విశ్రమించని తోడేలు..
- 29/11/2014
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- సార్క్-దేశాల శిఖర సభ ముగింపు రోజైన గురువారం నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేయడం దృశ్య ప్రసార మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తానీ ఉగ్రవాద హంతకులు మన సైనిక దళాల స్థావరాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత హింసాకాండ కొనసాగుతోందనడానికి ఇది మరో సాక్ష్యం. ఈ జిహాదీ హంతకులను పాకిస్తాన్ సైనికులు ఆధీన రేఖను దాటించి మన వైపునకు ఉసిగొల్పినట్టు కూడ వెల్లడికావడం నవాజ్ షరీఫ్ నయవంచన విధానానికి మరో సాక్ష్యం. నవాజ్ షరీఫ్ ఖాట్మండులో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం పూర్వ నిర్ధారిత పథకానికి నిదర్శనం. భారత వ్యతిరేక మతోన్మాద బీభత్సకలాపాలను విడనాడలేదని హంతక నిష్ఠను నిరూపించుకొనడానికి నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ పౌర ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో గురువారం నాటి దాడి భాగం. మన సైనికుల వేషాలను ధరించి మన సైనికులతో కలిసిపోవడం హఠాత్తుగా దాడులకు పాల్పడడం పాకిస్తానీ టెర్రరిస్టులు అనుసరిస్తున్న ఎత్తుగడ. అదేరీతిలో గురువారం కూడ పాకిస్తానీలు మన సైనిక స్థావరాల-బంకర్‌ల-లోకి చొరబడిపోయారు. ఎనిమిది మందిని హత్య చేశారు. నలుగురు టెర్రరిస్టులను హతమార్చడానికి 32 గంటల సమయం పట్టడం పాకిస్తానీ వ్యూహాత్మక పటిమకు నిదర్శనం. సార్క్ సమావేశం జరుగుతున్న సమయంలో మొదలైన దాడి శుక్రవారం కూడ కొనసాగింది. నరేంద్ర మోదీ కాశ్మీర్‌లోని ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించడం పూర్వ నిర్ధారిత కార్యక్రమం. అదే సమయంలో దాడులు జరపడం తమ జిహాదీ అస్తిత్వాన్ని చాటుకోవడం పాకిస్తాన్ పౌర ప్రభుత్వ లక్ష్యం. ఇలా చాటుకోవడం వల్ల మాత్ర మే అధికార పీఠాలను అంటిపెట్టుకొని ఉండడానికి వీలవుతుందన్నది పాకిస్తానీ రాజకీయ నాయకుల విశ్వాసం. పాకిస్తాన్ రాజకీయ వేత్తల సమష్టి స్వభావం అన్యమత విధ్వంసక జిహాదీ తత్వం. పాకిస్తాన్ సైనిక దళాల స్వభావం కూడ అదే. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రజల సమష్టి స్వభావం అన్యమత విధ్వంసక తత్వం. కొంతమంది ఈ సమష్టి స్వభావానికి అపవాదం కావచ్చుగాక. ఈ మతోన్మాద తత్వం ప్రస్ఫుటించే మాధ్యమం భారత వ్యతిరేకత. అందువల్ల తమ వౌలిక భారత వ్యతిరేకతను పౌర ప్రభుత్వంవారు పదేపదే చాటుకుంటూ ఉండాలి. సైనిక ప్రభుత్వ విశ్వాసం పొందడానికి ఇదే మార్గం. ఈ విశ్వాసం సన్నగిల్లిన తక్షణం సైనిక దళాల వారు పౌర ప్రభుత్వాన్ని తొలగించి వేస్తున్నారు. నరేంద్ర మోదీతో ఖాట్మండు కరచాలనం…ఆధీన రేఖ వద్ద వెన్నుపోటు…నవాజ్ షరీఫ్ వంచన వ్యూహానికి ఇదీ నేపథ్యం. గతంలో వాఘా సరిహద్దు గుండా సీమాంతర బస్సును ప్రారంభించిన సమయంలోనే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కార్గిల్‌లోని కిరాయి హంతకులను, సైనికులను ఉసిగొల్పింది. 1999నాటి నుండి కూడ షరీఫ్ స్వభావంలో మార్పు రాలేదనడానికి జమ్మూలోని ఆర్నియా ప్రాంతంలో ప్రస్తుతం జరిగిన హత్యాకాండ నిదర్శనం. ఆర్నియా ఆధీన రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతం.
ఖాట్మండులో జరిగిన సార్క్ సమావేశంలో నవాజ్ షరీఫ్‌తో ద్వైపాక్షి చర్చలు జరుపడానికి నిరాకరించడం ద్వారా మన ప్రధానమంత్రి పాకిస్తాన్ నడిపిస్తున్న హింసాకాండ గురించి ఇరుగుపొరుగు దేశాల ధ్యాస పెంచగలిగారు. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీరు సమస్యను ప్రస్తావించడానికి అలవాటు పడిన నవాజ్ షరీఫ్ సార్క్ వేదికపై మాత్రం అలాంటి దుస్సాహసానికి ఒడిగట్టలేదు. మనదేశంతో ఎలాగైనా మళ్లీ చర్చలు ప్రారంభించాలన్న తహతహ దీనికి కారణం కావచ్చు. ఇలా చర్చలు ప్రారంభించినట్టయితే భారత వ్యతిరేక హింసాకాండ ప్రాధాన్యం తగ్గిపోతుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు సమసిపోతుంది. ఈ నవాజ్ షరీఫ్ ఎత్తుగడ ఖాట్మండులో బెడిసి కొట్టింది. భారత దేశాన్ని యుద్ధంలో ఓడించలేని పాకిస్తాన్..సాయుధులను, ఉగ్రవాదులను, బీభత్సకారులను ఉసిగొల్పి ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తోందని అమెరికా ప్రభుత్వం గత నాలుగవ తేదీన బహిరంగంగా ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం వారు పాకిస్తాన్‌ను ఇలా బహిరంగంగా ఉగ్రవాద వ్యవస్థగా నిర్ధారించినట్టయింది. అమెరికాకు అంతర్జాతీయంగా ఉన్న పలుకుబడి కారణంగా అనేక దేశాల ప్రభుత్వాలు పాకిస్తానీ బీభత్సకాండను ఇప్పుడు గుర్తించగలిగాయి. అందువల్ల దేశం వెలుపల ఈ చెడ్డపేరును తగిలించుకోవడం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తక్షణ సమస్యగా మారి ఉంది. మన ప్రభుత్వం చర్చలకు అంగీకరించి నట్టయితే అమెరికా నిర్ధారణకు, అంతర్జాతీయ అభిప్రాయాలకు విలువలేకుండా పోతుంది. ఎందుకంటె పాకిస్తాన్ జరుపుతున్న హింసాకాడకు ప్రధానంగా బలియవుతున్నది భారతీయులే…
సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మానుకోనంతవరకు పాకిస్తాన్‌తో చర్చల ప్రసక్తే లేదన్నది ప్రస్తుత మన ప్రభుత్వ విధానం. బీభత్సకారులను ఉసికొల్పడం మాననంతవరకు పాకిస్తాన్‌తో సకల విధమైన సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం మన విధానం కావాలి. నేపాల్ తదితర సార్క్ దేశాల ఒత్తడికి లొంగిన కారణంగా సమష్టి ఇంధన నిధి ఒప్పందానికి నవాజ్ షరీఫ్ ఖాట్మండులో మద్ద తు పలుకవలసి వచ్చింది. సార్క్ దేశాలలో క్రమంగా తమ దేశం ఒంటరి అయిపోకుండా నిరోధించడానికే ఈ ఒప్పందానికి నవాజ్ షరీఫ్ అంగీకరించాడు. ఈ ఒప్పందాన్ని మనదేశం ప్రతిపాదించింది కాబట్టి ఇది మన ప్రభుత్వానికి వ్యూహాత్మక విజయం. తమ దేశంలో జరిగిన సభా వేదికపై భారత పాకిస్తాన్ ప్రధానులు కరచాలన లాంఛనాన్ని నిర్వహించాలన్న నేపాల్ ప్రభుత్వ అభ్యర్థనను మన్నించడం ద్వారా నరేంద్ర మోదీ రెండు వ్యూహాత్మక విజయాలను సాధించారు. మొదటిది నేపాల్ ప్రభుత్వానికి మన ప్రభుత్వం పట్ల మరింత సృహృద్భావం ఏర్పడింది. రెండవది పాకిస్తాన్‌తో స్నేహానికి మనదేశం సిద్ధమేనన్న భావం కూడ సార్క్ అధినేతల్లో కలిగింది. అయితే ఈ స్నేహం పాకిస్తాన్ తన హింసా ప్రవృత్తిని విడనాడినప్పుడు మాత్రమే సాధ్యం కాగలదు. పాకిస్తాన్ తన ప్రవృత్తిని మార్చుకోలేదన్నది జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ జరిగిన దాడుల వల్ల ధ్రువపడింది. అందువల్ల పాకిస్తాన్‌ను దారికి తేవడానికి వలసిన తదుపరి చర్యలకు మన ప్రభుత్వం పూనుకోవలసిన తరుణమిది…
పాకిస్తాన్ ప్రేరిత హత్యాకాండ ఆగనంతవరకు పాకిస్తాన్ సరిహద్దు ద్వారాలను మూసివేయడం ఒత్తడి పెంచడానికి మొదటి చర్య కాగలదు. సీమాంతర వాణిజ్యం, బస్సు సర్వీసులు, రైలు ప్రయాణాలు నిలిపివేయడం వల్ల వివిధ రకాల వేషాలలో పాకిస్తాన్ నుండి జిహాదీలు మన దేశానికి రాకపోకలు జరుపకుండా నిరోధించడానికి వీలవుతుంది. అప్పటికీ పాకిస్తాన్ తన ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నిర్మూలించకపోయినట్టయితే దౌత్య సంబంధాలను సైతం తెగతెంపులు చేసుకోవాలి. పాకిస్తాన్‌ను హింసాప్రేరక వ్యవస్థగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టడానికి సైతం మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో పాకిస్తాన్‌ను కామన్‌వెల్త్‌నుంచి బహిష్కరించిన చరిత్ర ఉన్నది. సార్క్‌నుండి పాకిస్తాన్‌ను తప్పించే ప్రయత్నం చేయడం అందువల్ల తప్పు కాబోదు.