు మ కార వ్రుత్యను ప్రాసలో –

‘’మధురయా మధు బోధిత మాధవీ మధు సమృద్ధి సమేదిత మేధయా –మాధుకరాం గనయా  ముహురున్మదద్వాని భ్రుతా నిభ్రుతాక్షర ముజ్జగే ‘’.మాఘ ప్రతిభను తెలియ జేసే లోకోక్తి ఒకటి ప్రచారం లో ఉంది .-

‘’మాఘేనా విఘ్నతో త్సాహా నోత్సంహంతే పదక్రమే – స్మరం తో భారవే రేవ కవయః కపయో యదా ‘’-అంటే –

‘’మాఘ మాసపు చలిలో సూర్యుడి వేడిని అనుభవించిన కోతులకు కాళ్ళు  వంకర్లు పోయి నడవ లేక పోతున్నాయి .అలాగే మాఘ కవి పద రచన చూసి భారవి పదాలను యెంత అనుకరించినా కవికాని వాళ్ళు కవిత్వం లో అసమర్ధులుగానే ఉండిపోతారు .అంటే భారవి మాఘుడిని అనుసరించినా అనుకరించినా శ్రేస్టకవి అని పించుకొన్నాడు అని భావన, అదీ మాఘుని ప్రత్యేకత .హరిదాసు రాసిన సుభాషిత రత్నావళి లో ‘’నైతచ్చిత్ర మహం మన్యే మాఘ మాసాద్య యన్ముహుః-ప్రౌఢ తాతి ప్రసిద్ధాపి భారవే రవ సీదతి ‘’అనే శ్లోకం కనిపిస్తుంది –దీని భావం –మాఘ మాసం రావటం తో సూర్య తేజస్సు సన్న గిలినట్లు అదే రకం గా మాఘ కవిత్వం ముందు భారవి కవిత్వ ప్రౌఢిమ  తగ్గింది .

సుదీర్ఘ ఋతు సూర్యాస్తమయ ఉదయాలను వర్ణన చేశాడు మాఘకవి చమత్కార వైభావమూ ఎక్కువే .శబ్ద మాధుర్యం తో బాటు ఓజో గుణం తో గాలిని వర్ణించాడు .ఆస్వాదిద్దాం –

‘’వికచ కమల గాంధి రంధయన్ భ్రున్గా మాలాః సురభిత మకరందం మంద మావాతివాతః

ప్రమద మదన మాద్యద్యౌవనో ద్దామ రామా రమణ రభస ఖేద స్వేద విచ్చేద దక్షః ‘’

మాఘునిలో శాస్త్ర జ్ఞానం ఎక్కువ .వేదం వేదాంగాలను ఆవ పోసన పట్టాడు .వ్యాకరణ పండితుడు .రాజనీతి ధర్మ శాస్త్రాలను చదివిన వాడు .జ్యోతిష శాస్త్రం లోను దిట్ట .కామ ఆయుర్వేద ,సంగీత ,సాముద్రిక ,హయ గజ శాస్త్రాల పారం ఎరిగిన వాడు .నాస్తిక దర్శనాలనూ తరచి చూశాడు .సూక్ష్మ తీక్ష్ణ ద్రుష్టి ఉన్నవాడు .క్లిష్టం గా సంక్లిష్టం గా సరళం గా చెప్పగలడు సందర్భాన్ని బట్టి .రెండవ సర్గ లో బాలరామ ఉద్ధవుల సంభాషణల్లో రాజనీతి కట్టలు తెంచుకొని ప్రవ హిం చిందని  విశ్లేషకాభిప్రాయం  .శార్దూల ఛందస్సులో ‘’షడరర’’చక్ర బంధం లో రాసిన శ్లోకం చూద్దాం –

               మాఘుడు శిశుపాల వధ కావ్యం లో చిత్ర బందాలనూ  గర్భ కవిత్వాన్ని బాగా చొప్పించాడు . ‘’ద ‘’అనే ఏకాక్షరం తో శ్లోకం రాశాడు .-దాదదో దుద్దా దుద్దాది దాదదో దూదాది దధొః-దుద్దాదం దాదదే దుద్దే దాదా దదదాదదో దదాః’’ అర్ధం –శ్రీకృష్ణుడు వర ప్రదాయి దుస్ట సంహారి .పాపహారి .ఇతరులకు ద్రోహం చేసేవారి చేతులను నరికేసే వాడు .శత్రువుపై బాణం వేసి నొప్పించేవాడు .

మురజ చిత్ర అంటే ‘’డ్రం’’ఆకారం లో రాసిన శ్లోకం చూద్దాం –

‘’సాసే  నాగమ నా రంభే

రాసే నాసిద నా రత

తర నా జ ద  నా మత్తా

దిర నాగమ నామాయా

దీని భావం –సైన్యం చాల బలీయమైనది .అది ముందుకు సాగుతుంటే అప్రమత్తం గా ఉంటూ ఏకాగ్రత తో  విధులు నిర్వహిస్తున్నారు .సైనికులు భీకర శబ్దాలు చేస్తున్నారు .సైనికులకు మదగజాలు సహకరిస్తున్నాయి .అక్కడున్న వారెవ్వరికి బాధ అనేది లేనేలేదు .నాలుగు పాదాలు భేరీ నినాదం తో ఒకే అర్ధాన్ని ఇవ్వటం ఇందులో ఉన్న రహస్యం .

శిశుపాల వధ పై వల్లభ దేవునిదే ప్రాచీన విమర్శ గ్రంధం .దీనిపేరు ‘’సందేహ విషౌదధి ‘’.మల్లినాద సూరి ‘’సర్వం కష ‘’అనే వ్యాఖ్య రాశాడు .ఇంకా ఎందేరెందరో వ్యాఖ్యానాలు రాశారు .1308లో భాస్కర భట్ట బోరికర్ మరాటీ భాషలోకి అనువదించాడు .అనేక విదేశీ భాషల్లోకి అనువాదం పొందింది .

  Inline image 1

మరో కవితో మళ్ళీ కలుద్దాం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.