ఇది విన్నారా కన్నారా ! 16
32-వీణకు అంతర్జాతీయ వైభవం కల్పించిన –శ్రీ మొక్కపాటి నాగేశ్వర రావు
226-1926 లో శ్రీ మొక్కపాటి సత్యనారాయణ ,శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లకు జన్మించి ఏలూరులో వీణ నేర్చి ,మద్రాస్ లో సంగీత విద్వాన్ పాసై నిలువుగా నిలబెట్టి వీణ వాయించే వైదుష్యం శ్రీ నాగేశ్వర రావు గారిది .1956 నుండి పదేళ్ళు మద్రాస్ లో వీణ బోధించి అనేక శిష్యులకు గురువయ్యారు .వీరి శిష్యులలో విదేశీయులు ఎక్కువ మంది ఉండటం విశేషం
227 -1966 లో ఫ్రెంచ్ ప్రభుత్వమిచ్చిన స్కాలర్షిప్ పై ‘’గ్రిగోరియన్ బాండ్ ‘’వారి చర్చి మ్యూజిక్ పై పరిశోధనకు ఆహ్వానింప బడి ,పూర్తీ చేశారు అమెరికా వెళ్లి ‘’వేసిలీనియన్ ‘’విశ్వ విద్యాలయం లో ఆచార్యులుగా పని చేశారు .1969 లో ఇండియాకు తిరిగొచ్చి అనేక కచ్చేరీలు చేస్తూ శిష్యుల చేతా చేయించారు .1970లో మద్రాస్ లో స్థిరపడ్డారు .1974 లో శ్రీ దండమూడి రామమోహన రావు గారితో కలిసి యూరప్ దేశాలలో పర్యటించి పలు సంగీత కచేరీలు చేసి మెప్పించారు .1976లో పారిస్ విశ్వ విద్యాలయం లో కర్నాటక సంగీత ఆచార్యులుగా నియమింపబడి సేవలు అంద జేశారు .
33-వైణిక బాల భాస్కర –శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు
228—చరిత్ర సృష్టించిన మహా వైణికులు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు .వీణ గురువరాచార్యులు ,వారి పౌత్రులైన వీణ వెంకట రమణ దాసు గార్లను బాల్యం లోనే మెప్పించినవారు సోమేశ్వర రావు గారు .’’వాగ్గేయ కార రత్న ‘’శ్రీ హరి నాగ భూషణం గారు మచిలీపట్నం లో సోమేశ్వరావుగారు 19 వ ఏట చేసిన కచేరీకి ముగ్ధులై ‘’వయసులో చిన్నవాడే అయినా కళ లో వ్రుద్ధుడే .కళలో పూర్తీ సిద్ధ హస్తుడు .’’వీణా కోవిద’’అని విజయనగర సంస్థ ‘’భారతీ తీర్ధ ‘’అందజేసిన బిరుదు కు అన్నివిధాలా తగినవాడు .అంతకంటే ‘’వైణిక బాల భాస్కర ‘’బిరుదం అత్యుత్తమంగా ఉంటుంది ‘’అన్నారు .మార్చి 25 న ఈ బిరుదప్రదానం హరి వారి చేతులమీదుగా అందుకొన్న చైల్డ్ ప్రాజేడి సోమేశ్వర రావు గారు .
229-17-5-1951న కోయంబత్తూర్ లో ,ఆ తర్వాత తంజావూర్ లో వీణ కచేరీచేసి మెప్పించారు .15-2-1952 న మచిలీపట్నం ‘’ఆంద్ర సారస్వత సమితి ‘’వారు ‘’వైణికరత్న’’బిరుదునిచ్చి సత్కరించింది .శ్రీ సోమేశ్వర రావు విజయనగరం జిల్లా వేగేశ అగ్రహారం లో 1920లో జన్మించారు .విజయనగర సంగీత కళాశాలలో చదివి ‘’డిప్లొమా ‘’అందుకొన్నారు .చిన్న తనం లోనే స్నేహితులను చుట్టూ కూర్చో బెట్టుకొని ‘’సంగీత ఆట ‘’ఆడేవారు .ప్రతిమాటకూ సమాధానాన్ని సంగీతం లో చెప్పటం అప్పటి వీరి ప్రత్యేకత గ్రామ. ఫోన్ రికార్డ్ లను బహు శ్రద్ధగా వినేవారు .ఆది భట్ల నాయన దాసుగారు వీరి బాల్య సంగీత ప్రతిభ గుర్తించి ,విజయ నగర సంగీత పండితులకు పరిచయం చేసి శ్రీ పేరి శ్రీరామ మూర్తి గారి వద్ద గాత్ర విద్యకు కుదిర్చారు
230 –శ్రీ వాసా కృష్ణ మూర్తి తో కలిసి వారింట వీణ సాధన చేస్తూ ,నిలబెట్టి వీణ వాయించేవారు .దేశమంతా పర్యటించి అనేక కచేరీలు చేసి చాలా.సువర్ణ ఘంటా కంకణాలతో సన్మానింప బడ్డారు .వీరి ధర్మపత్నికూడా వీరి శిష్యురాలే .వీరి సంగీతారాధనకు అచ్చెరువొందిన బాపట్ల ప్రజలు సగౌరవంగా ఆహ్వానించి అక్కడే ఉండే ఏర్పాటు చేసి గౌరవించారు .14-7-1973 న సోమేశ్వరరావు గారు 53వ ఏటనే సోమేశ్వర సాన్నిధ్యం చేరుకున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-8-16- కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్
